రామయ్య చిల్లర కొట్టు

 రామయ్య చిల్లర కొట్టు

రచయిత::సావిత్రి కోవూరు 

సాయంకాలం నాలుగు గంటల ప్రాంతంలో సత్యంగారు, ఆయన భార్య సుశీలమ్మ, కోడలు నిరుపమ, కొడుకు శిరీష్ తో కలిసి వాకిట్లో ఉన్న వేప చెట్టు కింద కుర్చీలలో కూర్చుని టీ తాగుతున్నారు. కొడుకు, కోడలు, మూడేళ్ళ మనుమడు చింటు అమెరికా నుండి 10 రోజుల క్రితం వచ్చారు. సంవత్సరానికి ఒక నెల తప్పనిసరి తల్లిదండ్రుల దగ్గరికి వస్తుంటాడు శిరీష్ కుటుంబంతో.

శిరీష్ “నాన్న నీవు రోజు చింటూ ని వీధి చివరి రామయ్య కొట్టుకి తీసుకెళ్లి ఏవేవో చిరుతిళ్ళు కొని ఇస్తున్నావు.వాడి హెల్త్ పాడవుతుంది ప్లీజ్ నాన్నా. అలాంటి నాణ్యతలేని తినుబండారాలు కొనియ్యకు. వాడికి అదే అలవాటు అయింది.రోజు నువ్వుండలు, పప్పు ఉండలు, పల్లీ పట్టిలు, కొబ్బరి ఉండలు, నిమ్మ గోలీలు, కొబ్బరి గోలీలు,ఏంటి నాన్న? ఆ తిండ్లు. పది రోజుల నుండి వాడు మధ్యాహ్నం పప్పు ఉండలో, నువ్వు ఉండలో, పల్లిపట్టో ఏదో ఒకటి ఇవ్వమని పేచీ పెడ్తున్నాడు.ఇలా అలవాటైతే అక్కడికి వెళ్ళాక మాకు కష్టమవుతుంది. వాడికి కొన్ని రకాల తిండ్లు తిన్నప్పుడు, ‘డస్ట్’ కు ఎక్స్పోజ్ అయినప్పుడు ఎలర్జీతో ఒంటి నిండా దద్దుర్లు వస్తున్నాయి.. మీరేమో డస్ట్ లో నడిపించుకుంటూ ప్రతిరోజు ఆ చిల్లర కొట్టుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నారు. మేము అమెరికా వెళ్ళే టైం దగ్గరకు వస్తుంది. ఇక్కడ అలర్జీ అయ్యిందంటే చాలా కష్టమవుతుంది” అన్నాడు.

సత్యం గారు”మా నాన్నకు, వాళ్ల నాన్న, ఈ వీధి చివరి చిల్లర కొట్టు చిరుతిండ్లే కొనిపెట్టాడు. మా నాన్న నాకు చిన్నప్పుడు ఆ చిరుతిండ్లే కొని పెట్టాడు.నా కొడుక్కు కూడా, అంటే నీకు కూడా నేను రోజు, నీ కొడుక్కు కొనిచ్చినట్టుగానే కొని ఇచ్చేవాడిని. అవి తినే పెరిగావు. చిల్లర కొట్టు అంటే అన్ని చవకగా అమ్ముతారని నీకు అంత చులకన భావం.
పెద్ద లైట్లు, హంగామాలు, ప్రకటనలు, వందల మంది పని వాళ్ళు ఉండరు, కనుక ఏ వస్తువైనా చౌకగా ఉంటుంది. అన్ని చిల్లర కోట్లలో నాణ్యమైన వస్తువులు ఉండకపోవచ్చు. చాలా దుకాణాల్లో నాణ్యమైన వస్తువులు కూడ ఉంటాయి. రామయ్య చిల్లర కొట్టు, నేను పుట్టక ముందు  నుండి ఉంది. వాళ్లు అన్ని నాణ్యమైనవే అమ్ముతారు. ఇలాంటి దుకాణాలకు నాలాగా కొంతమంది తరతరాల శాశ్వత కస్టమర్లు ఉంటారు. అంతెందుకు పైకి చిన్నగా కనిపిస్తుంది కానీ ఆ దుకాణంలో దొరకని వస్తువు లేదు. ఒక్కొక్కప్పుడు ఏ సూపర్ మార్కెట్లోనూ దొరకని వస్తువు కూడా ఇక్కడ దొరుకుతుంది.

