మంచిరోజులు

మంచిరోజులు

రచయిత:: శివరంజని

“పూజ పెళ్లివారొచ్చేసారు, హారతి పల్లాలతో వచ్చేయండి” చరవాణిలో నా శ్రీమతి పూజకి చెప్పాను.

“వస్తున్నా మాధవ్పూ” అంటూ పూజ మరో మహిళా ఈవెంట్ మేనేజర్ వచ్చారు హారతిపళ్లాలు మరియు శాలువాలతో. పెళ్లి కొడుకును అతని కుటుంబసభ్యులను స్వాగతించడానికి బ్యాండు మేళాల డీవీడీ ప్లే చేసారు. పెళ్లి కొడుకు హరి, అతని కుటుంబ సభ్యులు కారు దిగగానే, పూజ హారతిచ్చింది, నేను కాబోయే బావగారు హరికి కుంకుమ తో బొట్టు పెట్టి, శాలువా కప్పాను. పూజ, ఈవెంట్ మేనేజర్ చెరొక హారతి పళ్లెముతో హరికి హారతి ఇచ్చారు . నేను హరిని ఎత్తుకొని, పెళ్లి మండపంలోకి తీసుకెళ్లాను. పెళ్లి తంతు మొదలైంది. వేదికమీదున్న అందరికి మాస్కులు ఉన్నాయా లేదా అని ఒక సారి చూసా, అందరికి మాస్కులు ఉన్నాయి.

అయిరాండ్ల కుండలకు పూజ కుండలు రంగులు, కుందన్లు కొని, చాలా అందంగా తయారుచేసింది. అయిరాండ్ల కుండల మీద పూజ వేసిన పూల డిజైన్లు, మెరుస్తున్న కుందన్లు పెళ్లి పందిరిలో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి.

అక్కడక్కడా ఈవెంట్ మేనేజర్లు తిరుగుతున్నారు. అందరికి జ్యూస్ లతో పాటు, శానిటైజర్లు మాస్కులు అందజేస్తున్నారు ఈవెంట్ మేనేజర్లు.

ఉద్యోగ బాధ్యతలతో నేను చాలా బిజీగా ఉంటాను, నా శ్రీమతి పూజ ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ నడుపుతోంది. పెళ్లి పనులన్నీ పూజకే అప్పజెప్పా, తను మా అమ్మ సలహాలతో, పూజ హరిలకు నచ్చినట్టుగా పెళ్లి పనులన్నీ చేసింది. ఎక్కడా కాంప్రమైజ్ అవలేదు, తక్కువ మందితో పెళ్లి చేయటంతప్ప.

నా చిన్నారి చెల్లెలు లాస్య, హరిల పెళ్లి నా చేతుల మీదుగా అమ్మ కోరిక ప్రకారం శాస్త్రోత్కంగా జరుగుతోంది. పెళ్లి తంతు చేస్తూ అమ్మ మొఖంలోకి చూసా, తృప్తిగా నవ్వుతోంది. అమ్మ మొఖంలో ఈ నవ్వు చూడాలని పదిహేనేళ్లుగా ఎదురుచూస్తున్నా. పెళ్లి మంటపం కింద ఉన్న బంధువుల వైపు చూసా, కోవిడ్ పాండమిక్ కళ్యాణం కనుక, కేవలం మా రెండు కుటుంబాల సభ్యులం మాత్రమే శంషాబాద్ లోని ఫార్మ్ హౌస్ లో పెళ్లివేడుకలు చేస్తున్నాము. అందరూ సాంఘిక దూరం పాటిస్తూ, మొఖాలకు మాస్కులు ధరించి ఉన్నారు. ఆ అతికొద్ది మందిలో, మాస్కులు పెట్టుకున్న రఫీ అతని కుటుంబం కనిపించారు, నవ్వుతూ చెయ్యి ఊపా.

నేను ఇంటర్ చదివేటప్పుడు, నాన్న ఆక్సిడెంట్లో చనిపోయారు. నాన్న పోయిన బాధ ఉన్నా, నాన్న స్థానంలో అమ్మ చెల్లి బాధ్యతలు నెరవేర్చాలని నాకు నేనే శపథం చేసుకున్నా. ఉద్యోగం చేస్తూ, ఎం బి ఏ చదువుకున్నా. అమ్మ కూడా చాలా పొదుపుగా కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. నాకు కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చేవరకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాము.

