వాడంతే!

వాడంతే!

రచన::వడ్ల పాండు రంగా చారి

ఎన్ సి ఆటోమేషన్ సర్వీసెస్ లో టెక్నికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్న నేను, కొన్ని స్వకారణాల వలన ఆఫీస్ కి ఓ వారం రోజులు సెలవు పెట్టి, ఈ రోజే మళ్ళీ వచ్చాను. నా క్యాబిన్ ఎదురు టేబుల్ దగ్గర కొత్త కుర్రాడు, ‘ఎవరూ?’ అని అడగబోయేంతలో “కుర్రాడి పేరు జయరామ్, మొన్నే జాయిన్ అయ్యాడు, బొత్తిగా పని చేసేవాడిలాగా అయితే కనిపించట్లేదండీ, రెండ్రోజులుగా అక్కడే కూర్చుంటున్నాడు కానీ పక్క వాళ్ళని కనీసం పరిచయం చేసుకోలేదు, పరిచయాలు పెరిగితే, పనిలో సహాయం చేసి పెడతారు, పని నేర్చుకోవచ్చు కదా! సర్, మన దగ్గర..” అన్నాడు సూర్య నారాయణ.

“ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్” అనుకునే నేను సూర్య నారాయణ మాటలు విని ఆ కుర్రాడి మీద అలాంటి అభిప్రాయమే ఏర్పరచుకున్నాను. ఎక్కడికీ కదలకుండా ఎప్పుడూ అక్కడే కనిపించేసరికి, “బద్ధకిస్టు” అని కూడా అనిపించింది. దానికి తోడు రోజూ ఆలస్యంగానే వస్తాడు ఆఫీసుకి.

సిగరెట్ మందు అలవాటు ఉన్న వాళ్ళని అయినా మానిపించగలం కానీ, టీ వ్యసనం ఉన్నవాడిని ఏమీ చేయలేము, అందులో నేనూ ఒకడిని. రోజుకు అయిదారు సార్లు అన్నా టీ గొంతులో పడకపోతే ఇక ఏదో కోల్పోయినట్లే ఉంటుంది ఆ రోజంతా.
అలా రోజూ లాగే మూడు గంటలకు ఆఫీస్ బయట రాజు గాడి కొట్లో టీ తాగుతుంటే, జయరామ్ వచ్చి రాజుతో టీ ఇవ్వమని చెప్పి, “నమస్తే సర్..” అని నన్ను పలకరించాడు. నేను కూడా సమాధానంగా “నమస్తే” చెప్పి ఊరుకున్నాను.

ఎదుటివారి మీద మంచి అభిప్రాయం ఉంటే మాటామాటా కలపగలం కానీ అసలు వాళ్ళు పనికి రారు అని అనుకుంటే అంత సులువుగా కలిసిపోలేము, ఒకరకమైన చులకనభావంతో.

జయరామే మళ్లీ మాటందుకుని “సర్, ఎక్కడ ఉంటారు మీరు? ” అనడిగాడు రాజు ఇస్తున్న టీ కప్పు చేతిలోకి తీసుకుంటూ.

చెప్పాను ఏదో చెప్పాలి అన్నట్లుగా. మనకంటే చిన్నవాడు అడిగితే మనం అంత సీరియస్ గా తీసుకోం కదా.

జయరామ్ ఏదేదో మాట్లాడుతున్నాడు, నేను వినకుండానే ఊ కొడతూ ఉన్నాను. టీ తాగేసి వచ్చి నా క్యాబిన్ లో కూర్చున్నాను.

శనివారం సాయంత్రానికి నాకు జయరామ్ ఫోన్ చేశాడు “సర్, మీ ఇంటి దగ్గరలో లైబ్రరీ ఉంది కదా, అక్కడ ఉన్నాను” అని.
నేను ‘ కొంపతీసి ఇంటికి రమ్మనాలా వీడిని ఇప్పుడు ‘ అనుకుంటుండగానే “సర్, బార్ కి వెళదాం వస్తారా?” అని అడిగాడు. “నాకు అలవాటు లేదు” అన్నాను నేను.
“పోనీ టీ తాగుదాం వస్తారా?” అనడిగాడు.
“నేను ఇంట్లోనే ఉన్నాను కదా, ఇందాకే తాగేసాను” అన్నాను వాడిని కలవడం ఇష్టం లేక.
“సరే, సర్… ఉంటాను” అని ఫోన్ కట్ చేశాడు.

