సత్యమేవ జయతే

సత్యమేవ జయతే

రచన::నామని సుజనాదేవి

‘మరే త్వరగా ముక్కేయరా ..ఈ వేళ అసలే ముక్కోటి ఏకాదశి ..త్వరగా వెళ్ళకపోతే మా ఆవిడ ఊర్కోదు …..’ పేకాట ఆడుతున్న రమేష్ అనగానే ఉలిక్కి పడ్డాను. కారణం ముక్కోటి ఏకాదశి అర్ధాంగి సునంద పుట్టినరోజు.
అయ్యబాబోయ్….కనీసం పొద్దున్న కూడా గుర్తు లేక విషెస్ కూడా చెప్పలేదు. ఈ రోజు తప్పక గుడికి తీసుకెళ్ళేవాడు. ఈసారి మరిచిపోయాడు. ఇన్ని సంవత్సరాలు లేనిది , దాదాపు సంవత్సరం నుండి సహవాసదోషమా అన్నట్లు పేకాట అలవాటయ్యింది. అందుకే ఈ గోలలో పడి అర్ధాంగి పుట్టినరోజును మర్చిపోయాను. పిల్లలు కూడా సెలవులని వాళ్ళ అమ్మమ్మ ఇంటి కెళ్ళారు. ఒక్కత్తే ఉంటుంది. వెంటనే ముక్కలక్కడ పడేసి ఆఘమేఘాలపై ఇంటికొచ్చాను. కాని అప్పటికే ఆలస్యమైంది.
ఇల్లంతా చీకటి, నిశ్శబ్దం. ‘సునీ….సునీ…..’ కంగారుగా పిల్చాను. అలికిడి లేదు. పిల్లలింకా ట్యూషన్ నుండి వచ్చి ఉండరు. మరి సునంద ఏమయ్యింది….చ…చ…ఎంత తప్పు జరిగిపోయింది. ఛీ…ఈ పేకాట పిచ్చిలో అన్నీ మర్చిపోతున్నాను. ఛీ..ఛీ ..నన్ను నేను వందోసారి తిట్టుకున్నాను. ఎప్పుడు మనస్సు బాలేకపోయినా తనేక్కడుంటుందో తెల్సిన నేను
‘సునీ…..సునీ….’ పిలుస్తూ డాబా పై కొచ్చాను. అక్కడ ఒంటరిగా శూన్యం లోకి చూస్తూ కూర్చుని ఉంది సునంద. విరబోసుకున్న జుట్టు , కూర్చున్న తీరు ఆమె బాగా హార్ట్ అయ్యిందని చెప్పకనే చెబుతుంటే, ‘విష్ యు మెనీ మెనీ హాపీ రిటర్న్స్ అఫ్ ది డే సునీ …’ చెయ్యందుకుంటూ అన్నాను.
చెయ్యి విసిరికొట్టింది. ఆ కోపం నేను ఊహించినదే…
‘సారీ రా…సారీ రా …ఐయాం వెరీ సారీ…అన్నాగా వందోసారి….ఐయాం వెరి వెరివెరి వెరి వెరి సారీ….క్షమించావా వెయ్యోసారి….’ కొంచెం నవ్వించడానికి పాడాను….ఊహు….పట్టు వదలని విక్రమార్కురాలు కదా….కరగలేదు. ‘నన్ను క్షమించరా….ఎదో ఆఫీస్ పని ఒత్తిడిలో మర్చి పోయాను…’
‘………….’
‘అబ్బ…ప్లీజ్ అంటున్నాగా…మాట్లాడారా… నా బుజ్జివి కదా…ప్లీజ్ రా నువ్వలా ఉంటె నాకేం తోచదురా…లే…లేచి తయారవు..గుడి కేల్దాం….లే..లేమ్మంటున్నాగా.’
‘టైమెంత య్యింది…’ఖంగున మోగింది సునంద కంఠం.
‘ఎనిమిదిన్నర……’గతుక్కుమన్నాను. అంటే ఇప్పుడు ఉన్నపళంగా వెళ్ళినా వెల్లేలోగా గుడి మూసేస్తారు. చ…ఎంత పని చేసాను.
