అయోమయం సత్యవతి

అయోమయం సత్యవతి

రచన::మద్దిలి కేశవరావు

కోర్టు హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. జడ్జీ గారు రాకకోసం వాదులు,
ప్రతివాదులు, న్యాయవాదులు, ప్రజలు ఎదురు చూస్తున్నంతలో ముందుగా బంట్రోతు వచ్చి జడ్జీ గారు వస్తున్నట్లు చెప్పడంతో అంతా లేచి అభివాదం చేశారు. తన కుర్చీలో కూర్చున్న జడ్జీగారు విచారణలు మొదలు పెట్టాల్సిందిగా కోరడంతో…ధర్మరాజు బోనులో చేతులు కట్టుకొని నిల్చున్నాడు.
“చూడండి ధర్మరాజు గారు…మీరు స్పీడుగా కారు నడుపుకుంటూ యాక్సిడెంట్ చేశారని మీపై అభియోగం ఉంది…దీనిపై మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నిర్భయంగా చెప్పొచ్చు” అంటూ జడ్జీ అనడంతో ధర్మరాజుకు ముచ్చెమటలు పట్టాయి. “అయ్యా జడ్జీగారు నాకు ఏ పాపం తెలీదు. కలలో కూడా ఏ ప్రాణికి హాని తలపెట్టని నాపై నింద మోపడం సరికాదు..తమరే నన్ను రక్షించాలి” అంటూ ధర్మరాజు రెండు చేతులు జోడించి వేడుకున్నాడు. జడ్జీ చిన్నపాటి చిరునవ్వు నవ్వుతూ….”నువ్వు చెప్పేది నిజం అనడానికి నీపై కేసు పెట్టింది ఎవరో కాదయ్యా…నీ భార్య సత్యవతి…” అంటూ చెప్పేసరికి ధర్మరాజు గుండె గుభేలుమంది. బార్య సత్యవతి అనుమానం పక్షి, ఏ క్షణంలో ఎలా ప్రవర్తిస్తుందో అర్ధం కాని అయోమయం పరిస్థితి ఆమెది. అందుకే ఆమెను అందరూ అయోమయం సత్యవతి అంటుంటారు. ఇలా తనను కోర్టుకు ఈడ్చింది అంటే ఏదో బలమైన కారణం ఉంటుందని అర్థమైపోయింది ధర్మరాజుకు.
“అయ్యా…ఆమె అభియోగంలో నిజం లేదు…ఆమెనే విచారిస్తే మీకు అర్ధమవుతోంది” అంటూ ధర్మరాజు చెప్పడంతో సత్యవతి బోనులో నిల్చుంది. “చూడండీ సత్యవతి గారు…మీ భర్త కారుతో ఎవరినో యాక్సిడెంట్ చేశాడని పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు, అది నిజమేనా…?!” అంటూ జడ్జీ ఆడిగేసరికి సత్యవతి గొంతు సవరించుకుంటూ..”అవును సార్….రెండు రోజుల క్రితం పుట్టింట్లో ఉన్న నన్ను తీసుకురావడానికి మా ఆయన ఉదయం 9 గంటలకు కార్లో బయలుదేరిన వ్యక్తి సాయంత్రం 4 గంటలకు వచ్చాడు. అంటే సుమారు 7 గంటల ప్రయాణం చేశాడు. వాస్తవానికి 3 గంటలే ప్రయాణం..”
“అయితే ఆక్సిడెంట్ మీ ఆయనే చేశాడు అనేందుకు సాక్ష్యం ఏమైనా ఉందా మీ వద్ద” అంటూ జడ్జీ కళ్ళ జోడును సవరించుకుంటూ అడిగాడు.
“లేకేం సార్…నిన్నను న్యూస్ పేపర్లో *వ్యక్తిని గుద్దిన గుర్తు తెలియని వాహనం* అని చదివాను సార్…అంతే కాకుండా 4 గంటల పాటు ఆలస్యంగా ఎందుకువచ్చావు అనగా తత్తరపడుతూ నన్ను 3 గంటల్లో అదే కార్లో ఇంటికి తీసుకువచ్చాడు సార్. ఆయనే ఈ పని చేసుంటారని బలంగా నమ్ముతున్నాను” అంటూ సత్యవతి ఆయాసపడుతూ ఇంకేదో చెప్పుకుంటూ పోతుండటంతో జడ్జీ అడ్డు తగులుతూ…
“చూడమ్మా…మీ ఆయన నిరపరాధి.. కేసు కొట్టేస్తున్నాను” అంటూ జడ్జీ చెప్పడంతో సత్యవతి బిక్కమొఖం వేసుకుంటూ వెనుదిరిగింది. తను చెప్పేది వాస్తవమే అయినప్పటికీ జడ్జీ తన భర్త నిరపరాధి అంటూ ఇచ్చిన తీర్పుపై అనుమానం కలిగింది ఆమెకు. అదే విషయాన్ని ప్రక్కనున్న ఆమెతో తన సందేహాన్ని వెళ్లబుచ్చింది సత్యవతి.
“అమ్మా… జడ్జీ ఇచ్చిన తీర్పు కరెక్టే… ఎందుకంటే ఏ భర్త అయినా తన పెళ్ళాన్ని పుట్టింటికి తీసుకువెళ్లడం, తీసుకురావడం చేస్తే క్షణాల్లో ఆ పని ముగించేసి బయటపడతాడు. అదే పుట్టింట్లో ఉన్న భార్యను తీసుకురావాలంటే ఆయన మనస్సు ఒప్పుకోదు…మరో వారం రోజులు పాటు ఆమె పుట్టింట్లోనే ఉంటే బాగుణ్ణు అనుకుంటాడు. నీ బాబత్తు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. 3 గంటల్లో రావాల్సిన వ్యక్తి నిన్ను తీసుకు వెళ్ళడానికి అదనంగా నాలుగు గంటలు ఆలస్యంగా ఎందుకు వచ్చాడో జడ్జీ గారితో పాటు ఈ కోర్టులో ఉన్నవారందరికీ బాగా అర్ధమైంది తల్లీ….ఒట్టి మాలోకంలా ఉన్నావు…అదిగో నీకోసం మీ ఆయన ఎదురు చూస్తున్నాడు వేళ్లు” అంటూ ఆమె కుర్చీలో తలవాల్చి ఊపిరి పీల్చుకుంది. అయినప్పటికీ తన భర్త తన వద్దకు రావడానికి నాలుగు గంటలు ఆలస్యం ఎందుకైందో ఇప్పటికీ అర్ధం కాలేదు పాపం అయోమయం సత్యవతికి.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!