మనసున్న మారాజు

మనసున్న మారాజు

రచయిత: కమల ముక్కు ( కమల’శ్రీ’)

వంటింట్లో నుంచి బయటకు వచ్చి “అయ్యో!బాబీ కి మందు పట్టలేదే అనుకుంటూ ఊయల వైపు చూసిన సావిత్రి కి అది ఖాళీ గా దర్శనం ఇవ్వడం తో అత్తయ్య ఏమైనా తీసారేమో అని వాళ్ల గది వైపు వెళ్లింది.తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆమె అప్పుడే బయటకు వస్తూ ఏమ్మా సావిత్రీ బాబీ గాడికి మందు పట్టావా?!.” అంది.

దానికోసమే బయటకు వచ్చాను అత్తయ్యా. కానీ ఊయలలో బాబు లేడు.” అంది సావిత్రి.

“వాళ్ల తాతయ్య తీసారేమోనే. ఏమయ్యా బాబు ఓ సారి తీసుకుని రా వాడికి మందు పట్టే సమయం అయ్యింది.”అంది సావిత్రి అత్తయ్య రాధమ్మ.

“నేనెప్పుడు తీసానే. ఇప్పుడే ఊయల వైపు గా వచ్చాను. కానీ వాడు అందులో లేకపోయేసరికి నువ్వేమైనా ఆడిస్తున్నావేమో అనుకున్నాను.” అంటూ వచ్చారు రామారావు గారు.

“ఎవరూ తీయకపోతే బాబు ఏమైనట్టు? అయినా ఒకరికి ఇద్దరు ఆడవాళ్లు ఉన్నారు పిల్లాడ్ని చూసుకోవడం తెలీదా?!.”అన్నారు కోపం, కంగారూ కలిసి.

అప్పుడే గేటు చప్పుడు అనిపించి అటుగా చూసిన సావిత్రికి ఎవరో ముఖం కప్పుకుని ఉండి చేతిలో ఏదో మూటతో కనిపించడం తో “ఏయ్ ఆగూ ఎవరు నువ్వూ?!.” అంటూ పరుగున బయటకు వచ్చింది.ఆమె వెనకాలే రామారావు, రాధామ్మా కంగారుగా బయటకు వచ్చారు. వాళ్లు గేటు దగ్గరికి చేరుకునేసరికే ఆ వ్యక్తి వీధి మధ్యలోకి వెళ్లిపోయాడు.

“అయ్యయ్యో వాడేవాడో పిల్లాడిని ఎత్తుకుని వెళ్లిపోతున్నాడే.పట్టుకోండి బాబూ”అంటూ ఏడుస్తూ అరుస్తున్నారు ముగ్గురూ.

ఆ వీధిలోఉన్నవి పది ఇళ్లే. ఉద్యోగాలకు వెళ్లిపోయేవారు వెళ్లిపోగా మిగిలేది ముసలాల్లే.సావిత్రి వారి ఇల్లు ఆ వీధికి ఉత్తరపు దిక్కున చివర ఇల్లు. పట్టణానికి కాస్త దగ్గరగా ఉన్న స్థలం లో అక్కడక్కడా ఇల్లు కట్టుకున్నారు వారంతా.

వీళ్ల అరుపులు విన్న వీధిలోని వాళ్లంతా బయటకు వచ్చి “ఏమయ్యింది రామారావు గారూ?!.” అంటూ ప్రశ్నిస్తూనే వారిని అనుసరించారు.

“వాడేవాడో మేము పనుల్లో ఉండటం చూసి మా బాబీ గాడిని ఎత్తుకెళ్లిపోతున్నాడు.” అన్నారు ఆయాసం గా.

“అయ్యయ్యో పట్టపగలే ఎంత ఘోరం ఇంట్లో దూరి పిల్లాడ్ని ఎత్తుకెళ్లిపోతున్నారా.” అంటూ వారు కూడా లేని ఓపిక తెచ్చుకుని పరుగు పెడుతున్నారు.

