నా బాల్య నేస్తం

(అంశం : నా అల్లరి నేస్తం)                                                               నా బాల్య నేస్తం

రచన ::శ్రీదేవి శ్రీనివాస్ కొప్పిశెట్టి

ఆరోజు స్నేహితుల రోజు
చరవాణిలో నాకు వచ్చిన సందేశం చూసి
ఒక్కసారిగా నాకు నా బాల్య నేస్తం గుర్తొచ్చి
జ్ఞాపకాల దొంతరలను ఒక్కొక్కటిగా తిరగేస్తూ ఉంటే

ఆం……. అప్పుడు

ఎక్కడో చివరన బాగా ఆఖరున కనిపించింది నా నేస్తం యొక్క జ్ఞాపకం

నేను ఎక్కిన మేడలు ,దూకిన గోడలు దులిపిన చెట్ల కాయలు
అంతులేని అల్లర్లలో నాతో పాటు ఉన్న నా నేస్తం

తమ్ముడు మీద చాడీలు చెప్పి అమ్మతో తిట్టించినప్పుడు వాడు పెట్టిన బుంగమూతి చూసి పడీ పడీ నేను నవ్వుతంటే నాతోపాటు శృతి కలిపిన నా నేస్తం

పక్కింటి వారి పొలానికి వెళ్లి సరదాగా గడ్డి కోస్తానని చెప్పి టికెన వ్రేలు కోసుకుని రక్తం కారుతుంటే ఏడుస్తున్న నాతోపాటు ఏడ్చిన
నా నేస్తం

అల్లరి చేస్తున్న నన్ను తిడుతున్న అమ్మను చూసి అల్లరి పిల్లలు కాక నువ్వూ, నేనూ చేస్తామా అని నాన్నమ్మ అమ్మని మందలిస్తుంటే అమ్మ వంక గర్వంగా చూస్తున్నప్పుడు నాతో కూడా ఉన్న
నా నేస్తం

మగరాయుడూ మగరాయుడు అంటూ అమ్మ అన్నప్పుడల్లా అమ్మ నాకు ఏదో బిరుదిచ్చినట్లు నేను సిగ్గు పడుతున్నప్పుడు నాతోపాటు కూడా ఉన్న
నా నేస్తం

తమ్ముడు సైకిల్ చైన్ పెడుతుంటే చూసుకోకుండా నేను స్పెడల్ తిప్పితే తమ్ముడు వేలు అందులో చిక్కుకుని రక్తం వస్తుంటే నాన్న వచ్చి నన్ను కొడతారేమో అని తమ్ముడుని ఏడవవద్దంటూ నేను బిక్క మొఖం పెట్టినపుడు నాతోపాటూ ఉన్న
వా నేస్తం

నా అల్లరి భరించలేక దేవి తల్లి ,దేవి తల్లి అని పిలిచే అమ్మ ఒక్కసారిగా దెయ్యం అని నన్ను పిలుస్తుంటే అమ్మ నిక్ నేమ్ ఏదో పెట్టినట్టు నేను మురిసి పోతూ ఉంటే తను కూడా మురిసిపోతూనాతో ఉన్న
నా నేస్తం

నేను నవ్వినప్పుడు నవ్వి, ఏడ్చినప్పుడు ఏడ్చి నాకు తోడుగా ఉండే నా నేస్తం

ఇప్పుడు నాతో పాటు లేదు
నా స్నేహం వదిలి ఎక్కడికో వెళ్ళిపోయింది

బహుశా………..

బాధరబందీ లతో బందిఖానా లో ఉన్న బాధ్యత తో స్నేహం చేసి
వేదన, బాధలలో తనకు తోడుగా ఉండడం కోసమేమో

ఇప్పుడు నాతో లేని నా అల్లరి నేస్తం
“” నా మనసు “”

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!