ఎం బి ఏ చదివేటప్పుడు, అయితే ఒకసారి అల్లర్లలో చిక్కుకున్నా, ఆరోజు నేను బ్రతుకుతా అనుకోలేదు, నాకేమైనా అయితే అమ్మ చెల్లి పరిస్థితి ఏమిటి అని ఆలోచించా, అదే నన్ను బ్రతికించింది. అప్పుడు నేను ఎం బి ఏ చివరి సెమిస్టర్ చదువుతున్నా, రాత్రులు ఓ సాఫ్ట్వేర్ కంపెనీ లో సెక్యూరిటీ గార్డ్ గా చేస్తున్న. రాత్రి వేళల్లో క్యాబ్ లో మహిళా ఉద్యోగినులు చివరి డ్రాప్ ఉన్నప్పుడు, ఎస్కార్ట్ గా వెళ్ళేవాణ్ణి. రాత్రి వేళల్లో మహిళా ఉద్యోగినులను క్షేమంగా ఇంట్లో దిగబెట్టడం డ్రైవర్ మరియు నా పని. కొంత మంది ఉద్యోగినుల ఇళ్ల వరకు, కారు వెళ్లదు. అలాంటి ఇరుకు సందుల్లో, ఉద్యోగినితో పాటు వెళ్లి, ఇంటి దగ్గర దిగబెట్టి, లాగ్ అవుట్ షీట్ లో వారి సంతకం తీసుకొని, ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ కి సమాచారం అందిస్తే, వారు ఆ మహిళా ఉద్యోగినికి ఫోన్ చేసి నిర్దారించుకుంటారు. మహిళా ఉద్యోగినుల భద్రత కోసం, కంపెనీలు చాలా బాధ్యతగా వ్యవహరిస్తాయి. అందులో భాగమే నా ఉద్యోగం.

ఆ రోజు శుక్రవారం, డ్యూటీ అయిపోతే రెండు రోజులు సెలవు కాబట్టి, ఏమేం చదువుకోవాలో మనస్సులోనే ప్లాన్ చేసుకుంటున్నాను. రోజు లాగే, ప్రతి గంటకు లాగౌట్ లు అవుతున్నాయి. పదకొండు గంటల లాగౌట్ లో ఓల్డ్ సిటీ లో చివరి డ్రాప్ మహిళా ఉద్యోగిని ఉండటంతో, మా మేనేజర్ ఎస్కార్ట్ గా నన్ను పంపారు. డ్రైవర్ రఫీ, నేను అందరిని డ్రాప్ చేస్తూ, చివరి ఉద్యోగిని ఇంటికి వెళ్లేవరకూ, ఏ సమస్యా లేదు. చివరి డ్రాప్ మహిళా ఉద్యోగిని లాగ్ షీట్ లో సంతకం పెట్టి ఇంట్లోకెళ్ళిపోయింది. దూరంగా ఏవో శబ్దాలు వినిపించాయి, ఆ సందు చివరినుండి ఓ అల్లరిమూక రావడం కనిపించింది. మా పై ప్రాణాలు పైనే పోయాయి. డ్రైవర్ రఫీ అతి వేగంగా కారు మలుపు తిప్పుతున్నాడు. కానీ ఆలస్యమైపోయింది, ముష్కరులు మా క్యాబ్ ని చుట్టుముట్టారు. అందినచోటల్లా కారుని కొడుతున్నారు,కార్ పైకి కూడా ఎక్కారు. అద్దాలలోంచి మమ్మల్ని దిగమని, తిడుతున్నారు, తలుపులు బద్దలు కొడుతున్నారు. నువ్వు నేరుగా వెళ్లి, రెండో మలుపు తిరిగి తిన్నగా వెళ్లు, పోలీస్ స్టేషన్ వస్తుంది, ప్రాణాలు కాపాడుకో అన్నాడు రఫీ. అల్లరి మూక నన్ను కారులోనుంచి బయటికి లాగి కొడుతున్నారు, నా వీపు మెడలపైన కొడుతున్నారు, పొట్టలో గుద్దుతున్నారు. రఫీ బతిమాలుతున్నాడు “గరీబ్ హై భాయ్, ఖుదా కె వాస్తే జానేదో” రఫీ ఎంత బతిమిలాడినా వాళ్లు నన్ను కొట్టడం ఆపడంలేదు, రఫీని కూడా కొడుతూ తోస్తున్నారు.

