మంచిమనిషి

 మంచిమనిషి

రచయిత: శ్రీదేవి విన్నకోట

మా ఊర్లో  సాయిబాబా గుడి పక్క వీధి చివర వెంకటరమణ చిల్లర కొట్టు అంటే మంచి పేరు. చిన్నపిల్లల్ని అడిగినా ఆ కొట్టు ఎక్కడో చెప్పేస్తారు,ఒక విధంగా చెప్పాలంటే మా వీధిలో ఆ చిల్లర కొట్టు.
ఆ చిల్లర  కొట్టు ఓనర్ వెంకటరమణ ఒక ఆపద్బాంధవుడిలా అనుకోండి. అన్ని సరుకుల దగ్గర్నుంచి కాయగూరలు పండ్లు వరకు,పెన్నులు బొట్టు బిళ్ళలు రిబ్బన్లు దగ్గర్నుంచి పాలు పెరుగు పచ్చళ్ళ వరకు, తలనొప్పి, కడుపు నొప్పి, జ్వరం టాబ్లెట్లు, లాంటివి కూడా అమ్మేస్తూ ఉంటాడు. మంచి నిజాయితీ అయిన నిక్కచ్చి మనిషి, హోమియోపతి ఆయుర్వేదంలో కూడా కాస్త ప్రవేశం ఉంది, చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు  పరిష్కారాలు కూడా చెప్తూ ఉంటాడు.

పేరుకి మాత్రమే చిల్లర కొట్టు, అసలు అక్కడ దొరకని వస్తువంటూ ఉండదు.  ఎవరైనా మా వీధిలో ఏదైనా ఎవరికి సంబంధించిన అడ్రస్ అయినా చెప్పాలి అంటే ముందు ఆ కొట్టు గురించి చెప్పి  ఆ చుట్టుపక్కల ప్రదేశాల గురించి ఆ తర్వాత అడ్రస్ చెప్తూ ఉంటారు, మా ఊర్లో చిల్లర కొట్టు వెంకటరమణ  అంటే అంత ఫేమస్ అన్న మాట, ఏమాటకామాటే చెప్పుకోవాలి అండి, మంచి మనిషి ,ఎప్పుడైనా సరుకులకి  వెళ్ళినప్పుడు పదో ఇరవై డబ్బులు తక్కువ ఉన్నా మళ్లీ వచ్చినప్పుడు ఇద్దురు గాని, ఊరు వదిలేసి మీరు ఎక్కడికి పోతారు, లేదా నేను ఎక్కడికి పోతాను అంటూ మాటలతో సరి పెట్టేసుకుంటాడు.
ఆ డబ్బులు మనమే గుర్తుపెట్టుకుని ఇవ్వాలి తప్ప అతను మర్చిపోతాడు, నిజంగా మర్చిపోతాడో తాను అడక్కుండానే ఇచ్చేస్తారు అనే నమ్మకమో  తెలీదు గానీ ఎప్పుడూ అతని నమ్మకమే నిజమవుతుంది.

అయ్యో నేను ఎప్పుడు ఇంతే హడావిడి మనిషిని అనుకోండి.చిల్లర కొట్టు గురించి చెప్పే ఆనందంలో నా గురించి నేను చెప్పడం మర్చిపోయాను. నా పేరు విశాలాక్షి భర్త ఇద్దరు పిల్లలు అత్తమామలు ముచ్చటైన చింతల్లేని చిన్న కుటుంబం మాది. కాకపోతే నాకు ఒకటే చింత, అదేంటో నా మాటల్లోనే చెప్తా వినండి.

