(అంశం : నా అల్లరి నేస్తం) వసంతమే తెచ్చావు
రచన :: కమల ముక్కు (కమల’శ్రీ’)
పొద్దున్న లేస్తూనే
మొదలెడతావు నీ అల్లరి చేష్టలు
పనిలో ఉంటే
పక్కనే తిరుగుతావు
వంటింట్లో ఉంటే
ఏం వండుతున్నావ్
నాకు చూపియ్యి అంటావు
ఫోనులో మాట్లాడుతూ ఉంటే
ఇంకా ఎంత సేపు అంటావు
పక్కవారితో కబుర్లు చెప్తూ ఉంటే
ఇంకా అవ్వలేదా అంటావు
నీకేం కావాలో చెప్పూ అంటే
నాకు తెలీదు అంటావు
పుస్తకమేదో చదువుదామనుకుంటే
నాకీ ప్రశ్నకు జవాబు చెప్పూ అంటావు
ఎన్నో చేష్టలు
నన్ను ఆనందంలో ముంచెత్తేవి
ఎన్నో మాటలు
నా కష్టాలు దూరం చేసేవి
ఎన్నో నవ్వులు
నా కన్నీటిని తుడిచేవి
ఎన్నో జ్ఞాపకాలు
నా గతాన్ని మరిచేలా చేసేవి
అన్నీ నీతోనే వచ్చి చేరాయి నా జీవితంలో
సరికొత్త వసంతమే తెచ్చాయి నా పూదోటకి
చిట్టి చిరునవ్వుతో
ప్రపంచమే మరిచేలా చేసిన
నా చిన్నారి తల్లే
నా అల్లరి నేస్తం
ఆ దేవుని వరప్రసాదం