ఆనాటి జోకర్

ఆనాటి జోకర్

రచన: కమల ముక్కు (కమల’శ్రీ’)

హాలంతా చప్పట్లతో మారుమ్రోగుతోంది. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ ఇక నవ్వలేక కడుపు పట్టుకుంటున్నారు. కొందరు. మరి కొందరికైతే కళ్లమ్మట నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆనందం తో. వారందరి ఆనందానికి కారణం ఆ హాల్ లో జరిగే “నవ్వుతూ బ్రతకాలిరా” జరిగే ప్రోగ్రాం.

జోకర్ వేషధారణ లో ఉన్న అతను తన హావభావాలతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తున్నాడు. కుర్చీ లోంచి లేస్తే ఏం మిస్ అవుతామనో ఒక్కరూ కూడా కూర్చున్న చోటు నుంచి కదలడం లేదు. అంతలా లీనమైపోయారు ఆ ప్రోగ్రాం లో. తమ భాదలను, కష్టాలనూ మర్చిపోయి హ్యాపీ గా నవ్వుకుంటున్నారు.

ఓ అరగంట ముందు:-

నిర్వాహకులు ముందుగా ఫేమస్ జోకర్ అయిన హర్షిత్ తో ఆ ప్రోగ్రాం జరిపించాలని ప్లాన్ చేసి పాంప్లెట్ లు అచ్చు వేయించి అందరికీ పంచిపెట్టి టికెట్స్ కూడా అమ్మేశారు. హర్షిత్ కి ఉన్న క్రేజ్ ని బట్టి ఒక్కరోజు వ్యవధి లోనే టికెట్స్ బుక్ అయ్యాయి. సరిగ్గా ప్రోగ్రాం అరగంట లో మొదలౌతుంది అనగా హర్షిత్ వస్తున్న కార్ కి ఆక్సిడెంట్ అయ్యి అతనికి దెబ్బలు తగలడం తో అతను ప్ర్రోగ్రాం చేయలేకపోతున్నా అని చెప్పి మెసేజ్ చేశాడు హర్షిత్. అది చూడగానే నిర్వహకుల్లో కంగారు మొదలైంది. అప్పటికే ప్రేక్షకులు రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రోగామ్ కేన్సిల్ అయ్యింది అని చెప్తే పెద్ద పెట్టున గొడవ చేస్తారు. ఏం చేయాలో అర్ధం కాక తలలు పట్టుకున్న వారికి “సర్” అన్న పిలుపు వినపడటం తో తలపైకెత్తి చూశారు నిర్వహకుల్లో ఒకరైన రఘురాం.

“ఏంటీ?.” కాస్త అసహనం గా అన్నారు రఘురాం.

“సర్. హర్షిత్ సర్ ఎప్పుడు వస్తారు సర్. నేను ఆయనకి అభిమానిని సర్. ఆయన ప్రతీ ప్రోగ్రాం ని మిస్ కాకుండా చూస్తాను.” అన్నాడు ముప్ఫై ఐదేళ్ళ వ్యక్తి.

“అయితే ఏంటీ?.” కోపంగా అన్నారు శ్యామ్ మరో నిర్వహకుడు.

“అంటే సర్ అదీ…” అంటూ నసుగుతున్న అతన్ని చిరాగ్గా చూస్తూ “ఏంటయ్యా మా టెన్షన్ లో మేముంటే మధ్యలో నీ నస ఏంటీ?.” కాస్త గట్టిగానే అన్నాడు రఘురాం.

“అంటే వారి ఆటోగ్రాఫ్ తీసుకుందామని. ప్రోగ్రాం అయ్యాక తీసుకుందామంటే బిజీ గా ఉంటారు కదా అని ఇప్పుడు వచ్చాను. సర్ లోపల ఉన్నారా.” అన్నాడు ఆశగా.

“ఏంటీ… ఆటోగ్రాఫ్ తీసుకుంటావా. ఆ మనిషే రాలేని పరిస్థితి లో ఉంటే ఆటోగ్రాఫ్ తీసుకుంటాడంట. వెళ్లవయ్యా.” అంటూ కసురు కున్నాడు శ్యామ్.

“అయ్యో! ఆయన రాలేని పరిస్థితి లో ఉన్నారా?. ఏం జరిగింది సర్?.” కంగారుగా అడిగాడు అతను.

