శృంఖలాల పంకిల

(అంశం: “బానిస సంకెళ్లు”)

శృంఖలాల పంకిల

రచన:సత్య కామఋషి’రుద్ర

శృతిమించిన పేరాశలే.
ఆనందానికి సంకెళ్లు..!

పెచ్చుమీరిన స్వార్థాలేగా,
అనుబంధాలకు సంకెళ్లు.!

మితిమీరిన అహంభావాలు,
అన్యోన్యతలకు సంకెళ్లు..!

నమ్మిన సిద్ధాంతాలే,
నీతికి నిజమగు సంకెళ్లు.!

పెడదారుల ప్రలోభాలే,
నిజాయితీకి సంకెళ్లు..!

పాటించ గోరు విలువలే,
ఆదర్శాలకు సంకెళ్లు..!

హద్దుమీరిన దోపిడితత్వాలు,
అంబరమంటే అవినీతి పర్వాలు,
అభివృద్ధికీ అభ్యున్నతికీ సంకెళ్లు..!

సంకుచితమైన ఆలోచనలే కదా,
సఖ్యతా సామరస్యతలకు సంకెళ్లు..!

గిరిగీసుకున్న కట్టుబాట్ల సరిహద్దులే
స్వేచ్ఛను స్వాగతించలేని సంకెళ్లు.!

మనిషికి మనసే సంకెల..
మనసును తరిమే తలపే సంకెల..
ఆ తలపును రేపే వలపొక సంకెల..
ఆ వలపును రేపే వయసే సంకెల..!

అనుకుంటూ పోతే అలా అల్లికగా…
సగటు మనిషి బ్రతుకంతా..
ఎడతెగని శృంఖలాల పంకిల…!!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!