‘నేనో వెధవని….కనీసం అర్ధాంగి పుట్టినరోజు న గుడి కేల్లె చిన్న కోరికయినా తీర్చలేని మూర్ఖుడిని …అయినా పంతం కాకపొతే ఒక ఫోన్ కాల్ చేయొచ్చుగా…భార్య పుట్టినరోజు కూడా గుర్తుపెట్టుకోని దుర్మార్గుడినే…గుడికి తీస్కేల్లమని నువ్వయినా ఒక్కమాట గుర్తు చేస్తే నీ సొమ్మేం పోయింది…..’ కొంచెం గట్టిగా అని… ‘తప్పు చేయడం నీ వంతే..అరవడం నీ వంతేనా’ అన్నట్లు ,కోపంగా తేరిపార చూసిన ఆమె చూపుకు ఎక్కడ మసి అయిపోతానోననే భయంతో,’ఎదో పని ఒత్తిడిలో పడి…’నసిగాను.
‘ఎంత ఓవర్ టైం చేసారెంటి..ఆఫీస్ లాండ్ లైన్ కి చేసాను…’
రెడ్ హాండెడ్ గా దొరికి పోయాను..ఛీ…సెల్ ఉండగా ఆ లాండ్ లైన్ కి ఎందుకో ..ఛీ..ఛీ… తాను అబద్ధం చెబుతున్నానని తెలిసిపోయింది. నాకు తెలుసు ..సునంద కి ఎం చెప్పినా వింటుంది గాని…. అబద్ధం మాట్లాడితే పిచ్చి కోపం వస్తుంది. మరి ..ఆమె నాన్నగారు మంచి స్వాతంత్ర్య సమర యోధుడు. గాంధీజీ గారి ఏకలవ్య ప్రియ శిష్యుడు …అందుకే మొదటి నుండి కేవలం సత్యమే మాట్లాడాలి అంటూ ఇంట్లో క్రమశిక్షణగా పెంచాడు. ఆయన అన్ని లక్షణాలను పుణికి పుచ్చుకున్న ఆమె సత్యమే మాట్లాడుతుంది. ఇతరులను కూడా సత్యమే మాట్లాడ మంటుంది . అబద్ధం మాట్లాడితే అస్సలు సహించదు. మరి అది తెలిసిన నేను పేకాట ఆడుతూ కూర్చున్నానని ఆమె కిష్టం లేని విషయం చెప్పి, తిట్టించు కోవడానికి నేనేమన్నా చవటాయనా… శ్రీక్రిష్ణు డంతటి వాడికే తప్పలేదు సత్యభామాదేవి పాద సేవ… ఇక నేనెంత…. గత్యంతరం లేదు.అందుకే ఇక వంకర దారులు తొక్కకుండా సరెండర్ అయి పోయా…
‘సారీ…సునీ…ఈ ఒక్కరోజే అలా ఫ్రెండ్స్ తో బయటికెళ్ళి….’నసిగాను..
‘…..’ నెచ్చెలి మౌనం ఇంత భయంకరంగా ఉంటుందని మొదటిసారి తెలిసింది.
‘ఓ కే ..తప్పు చేసాను…మరోసారి చేయను..పెనాల్టీ గా నీకేం కావాలి చెప్పు…చీరలా..పట్టుచీరలా…వాషింగ్ మిషనా…గోల్డ్ రింగా… నక్లెస్ నా…’
‘…………’
‘అబ్బా అలా నీ మౌనంతో చంపకురా..ఎదో ఒకటి కమిట్ అవరా….నీ కాళ్ళు పట్టుకుంటాను….’ కాళ్ళను ముట్టుకోబోతే దూరం జరిపింది. చుబుకాన్ని అంది పుచ్చుకుని ,’చెప్పరా…ఈ దాసుడు నీ పాద సేవకుడు.. నీవేం ఆజ్ఞ ఇచ్చినా శిరసా వహించుటకు సిద్ధంగా ఉన్నాడు…అన్యదా శరణం నాస్తి…త్వమేవ శరణం మమ….’ నాటక ఫక్కీలో అన్నాను. నవ్వును ఆపుకుంటూ న్నట్లుగా నాకు తెలుస్తోంది…అమ్మయ్య అనుకుంటూ…
‘ యురేకా…హా…యురేకా ..తాకామీకా…నీ ముద్దు తీరేదాకా..యురేకా తాకమీకా…నీ ముద్దు తీరేదాక..యా..’ అంటూ అమాంతం ఆమెను ఎత్తుకుని గిరగిరా తిప్పాను.
‘అమ్మో…’ అంటూ నన్ను ఒడిసిపట్టుకుంది భయంతో . అలాగే పోదవుకుంటూ…
‘చెప్పరా..నీకేం కావాలి…’
‘ఏదడిగినా ఇస్తారా…’
‘ఓ..యస్….చిత్తం..’
