అదీ సంగతి

అదీ సంగతి

రచన: మంగు కృష్ణకుమారి

కొడుకూ, కూతురూ దొర్లి దొర్లి‌ నవ్వు. దేనికో అన్యుత కి బోధపడలేదు.

“ఏమయిందర్రా’ అన్నాది.

“తాతగారమ్మా!” అన్నాడు కొడుకు.

“ఏ తాతగారు? ఏం చేసేరు”

“మన ఎదురింటికి కొత్తగా వచ్చేరే, రెడ్డి తాతగారు! మొన్న మేం గ్రౌండ్ లో ఆడుకుందికి వెళితే అక్కడ బొంగారాలు ఆడుతున్నారు” కొడుక్కి నవ్వు.

“మరే అమ్మా! నిన్న పెద్ద వాన పడ్డాదా! తాతగారు కాగితం పడవలు వేసి, అవి జోరుగా వెళుతుంటే ఈల వేస్తున్నారు” కూతురు.

“తప్పర్రా! ఏం‌ పెద్దవాళ్ళయితే ఆడకూడదా! అలా నవ్వకూడదు” అన్యుత పిల్లలకి నీతులు చెప్పింది.

మర్నాడు రెడ్డి గారు
గాలిపటాలు ఎగరేస్తూ ఉంటే అన్యుత వాళ్ళింటి డాబామీద ఒకటి పడిపోయింది.

రెడ్డి గారు ఆ గాలిపటం కోసం వచ్చి బెల్ కొట్టేరు. అన్యుత గేట్ తీసి “రండి అంకుల్” అని లోపలికి పిలిచింది.

“నా గాలిపటం మీ డాబా మీద పడిపోయిందమ్మా” అన్నారు.

అన్యుతకి ఆయన ముఖంలో పసిపిల్లవాడు కనిపించేడు ఆక్షణంలో.

“అలాగే అంకుల్! తీసుకుందురు గాని, మొదట లోపలకి వచ్చి కూచోండి” అని ఆహ్వానించింది.

రెడ్డి గారు నెమ్మదిగా లోపలికి వచ్చి కూచున్నారు

“కాఫీయా చాయ్ కలిపీదా అంకుల్” అడిగింది అన్యుత.

“ఏదీ వద్దమ్మా! కాసేపయితే లంచ్  చేయాలి. నువ్వు రమ్మన్నావని ఇలా వచ్చేనంతే”

అన్యుత వెళ్ళి గాలిపటం తీసుకొచ్చి రెడ్డి గారికి ఇచ్చింది

“ఏమ్మా! నేను ఇలా ఆటలు ఆడుకోడం, అందరిలా నీకు నవ్వుతాలుగా లేదా” అడిగేరు రెడ్డిగారు.

“లేదంకుల్! మీకు చిన్నపుడు సరదాలు తీరలేదేమో అనుకున్నాను”

“సరదాలు తీరకపోడం కాదు.. ఇలా ఆడుతూ, విదేశాల్లో ఉన్న మనవలు పక్కనే ఉన్నట్టు ఊహించుకుంటూ ఉంటాను..నాతో ఆడమంటే ఏ పిల్లలూ ఆడరు. అప్పటికీ అనాధాశ్రమంలో‌ పిల్లలకి బుంగలూ బొమ్మలు కొనిచ్చి వాళ్ళతో ఆడతాను. వాళ్ళకీ కొన్ని రూల్స్, టైమింగ్స్ ఉంటాయిగా! ఒక్కోసారి అవదు”

అన్యుత ఆశ్చర్యంగా చూస్తోంది.

“నేను కూడా ఎల్లకాలం ఇలా ఆడలేనమ్మా.. ఓ సరదా వచ్చినపుడు మాత్రమే….చూస్తున్నవాళ్ళు ఏమనుకుంటారో అని నామోషీ పడను” అంటూ లేచేరు రెడ్డిగారు.

“అన్నట్టు నీ పేరేమిటి తల్లీ” అడిగేరు.

“అన్యుత” అంటూ ఉంటే అతను ఆశ్చర్యంగా ఆమె పక్క చూసి కూచొని “నీకీ పేరు ఎవరు పెట్టేరమ్మా, రష్యా సాహిత్యంలో ఈ పేరు చదివేను” అన్నారు.

“మా నాన్నే! ఎన్నో పుస్తకాలు చదువుతాడు. మాకు అందులో కథలన్నీ చదివి చెప్తూనే ఉంటాడు. ఎన్నో రకాల మనుషుల పాత్రల గురించి విశ్లేషించి చెప్తూనే ఉంటాడు.మా నాన్నంత కాకపోయినా నేనూ చదువుతాను” అంది అన్యుత.

“అదీ సంగతి. నీమీద ఉన్న సాహిత్య ప్రభావం చేతే, ఒకపాలు‌ ఎక్కువ ఆలోచించి నా సరదాలని ఎగతాళి చేయకుండా అర్థం చేసుకున్నావు. మీ నాన్నకి నా అభినందనలు అన్యుతా”
అంటూ లేచేరు రెడ్డి గారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!