“దార్లో ఆక్సిడెంట్ అయ్యిందిట. హాస్పిటల్ లో అడ్మిట్ చేశారని తెలిసింది.” రఘురాం తలపట్టుకుని అన్నాడు.
“మరిప్పుడు ప్రోగ్రాం ఎలా సర్?.” అన్నాడతను.

“ఆ టెన్షన్ లోనే మేము తలపగిలేలా ఆలోచిస్తుంటే నువ్వేమో ఆయన దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటా నంటూ మా బుర్రలు తింటున్నావు. వెళ్లవయ్యా.” అని కసురుకున్నాడు శ్యామ్.

“సర్ మీరు మరోలా అనుకోనంటే నేనో సలహా చెప్పనా సర్.” వాళ్ల వైపే చూస్తూ అన్నాడు అతను.

“ఏంటీ?!.” రఘురాం అతన్నే చూస్తూ అడిగాడు.

“ఆ ప్రోగ్రాం ని నేను చేయనా సర్.”

“ఏంటీ నువ్వు చేస్తావా. అదేమన్నా తోలుబొమ్మలాట అనుకున్నావా ఎవరు పడితే వాళ్లు చేయడానికి?. జోకర్ లా చేయడం ఎంత కష్టమో నీకు తెలుసా. వెళ్లు ఇక్కడి నుంచి… మా పాట్లేవో మేము పడతాము.” అన్నాడు శ్యామ్.

“ఇదిగో శ్యామ్ నువ్వు కాసేపు ఆగవయ్యా. ఏమయ్యా నువ్వు జోకర్ లా చేస్తావా. నీకు స్టేజ్ మీద పెర్ఫామ్ చేసిన అనుభవం ఉందా?!.” అన్నారు రఘురాం గారు.

“స్టేజ్ మీద పనిచేసిన అనుభవం అయితే ఉంది సర్.” అన్నాడు అతను.

“అవునా! ఎక్కడెక్కడ షోస్ చేశావు చెప్పు.” శ్యామ్ కాస్త వెటకారం గా ఉన్నాయి.

“చాలా చోట్ల చేశాను సర్.” కల్లింతలు చేసుకుని అన్నాడు అతను.

“అవునా! నిజమా?!” అన్నాడు రఘురాం.

“అవును సర్. కానీ నేను చేసిన పెర్ఫార్మెన్స్ జోకర్ లా కాదు.” అన్నాడు అతను కాస్త నెమ్మదిగా.

“మరీ…?!” రఘురాం తొంగి చూసింది అనుమానం.

“బుర్రకథలో హాస్యగానిలా.” అన్నాడు అతను.

“ఏంటీ హాస్యగానిలా చేశావా?. ఇప్పుడు జోకర్ లా చేస్తావా. బుర్రుండే మాట్లాడుతున్నావా. జోక్ లు వేయడానికి మేమే దొరికామా. ముందు నువ్విక్కడ నుంచి వెళ్లవయ్యా బాబూ?.” అన్నాడు శ్యామ్.

అతను కదలకుండా రఘురాం వైపు ఆశగా చూశాడు. రఘురాం నొసట చేయి పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు.

“వెళ్లమంటే నీక్కాదూ. వెళ్లిక్కడ నుంచి.” అంటూ అతన్ని బయటకు నెట్టబోయాడు శ్యామ్.

“శ్యామ్ కాసేపు ఆగుతారా మీరూ. ఇదిగో బాబూ నీ పేరెంటీ?!.” అతన్నే చూస్తూ అడిగాడు రఘురాం.

“మహర్షి సర్.” అన్నాడు అతను.

“ఇదిగో మహర్షీ. నీకు అవకాశం ఇస్తాను. కానీ పేమెంట్ మాత్రం ఇవ్వను. ఎవరు కూడా నువ్వు హర్షిత్ కాదు అని అనుకోకూడదు. అలా చేయగలను అంటే నాకు ఇష్టమే.”

“సార్ మీరెంటి సర్ పోయి పోయి బుర్రకథ చెప్పే వాడికి జోకర్ వేషం వేయమంటారు. అతను కానీ తేడా చేస్తే మన నిర్వహణా మండలి పరువు పోతుంది సర్.” శ్యామ్ కాస్త హెచ్చరించాడు.

