సిరివెన్నెల కలానికి నివాళి (కవితా సమీక్ష)

సిరివెన్నెల కలానికి నివాళి (కవితా సమీక్ష)

సమీక్షకురాలు: ఉమామహేశ్వరి యాళ్ళ

కవితా శీర్షిక: సిరివెన్నెల కలానికి నివాళి
రచన: భరత్ కుమార్ (చిన్న)

శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారికి వారి కలానికీ తమ్ముడు భరత్ కుమార్ ఇచ్చిక అక్షృ నివాళి అత్యద్భుతంగా సాగింది. వారి పాటలు వింటూ రచనను అలవర్చుకున్న భరత్ కుమార్ వంటి వారెందరో లక్షల ఏకలవ్య శిష్యులు సిరివెన్నెలగారికి ఉన్నారనడంలో అతిశయోక్తిలేదు.వారి కలం అజ్ఞానాంధకారాలను ఒఅరద్రోలేందుకు ఎక్కుపెట్టిన శరంలా, తెలుగు భాషామాధుర్యాన్ని దశదిశలా వ్యాపింపచేసేందు జన్మించిన కారణజన్మునిలా తెలుగుభాష సాహిత్యానికి మీరొక వరంలా దక్కారనడంలో సిరివెన్నెలగారి రచనలు గురించి తెలిసిన మనందరకూ వాస్తవమే అనిపిస్తుంది. నిజమే గురువులేకుంటే శిష్యునికి మార్గనిర్ధేశం చేసేదెవరు? అందుకనే వారు స్వర్గానికేగి మనలను ఒంటరులను చేసారంటారు కవి చిన్న.

ఎందరెందరికో ఆదర్శమై, వారి భావాలకి భక్తులమై, ఆశావాదానికి అనుచరులమై, వారి పాటలకి ప్రేమికులమై, తెలియకుండానే వారి సాహిత్యాన్ని ఆరాధించే శిష్యులం మనంమటారు.

శాస్త్రిగారు ప్రతి విషయంపైనా వినూత్నమైన పరిశీలన చేసి పరిశోధించి అక్షర కూర్పులో వాటిని పొందుపరచి చక్కని భావాలను ఆలోచింపచేసే ప్రశ్నలను మనపై సంధిస్తారంటారు. శాస్త్రిగారి పాట ప్రకృతిలో పరవశిస్తూ, విన్న మన శ్రవణాలలో అనేకమార్లు పులకరిస్తుందనడంలో సిరివెన్నెలగారి పాటలపై మన మనస్సులో ఎంతటి పదిలస్థానాన్నిచ్చామో తెలుపుతారు చిన్న.

పేరుకు పాటలే అయినా అవి వ్యక్తిత్వపు పునాదులనీ,మనిషికి కష్టంలో పోరాడమని చెప్పే ధైర్యపు పలుకులనీ, మన సైన్యం మనమేనిని, మనకి మనమే ధైర్యమని ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపుతారంటారు.
నిజమే శస్త్రిగారి రచనలో ప్రశ్నలోనే బదులుంటుంది. కానీ ఆ బదులు ఎవరికి వారు చెప్పుకోవాలి. అపుడేకదా మనలో ఆలోచనా శక్తి పెరుగుతుందనీ, సరికొత్తపథంలో నడవడం అలవడుతుందనీ మరీముఖ్యంగా అలా ప్రశ్నల సమాధానాలను వెదకడమే జీవితమంటారు శాస్త్రిగారంటూ జీవితాన్ని సిరివెన్నెల కోణంలో తెలియచెప్పారు.

మది బలహీనపడినపుడు, భరించలేని బాధలెదురైనపుడూ, ప్రేమ మైకాన ఓలలాడుతున్నపుడూ సిరివెన్నెల గేయాలే మనకి మందుగా బలంగా శక్తిగా ఓదార్పుగా పనిచేస్తాయంటూ శాస్తిగారి రచనలలోని లోతునూ, వారి పాటలు అన్ని వర్గాలకూ అన్ని సందర్భాలకూ పనికొచ్చే తీరునూ చాలా చక్కగా తెలిపారు.

పురాణాల సారాన్ని అతిసరళంగా తెలిపిన శాస్త్రిగారంటూ చాలా చక్కగా తెలిపారు. ఎందుకంటే వారు వ్రాసిన సిరివెన్నెల గేయాలలోని సారాంశమంతా అదేగా..అనంతమైన జ్ఞానం అర్ధవంతమైన సరళ పదాలలో నింపే శాస్త్రిగారు రచనలలో ఒదిగిన భావాల మాధుర్యాన్ని ఎంతో లోతుగా పరిశీలించి తెలిపారు.

