తల్లిప్రేమ

తల్లిప్రేమ

రచన: బండి చందు

ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనో సాధారణ రైతు. కోడి కూయకముందే పొలానికి వెళ్లి రాత్రి ఎప్పుడో ఇంటికి వచ్చేవాడు. ఇది అతని రోజువారీ దినచర్యగా ఉండేది. రామయ్య భార్య లక్ష్మమ్మ గుణవతి, అతనికి తగిన ఇల్లాలు. లక్ష్మమ్మ ఇంటి పనంతా ముగించుకొని పొలానికి వెళ్లి పొలంలో రామయ్యకి చేదోడువాదోడుగా ఉండేది. వారికి పెళ్లై పదేళ్లు కావొస్తున్నా పిల్లలు మాత్రం పుట్టలేదు. ఈ కారణంతో ఇరుగుపొరుగు ఇళ్లవారు ఎప్పుడూ లక్ష్మమ్మని గొడ్రాలు (పిల్లలు పుట్టని వారిని ఇలా పిలుస్తారు) గొడ్రాలు అని సూటిపోటి మాటలతో హింసిస్తుండేవారు. లక్ష్మమ్మ ఆ మాటలను పట్టించుకోకపోయినా లోలోపల మాత్రం చాలా భాదపడేది. ఈ విషయం తన భర్తకి చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోయేది.

ఒకరోజు వాళ్ళ ఊరికి తీర్థయాత్రలు చేస్తున్న స్వామిజీ ఒకరు వచ్చారు. అతను చాలా మహిమ కలవాడని ఏ కొరికనైనా తీర్చగలడని చుట్టుపక్కల వారు అనుకోగా లక్ష్మమ్మ విన్నది. రామయ్య పొలానికి వెళ్ళగానే చాలా సంతోషంతో లక్ష్మమ్మ ఆ స్వామిజీని వెతుక్కుంటూ వెళ్ళింది. స్వామిజీ ఊరి చివర ఒక పాడుబడిన గుడిలో ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. అతని ముఖం చాలా ప్రశాంతంగా ఎంతో తేజస్సుతో వెలిగిపోతోంది. లక్ష్మమ్మ అతని వద్దకి వెళ్లి స్వామి అని మెల్లిగా పిలిచింది. స్వామిజీ నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎవరమ్మా నువ్వు! ఏమి కావాలి అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు లక్ష్మమ్మ స్వామి నాకు పెళ్లై పదేళ్లు అవుతున్న ఇంకా పిల్లలు లేరు. చుట్టుపక్కల వాళ్ళ సూటిపోటి మాటలతో ఎంత హింసిస్తున్న ఎవరికి చెప్పుకోవాలో తెలియక నాలో నేనే కుమిలిపోతున్నాను. స్వామిజీ మీరు చాలా మహిమగలవారని తెలిసి మీ వద్దకు వచ్చాను. నాకు పరిష్కారం చూపండి, నాకు పుత్ర భిక్ష పెట్టండి అని బతిమిలాడింది.

లక్ష్మమ్మ చెప్పినదంత విన్న స్వామిజీ తల్లీ నీ కోరిక న్యాయమైంది. నీ భాద నేను అర్థం చేసుకున్నాను. నీకు ఒక మంత్రం ఉపదేశిస్తాను. ఆ మంత్రాన్ని నువ్వు రోజుకి పదకొండుసార్లు నిష్ఠగా పక్షంరోజులు పఠించు. నీకు తప్పక సంతనప్రాప్తి కలుగుతుంది కాకపోతే నీ బిడ్డకి ఐదు సంవత్సరాల వయసులో ఒక పెద్ద గండం ఎదురవుతుంది. దానివల్ల అతడు మరణిస్తాడు అని చెప్పాడు. లక్ష్మమ్మకి ఏమి అర్థం కాలేదు కొడుకు పుడతాడని సంతోషపడాలో లేక పుట్టిన కొడుకు చనిపోతాడని భాదపడాలో తెలియక నిశ్చేష్ఠురాలయింది. అంతలోనే తేరుకొని స్వామి వరమిచ్చినట్లే ఇచ్చి వెనువెంటనే శాపానికి గురి చేయడం భావ్యమా? దీనికి మీరే ఏదో ఒక ఉపాయం చెప్పి నా కొడుకుని రక్షించండి అని ప్రాధేయపడింది. స్వామిజీ లక్ష్మమ్మ భాద చూడలేక తల్లీ నీ బిడ్డకి ఎదురయ్యే ప్రమాదం నుండి ఎవరైతే కాపాడతారో ఆ కాపడినవారు మరణిస్తారు అని చెబుతాడు. దానికి లక్ష్మమ్మ స్వామి నా బిడ్డని నేను నా ప్రాణం కన్నా ఎక్కువగా కాపాడుకుంటాను. వాడికి బదులు నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అని సంతోషంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