ఇలా ఓ నాలుగైదు సార్లు జరిగాక ఒకసారి తప్పదు అన్నట్లు వాడితో కలిసి టీ తాగుదామని వెళ్ళాను, అసలు ఉద్దేశ్యం అది కాదు, ఊరికే అడుగుతున్నాడు కదా, ఓ సారి వెళ్తే, మళ్లీ అడగడని.

టీ తాగాక, ఇంటికి తీసుకుని వెళ్ళాడు బలవంతంగా, ఒక్కడే ఉంటాడట, ఒంటరిగా.
ఇల్లంతా చిందరవందరగా ఉంది, కుర్చీలో ఉన్న బట్టలూ అవన్నీ ఒకపక్క మూలకి బెడ్ మీదకి విసిరేసి నన్ను కూర్చోమన్నాడు.
అసలుకే అతని మీద ఉన్న అభిప్రాయం బాగా లేదు, అంతటికీ ఇదంతా చూసేసరికి అది ఇంకా రెట్టింపయ్యింది.
కానీ అదంతా పావు గంట సేపు కూడా లేదు,
అతని మాటలు వింటూ ఉంటే, అతని మీద ముందు ఉన్న అభిప్రాయం అంతా కూడా గాలి బుడగల లాగా పగిలిపోయి, గాల్లో కలిసిపోయింది.

అతన్ని అర్థం చేసుకోవడం మొదలు పెట్టాను, నిజాలు బయటికి వచ్చి, నాలో ఉన్న భ్రమలు తొలగిపోయాయి. అతను చెప్పినందు వల్ల కాదు, చెప్పిన మాటలను కొన్ని రోజులుగా జరిగిన సంఘటనలకు అన్వయించుకోవడం వలన.

సూర్య నారాయణ చెప్పినట్లు జయరామ్ బద్ధకిస్టు కాదు, జయరామ్ కి ఎక్కువ సేపు ఒకే పని చేయడం చిరాకు, అందుకే ఏ పని అయినా త్వరగా చేసేసి కూర్చుంటాడు.
తనకి ముందే తెలిసిన పని కనుక ఎవ్వరినీ అడగడు, ఇక పక్క టేబుల్ వాళ్ళతో మాట్లాడక పోవడానికి కారణం అతని పక్క టేబుల్ లో కూర్చునేది అమ్మాయి కావడం, అమ్మాయిలతో మాట్లాడ్డం అతనికి పెద్దగా ఇష్టం ఉండకపోవడం.

జయరామ్ తనకి నచ్చినట్లు ముక్కు సూటిగా ఉంటాడు, తనకు నచ్చిందే చేస్తాడు, తనకు సంతోషాన్ని ఇచ్చే పనే చేస్తాడు, ఎవ్వరినీ లెక్క చేయడు, తనకు నచ్చిన మనుషులని మాత్రమే తనతో కలుపుకుంటాడు.

జయరామ్ ని అర్థం చేసుకోవడం మొదలు పెట్టిన నాకు అతను కొత్తగా కనిపిస్తున్నాడు.

సూర్య నారాయణ అలా ఎందుకు చెప్పాడా అని ఆలోచిస్తే, మా మేనేజరు, ఇన్నేళ్లుగా పనిచేస్తున్న సూర్య నారాయణ కంటే జయరామ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండడం, ఎప్పుడు చూసినా అతను పని లేకుండా కూర్చునే ఉండడం, సూర్య నారాయణకేమో ఎప్పుడూ పని భారం పనిని నెమ్మదిగా చేస్తూ వాయిదా వేస్తూ ఉండడం వల్ల తెలిసింది.

ఇప్పుడు జయరామ్ ని నేను ఒక స్నేహితుడిలా చూస్తున్నాను.
ఎదుటి వ్యక్తిని మనం అర్థం చేసుకోవడం అనేది మనం చూసే చూపుల్లో ఉంటుందని, మనం చూసే దృష్టి కోణం మార్చుకుని అవతలి వారి వైపు నుండి కూడా చూస్తే, మనుషులు సరిగ్గా అర్థం అవుతారని తెలిసింది నాకు.

“వాడంతే, బద్దకిస్టు మహారాజు” అనుకుంటున్న వాళ్ళందరికీ వాడి గురించి “వాడలా కాదు” అని చెప్పాలనుకుని, వాడి గురించి ఎవరు ఏమనుకున్నా, అసలు వాడు పట్టించుకొనేకోడు అని ఎవరిష్టానికి వాళ్ళని వదిలేశాను, ఏమయినా అనుకోనీ అని.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!