వాడు తన వెనకే వస్తున్న వారిని చూసి ఇంకాస్తా వేగం పెంచాడు. ‘కాసేపు పరుగెత్తితే చాలు వీధి మలుపు కి కొంత ధురం లో తనకోసం వెయిట్ చేస్తున్న వెహికల్ ఎక్కి వెళ్లిపోవచ్చు.’ అనుకుంటూ పరుగెత్తుతున్నాడు. వీధి చివర చిల్లర కొట్టు వరకూ చేరుకున్న అతనికి కాలికి ఏదో కర్ర తగిలి కింద పడ్డాడు. అతను కింద పడగానే అంతవరకూ కొట్టు పక్కనే దాక్కుని ఉన్న రంగా పాక్కుంటూ వచ్చి పిల్లాడిని అందుకోబోయాడు. వాడు తన చేతిలో ఉన్న పిల్లాడు రంగా కి అందకుండా చేసి తన కాలికి తగిలిన కర్రనే అందుకుని రంగా ని కొట్టి పారిపోవాలని చూస్తుండగా రంగా అతని కాలిని గట్టిగా పట్టుకున్నాడు. వాడు ఓ చేత్తో పిల్లాడిని పట్టుకుని ఇంకో చేత్తో తనకి తగిలిన కర్ర తో రంగా ని కొడుతుంటే , దెబ్బలు తగులుతున్నా ఇంకాస్తా తన పట్టు బిగించాడు.

ఈ లోపు పిల్లాడు తనని ఎవరో కొత్త వ్యక్తి పట్టుకున్నాడని తెలుసుకున్నాడేమో భయం తో ఏడుపు లంఖించుకున్నాడు.

“రేయ్ ఎవడ్రా నువ్వూ బంకలా వదలడం లేదు.” అంటూ వాడు రంగా ని కాలితో తంటూ, కర్రతో కొడుతున్నా అతడ్ని ఇంచుకూడా కదల నివ్వడం లేదు రంగా. ఇంతలో పరుగున అక్కడికి చేరుకున్న సావిత్రి వాళ్ళందరూ ఒక్కసారిగా అతడిపై దాడికి దిగారు.వాడి చేతిలో ఉన్న కర్ర లాక్కుని వాడినే కొట్టడం మొదలు పెట్టేసరికి వారి దెబ్బలకు తాళలేని వాడు పిల్లాడిని అక్కడే వదిలేసి పారిపోవాలని చూసేసరికి ఎవరు చెప్పారో ఏంటో కానీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

ఆ వ్యక్తి ని పట్టుకుని “వీడో చిన్నపిల్లల దొంగ.పిల్లలను ఎత్తుకెళ్లిపోయి వారి చేత ముష్టి ఎత్తిస్తాడని మాకు కంప్లైంట్ ఉంది. చాలా రోజుల నుంచి వీడికోసం వెతుకుతుంటే వీడీరోజు ఇలా చిక్కాడు. ఎనీవే మీ ధైర్యానికి హాట్సాఫ్. ఇక వీడి పని మేము చూసుకుంటాము. ఫార్మాలిటీస్ ఉంటే మేము మీకు కాల్ చేస్తాము అప్పుడు మీరు స్టేషన్ కి రావాల్సి ఉంటుంది.” అని వెళ్ళిపోయారు.

“ఏడుస్తున్న పిల్లాడిని అందుకుని ఏం కాలేదు నాన్నా. ఏం కాలేదు. అమ్మని వచ్చేసానుగా.” అంటూ అక్కడే ఉన్న ఓ చెట్టు కింద కూర్చొని పాలు పట్టడం మొదలుపెట్టింది.

“హమ్మయ్యా! మొత్తానికి పిల్లాడు క్షేమంగా మనకి దొరికాడు. ఆ ఏడుకొండల వాడే మా బిడ్డని కాపాడాడు ఈ రోజు.” అంది రాధమ్మ.