మా ఇంటి పక్కన  రంగనాథం బాబాయ్ కొడుకు హరి పక్క పట్నంలో ఉద్యోగం వెలగబెడుతున్నాడు, వాడు నాకు వరుసకు తమ్ముడే వట్టి భార్య విధేయుడు అన్నమాట అతనికి సరిగ్గా సరి పోతుంది. హమ్మో వాళ్ళ ఆవిడ గజలక్ష్మి ఉందే , పాత సినిమాల్లో సూర్యకాంతానికి ఉన్నంత నోరు, గడుసుతనం, మొండితనం, మామగారైన రంగనాథం బాబాయిని (అంటే నేను బాబాయ్ అని పిలుస్తాను కదా అందుకే అలా చెప్పాను)  ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తుంది, (ఇదిగో మీకు ఒకటి చెప్పాలి మనలో మన మాట ఎవరు ఆవిడ దగ్గర అనకండి), రంగనాథం బాబాయ్ కి అన్నం కూడా సరిగ్గా పెట్టదు పాపం ఆయన మొహం ఎప్పుడు చూసినా ఆకలితో ఉన్నట్టే ఉంటుంది, కానీ కోడల్ని ఏమీ అనలేని నిస్సహాయత, అసలు ఎవరికీ కొడుకు  కోడలు గురించి  చెడుగా చెప్పడు అసలు నోరే విప్పడు..పక్క పక్కనే ఉండడం వల్ల నేను రోజూ చూస్తూ ఉంటా కాబట్టి నాకు తెలుస్తుంది, అలా చెప్తే ఉన్న ఒక్కగానొక్క కొడుక్కి కోడలికి ఎక్కడ చెడ్డపేరు వస్తుందో నలుగురు తన కొడుకు గురించి తప్పుగా ఏమనుకుంటారో అనే భయం  కూడా బాబాయ్ కి ఉంది,ఎప్పుడైనా లోపలికి పిలిచి నాలుగు ముద్దలు పెడదాము అన్నా గజలక్ష్మి ఇంతింత కళ్ళు వేసుకుని చూస్తూ ఉంటుంది, అప్పటికి అడపాదడపా పిల్లల చేత వాళ్లే తింటూ పెడుతున్నట్టుగా ఒక స్వీటో హాటో  పండో ఏదో ఒకటి గజలక్ష్మి కంటపడకుండా పంపిస్తూనే ఉంటా బాబాయిని తినమని చెప్పి,అలా నేను ఏమైనా పంపించడం పొరపాటున చూసిందంటే కళ్లల్లో నిప్పులు పోసుకున్నట్టు మా మామకు నువ్వు పెట్టాల్సిన అవసరం ఏంటి మేం పెట్టలేమా ఆయన తినట్లేదా నీకేంటి అంత అక్కర అన్నట్టు పైకి నన్ను తిట్టలేక మనసులోనే తిట్టుకుంటూ  మాడు మొహం వేసుకుని ఎర్రగా చూస్తూ ఉంటుంది, అప్పుడే నాకు అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కుతిననీవ్వదు అన్న  సామెత గుర్తొస్తూ ఉంటుంది, ఏమైనా గట్టిగా అందాము అంటే నా మాటలకి బాబాయ్ ని ఇంకా ఇబ్బంది పెడుతుందిఏమో ఆయన నాతో ఏమైనా చెప్పాడెమో అనుకుంటుంది అని నా భయం, అదికాక మావారికి గొడవలు అంటే అస్సలు ఇష్టం ఉండదు, ఒకవేళ గజలక్ష్మి నన్ను ఏమైనా అన్నా వాళ్ల గొడవలు నీకు ఎందుకు, మధ్యలో వెళ్లి అందులో తలదూర్చడం నీదే తప్పు అంటూ ఎదురు నన్నే తిడతారు, అందుకే ఏమీ అనలేక అలా చూస్తూ ఊరుకుని నోరు మూసుకోవల్సి వస్తుంది, ఇలాగే భారంగా సాగుతున్నాయి రోజులు,