“ఏం కాదు. నేను అదంతా చూసుకుంటాను. ఏమయ్యా నీకు పేమెంట్ లేకుండా చేయడం ఓకేనా!.” మహర్షి ని అడిగాడు రఘురాం.

“హా…హా… ఒకే సర్. మీరు నాకు అవకాశం ఇస్తానంటే ఎందుకు కాదంటాను సర్. మీరు పైసా ఇవ్వకపోయినా పర్వాలేదు. నేను చేస్తాను సర్.” అన్నాడు మహర్షి సంతోషంగా.

“సరే మహర్షీ… కాస్ట్యూమ్స్ , మేకప్ అన్నీ ఆ రూం లో ఉంటాయి. నువ్వు అందులోకి వెళ్లు.” అన్నాడు రఘురాం.

“అలాగే సర్.” అని ఆ గదిలోకి వెళ్లాడు మహర్షి.

అతను అందులోకి వెళ్లిపోయాడని నిర్థారించుకున్నాక “మీరు చేస్తుంది ఏంటో నాకు అర్థం కావడం లేదు సర్. ఈ బుర్రకథ లు ఆడేవాడితో జోకర్ లా యాక్ట్ చేయించడం…అదీ లైవ్ పర్ఫార్మెన్స్… కష్టమేమో సర్. ఓసారి ఆలోచించండి.” అన్నాడు శ్యామ్.

“ఇది తప్పించి ఇంకో మార్గం లేదయ్యా. ఆల్రేడీ టికెట్స్ అమ్మేశాం. ఇప్పుడు ప్రోగ్రాం కాన్సిల్ అంటే ఎంత లాసో తెలుసా. ప్రోగ్రాం సక్సెస్ అంటే క్రెడిట్ మన ఖాతాలో, అన్ సక్సెస్ అయితే అప్పుడు అసలు విషయం రివీల్ చేద్దాం. అంతవరకూ నువ్వు మారుమాట్లాడకుండా ఉండు శ్యామ్.” అని పైకి లేచి ఆడిటోరియం లోకి వెళ్లాడు రఘురాం.

“మీకు నచ్చినట్టు చేయండి. నేనైతే అటు వైపే రాను.” అని ఆఫీసు రూం లోనే కూర్చుండి పోయాడు శ్యాం.

ఆడిటోరియం మొత్తం ప్రేక్షకులతో నిండిపోయింది. ఆ జనసందోహం చూస్తూ ఫ్రంట్ లైన్ లో ఉన్న వీఐపి సీట్లో కూర్చున్నాడు రఘురాం.

“హాయ్… హలో… నమస్తే. మరికాసేపట్లో మనమెంతగానో నచ్ఛే,మెచ్చే శ్రీ హర్షిత్ గారి ప్రోగ్రాం స్టార్ట్ అవ్వబోతోంది. కడుపుబ్బా నవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?!.” అంటూ వయ్యారంగా నడుస్తూ వచ్చిందో అమ్మాయి.

“హా…రెడీ… హర్షిత్…హర్షిత్…” అంటూ అరుస్తున్నారు ప్రేక్షకులు.

“అయితే మరెందుకాలస్యం మన హర్షిత్ గారికి వెల్ కం చెప్పేద్దామా!.” అంది యాంకర్.

“హా… చెప్పేద్దాం…”

“లెట్స్ వెల్ కమ్… అవర్ టాలెంటెడ్ జోకర్… ఒన్ మాన్ ఆర్మీ లా షో ని తన భుజస్కంధాలపై నడిపించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే మిస్టర్ హర్షిత్…” అంది యాంకర్.

అందరి చప్పట్ల మధ్య నెమ్మదిగా స్టేజ్ పైకి వచ్చాడు మహర్షి. చాలా రోజుల తర్వాత స్టేజ్ ఎక్కాడేమో కొంచెం బెరుకూ, కొంచెం భయం, కొంచెం వణుకూ… అన్నీ కలగలిపి భయం భయంగా అడుగులు వేస్తూ మధ్యలోకి వచ్చాడు.

“హర్షిత్… హర్షిత్…హర్షిత్…” అంటూ అందరూ అరుస్తుంటే వెన్నులో వణుకు మొదలైంది మహర్షికి. స్టేజ్ ఎక్కి అప్పటికే మూడు నిముషాలు దాటింది. ప్రేక్షకుల్లో కలకలం మొదలైంది.