“అవును ఆ ఏడుకొండల వాడే రంగా రూపం లో వచ్చి మన పిల్లాడిని కాపాడాడు. మనమంతా ఇన్నేళ్లూ అతని కొట్టు వైపు చూశామా. పెద్దింటి వాళ్లు ఉండే ఏరియా లో ఈ చిల్లర కొట్టేమిటీ ఏదో ఒక రోజు ఈ కొట్టు తీయెంచేద్దాము అని ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉన్నాము. కానీ ఆ చిల్లల కొట్టు వాడే ఈ రోజు మన బిడ్డని కాపాడాడు.” అంటూ, కిందపడి ఉన్న రంగా దగ్గరికి వెళ్లి “అయ్యో దెబ్బలు బాగా తగిలాయే. హాస్పిటల్ కి తీసుకుని వెళ్దాం పదండి.” అన్నారు ఎవరో.

“నాకేం కాలేదండీ. బాబు మనకి క్షేమంగా దొరికాడు అది చాలు.” అంటూ పాక్కుంటూ వెళ్లబోయాడు.కానీ దెబ్బలతో ముందుకు వెళ్లలేకపోయాడు.

“ఏం కాలేదని అంటున్నావు కానీ దెబ్బలు బాగానే తగిలినట్టు ఉన్నాయి.” అని తమకి తెలిసిన డాక్టర్ కి ఫోన్ చేసి , రంగా ని నెమ్మదిగా ఓ ఇంటి లోపలికి తీసుకుని వెళ్లారు. డాక్టర్ వచ్చి రంగా ని చూసి గాయాలకు ఆయింట్ మెంట్ రాసి, ఇంజక్షన్ వేసి మందులు రాసిచ్చాడు.

రంగా కొన్ని రోజులకు కోలుకున్నాడు. కానీ అతనికి బాగులేనన్ని రోజులూ కొట్టు మూతపడే ఉండటం తో అతను కొట్టు తెరిచేసరికి అందులో ఉన్న కాస్త సామాను కూడా పాడయ్యింది. కొట్టు కూడా చెదలు పట్టేసి అవశాన దశకి చేరువలో ఉంది.

చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఉన్న ఒక్క ఆధారం కూడా పోయింది. తను తీసుకెల్లే పదీ పరకతోనే తన కుటుంబానికి నెట్టుకొస్తున్నాడు ఇన్నేళ్లూ. ఆ వీధిలో వాళ్లు కొనకపోయినా అటుగా బండిమీద వెళ్ళేవాళ్లు ఆగి ఏదో ఒకటి కొనే వారు. ఇప్పుడు తన కుటుంబాన్ని ఆదుకునే పెద్దదిక్కుని కోల్పోయినట్టుగా అయ్యి ఇక ఏం చేయలేని పరిస్థితి లో నిరాశగా తలక్రిందకి వాల్చి బాధపడుతున్న వాడల్లా,

“రంగా!” అన్న పిలుపు వినపడి తలపైకెత్తి చూశాడు. ఎదురుగా సావిత్రీ, ఆమె భర్త ఈశ్వర్. అత్తా,మామలూ.

“మా బిడ్డ ని కాపాడిన నువ్వు ఈ రోజు ఇలా బాధపడుతుంటే మేము చూస్తూ ఉండలేకపోతున్నాము.‌ అందుకే మా వంతుగా.” అంటూ ఓ చిన్న పేకెట్ ని రంగా చేతిలో పెట్టింది సావిత్రి.

తెరిచిచూస్తే అందులో నోట్ల కట్టలు.”అయ్యో! అమ్మా నాకెందుకు డబ్బులు. వాడు బిడ్డని ఎత్తు కెళ్తుంటే చూస్తూ ఉండలేక నా వంతు సహాయం అందించాను. అంతేకానీ మీనుంచి ఏదో ఆశించికాదు.”

