అబ్బో! ఎంత తీపి!

(అంశము:: “కొసమెరుపు కథలు”)

అబ్బో! ఎంత తీపి!

రచన: కవి రమ్య

“హాయ్ వదినా! చిన్న పాప సిరి పుట్టినరోజు కదా. కేక్ కావాలని భీష్మించుకుని కూర్చుంది. కరోనా కాలం కదా బయట నుండి తెప్పించాలంటే ఆలోచించాను. ఈ లోగా మా పెద్ద పాప వనజ ఇంట్లోనే యూట్యూబ్ చూసి చేసేస్తానని, చెల్లికి సర్ప్రైజ్ ఇవ్వాలని సన్నాహాలు చేస్తోంది. నేనేమో బెలూన్లు, రిబ్బన్లు మా ఆయనతో కలిసి కడుతున్నాను. సిరి తయారవుతోంది” అని కబుర్లు చెబుతూ పనిలో నిమగ్నమయ్యింది శిరీష

“కానీయండి! కేక్ కోసేడప్పుడు వీడియో కాల్ చేయడం మరిచిపోకండి” అని శైలజ నవ్వి ఫోన్ పెట్టింది.

ఒక గంట సమయం తరువాత హాలు అంతా అందంగా అలంకరించారు శిరీష మరియు వాళ్ళ ఆయన.

“అమ్మా! కేకు రెడీ. వీడియో కాల్ చేయి. చెల్లిని పిలు. గిఫ్టులు కూడా సిద్ధం” అని ఆఘమేఘాల మీద పరుగులు తీస్తూ వచ్చింది వనజ.

ఈలోగా సిరి మురిసిపోతూ కళకళలాడుతున్న మొహంతో కేక్ చూడడానికి వచ్చింది. శిరీష వీడియో కాల్ చేసి హాలు మొత్తం చేసిన అలంకారం చూపించి వనజ తెస్తున్న కేకు చూపించి సంతోషపడింది. సిరి అయితే అరుస్తూ గెంతులేస్తూ కేకు చుట్టూ ప్రదక్షిణలు చేసింది. అందరి బంధువులకి జూమ్ వీడియో కాల్ ద్వారా చూపించడం మొదలెట్టింది వనజ.

“రెడీ. కేకు కొయ్యరా బంగారు తల్లి” అని అమ్మ అనడం ఆలస్యం అక్క చేతిలో కత్తి తీసుకుని కేకు కోసి ముందుగా తను తినేసింది. కాల్ లో ఉన్నవారంతా గట్టిగా నవ్వుకుంటూ “అక్క చేసిన కేకు రుచి ఎలా ఉందే బంగారు తల్లి?” అని ప్రేమగా అడిగేసరికి సిరికి నోట మాటరాలేదు. ఓ నిమిషం ఆలోచించి “అమ్మా! నువ్వు తిను…నాన్న! నీకు…అక్కా! నీకు” అని గబ గబా అందరి నోట్లో పెట్టేసి ఒక మూల కూర్చుని నీళ్ళు తాగింది.

అందరూ కాల్ లో ఆసక్తిగా చూడడం మొదలెట్టారు. “శిరీష! ఏమైంది? రుచి ఎలా ఉందని అడిగితే ఎవరూ ఏం మాట్లాడడం లేదు. సిరి ఏంటి అలా వెళ్ళిపోయింది? తనకి నచ్చిన వెనిల్లా ఫ్లేవర్ లేదని అలిగిందా?” అని శైలజ కంగారుపడింది.

గొంతులో ఉన్న కేకు ముక్కని కష్టపడి మింగి “కేకు చాలా బాగుంది. అబ్బో! ఎంత తీపి! ఎంత తీపి” అని శిరీష నవ్వి “ఓకే వదినా! ఇక మేము ఉంటాము. ఆయనకి ఆఫీసు నుండి కాల్ వస్తోంది. పాపకి విషెస్ చెప్పడానికి అనుకుంటాను. పాపకి కేకు బాగా నచ్చి మరోసారి తినడానికి అలా కూర్చుంది” అని పళ్ళు ఇకిలిస్తూ ఫోన్ పెట్టేసింది.

ఒక నిమిషం మౌనం పాటించి, “ఒసేయ్! ఏం వేసావే? కేకు ఇంత తియ్యగా ఉందేంటి? పళ్ళు జివ్వుమంటున్నాయే” అని శిరీష నోరు నొక్కుకుంది. వాళ్ళ ఆయన వెంటనే గ్లాసుడు నీళ్ళు తాగారు.

“అమ్మా నేను యూట్యూబ్ నే చూస్తూ ఫాలో అయ్యాను. రా! కావాలంటే కేకు తయారుచేయడానికి వాడినవన్నీ వంటింట్లో గట్టు మీద ఉంచాను” అని వనజ వాళ్ళ అమ్మ శిరీష చేయి పట్టుకుని లాక్కెళ్ళింది.

శిరీష అన్ని పదార్థాలు పరిశీలించి “ఒసేయ్ నీ ఇల్లు బంగారం గానూ చక్కెర పొడి బదులు గ్లూకాన్ డీ కలిపినట్టున్నావు. ఈ డబ్బాలో నీ చెల్లి గ్లూకోస్ పొడి వేసింది. రుచి చూడు…నువ్వూ నీ యూట్యూబ్ తెలివి” అని వాపోయింది.

సిరి మెల్లగా వచ్చి “అంటే ఎవరూ కనిపెట్టలేరని ఇక్కడ దాచాను అక్క…క్షమించు” అని రెప్పలు టపటపలాడించింది. వనజ ఏమి చేయలేక బుంగమూతి పెట్టింది.

 

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!