వాయులీనమైన గాంధర్వ గానం

వాయులీనమైన గాంధర్వ గానం

రచన: డా॥అడిగొప్పుల సదయ్య

(ఇష్టపదులు)
1.
వైకుంఠ పురమునను భజన కీర్తన జేయ
పద్మనాభుడు గరుడ వాహనము బంపెనో!

తాండవంబాడు తరి తకథిమలు పాడుటకు
ముక్కంటి నందిపుని మురిపెమున బంపెనో!

సంగీత సాహిత్య సద్గోష్ఠిలో జేర
రాజీవ సంభవుడు రాయంచ బంపెనో!

ఆస్థాన పీఠమును అధిష్టింపనుగోరి
అమరావతీ పతీ హస్తీశు బంపెనో!

2.
స్వర రాజు ఖగరాజు సాలంకృతుండయ్యి
పాల కడలి జేరి పరవశిస్తున్నాడో!

స్వరరాజు వృషరాజు వర మూపురంబెక్కి
కైలాస శిఖరాల కాంచుటకు వెళ్ళెనో!

స్వరరాజు సురరాజు విరి తోటలో జొచ్చి
తేటియై వీణియలు మీటుచుండెనొ కదా!

స్వరరాజు నటరాజు సధనమందున జేరి
సరిగమలు పదనిసలు సాయించుచుండెనో!

3.
గాన గాంధర్వమా! గగనమేగితివేల?
శోక సంగీతమున లోకమును ముంచేసి;

నన్ను పాడవా యిక నంటు నేడ్చెను పాట
మూగబోయిన సుధా రాగమును తలచుకొని;

చిత్రసీమా తల్లి చిన్నబోయెను గదా!
గాత్రమెవరిత్తురని కడు దుఃఖమున మునిగి;

సరిగమలు పదనిసలు పరిఖిన్న వదనలై
బాలసుబ్రహ్మణ్యా! పరితపించె నీకై…

You May Also Like

One thought on “వాయులీనమైన గాంధర్వ గానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!