“నువ్వు ఆశిస్తున్నావని మేమనలేదే. మమ్మల్ని ఆదుకున్న దేవుడు నిలువ నీడ లేక బాధపడుతుంటే చూడలేక మా వంతుగా సహాయం చేస్తున్నాము. కాదనకుండా తీసుకో రంగా.” అన్నాడు రంగా.

“అయ్యో నేనేంటీ దేవున్నేంటీ. నేనో చిల్లర కొట్టు నడుపుకునే పేదింటి వాన్ని. మీ అభిమానం , ఆప్యాయతా చాలు నాకు ఇంకేమీ వద్దు.” అని ఆ పేకేట్ వారి చేతిలోనే పెట్టి తన వీల్ సైకిల్ వరకూ పాక్కుంటూ వెళ్లి దానిమీద కూర్చుని ముందుకు సాగిపోయాడు. అతనలా వెళ్లిపోతుంటే “ఏవండీ పాపమండీ మనవల్లే అతను ఉన్న ఆధారం కూడా కోల్పోయాడు. అతనికి ఎలాగోలా సహాయం చేయాలండీ.” అంది సావిత్రి బాధగా.

“కానీ ఎలా సావిత్రీ మనం డబ్బులిస్తే తను తీసుకోవడం లేదుగా. మరెలా సహాయం చేస్తాము?!.” అన్నాడు ఈశ్వర్.

“ఏమో నాకేం తెలీదు. తను బాధపడకుండా చూసుకునే బాధ్యత మనకుంది. మనకి పుత్రబిక్ష పెట్టిన వాడు. ఇలా బాధపడుతుంటే చూడలేకున్నా.” అంది సావిత్రి.

“సరే సరే ఏదో చేస్తాను.నువ్వు బాధపడకు.” అంటూ ఇంటి బాట పట్టాడు ఈశ్వర్ అతని వెనుకే మిగతావారూ.

నెలరోజుల తర్వాత ఓ చెట్టు క్రింద పరదా పరిచి చిన్నపిల్లల బొమ్మలు అమ్ముతూ ఉన్న రంగా తన ముందు ఆగిన బైక్ ని చూసి తలపైకెత్తకుండానే

“ఆ.. ఏం కావాలి సర్. మా దగ్గర తక్కువ ధరకే మంచి మంచి బొమ్మలు దొరుకుతాయి సర్.” అంటూ అన్నీ బొమ్మల్ని చూపిస్తున్నాడు.

“నువ్వే కావాలి.” అనే మాట వినిపించి తలపైకెత్తి చూశాడు. బైక్ పై ఈశ్వర్.

“సర్ మీరా…?!.” అన్నాడు రంగా ఆశ్చర్యంగా.

“హా నేనే.నిన్ను చూడాలని సావిత్రి నా బుర్ర తినేస్తుంది. ఎక్కడని వెతకను చెప్పూ. ఓసారి ఇంటికి వస్తావా రంగా. ఫ్లీజ్.” అన్నాడు ఈశ్వర్ వేడుకోలుగా.

“అయ్యో! మీరు నన్ను బ్రతిమలాడటం ఏంటి సర్. తప్పకుండా వస్తాను.”

“అయితే రేపు ఉదయం తొమ్మిది గంటలకల్లా వచ్చేసేయ్.”

“అలాగే సర్.”అని ఎవరో వస్తే వారికి బొమ్మలు చూపించే పనిలో పడిపోయాడు.

మరుసటి రోజు ఉదయం తన చక్రాల బండి తో ఆ వీధికి చేరుకున్నాడు. తన బడ్డీ కొట్టు స్థానే ఏదో సూపర్ మార్కెట్ దర్శనమివ్వగానే అతని గుండె కలుక్కుమంది.