రచనలోవిప్లవం,ఓదార్పు, వేదాంతం,వైరాగ్యం,అన్నింటినీ అలవోకగా పలికిస్తారు. ప్రతిపాట పాఠమై సాహిత్యం నేర్పుతుందనీ, ప్రతి కవిత కాంతిలా దారిచూపి సన్మార్గం నేర్పుతుంది.
కవి కవనానికి కలికి తురాయి ఈ పదాలని అనకమానలేము. యమధర్మరాజు సమన్యాయం సన్యాసం తీసుకుందో, స్వర్గానికి ఓపిక నశించిందో, లేక మిత్రుడు గాత్రానికి పాట రాయగ తరలి వెళ్ళినాడో అంటూ చాలా చక్కని ప్రశ్నలని తన మదిలో సంధించుకున్నారు . ఇలా ఏకారణమైనా కానీ స్వర్ణశకం సిరివెన్నెలగారితోనే ముగిసిందంటారు. ఆనాడు వేటూరిగారి మరణంతో లోటు సగమే అయితే నేడు సిరివెన్నెలగారి మరణంతో పాటకి గుండెపోటులా మారింది పరిస్థితి అనడంలో వారు పాటకి అందునా సిరివెన్నెలగారి పాటలకి ఎంతగా అభిమానులో చూపుతుంది ఈ కవనంలో,
ఆశావహ దృక్పధంలో మనసుకి సర్ధిచెప్పుకునేందుకు అన్నట్లుగా మరియూ వాస్తవికతను తెలుపుతూ శాస్త్రిగారి రచన నేడు అమరలోకం వరకూ ఎగిసిందంటారు, కవనాలకి చావులేక శాస్వత కీర్తి లభించిందంటారు. మరీ ముఖ్యంగా మరణానికే ఆభరణం శాస్త్రిగారి మరణమంటారు. మరణమంటే ఆభరణమనడంలో ఎంతో గుండె ధిటవు వుంటేనే వాడాల్సిన ప్రయోగమిది. ఎందుకంటే మరణం అంటేనే బాధ కానీ ఆ బాధని మరచిపోవడానికి కానీ లేక శాస్త్రిగారి ఔన్నత్యాన్ని ధిగంతాలవరకు చాటేందుకు కానీ కవి చేసిన సాహస ప్రయోగం శాస్త్రిగారి మరణం మరణానికే ఆభరణమనడం. అంతేకాదు శాస్త్రిగారు దివికే ఓ తోరణం అంటూ పచ్చని ఆయన పాటల పందిలో ఆయనొక మామిడి తోరణమన్న భావనని చాలా చక్కగా ఉటంకించారు. స్వర్గలోకపు అణువణువూ సిరివెన్నెల ఆగమనంతో పావనమొందిందనడం వాస్తవికమైనా మరో సాహసపూర్వక ప్రయోగమనే చెప్పాలి. చెక్కుచెదరని శాస్త్రిగారి చిరునవ్వుల సాహిత్యపు భావాలలో మాధుర్యాన్ని ఎంతో చక్కని పదాల పొందికలో కవనపు ఆద్యంతాలు చక్కగా తెలిపారు. శాస్త్రిగారిని గురించిన అన్ని కోణాలనూ అలవోకగా అలతి పదాలలో సరళమైన భాషలో కూర్చిన మీ కవనం ఆద్యంతం అద్భుతంగా సాగిందనడంలో అతిశయోక్తిలేదు.

*********

సిరివెన్నెల కలానికి నివాళి
రచన: భరత్ కుమార్ (చిన్న)
లక్షల శిష్యులకే గురువులైన, ఓ సిరివెన్నెల గారు,
తెలుగు భాష సాహిత్యానికి, దక్కిన వరమే మీరు…
అజ్ఞానానికి అంతంలా, మీ కలముని కదిలించారు,
నేడు స్వర్గానికి బయలుదేరి, మమ్ము ఒంటరి చేశారు…

మా ఎందరికో ఆదర్శమైన, మీ భావాలకు భక్తులం,
అందరికీ కనిపించని, మీ ఆశావాదానికి అనుచరులం…
మా అణువణువుని కదిలించే, మీ పాటల ప్రేమికులం,
నిత్యం ఆసక్తిగ అనిపించే, మీ సాహిత్యానికి శిష్యులం…

