అండదండలు

అండదండలు
                      (తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)           

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

       నాన్న నేను సినిమాకు వెళుతున్నాను. మా స్నేహితులతో కలిసి,  అంటూ కాలేజీ దగ్గర మా నాన్న కనిపించగానే చెప్పాను. సరే అమ్మ, మీ అమ్మకి ఒక ఫోన్ చేసి చెప్పు,  మళ్లీ ఎదురుచూస్తూ ఉంటుంది అన్నారు నాన్న. మా స్నేహితుల ఆశ్చర్యానికి అవధులు లేవు. కాలేజ్ వర్కింగ్ డే రోజున ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్లడమే కాకుండా,  ఆ విషయాన్ని నాన్నతో చక్కగా చెప్పిన నన్ను చూసి కొందరు కుళ్ళుకున్నారు. మరికొందరు నన్ను వింతగా చూశారు. ఏది ఏమైనా మనం చేసేది తప్పు కానప్పుడు, ఆ పని గురించి చెప్పుకోవడంలో తప్పేముంది అనేది ఇప్పటికీ నా వాదన. ఆ రోజు క్లాసులో జరగాల్సిన పాఠాలు ఏమి అంత ఇంపార్టెంట్ అయినవి కాదు. అందుకే ఫ్రెండ్స్ అందరం అనుకుని సినిమాకి వెళ్ళాము. అనుకోకుండా మా నాన్న కనిపిస్తే చెప్పాను. తప్పేం లేదు కదా!!!! అనేది నా వాదన,  స్నేహితులతో అదే చేశాను. అవునా, అంత క్లోజ్ గా ఉంటావా మీ నాన్నగారితో అన్నారు ఆశ్చర్యంగా! నేను మరీ వింతగా, అవును నేను మా నాన్నతోనే కాదు,  అమ్మతో,  నాన్నతో, అన్నయ్యతో కూడా, ఇంకా మాట్లాడితే బాబాయి,  పిన్నితో కూడా అంతే స్వాతంత్రంగా మాట్లాడుతాను. తప్పేముంది!!! అన్నాను. అదేంటి మీ వాళ్ళ నిన్ను ఏమీ అనరా? అన్నారు. దేవుడిచ్చిన వరమో, మా వాళ్ళకి నా మీద ఉన్న నమ్మకమో నాకు తెలియదు గానీ,  వాళ్లు ఏ రోజు నేను చేసిన పనిని తప్పు అంటూ వ్యతిరేకత చెప్పలేదు. నన్ను చిన్నచూపు చూడలేదు. అది ఇప్పటికీ నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఆడపిల్లవు నీకు చదువు ఎందుకు? పెళ్లి చేసుకుని సంసారం చేసుకోక, అంటూ ఉన్న తల్లిదండ్రులు, మా స్నేహితుల అయోమయ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో నాకు తెలుసు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా నా చదువుకి అండగా నిలిచిన మా వాళ్ళు అందరూ అంటే నాకు వల్లమాలిన అభిమానం. నేను మరచిపోలేని ఒక సంఘటన నా కళ్ళ ముందు కదలాడుతోంది. నేను కాలేజి చదువుతున్న రోజుల్లో, మా తాతయ్య నన్ను దగ్గర కూర్చో పెట్టుకుని నీకు కాలేజీలో కానీ, చదువులో కానీ, ఇంకా ఏ విషయంలో అయినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా, మేము అండగా ఉంటాము. అన్నయ్య ఉద్యోగ రీత్యా వేరే ఊర్లో ఉన్నప్పటికీ, బాబాయి నీకు సహాయం చేస్తాడు. నాన్న కూడా నీకు తోడుగా నిలబడతాడు. ఏ విషయమైనా భయపడకు అని నాకు ధైర్యం చెప్పి, నన్ను చదువుకోవటానికి ప్రోత్సహించారు. విత్తనం ఒకటి వేస్తే, చెట్టు మరొకటి వస్తుందా అన్న చందాన, మా ఇంట్లో కూడా అదే అండ దండలు నా కూతురికి అందించాను. అలాగని కొడుకును తక్కువ చెయ్యను. అసమానతల లేని ముచ్చటైన ముద్దు బిడ్డలు నా పిల్లలు. ఇవి ఆడవాళ్లు చెయ్యాలి, ఇది మగ పిల్లలు చెయ్యాలి అన్న తేడా లేకుండా, అన్నీ కలుపుగోలుగా చేసుకునే సహాయాలే మా ఇంటి పనులు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!