ఒకరోజు మధ్యరాత్రి మీ అమ్మ విపరీతమైన జలుబుతో ఊపిరి తీసుకోవడం కష్టమై ఉక్కిరిబిక్కిరై అవస్తపడుతుంటే, నాకు ఏం చేయాలో తోచక ఆ రామయ్య చిల్లరకొట్టుకెళ్ళి తలుపు తడ్తే, లేచి వచ్చి విసుక్కోకుండ ‘జిందాతిలస్మాత్’ అనే తైలం కావాలంటే ఇచ్చాడు. దాంతో ఉపశమనం పొందింది.నీవు వెళ్తే ఏ సూపర్ మార్కెట్ వాళ్ళయిన ఇలా సహకరిస్తారా చెప్పు. అలా అని సూపర్ మార్కెట్ లను విమర్శిస్తున్నాననుకోకు. దేని ప్రయోజనం దానిదే.

మీరు వచ్చిన రెండో రోజే మీ అమ్మ చింటూ కి మంచి ఆయుర్వేద ఔషధాల తో మందు చేసి వారం రోజులు త్రాగించింది.  వాడు ఇన్ని రోజుల్లో ఒక్కరోజు కూడా దగ్గడం గానీ తుమ్మడం గాని చూసావా? వానికి ఆ మందు వల్ల రెసిస్టెన్స్ పవర్ పెరిగి చక్కగా ఆడుకుంటున్నాడు. నువ్వుల లడ్డూలు, పప్పు లడ్డూలు, పల్లీ పట్టీలు బెల్లము, నువ్వులు, పల్లీలు మొదలైన వానితో చేస్తారు. కనుక అవి తినడం వల్ల, ఏ విటమిన్, కాల్షియం, ఐరన్ మొదలైనవి ఎన్నో లభిస్తాయని, మీకు నేను వేరే చెప్పనక్కర్లేదు అనుకుంటా.
వాడు పడుకొని లేచిన తర్వాత సాయంత్రం సంత్రా తొనలు, మామిడి పండు, జామ కాయ ముక్కలు, నేరేడు పళ్ళు, చిన్న ఉసిరి కాయలు ఇస్తున్నాను. అది చెప్పవేంటిరా మరి. నాకు కూడా నా కొడుకును, అంటే నిన్ను పెంచిన అనుభవం ఉంది.  వాడికి ఏం పెడితే మంచిదో నాకు కూడా తెలుసు.
ఇక మీ అమ్మ ముసాంబరం, పుటం పెట్టిన అల్లం అంటే, పిప్పళ్ళు,ఆకల కర్ర, వామ, దుంపరాష్ట్రం, ఇంకా ఏవో దినుసులు అల్లానికి కుచ్చి దాని పైన బట్ట చుట్టి దాన్నిఎర్రమట్టితో కవర్ చేసి కుంపటిలో కాల్చి తర్వాత తీసి దాన్ని పొడి చేసి ఒక డబ్బాలో పోసి పెట్టింది. దానిని సర్వరోగ నివారిణిగా పిల్లలకు వాడతారు.
దానివల్ల ఎలర్జీ ఎప్పటికీ రాకుండా, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. మీరు అమెరికాలో ఏమేమి తింటారో నేను చూశాను కదా! చాలా వరకు మైదాపిండి, చక్కెరతో తయారుచేసిన పిజ్జాలు, బర్గర్లు, కేక్స్, కప్కేక్స్ ఎక్కువగా తింటారు. పిల్లలకు కూడా పెడతారు. వాని వల్ల ఒంట్లో అనవసర కొవ్వు పెరుగుతుంది.

“సరే మామయ్య ఆయన అలాగే అంటారు కానీ, మీరు వెళ్లే వీధి చివర చిల్లరకొట్టు గురించి చెప్పండి. చాలా ఇంట్రెస్ట్ గా ఉంది” అన్నది నిరుపమ.

“ఆ కొట్టు చరిత్ర చాలా ఉందమ్మా. ఇప్పుడు కొట్టు నడిపే అతను ‘రామయ్య’ అని నా క్లాస్మేట్. అతను ఆ కాలంలో పి.యు.సి చదివి మున్సిపల్ ఆఫీస్ లో పని చేస్తూ ఉండేవాడు. ఆయన ఆఫీస్ కి వెళ్ళినప్పుడు అతని భార్య కొట్టును చూసుకునేది.
అతనికి ఇద్దరు మగపిల్లలు. పిల్లలు ఇద్దరు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్లు తండ్రితో ‘మనకు డబ్బులకు ఏమీ ఇబ్బంది లేదు. ఈ చిన్న కొట్టు ఎందుకు నాన్న. తీసేయొచ్చు కదా’ అని వాళ్ళ నాన్నతో ఎన్నోసార్లు అన్నారు.  రామయ్య ‘ఈ దుకాణం మా తాతల కాలంనాటి నుండి నడుస్తున్నది. కొట్టు మూసేసే ప్రశ్నేలేదు’ అన్నాడు.
చూడటానికి ఆ కొట్టు చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ, దాని లో దొరకని వస్తువు లేదమ్మా. మూడు వైపులా గోడలకు ‘బాట షూ డబ్బా’ అంత డ్రాలు మొత్తం వంద వరకు ఉంటాయి.  ఆ డ్రా ల లో ఏ ఏ వస్తువు దేన్లో ఉన్నదో చిన్న స్లిప్స్ రాసి పైన  అతికిస్తాడు. నేలపైన పేద్ద బాక్సులు ఉంటాయి మూతలు పెట్టే లాగా. వాటిలో బియ్యం, పిండి లాంటివి ఉంటాయి.

