ఎవరో ఒకరి గురించి (కవితా సమీక్ష)

ఎవరో ఒకరి గురించి (కవితా సమీక్ష)

సమీక్షకురాలు: ఎం. వి. ఉమాదేవి

కవితా శీర్షిక: ఎవరో ఒకరి గురించి
రచన: ఏటూరి నాగేంద్ర రావు

ఎక్కడయినా ఎప్పుడైనా సరే,సందర్భం ఏదైనా మానవత్వం పరిణితి, పరిణామం గురించి ఏదోకటి వ్రాయాలని పిస్తుందని కవి నాగేంద్ర రావు గారి తపన. ఎప్పుడూ అంతా సుఖాంతమే ఉండేది కథనో సినిమా నో కావచ్చు కానీ మనిషినిజ జీవితం మాత్రం వైనవైనాలుగా వ్రాయదగిన విశేషాలతోనే నిండి ఉంటుంది కదా.. !కాలి పోతున్న చెట్టు లాంటి మనిషి, నిన్నటి దాకా ఎన్ని పూలు పూయించాడో… అన్న వాక్యం గుండెల్లో ఫిరంగి లా పేలుతుంది.. దాని వెంటనే ఎన్నో ప్రశ్నలు పుట్టుకొస్తాయి. పూసిన పూలేమయ్యాయో, తానే ఒక మహా సరోవరం అయినపుడు.. ఆధారపడిన, వాడుకున్న వాళ్ళు గుర్తు పెట్టుకో లేదా..? ఎన్ని ద్వారాలు, కిటికీలు గా పునర్జన్మ లెత్తాడో ఆ ద్వారబంధం పైన నగీషీలు గా కవి ఆలాపన ముద్రితమవుతుంది !

వాడ్ని చూసి నన్ను అనుకొంటారు మతి భ్రమించి అని ఓ సందేహం.. అవును కాల ప్రవాహంలో కర్మలకు కర్తలను తారుమారు చేయగలదీ సమాజం ! సొమ్మొకడిది సోకొకడిది సేవలో ముఖ్యం గా… !దాచి పెట్టాల్సినదేదో నీచేతి కిచ్చేనో ఎవరికిచ్చేనో.. జీవితం రహస్యం తెలిసి కూడా అని తనకి తానే చిరాకు..

అందుకే రాయగలిగిన వాళ్ళు ఆందరూ వ్రాయాలి వాడి గురించి అంటున్నారు రచయిత. నవ రసాల జీవితం ఎటూ కాకుండా ఎందుకు పోవాలి? ఒంటరి తనం ఫీనిక్స్ పక్షి లా శోకించిన వేళ, దేనికో దానికి… మాధుర్యమో, కర్కశమో పంచుకోడానికి.. మాట్లాడటం ముఖ్యం !పోట్లాడటమైనా ఫర్లేదు.. కావలిసింది మనిషి అలికిడి, సాహచర్యం!

బెర్ముడా ట్రయాంగిల్ లా ఆధునిక సమాజం మనిషిని లోపలకి లాగేసే లోగానే, కూలి పోకుండా ఉండేందుకు ఒక మానవత్వపు తోడు కావాలి అంటున్నారు కవి.

ఎంత ఒంటి స్థంభం మేడయింది మనిషి కాలం, బ్రతుకు కలిసి సృష్టించగల అలజడి చిన్న కవిత లో హృద్యంగా వర్ణించారు.. అదే ఒక్క పలకరింపు ఏళ్ళతరబడి అనుభవాన్ని పసి పిల్లలకేరింత గా మారుస్తుంది. చుట్టూ సౌకర్యం గోడలు కట్టుకొని నిత్య ఒంటరిగా మనిషి పడే వేదన ఈ కవితలో నిలదీస్తూ ఉంది.
దృశ్యరూప విధ్వంసం సృష్టించడం కంటే మనిషి తనం గురించి తెలుసు కోవడం, తెలియపరచడం ముఖ్యం అన్నట్టు గా నిగూఢమైన భావనలు తెలిపారు కవి !అభినందనలు !

***********************
కవితా శీర్షిక: ఎవరో ఒకరి గురించి
రచన: ఏటూరి నాగేంద్ర రావు

కవిత రాయాలని పిస్తోంది.
ఎవరో ఒకరి మీద
సందర్భం ఏదైనా
ఎప్పుడైనా – – ఎక్కడైనా!
కాలిపోతున్న చెట్టులాంటి
మనిషి నిన్నటిదాకా
ఎన్నిపూలు పూయించాడో!
తానే ఒక మహాసరోవరంగా
పరిభ్రమించాడో!
ఎన్ని ద్వారాలను మోశాడో!
ఎన్ని కిటికీలుగా పునర్జన్మలెత్తాడో!
వాడ్నిచూసి నన్ను అనుకొంటారు
మతిభ్రమించి.
అన్నింటా ఎప్పుడూ
నాతోపాటుగా ఏదీవుండదు.
నేనేవుంటాను తోడునీడగా!
ఇక్కడ ఏరుకోవాల్సందేదో
ఎరుకలేదు.
ఇప్పుడు
దాచిపెట్టవలసిందేదో
నీచేతికిచ్చేనో
ఎవరిచేతికిచ్చేనో!
జీవిత రహస్యమూ,
మర్మమూ ఆ దాటు గా
తెలిసిన వాణ్ణి!
అందుకే!
రాయగలిగిన వాళ్ళందరూ
రాయాలి వాడి గురించి!
ఒక రాయినో, రప్పనో,
రంగునో,
రజ్జు సర్పభ్రాఃతితోనో
వాడిముందు వాలిపోకపోతే ఎలా!
దృశ్యరూప విథ్వంసంచేస్తే ఎలా!
ఈక్షణం ఎంత మథురమైనది
అంతే కర్కశమైంది కూడా!
దేనికో ఒకదానికి
మనిషి కావాలి.
మాట్లాడుకునేందుకో!
పోట్లాడుకునేందుకో!
కూలిపోకుండా ఉండేందుకో.

***********************

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!