‘ప్రామిస్…’
‘నీకు తెలీదా …. ఇన్ని సంవత్సరాల మన దాంపత్యంలో ఒక్కసారి మాట ఇస్తే బొందిలో ప్రాణం ఉండగా ఎ మాత్రం మాట తప్పనని…’
‘ఓ కే..అయితే చెబుతున్నా…’
‘అట్టే…చంపక చెప్పరా…’ పెద్ద టెండర్ అయి ఉంటుందని భయపడుతూనే ఆత్రుత దాచుకోలేక అడిగాను .
చెప్పింది. ఆమె వింత కోరిక విని అదిరిపడ్డాను. అనుమానం తీరక , ‘కం ఎగైన్..’ అన్నాను.
‘యస్…. మీరు కరెక్ట్ గానే విన్నారు…మిలార్డ్…మీరు మూ డు నెలలు కేవలం సత్యం నే మాట్లాడాలి….’ ఒత్తి పలుకుతూ అంది.
‘ఏంటీ ..ఎ నగలో , నాణ్యా లో,బంగారమో , వజ్రాలో కోరతావనుకుంటే , ఇలా కోరావేమిటి…పైసా ఖర్చు లేని కోరిక..’ అన్నాను.
‘నా కదే పది వేలు…..’
అప్పుడు నాకర్ధమయ్యింది. ఇంతవరకు ఎన్నడూ ఎ విషయం ఆమె దగ్గర దాచని నేను, గత పది నెలలుగా పేకాట ఆడుతున్న సంగతి ఆమె దగ్గర దాచాను. దానికి కారణం ఉంది. అదేంటంటే పేకాట విషయం తెలిసిన మరుక్షణం ఆమె పుట్టింటికి వెళుతుంది. ఆమెకు అస్సలు నచ్చని ఆట అదే. ఆమె పుట్టింటి కేలితే ఇక తన గతి అంటే. ఆమె లేక నేను బ్రతకలేను. నా పేకాట విషయం తెలుసుకోవడానికో , చూచాయగా ఉన్న ఆమె అనుమానం నివృత్తి చేసుకోవడానికో ఆమె ఆ కోరిక కోరిందని నాకర్ధమయ్యింది. అంటే ఇక నేను పెకాట కి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందేనన్నమాట. హతోస్మి…ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు పుట్టినరోజు కొంచెం మేలుకుని గుడికి తీసికెళితే ఎంత బావుండేది..పోనీలే ఏది జరిగినా మన మంచికే నని ఇదీ ఒకందుకు మంచిదేనేమో..ఇలా అయితేనైనా తానూ పేకాట మానేస్తాడే మో..అయితే ఇక తను మూడు నెలలు పేక ముట్టడం ఉండదు..హతోస్మి…గాఢంగా నిట్టూర్చాను.
అయితే పొద్దుటే నేను ఆఫీసుకి వెళ్ళగానే తయారై, తాను ఒక్కర్తే గుడికి వెళ్లి వచ్చిందని, ఆ విషయం దాచి నన్ను ఆట పట్టిస్తూ, సునంద నవ్వుకుందని నాకు మరో సంవత్సరం తర్వాత తెలిసింది.
ఇక అప్పటి నుండి అసలు సినిమా మొదలయ్యింది. నిప్పటివరకూ రాత్రి ప్రతిరోజూ పేకాట ఆడుతూ రాత్రి పోద్దుపోయేంత వరకుండి ఆలస్యంగా ఇంటికి రావడం ..దానితో ప్రోద్దేక్కేవరకు పడుకుని నెమ్మదిగా లేచి కాలకృత్యాలు , స్నానాదికాలు ముగించుకుని టిఫిన్, రెండుసార్లు కాఫీ సేవనం చేసి తీరిగ్గా ఆఫీస్ కి వెళ్ళేవాడిని. దీనితో ఆఫీస్ లో నాకు లేట్ కమ్మర్ అనే పేరు స్థిర పడిపోయింది. మా సెక్షన్ బాస్ దగ్గర అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేసేప్పుడు మింగెట్లు చూస్తున్న అతనికి రోజుకో సాకు చెప్పెవాడిని. వచ్చేముందు ఫోన్ వచ్చిందనో, చుట్టాలోచ్చారనో,రోడ్ పై ఆక్సిడెంట్ అయ్యిన్దనో, టైర్ పంచర్ అయ్యిన్దనో, సెల్ నో, కళ్ళద్దాలో మరిచాననో….సాకుల కేం కొదవ….రోజుకో కహానీ చెప్పేవాడిని. అది తప్పు అని అతనికీ తెలుసు..కాని నిజం చెబితే ఎవ్వరైనా క్షమిస్తారా……., నా పిచ్చిగానీ. వర్క్ విషయంలో కూడా వర్క్ సరైన సమయంలో ఎందుకు కాలేదంటే సవాలక్ష కారణాలు చెప్పేవాడిని. కాని ఇప్పుడు సునీ కిచ్చిన మాట వళ్ళ ఎ ఒక్క అబద్ధం చెప్పకుండా రోజులు గడవడం అంటే దుర్భరంగా అనిపిస్తుంది… మాటిచ్చాను కదాని అబద్ధం చెప్పలేక పెకాటకు వెళ్ళడం మానేసాను. దానితో ఆఫీసయిపోగానే తిన్నగా ఇల్లు చేరడం మొదలైంది.