చచ్చిపోతానేమో అనుకున్న, అదిగో అప్పుడు అమ్మ, చెల్లి గుర్తొచ్చారు, అంతే నాలో తెగింపు వచ్చింది. అంతమంది ముందు నా బలం సరిపోదు, కానీ నా ఆత్మబలం వాళ్లను ఓడించింది. ఏదయితే అదయిందని అందరిని తోసేస్తూ, పరిగెత్తా, ఆ ముఠాలోని వాళ్ల బైక్ మీదే పారిపోయా. ఇది వాళ్ళు ఊహించనిది. నేను వాళ్లకు అందకపోవడంతో, చేతిలో ఉన్న రాడ్లు, బ్యాట్లు, కర్రలు నాపై విసిరారు, కొన్ని తగిలాయి, కొన్ని కింద పడ్డాయి. సందు మలుపు తిరుగుతున్నప్పుడు, రఫీ కారుమీద పెట్రోల్ పోయడం కనిపించింది. పోలీస్ స్టేషన్ బయటే బైక్ వదిలి, పరిగెత్తుతూ వెళ్లా, స్టేషన్ లో పోలీసులకు కూడా చాలా దెబ్బలు ఉన్నాయి, ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటున్నారు. పరిస్థితి చెప్పి రఫీని కాపాడమని అర్తించా, ఏరియా వివరాలు కనుక్కొని ఇన్స్పెక్టర్ ఎవరికో ఫోన్ చేసాడు. ఉర్దూ లో మాట్లాడుతున్నాడు. రఫీని కాపాడమని అభ్యర్తించాడు. నేను కానిస్టేబుల్ దగ్గర ఫోన్ తీసుకొని, కంపెనీకి ఫోన్ చేసి పరిస్థితి చెప్పా, వెంటనే వాళ్లు కంపెనీ క్యాబ్ బయల్దేరాకుండా ఆపేసారు. రఫీ కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది, ఆ రాత్రి నేను పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాను, అమ్మ చెల్లి కోసం నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని. తెల్లవారుతుండగా రఫీ స్టేషన్ కు వచ్చాడు, ఇద్దరం కౌగిలించుకొని ఏడ్చాము.

నేను తప్పించుకున్నాక, రఫీ కారుని తగలబెట్టి కొడుతుండగా, ఇన్స్పెక్టర్ గారి ఫోన్ అందుకున్న, ఆ ఏరియాలో తన మాటకు తిరుగులేని ఓ పెద్దాయన, అక్కడికి వెళ్లి, అల్లరి మూకను మందలించి, రఫీని అల్లరిమూక నుండి కాపాడి, రాత్రంతా తన ఇంటిలోనే ఆశ్రయం ఇచ్చారట.

నాకు రఫీకి చాలా దెబ్బలు తగిలాయి. రఫీ కారు తగలబడిపోయింది.
నేను వెంటనే, కంపెనీకి సమాచారం అందించటం వల్ల, ఉద్యోగులకు, డ్రైవర్లకు, కార్లకు ఎలాంటి నష్టం జరగకుండా అన్ని లాగౌట్ లు కాన్సల్ చేసారు.

“ఉదయం వెళ్లి చూసా, నా కారు మొత్తం తగబడిపోయింది మాధవ్” అంటూ రఫీ ఏడ్చాడు. “ఇన్సూరెన్స్ ఉందా” అడిగాన్నేను. “అయిదు సంవత్సరాలు అయిపొయింది, ఫుల్ ఇన్సూరెన్స్ లేదు” అన్నాడు రఫీ. రఫీకి తల్లి,తమ్ముడు, చెల్లి, భార్య ఒక బాబు. రఫీ భార్య ఇప్పుడు గర్భవతి. ఉద్యోగం ఎంత బాధ్యతగా చేస్తాడో కుటుంబాన్ని కూడా అలాగే బాధ్యతగా చూసుకుంటాడు. ఎవరికీ కష్టం రానివ్వడు. ఈ సంవత్సరమే చెల్లి పెళ్లి చేసాడు. నేను పెళ్లికి ముందునుండే వెళ్లి, పెళ్లి పనుల్లో సాయం చేసాను. రఫీ తల్లి నన్ను బేటా అని, రఫీ చెల్లెలు నన్ను బయ్యా అని సంబోధించారు. అసలే పేదరికం, కుటుంబానికి ఆధారమైన కారు తగలబడిపోయింది. ఇప్పుడేమిటి దారి, కంపెనీ నుండి ఏమైనా సహాయం అందితే బాగుండు అని మనసులోనే అనుకున్నాను.