“ఏమైంది హర్షిత్ సార్… మీరెంతో గొప్ప జోకర్ అనీ, ప్రజలను నవ్వించడంలో మిమ్మల్ని మించిన వారు లేరనీ అంటారే. అలాంటిది మీరెంటీ ప్రోగ్రాం స్టార్ట్ చేయకుండా ఆలోచిస్తున్నారు. మమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుందా ఏంటీ?!.” అన్నాడు ఎవరో.

“చేసేస్తా అంటూ పెద్ద ఫోజు కొట్టి స్టేజ్ ఎక్కాను. ఇప్పుడు కానీ చేయకపోతే పోయేది నా పరువు కాదు, నేనే హర్షిత్ అనుకునే ఆ హర్షిత్ గారి పరువు. లేదు అలా జరగడానికి వీల్లేదు. నేనేంతగానో అభిమానించే హర్షిత్ గారి పరువు పోవడానికి వీల్లేదు. నన్ను నమ్మి ఆఫర్ ఇచ్చిన ఈ పెద్దాయన తలదించుకునేలా చేయకూడదు.” అని అనుకుంటూ… తన ప్రదర్శన మొదలుపెట్టాడు.

బుర్రకథ లో మాటలతో హాస్యం ఒలకబోస్తే, జోకర్ షో లో మాత్రం కేవలం హావభావాలతోనే నవ్వించగలగాలి. అదే చేస్తున్నాడతను. అతను చేసేది చూస్తూ చప్పట్ల కొడుతున్నారు ప్రేక్షకులు. ఆ చప్పట్లు ఆఫీస్ రూం లో ఉన్న శ్యాం కి వినిపించి ఒక్క ఉదుటున లేచి ఆడిటోరియం వైపు పరుగున వెళ్లి అక్కడ మహర్షి చేస్తున్న యాప్ట్ చూస్తూ మంత్రముగ్ధుడై పోయాడు.

అక్కడున్న వారిని నవ్వించడమే తన ధ్యేయంగా చేసుకుని ఓ ఋషి తపస్సు చేస్తున్నట్లుగా యాఫ్ట్ చేస్తున్నాడు మహర్షి.

ప్రస్తుతం:-

ప్రదర్శన పూర్తి అయ్యాక అభివాదం చేసి నిలబడ్డాడు మహర్షి.

అందరూ “హర్షిత్… హర్షిత్” అంటూ చప్పట్లు కొడుతూ నిలబడ్డారు. ఒక్కొక్కరైతే ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి తెచ్చుకున్న బుక్ లను సిద్ధం చేసుకుని ముందుకు నడుస్తున్నారు.

ప్రస్తుతం బుర్రకథ లు ప్రదర్శించక పోవడం తో ఏ ప్రోగ్రాం లూ లేక ఖాళీగా ఉంటున్న మహర్షి కి ఆ చప్పట్ల మోత వినగానే ఎనలేని సంతోషం మొదలైంది. కళ్లవెంట అతనికి తెలియకుండానే కన్నీరు కారడం మొదలైంది. ఇన్నాళ్లూ ప్రదర్శనలు లేక బ్రతుకు తెరువు కోసం కూలీ పనికి పోతున్న తనకు ఓ జీవనాధారం దొరికినట్టు గా అనిపించింది. తనను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన ఆ పెద్దాయనకు మనసులోనే అభివాదం చేశాడు మహర్షి.

ప్రేక్షకులు బయటకు వెళ్లిపోతుండగా ఒన్ మినిట్ ఫ్రెండ్స్.” అని మైక్ లో వీనపడటం తో అందరూ స్టేజ్ పైకి చూశారు.

మీరందరికీ ఓ విషయం చెప్పాలి. అంతకంటే ముందు క్షమాపణలు కోరాలి. ఎందుకంటే ఈయన మీరు అనుకున్నట్టు హర్షిత్ గారు కాదు… మహర్షి అని బుర్రకథల్లో హాస్యగానిగా వేషం వేసే ఆయన. హర్షిత్ గారికి యాక్షిడెంట్ అయ్యి హాస్పిటల్ లో ఉంటే ప్రేక్షకునిలా షో చూడాల్సిన ఆయన ఆఖరి నిమిషంలో నిజం తెలుసుకుని ఈ వేషం వేసుకుని ఈ ప్రదర్శన ని ఇంత గొప్పగా ఇచ్చారు.