తోచక పిల్లలతో, సునీతో క్యారమ్స్, షటిల్ ఆడటం, వారానికి మూడు రోజులు యోగా క్లాసులకు వెళ్ళడం ..అక్కడ గురువుగారు చెప్పినట్లు అందరం ‘అహింస పరమోధర్మః ‘ అని శాఖాహారానికే మారి అందులోని రుచులను ఆస్వాదించడం… ఎక్సర్ సైజులు చేయడం, ..పిల్లలు ఎం చదువుతున్నారోనని వారి ప్రక్కన కూర్చోవడం అలవాటయ్యింది. నిజం చెప్పొద్దూ. ఇంతకుముందు కనీసం వాళ్ళు ఎ క్లాస్ చదువుతున్నారో కూడా తెలియదు. ఇపుడు ఒకేసారి వాళ్ళ ప్రక్కన కూర్చుంటూ, నా కిష్టమైన ఇంట్లోని పుస్తకాలు అన్ని చదవడం మొదలు పెట్టేసరికి చాలా లాభాలోచ్చాయి. ఒకటి, నా కిష్టమైన పుస్తకాలు…. ఒకప్పుడు నేను, పిల్లలు పాల్గొన్న అనేక పోటీలలో బహుమతులుగా వచ్చినవి, కొన్నవి, మనింట్లో నే ఉండేవిగా….. అని ఏవీ చదవలేదు. ఇపుడవన్నీ చదువుతుంటే కొత్త ఉత్సాహం వస్తోంది. ఒకప్పుడు పుస్తకాల పురుగుగా ఉండేవాడిని. మళ్ళీ అప్పటి రోజులు గుర్తొచ్చాయి. పర్సనాలిటీ డెవలప్ మెంట్ పుస్తకాలు చదవడంతో వ్యక్తిత్వ వికాసం పెరిగింది. రెండో ఉపయోగం పిల్లల చదువులు మెరుగవడం అందరి ఆరోగ్యాలు బాగుండడం. ఎదేలాగంటే పిల్లలిద్దరూ వాళ్లకు వచ్చిన మార్కులు , అవన్నీ నాకు చూపెడుతుండటం … నేను…’అరె…బాగా చేసారు…ఇలా అయితే ఇంకా బావుండేది…’ అంటూ సూచనలు ఇవ్వడంతో వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో చదువుతున్నారు. వారానికి ఒకసారి సునంద, పిల్లలతో అలా అలా గుడికో, పార్క్ కో బయటకు వెళ్లి రావడం సాధారణమై పోయింది. పిల్లలు ఎప్పటికీ టీవీకి అతుక్కుపోకుండా క్యారం, చెస్, షటిల్ ఆడటంతో సంతోషంగా ఉండటమే కాక స్కూ ల్లో ఆట ల పోటీలకు మెలకువలన్నీ అడిగి తెలుసుకుంటున్నారు. ఇద్దరూ తండ్రి ప్రోత్సాహం, సహాయంతో సైన్స్ ఫేర్ కి సెలెక్ట్ అయి వారు పెట్టిన ఎక్స్ పరిమేంట్ లకు బహుమతులు పొందడంతో వారికి నూతనోత్సాహం వచ్చింది. సృజనాత్మకత పెరిగింది.
రాత్రి త్వరగా పడుకోవడం వళ్ళ త్వరగా పెందరాలే లేవడం అలవాటయ్యింది. అందరూ కలిసి వాకింగ్ కి వెళ్ళి వచ్చి, యోగా అది చేసి పిల్లలు పాఠాలు వల్లే వేస్తుంటే గడ్డం గీసుకుని ఎంత తీరిగ్గా తయారైనా ఆఫీస్ కి ఇన్ టైం లోనే వెళుతున్నాను…ఇదివరకులా ఆలస్యమైతే అబద్ధాలు చెప్పకూడదు కనుక సమయానికే చేరుతున్నాను.