ప్రతి విషయంపై మీ పరిశీలన, సరికొత్తగా ఉంటుంది,
సరళమైన మీ వివరణ, ప్రతి మదినీ తాకుతుంది…
ప్రకృతి మీ ప్రతి పాటలో, ప్రవేశించి పరవశిస్తుంది,
ఆ పాటవిన్న ప్రతి శ్రవణం, పలుమార్లు పులకరిస్తుంది…

చలనచిత్రాల్లో మీ రచనలు, వాటి పేరుకేమో పాటలు,
అవి నిజానికైతే మా అందరి వ్యక్తిత్వపు పునాదులు…

మనిషికెంత కష్టమెదురైనా, పోరాడమనే చెబుతారు,
మన సైన్యం మనమేనని, ఆత్మవిశ్వాసం నింపుతారు…

ప్రశ్నలోనె బదులుందని, పద్ధతిగా చెబుతారు,
మీ పరిశీలణ శక్తితో, కొత్త పథము చూపుతారు…
జవాబు మీకు తెలిసినా, ప్రశ్నించి ఊరుకుంటారు,
సమాధానాలను వెతకటమే, జీవితమని అంటారు…

మది బలహీనం అయిపోతే, మీ పాటతోనె నిట్టూర్పు,
మాకు భరించలేని బాధొస్తే, మీ పాటే ఒక ఓదార్పు…
ప్రేమ ఒడిన ఉన్నపుడు, మీ పాటలతో మైమరపు,
ప్రేరణకై చూస్తున్నా, మాకు మీ పాటలె మేల్కొల్పు…

నడతెందుకు మార్చవని, నిగ్గదీసి అడుగుతారు,
ఓటమికే లొంగకని, జీవిత పోరాటం నేర్పుతారు…
పురాణాల సారాన్ని, అతిసరళంగా చెబుతారు,
అనంతమైన జ్ఞానాన్ని, మా అందరికీ పంచుతారు…

విప్లవమూ, ఓదార్పు,
వేదాంతం, వైరాగ్యం…
పదాలదేమో విన్యాసం,
పోలికలదేమో పరవశం…
వైవిధ్యము మీ నేపథ్యం,
అభేద్యము మీ సారథ్యం…

ఆ గురుద్రోణుడి విలువిద్యకు, నాడు ఏకలవ్యుడు ఒక్కడే,
ఈ గురువుగారి వైవిధ్యానికి, అలాంటి శిష్యులెందరో…

మీ ప్రతి పాట పాఠమై, మాకు సాహిత్యం నేర్పుతుంది…
మీ ప్రతి కవిత కాంతియై, మాకు సన్మార్గం చూపుతుంది…

తరువాతి పాట ఎప్పుడని, వేచి చూడు కళ్ళకి,
తిరిగిరాని లోకాలు, తరగని శోకాలను మిగిల్చాయి…
మీ ప్రతిపాటకు పరవశించు, తెలుగువారి శ్రవణాలకు,
నేటి ఈ శాశ్వత దూరాలు, శాపాలుగ మారాయి…

మీ మరణవార్త వినగానే, మా మాట మూగబోయింది,
మీరికలేరను ఊహకూడ, మా ఊపిరినాపేస్తుంది…

యమధర్మరాజు సమన్యాయం, సన్యాసం తీసుకుందో,
లేక స్వర్గానికి హఠాత్తుగా, ఓపికంత నశించిందో…
పైన మీ మిత్రుడి గాత్రానికి, పాటరాయ తలిచారో,
లేక తెలుగుతల్లి కీర్తిని, కొనియాడాలని కదిలారో…

కారణాలు ఏవైనా, ఓ స్వర్ణశకం ముగిసింది,
నేడు సిరివెన్నెల సాహిత్యం, స్వర్గాన్నీ చేరింది…

వేటూరి గారి మరణంతో, లోటు సగమే అనిపించింది…
నేడు శాస్త్రిగారి పయనంతో, పాటకే గుండెపోటులా ఉంది…

మీ కలము నేలకూలలేదు,
నేడు నింగిదాక ఎగసింది…
మీ కవనాలకు చావులేదు,
వాటి కీర్తి కాస్త పెరిగింది…

ఆ మరణానికే ఆభరణం,
మా గురువుగారి ఈ పయనం…
మీరు దివికే ఒక తోరణం,
స్వర్గపు అణువణువూ పావనం…

ఇట్లు
మీ లక్షల ఏకలవ్య శిష్యులు

*********

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!