నాన్న

నాన్న

రచయిత :: బండి చందు

ఓ ఎనిమిదేళ్ల పాప. లైబ్రరీలో పుస్తకాల పురుగులా మారిన నా వద్దకు వచ్చి భయం భయంగా అన్నయ్య నీ పేరేంటి అని అడిగింది. చూడ ముచ్చటగా ఉన్న ఆ పాపను చూసి భయపడకు నా పేరు చందు నీ పేరేమిటి మీ ఇల్లెక్కడ అని అడిగాను. దానికి ఆ పాప నా పేరు ఆరాధ్య మా ఇల్లు ఈ పక్కనే ఉంది అన్నయ్య అని చెప్పింది. అప్పటి నుండి తను రోజు లైబ్రరీకి వచ్చి నాతో పాటు కూర్చొని కామిక్ బుక్స్ చదివేది. చాలా తెలివైన పిల్ల.

ఒకరోజు అనుకోకుండా మాటల్లో మీ నాన్న ఏమి చేస్తుంటాడు అని అడిగాను. దానికి తను మా నాన్న పేరు శ్రీనివాస్. మా నాన్న మహారాష్ట్రలో ఒక సేటు దగ్గర గుమస్తాగా పనిచేస్తాడంటా అని అమ్మ చెప్పింది. అంటే మీ నాన్న మీతో ఉండడా అని అడిగితే లేదన్నయ్య మా నాన్న రెండు నెలలకి ఒకసారి వచ్చి రెండ్రోజులు ఉండి మళ్ళీ వెళ్ళిపోతాడు. మా నాన్న వచ్చినప్పుడు నా కోసం ఎన్నో బొమ్మలు చాక్లేట్లు తెస్తాడు అని సంతోషంగా చెప్పింది. కానీ తాను చెబుతున్నప్పుడు తన కళ్ళలో నీటి సుడిగుండాలు, మాటలో తడబాటు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇంతలో వాళ్ళ అమ్మ పిలిస్తే మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోయింది. నేను కాసేపు చదువుకొని వెళ్లిపోదామనుకునేలోపే తను మళ్ళీ వచ్చింది. ఇప్పుడు తన కళ్ళలో చెప్పలేని ఆనందం, ఏదో చెప్పాలన్న ఆత్రుత కనిపిస్తున్నాయి. ఏమైంది ఆరాధ్య ఇంత సంతోషంగా ఉన్నావ్ ఏమి జరిగింది అని అడిగా.

అన్నయ్య రేపు మా నాన్న మహారాష్ట్ర నుండి వస్తున్నాడట మా అమ్మ ఇప్పుడే చెప్పింది. మా నాన్న నాకు చిన్న సైకిల్ తీసుకొస్తా అన్నాడు అంటూ లైబ్రరీ అంతా గంతులు వేస్తుంది. ఆ పాప ఆనందానికి హద్దుల్లేవు. తనని అల్లరి చేయవద్దని చెప్పి కుర్చీలో కూర్చోబెట్టి మీ నాన్న అంటే నీకు అంత ఇష్టమా అని అడిగాను. అందుకు ఆ పాప చెప్పిన సమాధానం తిరిగి నన్ను అడిగిన ప్రశ్నకు బదులు ఇవ్వలేని నన్ను చూసి నాపై నాకు చాలా కోపం అసహ్యం కలిగాయి.

అవును అన్నయ్య చాలా ఇష్టం అయినా నాన్న అంటే ఇష్టముండని వారు ఉంటారా. కానీ మా నాన్న ఎప్పడూ నాతోనే ఎందుకు ఉండడు అన్నయ్య నేనెం తప్పు చేశాను. నేనంటే నాన్నకి ఇష్టం లేదా ఇక్కడ ఉన్న రెండ్రోజులు కూడా నాతో సరిగ్గా మాట్లాడడు ఎప్పుడూ సేటు, వ్యాపారం అంటాడు. ఒక్కోసారి ఇలా వచ్చి అలా వెళ్తాడు. ఏమైనా అంటే చిన్నపిల్లవి నీకేం తెలియదు వెళ్లి అడుకో అని తిడతాడు. అమ్మని అడిగితే నాన్న మన కోసమే కదా కష్టపడేది ఇలా అల్లరి చేయడం మానేసి చదువుకోపో అని అంటుంది.

అన్నయ్య నువ్వైనా మా నాన్నకి చెబుతావా ఒక్కసారి నాతో కూర్చొని మాట్లాడమని, నేను చెప్పే కథలు వినమని కొద్దిసేపు నాతో ఆడుకోమని చెప్తావా అని ఏడుస్తూ గోముగా అడిగింది. ఆ ప్రశ్నకు నా దగ్గర బదులు లేక ఏమి చెప్పాలో తెలియక ఆరాధ్య ఊరుకో నువ్వు మీ నాన్న నీతో కాసేపైనా మాట్లాడట్లేదని, ఆడుకోవడానికి రావట్లేదని భాదపడుతున్నావు. కానీ నేను పుట్టిన సంవత్సరానికి మా నాన్న చనిపోయాడు. అసలు నాన్న ఎలా ఉంటాడో కూడా తెలియదు ఆ పిలుపుకి నేను నోచుకోలేదు. అలా అని నేను ఎప్పుడు భాదపడలేదు ఎందుకంటే నాకు అన్నీ మా అమ్మే. నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి కనీసం నీకు నాన్న అని పిలిచే అదృష్టం కలిగింది అని తనను ఓదార్చి ధైర్యం చెప్పాను. తనకి ధైర్యం అయితే చెప్పగలిగాను కానీ నన్ను నేను ఓదార్చుకోలేకపోయాను.

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!