ఆఫీస్ లో కూడా ఇదివరకులా వర్క్ విషయంలో అబద్ధాలు చెప్పకూడదు కనుక, నిజాలే చెప్పాలనేసరికి వర్క్ తప్పనిసరిగా కరెక్ట్ గా చేయాల్సి వస్తోంది. ఎందఱో వర్క్ చేస్తుంటే ఇంకా అందులో పూర్తీ ఏకాగ్రత కుదిరి ఇంకా చేయాలనిపిస్తోంది. ఇటీవల మా ఆఫీసులో స్టాఫ్ మీటింగ్ జరిగింది. అందరూ ఉన్నవీ లేనివి పొగిడి మేనేజర్ ను భలే సంతృప్తి పరిచారు. ఆయన తెగ సంతోశపడి పోయారు. అయితే అప్పుడే అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. నిజానికి నేను మంచి వక్తను కనుక ఎ మీటింగ్ లోనైనా తప్పక నన్ను మాట్లాడమంటారు. అయితే నా సత్యవ్రతం సంగతి వారికి తెలీదు కనక ఎప్పటిలా నన్ను మాట్లాడమని బలవంత పెట్టారు. నేను ఎంత వారించినా వినకుండా లేపి నించో పెట్టడం తో మాట్లాడక తప్పలేదు. ఐతే ఎప్పటిలా నేను కూడా వాళ్ళందరినీ పొగడలేదు. ఈ సారి తప్పక సత్యమే మాట్లాడాలి కాబట్టి జరుగుతున్న విషయాలు , లోటుపాట్లు, తీసుకోవాల్సిన చర్యలన్నింటిని కూలంకషంగా ఏకరువు పెట్టాను. అందరిలో చిత్త శుద్ది లోపించిందని అసలు అంతా చాలా బాగుందని మన గురించి మనమే పోగుడుకుంటూ, మనల్ని మనమే మోసగించుకుంటూ మన లోపాలను మనం ఇంకా గుర్తించటం లేదని, బ్రాండ్ ఇమేజ్ నెమ్మదిగా తగ్గుతోందని ఒకవేళ ఇంకా మనం కళ్ళు తెరవకపోతే సంస్థ మూతపడే రోజులు అతి తొందరలోనే వస్తాయని చెబుతూ, కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాను. అందులో తగ్గుతున్న నాణ్యత గురించి ఒక వస్తువును మార్కెట్ లోకి విడుదల చేసాక అందులో అన్ని పరికరాలు మంచి నాణ్యత గలిగినవి వేసి, కేవలం ఒకటి రెండు మాత్రం కొంచెం నాసిరకంవి వేయడం వాళ్ళ ఆ వస్తువు పనికిరాకుండా పోయి నాణ్యత కోల్పోతుందని దానివలన కస్టమర్ కి నష్టం జరిగి మిగతా అన్ని కంపెనీల లాగానే ఇదీ ఉందని ప్రచారం అవుతుందని, దానితో బ్రాండ్ ఇమేజ్ పడిపోతోందని, బ్రాండ్ ఇమేజ్ తో ప్రస్తుతం జరుగుతున్న కొనుగోళ్ళు ముందు ముందు ఇవి మిగతా కంపెనీల లాగానే పని చేస్తే అప్పుడు ఎక్కువ డబ్బు వెచ్చించి మన వస్తువులనే కొనాలనే రూలు లేదు కనక, సేల్స్ పడిపోయే ఆస్కారం ఉందంటూ , ఇటీవల నేను గుర్తించిన రెండు ఉత్పత్తులలోని లోటుపాట్లను ప్రయోగాత్మకంగా ఎత్తి చూపాను. పైగా మన బలాలను కొన్ని అనవసర విషయాలకు వృధా చేస్తున్నామంటూ, వాటిని అరికట్టడానికి చాలా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలంటూ అలాంటి చిట్కాలు చెప్పాను. మనదరిలో కూడా ‘ఏకత్వ’ భావన ఉంది ఒకే ఫామిలీలా ప్రతి ఒక్కరు ఫీలయినప్పుడు ఈ అధిక ఖర్చులు కూడా తగ్గుతాయంటూ ఉదాహరణలు ఉటంకించాను . ఇంట్లో కుటుంబంలో ఖర్చు తగ్గాలంటే ప్రతి ఒక్కరు ఎలా శ్రద్ధ తీసుకుంటారో ఇక్కడా అ లా చేస్తే ఇంకా లాభాల శాతాన్ని పెంచొచ్చు. అది మరో రూపంలో లాభంగా మనమే అధిక జీతంలా పొందొచ్చు..అంటూ కొన్ని సూచనలు చేసాను. ప్రస్తుత మన ఉత్పత్తుల గురించి ప్రజలతో ఉన్న ‘టాక్’ గురించి చెప్పాను. నిజాని కి ఎ రకమైన కొత్త ఉత్పత్తి అయినా మార్కెట్ లోకి విడుదల అయ్యేముందు చాలా పెద్ద పెద్ద తలలు ఎన్నో రకాలుగా ప్రయోగాలు చేసి అన్ని రకాల లోటుపాట్లను సరి చేసాక మార్కెట్ లోకి విడుదల చేస్తారు. అయితే వారందరూ ఉన్న త కుటుంబాలకు చెందినవారు. వారు పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆలోచించే తరహాలో ఆలోచించక పోవడం వళ్ళ, అలాంటి కుటుంబాల నుండి వచ్చిన నా లాంటి వారికి వారి బాధలు, ఆలోచనలు బాగా తెలుస్తాయి. అందుకే ఆ విషయమే నిక్కచ్చ్చిగా చెప్పాను. బాస్ ఇప్పటివరకు ఎన్నో రకాలుగా డైనమిక్ అని పేరు తెచ్చుకున్నారని, ఇవన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఇంకా డైనమిక్ అవుతారని చెప్పాను.
