అణువణువు అద్భుతమే
రచన: దుర్గా మహాలక్ష్మి ఓలేటి
కోటాను కోట్ల కణ సమూహం
నిర్మించే నీ అంగాంగ సౌందర్యం
అందమైన ఆడతనాన
సూక్ష్మాతి సూక్ష్మ శుక్రకణ
సంయోగం నీకు కలిగించే
మానవ జన్మ యోగం
అద్భుతమే……
నాడుఆటవిక జాతి ఆదిమానవుడే
నేడు అడుగులు వేసే
ఆకాశ హార్మ్యాలకు నాంది
అంతరిక్ష మార్గాన విహారాలకు పునాది….అద్భుతమే…
అరచేత ఇముడు మానవ మెదడు
సృష్టించే చూడు అరచేత అరక్షణంలో
వీక్షించే ప్రపంచాన్ని అద్భుతమే…..
నింగి నేల చెట్టు పుట్ట
పక్షులు కట్టే గూడు
చిగురించే కొమ్మ నేల రాలు ఆకు
నీటిలో చేప బొసినవ్వుల పాప
వర్షించే కళ్ళలో నవ్వే పువ్వు
ఆస్వాదించే మనసుంటే
అణువణువు అత్యద్భుతమే….
***