మనం ఏ వస్తువు అడిగినా రెండు నిమిషాలలో ఇచ్చేస్తాడు. మీ సూపర్ మార్కెట్లో లాగా ఎదురుచూపులు ఉండవు. బిల్లు కట్టే దగ్గర లైన్లు ఉండవు.

అతని దగ్గరకు కొత్త వినియోగదారులు చాలా తక్కువగా వస్తారు. నాలాగా తరతరాలుగా వచ్చే వాళ్లు, నమ్మకం ఉన్న వాళ్లు ఎక్కువ.
రామయ్య వాళ్ళ తాత పేరు కూడా రామయ్యే. ఆయన పేరు మీదే ఆ దుకాణాన్ని పెట్టారు. ‘రామయ్య దుకాణం’ అంటే ఈ బస్తీలో గౌలిపుర నుంచి ఛత్రినాక వరకు అందరికీ తెలుసు.
అది ఉదయం 6 గంటల నుంచి రాత్రికి 10 గంటల వరకు ఎట్టి పరిస్థితిలోనూ మూసి వేయరు.

మా నాన్నగారు ఉన్నప్పుడు ఉదయం పండ్లపొడి, ‘గొల్లభామ’ టీ పొడి, చక్కెర, బెల్లం మొదలుకొని అన్ని ఆ కొట్టులోనె కొనేవాళ్ళం.రోజుకు ఐదారు సార్లు వెళ్లేవాడిని.  అందుకే నా దృష్టిలో ఆ దుకాణం అంటే ఎంతో విలువైనది” అన్నారు సత్యం గారు.

“మావయ్య మీరు ఇందాక ‘ముసాంబరం’అన్నారు అంటే ఏంటి?” అన్నది నిరుపమ.

“కలబంద, అంటే ఇప్పుడు మీరంతా ‘అలోవేరా’అంటున్నారు కదా! అదే. దానిదే గుజ్జంత తీసి గిన్నెల్లో పెట్టి ఎండబెడితే నల్లని పదార్ధంగా మారుతుంది. దానిని ‘ముసాంబరం’ అంటారు. ఇప్పుడిప్పుడే దాని ఔషధ గుణాలు అందరికి తెలుస్తున్నాయి. కానీ మా అమ్మ వాళ్లకు పూర్వం నుండే తెలుసు ఆ ముసాంబరం మీరు వెళ్ళే ఆ సూపర్ మార్కెట్లలో దొరకదు. అందుకే నా దృష్టిలో మీరు వెళ్లే పెద్దపెద్ద సూపర్ మార్కెట్ ల లాగే, ఈ వీధి చివర కిరాణా కొట్టు కూడ చాలా విలువైందే. దేని ప్రత్యేకత దానిదే. దాంట్లో దొరికేవి దీంట్లో దొరకక పోవచ్చు, దీంట్లో దొరికేవి దాంట్లో దొరకక పోవచ్చు” అన్నారు సత్యం గారు.

“మీరు చెప్పినాక  నాకు కూడా అలాగే అనిపిస్తుంది మామయ్య” అన్నది శిరీష.

“ఏవండీ ఇక్కడ ఉన్నన్ని రోజులు బాబు విషయం అత్తయ్య, మామయ్య వాళ్లకి వదిలి పెట్టేద్దాం. వాళ్లకు తెలిసినన్ని మంచి విషయాలు మనకేం తెలుసు. ఇక్కడికి వచ్చినప్పటి నుండి మామయ్య కొనిచ్చినవన్నీ  తిన్నా చింటుకు చిన్న సుస్తీ కూడ కాలేదు”

“వాడికి అలా చెప్పమ్మా మా మనవడు విషయంలో మాకు కూడా కొన్ని సరదాలు ఉంటాయి. ఎక్కడికైనా తీసుకెళ్లాలని, ఏవేవో కొని ఇవ్వాలని, దేనికీ అడ్డు చెప్పొద్దని మీ ఆయనకు చెప్పు. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టు” అని సుశీలమ్మ అనేసరికి ముగ్గురు నవ్వేశారు.

***

You May Also Like

One thought on “రామయ్య చిల్లర కొట్టు

  1. నేటి తరానికి అవసరమైన సందేశాత్మక కథ 👌👌💐💐💐
    సావిత్రి గారూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!