కరతాలద్వానులు మిన్నంటి నా బాస్ ముఖం మాడి పోయింది. కొంతమంది కొలీగ్స్ చెవులు కొరుక్కున్నారు కూడా. అయినా నేను దేనికీ వేరవలేదు. నేనేం చెప్పినా ఉద్యోగమైతే తీసేయలేరు. మహా అయితే ప్రమోషన్ పోస్ట్ పోన్ చేస్తారు. అంతే కదా అనుకున్నాను.
ఈ సందర్భంలో మా కంపెనీ ఒక కొత్త ప్రాడక్ట్ ను విడుదల చేసింది. మా కంపెనీ పిల్లలకు కావాల్సిన ఆటబొమ్మలు, సైకిల్, రిక్షా లాంటి వన్నీ తయారీ చేసే కంపెనీ. అయితే ఈ మధ్య తయారీ చేసింది, ఇంతకుముందు సైకిల్ లానే ఉంది గాని హండిల్ , సీటు లాంటివి కొన్ని వేర్వేరుగా ఉన్నాయి.
ఆ డిజైన్ మార్కెట్ లోకి విడుదల చేసే ముందు చర్చ అయ్యాక డిజైన్ అప్రూవ్ చేయడానికి ఒపీనియన్ కోసం దాని స్క్రిప్ట్ , పని చేసే విధానం మా సెక్షన్ హెడ్ కి వస్తుంది. అతను సాధ్యమైనంతవరకు మంచి ఇంగ్లీస్ రానందున నాపై ఆధార పడతాడు. ఇంతకూ ముందయితే ఇలా నేను అలా చేసినందుకు ప్రతిఫలంగా కొంచెం ముందుగానే పెకాట కు పర్మిషన్ తీసుకుని వేల్లె వాడిని. కాని ఇప్పుడు ఆ అవసరం లేకపోయినా ఎప్పటిలా నన్నే ఫెయిర్ చేయమన్నారు. అయితే నేను కంప్యుటర్ లో చేసేప్పుడు, దాని ప్రాసెసింగ్ గురించి ఎన్నిసార్లు చూసినా ఒక లోపం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. దాని వల్ల ప్రస్తుతం మార్కేట్ లో బాగానే అమ్ముడుపోయినా ఆరునెలల్లోనే తప్పక అందులో ఉన్న బటన్ వళ్ళ సైకిల్ చైన్ సిస్టం, దెబ్బతినే అవకాశముంది. తీసుకున్న ఆరునెలల్లోనే అలా రిపేర్ వస్తే బ్రాండ్ ఇమేజ్ తో వారెంటీ అయినా సంస్థ నష్టపోతుంది. లేదంటే కస్టమర్ కి కంపెనీ పై నమ్మకం పోతుంది. అందుకే ఆ విషయం గురించి ప్రాడక్ట్ పూర్తిగా బయట మార్కెట్ లోకి రాక ముందే చెబితే అని మా సెక్షన్ హెడ్ కి చెప్పాను. ఆయనా నువ్వు నిజంగా మంచి ఇంట లీజేంట్ వోయ్ అని మేచ్చుకున్నాడు. నవ్వి ఊరకున్నాను. ఆ తర్వాత ఆ విషయం మేనేజర్ తో చర్చించి తానె పసిగట్టినట్లు చెప్పాడట. అయితే మేనేజర్ ఏవో రెండు ప్రశ్నలు, అనుమానాలు అడిగితె నీళ్ళు నమిలాడ ట. అప్పుడాయన నిజంగా ఇది నీకొచ్చిన ఆలోచననేనా అని అడిగాడట. అప్పుడు ఆయన తన పేరు చెప్పాడట. ఈ రోజు ఆయన దగ్గరకు నన్ను తీసుకు రమ్మన్నాడట. అందుకే ఆ రోజు మేనేజర్ చాంబర్ నుండి నాకు పిలుపు వచ్చింది.
