తీరని కోరిక

(అంశం:-మది దాటని ప్రేమ)

తీరని కోరిక

రచయిత :: నాగ మయూరి

మొదటిసారి మిమ్మల్ని చూసిన క్షణాన ఎంత ఆనందం కలిగిందో తెలుసా !
అప్పటికి మీరు ఇంకా చాలా చిన్న వాళ్ళు. ఆనాటి నుంచి ప్రతిరోజూ ఉదయం లేవగానే, రాత్రి పడుకునే ముందు మిమ్మల్ని తనివితీరా చూడటం నా దినచర్యలో భాగమయిపోయింది.
ప్రతీ క్షణం మీ ఎదుగుదలను ఆశ్వాదిస్తూ మనసులో ఎంతగా మురిసిపోయానో…. ఈ రోజుకి నా కల నెరవేరబోతోంది.
అబ్బ! ఎంత అందంగా ఉన్నారు….అందుకే కాబోలు కవులు అందమైన పడుచుపిల్లని “దోర జాంపండు” అంటూ మీతో పోలుస్తారు… అని మనసులో అనుకుంటూ మా పెరటిలో కాసిన జామకాయల గుత్తిని కోసి అపురూపంగా ఇంట్లోకి తీసుకొచ్చాను.

మా చిన్ని ఎదురుపడి “అమ్మా జామ కాయలు భలే ఉన్నాయి! సరిగ్గా మన ఇంట్లో అందరికీ సరిపోయేటు ఐదు కాయలు కాసాయి అంటూ మురిసిపోయింది.

ఆ వెనకాలే మా అత్తగారు “అమ్మాయి పంచపాండవులా ఐదు కాయల గుత్తి ముద్దుగా” ఉంది అంటూ కితాబు..

“అసలే ఎప్పుడు ఎప్పుడు తిందామా అని నేను ఆరాట పడుతుంటే వీళ్ళు ఏంటిరా బాబు” అని మనసులో అనుకుంటుండగానే…. మాచిన్ని ఆ గుత్తిలో నుంచి తనకి నచ్చిన కాయ తెంపుకుని పరుగెత్తింది.

ఇంతలో మా అత్తయ్య గారు “అమ్మాయి మన చెట్టుకి కాసిన తొలికాపు కదా దేవుడికి నైవేద్యం పెట్టి తిందాం అన్నారు”.

అబ్బా ఇంక ఎంతసేపు నామనసులో ఉన్న కోరికని అణుచుకోవాలి…అయినా “మొక్క నాటిన నాటినుంచి ఎదురు చూసిన దానిని ఈ కాసేపు ఆగలేనా” అని మనసుకి సర్దిచెప్పుకుని….
ఆ జామపండ్లని శుభ్రంగా కడిగి, పళ్ళెంలో పెట్టి దేవుడిగదిలో పూజ చేసుకుంటున్న మామయ్య గారికి అందించాను.
ఇంక ఆ తర్వాత చూడాలి నా అవస్థ… క్షణం ఓ యుగం లానే అనిపించింది.ఎంతకీ మామయ్య పూజ అవ్వదాయే…నామనసు ఏమో జామపండు రుచి చూడాలని తెగ ఆరాటపడిపోతోంది.

ఈలోగా మా మామయ్యగారి స్నేహితులు ఒకరొకరుగా వచ్చి అరుగుమీద చేరుతున్నారు. అలా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఓపది మంది దాకా చేరి కబుర్లు చెప్పుకోవడం అలవాటు. ఈరోజు వాళ్ళని చూడగానే నా ప్రాణం లేచొచ్చింది. “హమ్మయ్య ఇంక మామయ్య పూజ ముగిస్తారు. ఈ లోపు వేడి వేడి కాఫీ తెచ్చి మామయ్యకి ఇచ్చేస్తే ప్రశాంతంగా కూర్చుని, నా జామపండు రుచి చూడచ్చు” అనుకుని ఆనందంగా వంటిట్లోకి కదిలాను…

కాఫీ కప్పుతో భయటకి వచ్చి చూద్దును కదా ! ప్రతిరోజూ అరుగుమీద చేరే వారంతా ఈరోజు మా వసరాలో కొలువుదీరారు. అత్తయ్య చక్కగా చాక్ తో జామకాయలు ముక్కల చేసి పంచుతున్నారు.
నాకయితే ఆ దృశ్యాన్ని చూసి పై ప్రాణాలు పైనే పోయాయి. ఎంత బావున్నాయో, ఇలాంటి పళ్ళు ఎక్కడ దొరకవు అంటూ…
కనీసం ఒక ముక్క అయిన మిగలకుండా తినేస్తున్నారంతా….
మామయ్య గారు ఏమో అవును మరి మా కోడలు ఎంతో శ్రద్ధగా సేంద్రియ ఎరువులు వాడుతూ పెంచింది. ఇలాంటి పళ్ళు, కూరలు ఆరోగ్యానికి చాలా మంచివిట.మా కోడలికి మా ఆరోగ్యం మీద ఎంత శ్రద్దో అంటూ పొగిడేస్తున్నారు….

నేను ఇష్టంగా పెంచుకున్న చెట్టు మీద మీకు పెత్తనం ఏంటి ? కనీసం ఒక పండు కాదు కదా ముక్క అయిన మిగలకుండా పంచిపెట్టేసారు అని గట్టిగా అరవాలనిపించినా…అంతకు ముందే
మామగారు ఆపాదించిన మంచితనం అడ్డొచ్చి, జామపండు తినాలనే కోరికని మనసులోనే అణిచిపెట్టి వంటపనిలో పడ్డాను.

ఆ తర్వాత మరో జామకాయ కాయడం, అది పూర్తిగా పక్వానికి రాకుండానే చిలకమ్మ పాలవడం….ఇలా ప్రతిసారీ ఏదో విధంగా నా చెట్టు జామకాయ నాచేతి నుంచి నోటికి చేరకుండానే దూరమయ్యిపోతోంది….అయినా నామనసులో జామ చెట్టు మీద ప్రేమ,పండు తినాలనే కోరిక తీరనేలేదు…

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!