“అద్దమంటి మనసు”

“అద్దమంటి మనసు”
                            (తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: శ్రీదేవిప్రభాకర్ తంత్రవహి

              గేటు కిర్రుమంది. పడక్కుర్చీ లో కూర్చుని పేపరు చదువుతున్న పూర్ణయ్యగారు తలెత్తి చూసారు. ఎండతగలకుండా నెత్తిన గొడుగేసుకుని, పంచెకొంగును ఒక చేత్తో పైకి పట్టుకుని, మరో చేత్తో గేటును నెట్టుకుంటూ ముసలయ్య వచ్చాడు.
‘దండాలయ్యగోరూ!’ అంటూ వచ్చి, మెట్టుమీద కూర్చున్నాడు. రామవరం నుంచి ఎప్పుడొచ్చావురా! అందరూ బాగున్నారా? కుశలప్రశ్నలు వేసారు, పూర్ణయ్యగారు. నిన్న వచ్చానండి. మా సెల్లెలి కొడుకుని నిమ్మ్  ఆసుపత్రిలోవేసారు. దోస్తులతో మోటారు బండ్లో పోయి, పడ్డాడంట, అదిగో ఆడిని సూసి రామవరం తిరిగిఎల్తూ తవర్ని సూద్దారని ఇట్టా వచ్చానండి.! అన్నాడు. మంచిపనిజేసావురా! అన్నారు ఆప్యాయంగా. ముసలయ్య హైదరాబాద్ వచ్చాడంటే తనింటికి రాకుండా, తనని చూసి పోకుండా పోడు. వాడికి తనంటే ఎందుకో అంత ఆపేక్ష. తాను కూడా అతన్ని అభిమానంగా చూస్తాడు. వచ్చాడంటే, రెండురొజులన్నా ఉంటాడు. ఆపనీ, ఈపనీ చేసిపెడతాడు. చాప ఇస్తే, వరండాలో వేసుకుని చేతిసంచి తలకింద పెట్టుకుని పడుకుంటాడు. ఎప్పటెప్పటివోకాలం నాటి సంగతులన్నీ చెప్తుంటాడు. ఊరివాళ్ల కబుర్లు విసుగూ విరామం లేకుండా మాట్లడుతూనే ఉంటాడు. ఎప్పుడు తిన్నావో ఏంటో, అందాకా రెండు అరటిపళ్లు తిను, వంటయ్యాక అన్నం తిందువుగాని అంటూ రెండు అరటిపళ్లు,
చెంబుతో మంచినీళ్లు ఇచ్చింది, బుల్లెమ్మగారు.
బుల్లెమ్మగారికి నేనంటే ఎంత అభిమానమో అంటూ ఆ పళ్లు తిని, చెంబు ఎత్తుకుని గట గటా నీళ్లు తాగేసాడు, ముసలయ్య. పూర్ణయ్యగారు ఇంటిపెరట్లో ఉన్న కూరగాయలు కోస్తుంటే,
అయ్యగోరూ ! ఈమాత్రం పనికి తవరెందుకండీ ! మీరట్టా కూసోండి, కబురులు సెపుతుండండీ, చనంలో కోసి అమ్మగారికి ఇత్తాను .. అంటూ పంచె ఎగదోసి గోచీ కట్టుకుని వంచిన నడుం ఎత్తకుండా కూరలన్నీ కోసి బుట్టలో వేసి వంటింట్లో బుల్లమ్మగారికి ఇచ్చాడు. కొడవలి తీసుకుని, చెట్లమధ్యన ఉన్న కలుపు మొక్కలన్నీ తీసేసి, మొక్కలన్నింటికీ చక్కగా పాదులు చేసి,పెరడంతా అద్దంలా చేసాడు. ఈలోపు బుల్లెమ్మగారు ఆకులో అన్నం, పప్పు ఇంత అవకాయ పచ్చడి వేసి పెట్టింది. అమ్మగోరూ! పచ్చడి సానా బాగుందమ్మగోరూ, నోరు సవి సచ్చినప్పుడు మీ పచ్చడి కూసింత నాలిక్కి రాసుకుంటే బాగుంటదమ్మగోరూ! అన్నాడు. అయ్యో !దానికేం భాగ్యం అంటూ ఒక సీసానిండా ఆవకాయ పెట్టి ఇచ్చింది బుల్లెమ్మగారు. మా అమ్మే! మీకెంత పేమ తల్లీ.. మీరు సల్లగా ఉండాలి అంటూ దీవించి ఆ సీసాని భద్రం గా తన చేతి సంచిలో పెట్టుకున్నాడు. అన్నం తిని కునుకు తీసాక, పూర్ణయ్యగారు పడుకునే రూములో పుస్తకాల బీరువా అంతా సర్దిపెట్టాడు. మంచం మీద దుప్పట్లు మార్చి చక్కగా పక్కలు సిద్ధం చేసాడు. వచ్చాడంటే ఊరికే కూర్చోడు. ఏవో పనులు చేసిపెట్టాల్సిందే.
చిన్నప్పుడు తమ ఇంట్లోనే ఉండి అందరినీ ఎత్తుకుని మోసినవాడు. వయసయినా ఏమాత్రం
తగ్గకుండా పనులు అందిపుచ్చుకుంటాడు.
ఈమధ్య పడిన వానలకు పెరడంతా అడవిలాగా చెట్లు పెరిగిపోయాయి. పూర్ణయ్యగారు బాగుచేయిద్దామని కూలీలను పిలిస్తే వెయ్యి రూపాయలు అడిగారు. అలాంటిది క్షణంలో శుభ్రం చేసేసాడు. తెల్లారిపొద్దున్నే ముసలయ్య ఊరెళ్లడానికి బయలుదేరాడు. ముసలయ్య చేతిలో
‘ఇది ఉంచరా’ అంటూ పూర్ణయ్యగారు ఒక ఐదువందల నోటు ఉంచారు. వద్దయ్యగోరూ! అంటూ ఎంతో గట్టిగ చెప్తేగానీ తీసుకోలేదు. ఈలోపు లోపలినుండి పూర్ణయ్యగారి పాత ఇస్త్రీ పంచె, ఒక పాత చీర ఉన్న కవరు తెచ్చి, ఇచ్చారు బుల్లెమ్మగారు. ముసలయ్య కళ్ళల్లో సన్నని నీటిపొర, మహదానందపడి పోయాడు. రెండుచేతులెత్తి మీరు సల్లగా ఉండాలయ్యా, అంటూ దీవించి మెల్లగా మెట్లు దిగి గేటు తలుపు తీసుకుని రోడ్డెక్కాడు. చిన్నప్పుడెప్పుడో ఎత్తుకుని పెంచిన అభిమానం అతనిది. విశ్వాసంగా
ఆ నిష్కల్మషమయిన మనసుకు ఆదరణ వీరిది. అనాటి మనుషుల మనసులలో తప్ప ఈనాడు అలాంటి ప్రేమాభిమానాలు కాగడాబెట్టి వెతికినా కనిపిస్తాయా? ! హైదరాబాదు ఊళ్లోకి వస్తే మాత్రం ఇంతదూరం ఖర్చులుపెట్టుకుని వచ్చి మనలను వెతుక్కుంటూ రావడం. ఒకటి .!” అంటోంది బుల్లెమ్మగారు. గేటు వేసి, లోపలికి వస్తూ. అద్దంలా తయారైన పెరట్ని తృప్తిగా చూసుకున్నారు, దంపతులు. అక్కడ ఉన్నవి అద్దం లాంటి మనసు ఆనవాళ్లు !!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!