ఆ రోజు మీటింగ్ లో అలా అన్నప్పటి నుండి, ఆయన నాతొ మాట్లాడలేదు. నేను వెళ్ళగానే సాదరంగా ఆహ్వానించి కాఫీ ఆఫర్ చేసి ఆయన అనుమానాలు అడిగాడు. నేను చెప్పిన సమాధానాలకు సంతృప్తి పడ్డాడు. సత్యమే మాట్లాడాలి కాబట్టి పై పై మెరుగులు దిద్దకుండా కుండబద్దలు కొట్టినట్లు ఉన్న విషయం ఉన్నట్లు చెప్పాను. దానితో ఆయన చాలా తృప్తి పడ్డారు.
‘వెల్ డన్ ..అందరూ నీలా కాస్తంత ప్రాక్టికల్ గా ఆలోచిస్తే తప్పకుండా మన సంస్థ ఉన్నత శిఖరాలకు చేరుతుంది. నీ సూచన పాటించి అంతా వారు సీట్లో ఉన్నప్పుడే లైట్, ఫాన్ వేసుకుని లేనప్పుడు ఆఫ్ చేసేసరికి ఈ నెల మన బిల్ వెయ్యి తగ్గింది…’ అన్నారు. నేను నవ్వి వచ్చేసాను.
తర్వాత రెండు రోజులకి మా సెక్షన్ హెడ్ ‘రమణా …మరే నేనే ఇలా అడగడం బాగోదని ఇన్ని రోజులు ఊరకున్నాను. కాని నాతొ నిన్ను అడగమని ఫోర్స్ ఎక్కువ కావడం వళ్ళ అడగాల్సి వస్తోంది. పోటీలో మనతో సరి సమానంగా నువ్వెంత అంటే నేనెంత అంటూ ఉండే CR కంపెనీ వాళ్ళు నిన్ను తమ కంపెనీ లోకి రమ్మని అడుగుతున్నారు. ప్రమోషన్ తో పాటు ఇప్పుడున్న సాలరీ కి రెండు ఇంక్రిమెంట్లు కలిపి ఇస్తారట. అందుకే రోజు నిన్ను అడగమని నాకు ఫోన్ చేస్తున్నారు. ఆ కంపనీ చీఫ్ మేనేజర్ నాకు మంచి ప్రెండ్. నిజం చెప్పాలంటే నీ శ్రేయోభిలాషిగా ఇక్కడ గొర్రె తోక బెత్తేడులా నాలుగు సంవత్సరాల బట్టి నీ జీతం అంతే ఉంది. అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది. అది వచ్చినపుడే మనం ఉపయోగించుకోవాలి. ఎ విషయం ఆలోచించుకుని సమయం తీసుకుని, రెండు రోజులు ఆగి చెప్పు’ అన్నాడు.
ఈ మధ్య మేనేజర్ అప్పజెప్పిన స్పెషల్ వర్క్ కోసం ఆఫీస్ అవర్స్ దాటాక కూడా ఉండాల్సి వస్తోంది. అలాంటి సమయంలో ఒకరోజు నేను దీక్షగా పని చేస్తుంటే వచ్చి ఆయన చెప్పిన మాటలివి.
నేను వెంటనే ,’తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దేవాడిని కాదు సర్…ఇందులో ఆలోచించాల్సిందే మీ లేదు.నాకు ఏమీ లేనప్పుడు ఆకలి తీర్చిన సంస్థను నేను మరవను. ఎదో ఇప్పుడు వాళ్ళు ఇంతకన్నా ఎక్కువిస్తామని అన్నా ఆపద లో ఆదు కున్నవారిని మర్చిపోలేను. మీరు ఎన్ని రోజులు , నెలల తర్వాత అడిగినా నా సమాధానంలో మార్పుండదు. నేను వేరే ఏ కంపెనీలో చేరను’ అన్నాను నిశ్చయంగా.