ఒకరోజు ఏమైంది అంటే నేను పాల ప్యాకెట్ తేవడం కోసం వెంకటరమణ కొట్టు దగ్గరికి వెళ్లాను, రంగనాథ బాబాయ్ అక్కడే కూర్చుని ఉన్నాడు నీరసంగా, పాలు పెరుగు ప్యాకెట్ తీసుకు వెళ్లడానికి వచ్చాడు, గజలక్ష్మి కొట్టు నుంచి ఎం తీసుకురావాలి అన్నా రంగనాథం బాబాయినే పంపిస్తుంది, అది కూడా ఒక్క సారి కాదు,సరుకులు ఏమైనా కావాలంటే ఒకేసారి రాసి తెప్పించుకోవచ్చు కదా, అలా చేయదు పది సార్లు తిప్పుతుంది చిన్నపిల్లాడిలా బాబాయ్ ని. పాపం బాబాయ్ కి ఏమో కీళ్ల నొప్పులు, ఆరోజు బాబాయ్ తన కీళ్ల నొప్పులు గురించి చెప్తుంటే అందుకు చిల్లర కొట్టు వెంకటరమణ తన దగ్గర ఉన్న హోమియోపతి మందుల డబ్బా లో నుంచి అందుకు సంబంధించిన మాత్రలు తీసి ఇస్తున్నాడు, ఇంట్లోంచి నాలుగు ఇడ్లీలు కారప్పొడి నెయ్యి పచ్చడి వేసి తెప్పించి  బాబాయ్ కి తినమని పెట్టాడు, బాబాయ్ మొహమాట పడుతూనే ఆవురావురుమంటూ తిన్నాడు,  ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన కాఫీ కూడా తాగాడు. ఏ మనిషికి అయినా కడుపు నిండితే సంతోషంతో ముఖం తేటగా కనిపిస్తుంది ఆ సంతోషం బాబాయ్ మొహంలో స్పష్టంగా కనిపించింది నాకు, బాబాయ్ ఆకలి తీర్చిన వెంకటరమణ నాకు నిజంగా ఏడుకొండలవాడిలాగే  కనిపించాడు,రెండు చేతులెత్తి దండం పెట్టాలి అనిపించింది నేను చేయలేని పని అతను చేస్తున్నందుకు, ఆ తర్వాత వారం రోజులపాటు నేను శ్రద్ధగా గమనిస్తే బాబాయ్ ఆక్కడ ప్రతిరోజు టిఫిన్ తిని కాఫీ తాగుతున్నాడు అని అర్థమైంది, అంతకు ముందు ఎన్ని రోజులనుంచి సాగుతుందో నాకు తెలియదు కానీ జరిగేది మంచి విషయమే కదా అనిపించింది, కానీ ప్రతిరోజు అంటే కష్టమే కదా,?
వెంకటరమణకు బాధగా అనిపించకపోయినా వాళ్ల ఇంట్లో వాళ్లకి రంగనాథం బాబాయ్ కి ప్రతిరోజు టిఫిన్ పెట్టాలి అన్న బాధగా అనిపించొచ్చు, అందుకు నేను ఒక పరిష్కారం ఆలోచించాను, వెంకటరమణ కి అతను చేస్తున్న పనికి థాంక్స్ చెప్తూనే టిఫిన్ రేపటి నుంచి నేను తెచ్చి ఇస్తాను అని  బాబాయ్ కి పెట్టమని చెప్పాను, మీకెందుకండీ శ్రమ పర్వాలేదు అన్నాడు మొహమాటంగా, ఆయన నాకు బాబాయి అవుతారు మీకు తెలుసు కదా, వాళ్ళ ఆవిడకి జడిసి నేను ఇంటి దగ్గర ఏమీ పెట్టలేను, ఏదో నాకు తోచినంతలో ఆయన్ని చూస్తే మా నాన్నలాగే అనిపిస్తారు, ప్లీజ్ నన్ను పెట్టనివ్వండి అన్నాను, అతను మీ ఇష్టమండి అంటూ ఒప్పుకున్నాడు, మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి అంటూ ఆగాను, చెప్పండి అన్నాడు.
బాబాయి ఎప్పుడు మీ కొట్టు దగ్గరికి వచ్చిన సరే తినడానికొ తాగడానికో  ఏదో ఒకటి మీరే ఇస్తున్నట్టు బలవంతంగా అయినా సరే ఇస్తూ ఉండండి,
ఏం ఇచ్చారు ఎంతయింది అనేది పద్దు రాసి పెట్టండి నేను నెలకు ఒకసారి ఇచ్చేస్తాను డబ్బులు ఎంత అయితే అంత, ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకండి ముఖ్యంగా గజలక్ష్మి కీ అని చెప్పాను.వెంకటరమణ చిరునవ్వుతో మీది చాలా మంచి మనసు అండి, తప్పకుండా అలాగే చేస్తాను అన్నాడు. అప్పటి నుంచి బాబాయ్ కి అనుమానం రాకుండా అలా మొదలై ఇప్పటికీ  చాలా నెలలుగా ఇలా కొనసాగుతూనే ఉంది.మేం బాబాయ్ ఆకలి తీర్చి సంతోష పెట్టే మా కార్యక్రమం, ఇప్పుడు బాబాయ్ కళ్ళలో ఆకలి కనిపించట్లేదు, చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటున్నారు, బాబాయ్ కి నేను ఏం పెట్టాలి అనుకున్నా అవి వెంకటరమణ చిల్లర కొట్టు దగ్గరికి వెళ్ళి పోతున్నాయి, బాబాయ్ అక్కడే హ్యాపీ గా తింటున్నారు, నేను గజలక్ష్మి వాడి చూపుల నుంచి విజయవంతంగా తప్పించుకున్నాను,

అరవై ఏళ్లు దాటితే పెద్దవాళ్లు కూడా పసిపిల్లలతో సమానమే, వాళ్లకు ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది చిన్నపిల్లలలాగే, మన అమ్మ నాన్న ఎంతో అత్తమామలు కూడా అంతే అనుకుంటే  వాళ్ళని సంతోషంగా ఉంచుతూ మనం సంతోషంగా ఉండగలం, ఆఖరిగా నేను చెప్పేది ఏంటి అంటే
మా వీధిలో ఉన్న వెంకటరమణ చిల్లరకొట్టు లాంటి చిల్లర కొట్టు వెంకట రమణ లాంటి మంచి మనిషి అతని లాంటి పెద్ద మనసు, సాయం చేసే గుణం ఉన్నవారు ప్రతి వీధికి ఒకరైనా ఉండాలని అతన్నిఆ శ్రీనివాసుడు ఎల్లప్పుడూ చల్లగా కాపాడాలి అని తప్పకుండా కోరుకుంటాను, ఇదండీ నేను చెప్పాలనుకున్న మా వీధిలో ఉన్న చిల్లరకొట్టు కథ.

***

You May Also Like

One thought on “మంచిమనిషి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!