లక్ష్మమ్మ స్వామిజీ చెప్పినట్టుగా మంత్రాన్ని నిష్ఠగా పఠించి గర్భం దాలుస్తుంది. దాంతో రామయ్య ఎంతో సంతోషిస్తాడు. సంవత్సరం తరువాత రామయ్య లక్ష్మమ్మ దంపతులకు ఒక పుత్రుడు జన్మిస్తాడు. ఆ పిల్లవాడు ఎంతో తేజస్సుతో, చూడగానే ఎవరి మనసైన సంతోషంతో నిండిపోయే నవ్వుతో, చక్కని రూప లావణ్యంతో ఉన్నాడు. ఆ పుత్రుణ్ణి చూసి ఊరి వారంతా కారణజన్ముడు పుట్టడాని ఆ దంపతులని పొగిడారు. రామయ్య లక్ష్మమ్మ ఆ పిల్లవాడికి ‘కర్ణ’ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచసాగారు. ఇక వాళ్ళిద్దరికి ఆ పిల్లవాడే లోకమయ్యాడు. లక్ష్మమ్మ మాత్రం భర్తకి పిల్లవానికి ఉన్న గండం గురుంచి చెప్పకుండా పిల్లవాణ్ణి కంటికి రెప్పలా చూసుకుంటుంది.

ఆ పిల్లవాడు ఎదిగేకొద్ది దినదినాభివృద్ది చెందుతూ దేధీప్యమానంగా వెలిగిపోతున్నాడు. మిగితా పిల్లల్లో లేని తేజస్సేదో ఆ పిల్లవాని ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపించేది. చూస్తుండగానే ఆ పిల్లవానికి ఐదు సంవత్సరాలు వచ్చాయి. దానితో లక్ష్మమ్మ కొడుకుని ఎక్కడికి వెళ్ళనిచ్చేది కాదు. ఇంట్లోనే ఉండి ఆడుకోవాలని లేకపోతే నాన్న తిడతారని నచ్చజెప్పేది. అయినా వినకుండా ఆ పిల్లవాడు స్నేహితులతో ఆడుకోవడానికి బయటికి వెళ్ళేవాడు. ఒకరోజు ఆ పిల్లవాడు ఎప్పటిలాగే స్నేహితులతో ఆడుకుంటుండగా వాళ్ళు ఆడుతున్న బంతి వెళ్లి బావిలో పడింది. ఆ బంతిని చూడటానికి పిల్లలందరూ బావి వద్దకు వెళ్లారు. కర్ణ బంతి కొరకు ముందుకు తొంగి చూడడంతో కాలు జారి బావిలో పడ్డాడు. ఇంట్లో లేని కర్ణను వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మమ్మకి బావి వద్ద పిల్లలందరూ నిలబడడం చూసి దగ్గరికి వెళ్లి బావిలో పడ్డ తన కొడుకుని చూసి గుండెలు బాదుకుంది. కాపాడడానికి ఎవరైనా ఉన్నరేమో అని చుట్టుప్రక్కలంతా చూసింది. ఎవరూ కనిపించలేదు పిల్లలంతా భయంతో అరుస్తున్నారు. ఇక వేరే దారిలేక లక్ష్మమ్మ కొడుకు కొరకు తానే బావిలోకి దూకింది. బావిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కొడుకుని ఎంతో సాహసంతో కాపాడి బయటకి తీసుకువచ్చి బ్రతికించుకుంటుంది. పిల్లల ద్వారా విషయం తెలుసుకున్న భర్త రామయ్య ఊరి వాళ్ళు లక్ష్మమ్మను ఎంతగానో ప్రశంసించారు.

స్వామిజీ చెప్పిన గండం తొలగిపోయిందని ఇక మీదట తన కొడుకుకి ఎలాంటి ఆపదలు రావని సంతోషంతో లక్ష్మమ్మ స్వామిజీ చెప్పిన గండం గూర్చి భర్తకి చెప్పి కొడుకుని జాగ్రత్తగా చూసుకొమ్మని కన్నుమూస్తుంది. భార్యకు ఏమైందో తెలియక చూస్తున్న రామయ్యకి లక్ష్మమ్మ మెడపై పడిన పాముగాట్లు కనిపించడంతో రామయ్య ఒక్కసారిగా గొల్లుమన్నాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!