అయితే అపుడే చాంబర్ నుండి బయటకు వెళుతున్న మేనేజర్ ఈ మాటలు విన్నట్లు నాకుగాని, మా హెడ్ కి గాని తెలియదు. ఆ తర్వాత నేను ఊహించినట్లుగానే, నేను చెప్పిన లోపాలు సరి చేసి మార్కెట్ లోకి విడుదల చేసిన ప్రాడక్ట్ మంచిగా క్లిక్ అయి, ప్రశంసల వర్షం కురిపించింది. ఆ విజయోత్సవ సభ నిర్వహిస్తూ మేనేజర్ గారు నా కృషి గురించి అభినందనలు తెలుపుతూ, ప్రమోషన్ తో పాటు రెండు ఇంక్రిమెంట్లు ఇస్తున్నట్లు ప్రకటించడంతో కరతాళ ధ్వనులతో హాలంతా మార్మోగింది. నేను ఊహించని పరిణామానికి ఉద్వే గంతో మాటలు రాలేదు. అందరూ ‘కంగ్రంట్స్ ’ చెబుతుంటే అందరికీ కృతఙ్ఞతలు తెలుపుతూ, మేనేజ్ మెంట్ కి ధన్యవాదాలు తెలిపి, వస్తూ, వస్తూ గుడికి వెళ్ళడానికి పూలు, కొబ్బరికాయ ఇంట్లోకి స్వీట్ తీసుకుని ఆగమేఘాలపై ఇల్లు చేరాను. నేను ఇల్లు చేరేసరికి దిగాలుగా శూన్యంలోకి చూస్తూ కూర్చుని కనిపించింది శ్రీమతి. నేను దానిని అంతగా పట్టించుకోకుండా , ‘సునీ…గుడ్ న్యూస్ …ఏమిటో చెప్పుకో చూద్దాం…’ అంటూ స్వీట్ బాక్స్ ముందుంచాను .
కాని నా అంచనాలకు విరుద్ధంగా ముఖం తిప్పుకుంటూ, ప్రక్కకు తిరిగింది. ఆశ్చర్యంగా ‘ఏమయ్యిందిరా… సునీ…ఎనీ ప్రాబ్లం……’ అంటూ అడిగాను, చుబుకాన్ని పట్టుకుని. నా ఆశ్చర్యాన్ని పెంచుతూ కళ్ళు రెండూ వర్షిస్తున్నాయి.
‘ఎంటిరా ఇది… ఏమయ్యింది…’ అడిగాను లాలనగా.
‘నాకు తెలీదా ఏమిటి, మీరు స్వీటు ఎందుకు తెచ్చ్చారో..అందుకే బాధగా ఉంది’
‘ఏంటి…నా విషయం అప్పుడే నీకు ఎలా చేరింది..ఎవరు చెప్పారు… దానికి సంతోషించాలిగాని బాదెందుకు…’ అడిగాను విస్మయంగా.
‘ఒకరు చెప్పేదేమిటి…నా కు తెలీదా ఈ రోజుతో మీ ‘సత్య వ్రతం ‘అయిపోయిందనేగా స్వీటు తెచ్చింది…నాకు తెలుసు, నేను రోజు, రోజుకు రోజులు లేక్కపెట్టుకుంటూనే ఉన్నాను. ‘
నేను పెద్దగా నవ్వాను. ఆమె అవాక్కై పోతుంటే,’పిచ్చిదానా…నీ బాధ అదా…నేను అసలు ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాను. ఇదిగో అలా సత్యం మాట్లాడినందుకే ఇప్పుడు నాకు ప్రమోషన్, రెండు ఇంక్రిమెంట్లు వచ్చాయి. అలాంటి సత్యాన్ని నేను ఎందుకు వదిలిపెడతాను…జీవితాంతం పాటిస్తాను. నీ బాధ అదా……పిచ్చి సునీ….ఈ దాసుడి క ఎప్పటికీ నీ పాద దాసుడే…’ చివరి వాక్యం తల కొంచెం వంచి చేయి తో సలాం చేస్తున్నట్లు అంటూ, ఆమెను అమాంతం లేపి గిరగిరా తిప్పాను.
‘నిజంగా…’ అన్నట్లు నా నవ్వుతో శృతి కలిపి నా భుజాన్ని పడకుండా ఒడిసిపట్టుకున్న నా నెచ్చెలి కళ్ళలోని కన్నీళ్లు ఆనంద బాష్పా లై , ఆ విరిసిన నవ్వులో కోటి కాంతులు లీనమై కనిపించాయి. దూరంగా గుడిలోని జే గంటలు తధాస్తు అన్నట్లు శుభప్రదంగా మోగాయి.

*******

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!