“ఎవరో సూపర్ మార్కెట్ కట్టుకున్నట్టున్నారు.” అనుకుంటూ చేత్తో పెడల్ తిప్పుతుండగా “రంగా… ఇటూ‌.. ఇటువైపు రా.” అన్న సావిత్రి గొంతు వినిపడి సూపర్ మార్కెట్ దగ్గర ఆపి మెల్లగా దిగాడు.

“సమయానికి వచ్చావు రంగా. ఈ సూపర్ మార్కెట్ మాదే. ఈ ఏరియా కార్పోరేటర్ ని పిలిస్తే ఆయన వంట్లో బాలేదనీ రాలేననీ ఇప్పుడే ఫోన్ చేశారు. నీకంటే ఆత్మీయులు ఎవరున్నారు. ఆ రిబ్బన్ కటింగ్ నీ చేతుల మీదుగా జరిగితే అంతా శుభమే జరుగుతుంది.”అంది రాధమ్మ.

“నేనెందుకమ్మా . మీరు పెద్దవాళ్లు. మీరు చేయండి.” అంటున్నా వినకుండా అతని చేతే రిబ్బన్ కటింగ్ చేయించారు. ఆ వీధిలో ఉన్నవాళ్లంతా లోపలికి వచ్చి మంచి మంచి గా ఉంది శ్రీధర్. అన్ని ఐటెమ్స్ పెట్టావు.” అన్నారు.

మరే. ఈ సూపర్ మార్కెట్ కి వచ్చాక దొరకని వస్తువంటూ ఉండకూడదనీ అన్ని రకాలూ పెట్టించాను. సరే తొలి బోణీ ఎవరు చేస్తారు?.” అన్నాడు ఈశ్వర్.

“ఇంకెవరు మన సావిత్రే చేస్తుంది. నా కోడలి చేతి బోణీ బాగుంటుంది.” అన్నారు రామారావు గారు.

ఓ కేజీ పంచదార ప్యాకెట్ తీసుకుని “ఇదిగో రంగా బోణీ.” అంటూ అతని చేతిలో వంద రూపాయల నోటు పెట్టింది.

“నాకెందుకమ్మా?!.” అన్నాడు ఆశ్చర్యంగా.

“ఎందుకంటే ఈ షాప్ నీదే కాబట్టి.” అన్నారు అందరూ.

“నాదా. అయ్యో ఇదంతా ఎందుకు. నాకేం వద్దు. మీ ప్రేమ చాలు.” అని వెళ్లిపోబోతుంటే “ఆగు రంగా. నువ్వెళ్లిపోతే మా మీద ఒట్టే.” అన్నారు అంతా.

ఆ మాటకి ఆగిపోయిన రంగా ‌కన్నీరు నిండిన కళ్లతో నేను చేసిన చిన్న సహాయానికి ఇంత పెద్ద సహాయం చేస్తున్నారు. మీరు ఋణం ఎలా తీర్చుకోవాలో నాకర్థం కావడం లేదు.” అన్నాడు.

“నువ్వు చేసింది చిన్న సాయం అని నువ్వనుకుంటున్నావు. కానీ మా అందరి ప్రాణాలు కాపాడవని మేమనుకుంటున్నావు. మమ్మల్ని కాపాడిన నీకు ఏం చేసినా తక్కువే అనిపించించి. డబ్బులిచ్చి నీ కొట్టు బాగుచేసుకోమంటే వద్దని వెళ్లిపోయావు. అప్పుడే నిర్ణయించుకున్నాం ఓ మంచి సూపర్ మార్కెట్ ని స్టార్ట్ చేసి నీకివ్వాలని. ఇది కూడా నీ సహాయానికి వెలకట్టి కాదు. నువ్వెప్పుడూ మా కళ్లముందే సంతోషంగా ఉండాలనే చిన్న స్వార్థం అంతే.” అంటూ వెళ్లిపోయారు వాళ్లంతా.

వెళుతున్న వాళ్లనే చూస్తూ ఉండిపోయాడు రంగా కన్నీరు నిండిన కళ్లతో.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!