మనసే మందిరం

మనసే మందిరం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కాటేగారు పాండురంగ విఠల్

కల్యాణి కుటుంబాన్ని వున్నంతలో గుట్టుగా భర్తకు ఏ ఇబ్బంది కలుగకుండా నెట్టుకొచ్చేది. కాంతారావు కూడా భార్య నేర్పు,సహనాన్ని గుర్తించి ఆమెను ఏమీ ఇబ్బంది పెట్టకుండా చూసుకునే వాడు.తల్లి తండ్రి ఇంటిపట్టునే వుండి, చేదోడు వాదోడుగా, మనవడు-మనవరాలితో కాలక్షేపం చేసుకుంటూ చింతలేని కుటుంబంలో, హాయిగా గడుపుతూ జీవిస్తున్నారు. రామయ్య-సీతమ్మలు ఆ చుట్టుపక్కల వారిలో ఆదర్శ దంపతులుగా గుర్తింపు పొందారు. పచ్చని వేపచెట్లకు కరోనా కాలంలో కాని రోగమొచ్చి,కాటేసి ఆకులు లేకుండా చేసినట్లు, కల్యాణికి క్యాన్సర్ వచ్చి కుటుంబాన్ని అతలాకుతలం చేసింది. శరత్, చంద్రిక తల్లి అవస్థను చూసి, చలించి పోయారు. ప్రశాంత సాగరంలో తుఫాన్ చుట్టిముట్టినట్లు, వృద్ధ దంపతులు గమ్యం తెలియని నావికులే అయిపోయారు. ఇంతవరకు తనను, పిల్లలను, తన తల్లిదండ్రులను కంటి రెప్పల్లా కాచుకునే, కల్యాణి అసహాయంగా మంచంపై పడి వుండడం కాంతారావును మానసికంగా కృంగుబాటుకు గురిచేసింది. రామయ్య సీతమ్మల మనస్సులు సుడిగుండంలో చిక్కినట్లు, ఇరుక్కున్నట్లు తల్లడిల్లిపోసాగాయి. అన్ని అవసరాలు తీర్చే అమృత వర్షిణి కల్యాణి, అచేతనంగా పడివుండడం కాంతారావును తీరని మనోవేదనకు గురి చేసింది. మానసిక సంఘర్షణకు గురియై, తన దీనస్థితికి మనసులోనే కుళ్ళిపోతో మంచానికే పరిమితమైన తల్లితో, పిల్లలిద్దరు దూరం వుండలేక, ఆమె చెంతనే వుంటూ సపర్యలు చేస్తున్నారు. ఇన్నాళ్లు ఏ లోటు రానియ్యని కల్యాణిని రామయ్య సీతమ్మ డాక్టర్ల సలహాలకనుగుణంగా లేవలేని స్థితిలో వున్ననూ బిడ్డలా సేవలు చేస్తున్నారు. ఒక్కసారి కుటుంపంలో ప్రతి ఒక్కరి మనసుల్లో తీవ్ర అలజడి రేగింది. ఒక్కడి సంపాదన, భార్య అచేతనావస్థ! తల్లిదండ్రులే ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కుగా నిలబడి అన్నీ చూసుకుంటుంటే, కాంతారావు మనస్సు తల్లడిల్లి పోతున్నది. మనస్సులోని సత్సంకల్పమే మన దుఃఖాలు, కష్టాలకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది!ఇంట్లోని పెద్దలు, తన ఇద్దరు పిల్లలు, భర్తల ఆదరాభిమానాలు కల్యాణిలో మనో బలం పెంచాయి. మనం చేసిన మంచి రెట్టింపై మళ్ళీ మనకు మేలు చేస్తుందనే గీతా బోధనను విశ్వసించే కల్యాణి, మానసికంగా కుంగుబాటును తగ్గించుకొని, మనోధైర్యాన్ని పెంచుకో సాగింది. మనస్సు కృంగితే లొంగిపోతుంది. మచ్చిక చేసుకుంటే మన మాటే వింటుంది. మనో నిబ్బరమే పరమౌషధంలా పనిచేస్తుంది. భర్త ఆవేదన, పిల్లల మమకారం, అత్తమామల ఆప్యాయతలు కల్యాణిలో మానసిక పరివర్తనకు కారణమయ్యాయి. మనస్ఫూర్తిగా ఇన్నాళ్లు తను చేసిన నిస్వార్థ సేవే, నేడు ప్రతి ఒక్కరి మనస్సులను ప్రభావితం చేశాయి. అందరి ప్రేమను పొందిన కల్యాణి మనస్సులో నూతనోత్తేజం పెల్లుబికింది. ఆ మానసిక శక్తి,శరీరంలోని అనువణువును ప్రభావితం చేసి, మెల్ల మెల్లగా కోలుకోవడం మొదలైనది. డాక్టర్లు కూడా ఆశ్చర్య పోయేలా కాలం గడచిపోతుంటే కల్యాణిలో పెను మార్పులే రాసాగాయి. మందులకు లేని శక్తి మనస్సుకు వున్నదని రుజువు చేసింది కల్యాణి జీవితం. మనిషిలోని మంచితనం, మంచి మనస్సు, మంచి నడవడికలు, అంతర్గత శక్తిని ద్విగుణీకృతం చేస్థాయి. కల్యాణి మనోస్థిరత, అందరి మనో వాంఛ ఫలించి, వైద్య చరిత్రలోనే ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. మరో ఏడాదికల్లా కల్యాణి తన పనులు తాను చేసుకుంటూ, అత్త మామలను ఆదరిస్తూ, భర్తకు చేదోడు వాదోడుగా వుంటూ, మనసారా కుటుంబాన్ని నడుపుకుంటుంది. నాడు కల్లోల సంద్రంలో చిక్కిన నావకు, నేడు చుక్కానియై తీరం చేర్చినది. మనసును సన్మార్గంలో వుంచండి. వైద్యానికి లొంగని జబ్బు అయినా మనస్సును మచ్చిక చేసుకొని, మందు మాకుల సహాయంతో తొందరగా కొలుకోవచ్చని, డాక్టర్లు కూడా వైద్యులకిచ్చే సూచనలు, సలహాలలో రోగులకు చెప్పడం కొనసాగిస్తున్నారు. మనసే మందిరం!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!