కార్ లేదు కాబట్టి, ఇద్దరం బస్ లో ఆఫీస్ కు వెళ్లాము. జరిగింది మరోసారి మా సూపర్ వైసర్లకు చెప్పాము, మా దెబ్బలు చూసి బాధ పడి రెండు రోజులు సెలవు ఇచ్చారు. మా ఇద్దరికీ వైద్య ఖర్చులకోసం, ఇతర డ్రైవర్లు, సెక్యూరిటీ సిబ్బంది కలిసి చేరి పదివేలు ఇచ్చారు. కంపెనీ పాలసీ ప్రకారం, అయిదు సంవత్సరాలు పూర్తయిన కార్లు, తీసేయాలి. రఫీ చెల్లి పెళ్లి చేయటంవల్ల, కొత్త కారు కొనలేకపోయాడు. కంపెనీ పాలసీకి విరుద్ధంగా, ఐదుసంవత్సరాలు పూర్తయిన కారు నడుపుతున్నావని, రఫీని మందలించారట. రఫీకి అటు ఇన్సూరెన్స్ కంపెనీ నుండి, ఇటు కంపెనీ నుండి ఎలాంటి నష్టపరిహారం రాలేదు. కొత్తకారు కొనడానికి డౌన్ పేమెంట్ లేక, రఫీ స్కూల్ పిల్లలకు ఆటో నడపడం మొదలుపెట్టాడు. తర్వాత నా ఎం బి ఏ పూర్తయి, నాకు కార్పొరేట్ ఉద్యోగం వచ్చి, రఫీ గురించి వివరాలు తెలియలేదు.

ఆరోజు అల్లర్లలో, జరిగిందంతా అమ్మకు, చెల్లికి, పూజకు తెలుసు. లాస్య తన పెళ్లికి రఫీని కూడా పిలవమని అడగటంతో, అప్పట్లో నేను వెళ్లిన, రఫీ పాతఇంటి గుర్తులు గుర్తు చేసుకుంటూ, రఫీ ఇంటికి వెళ్లాము. కరోనా వల్ల, విద్యాలయాలు కూడా సెలవు కావడంవల్ల రఫీకి ఇప్పుడు ఆటో నడిపే పని కూడా లేదు. నేను వెళ్లేసరికి, రఫీ భార్య మిషన్ మీద మాస్క్ లు కుడుతుంది, రఫీ కటింగ్ చేస్తున్నాడు. పేదరికం ఆ ఇంట్లో తాండవిస్తోంది. రఫీ భార్య కు పూజ పళ్లు, స్వీట్లు ట్రే లో పెట్టి ఇచ్చింది. పెళ్లికి కుటుంబమంతా బట్టలు కొనమని, డబ్బు ఉన్న కవరు రఫీ భార్య చేతిలో పెట్టింది.
“ఇది నీ చెల్లెలు పెళ్లి, అందరు తప్పకుండా రావాలి” అని పూజ నేను మరీ మరీ చెప్పి బయలుదేరాము. ఈరోజు పెళ్లిలో రఫీకి మంచి బహుమతి ఉంది.

పెళ్లి తంతు, భోజనాలు అయ్యాక రఫీ దంపతులకు లాస్య తన చేతుల మీదుగా పది లక్షల చెక్కు ఇప్పించాము. “దీనితో ఏదైనా వ్యాపారం చేసుకోండి” అని పూజ నేను వాళ్ల భుజాలు తడుతుంటే, నోట మాట రాక, ఆనంద బాష్పాలు రాలుస్తుంటే, “ఇక అన్ని మంచిరోజులే, ఏడవకూడదు” అన్నది అమ్మ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!