బుర్రకథ వాడివి నువ్వేం చేయగలవని ఆయన్ని హేళన చేశాను. కానీ అది తప్పుడు అభిప్రాయం అనీ నా తప్పుని మన్నించమని మనసారా వేడుకుంటున్నా మహర్షి గారూ.

బుర్రకథ లో నలుగుర్నీ మీ మాటలతో నవ్వించే మీరు ఈ రోజు కేవలం హావభావాలతో మమ్మల్ని మైమరించేలా చేశారు. మీరెంత టాలెంటెడ్ నటులో చూస్తుంటేనే అర్థం అయ్యింది. అలాంటి మిమ్మల్ని చులకన చేసినందుకు నన్ను మన్నించండి.” అని మహర్షి వైపు చూసి చేతులు జోడించాడు శ్యాం.

“అయ్యో సార్…” అంటూ మహర్షి ఏదో చెప్పబోతుంటే,

“ముందు నేను వీరిపై నమ్మకం లేక ఒప్పుకోక పోతే మా రఘురాం గారు విత్ ఔట్ ఎనీ పేమెంట్ షో చేయమని ఆఫర్ ఇచ్చారు. కానీ మహర్షి గారు చేసిన ఈ యాప్ట్ కి ఎంతైనా తక్కువే. అందుకే మా సంస్థ తరుపున ఈ చిన్న మొత్తం వారికి అందిస్తున్నాం.” అని ఓ కవర్ అందించాడు శ్యాం.

సార్ మీరు నామీద నమ్మకం తో అవకాశం ఇచ్చారు. అది చాలు నాకు. ఈ మొత్తం వద్దు సర్.” అని సున్నితంగా తిరస్కరించబోతున్న మహర్షి చేతిని పట్టుకొని తీసుకో మహర్షీ… ఇది నీ ప్రదర్శన కు ఇచ్చిన గౌరవం, అంతరించిపోతున్న మన పల్లె బుర్రకథ ల్లో నటించే వారిలో ఎంత గొప్ప టేలెంట్ ఉంటుందో ప్రపంచానికి తెలియజేసేలా చేసిన నీ ప్రతిభకి పట్టాభిషేకం. కాదనకుండా తీసుకో.” అన్నారు రఘురాం గారు.

ఇక కాదనక దాన్ని అందుకున్నాడు మహర్షి. అప్పటివరకూ శ్యాం చెప్పేదంతా విన్న ప్రేక్షకులంతా ఒక్కసారిగా ప్రశ్నించారు… “మీరేంటి సర్?.” అని.

“మహర్షి.‌.. ‘ఆనాటి జోకర్’ ని.” అంటూ అందరికీ అభివాదం చేశాడు మహర్షి.

“సభాముఖంగా మీ అందరికీ తెలియజేసేదేమనగా నాకు ఈ సంస్ద వారు అందించిన ఈ మొత్తాన్ని మా కళాకారుల సంక్షేమం కోసం వినియోగిస్తానని తెలియజేస్తున్నా. ప్రదర్శనలు లేక కూలి పని చేసుకుంటున్న నాకో బ్రతుకు తెరువు చూపించిన ఈ సంస్థ వారికి జీవితాంతం రుణపడి ఉంటాను.” అంటూ కన్నీళ్లతో చెప్తున్న మహర్షి మాటలు వినగానే… అందరూ చప్పట్లతో “సార్ ఓసారి మిమ్మల్ని విత్ ఔట్ మేకప్ చూడొచ్చా?!.” అని కోరడంతో వెళ్లి మేకప్ రిమూవ్ చేసుకుని వచ్చి స్టేజ్ పై నిలుచున్నాడు మహర్షి.

“ఆనాటి ఈ జోకర్ ల ముందు ఈనాటి జోకర్ లు వెలవెలపోతారేమో సర్. మీలో చాలా గొప్ప టాలెంట్ ఉంది.” అంటూ పొగుడుతూ… అతని దగ్గర ఆటోగ్రాఫ్ లు తీసుకుంటూ బయటకు నడిచారు ప్రేక్షకులు.

“సర్ నన్ను మన్నిస్తారా?!.” మరోసారి అన్నాడు శ్యాం.

“మీకు నేను థాంక్స్ చెప్పుకోవాలి సర్. థాంక్యూ సర్.” అంటూ నమస్కరించాడు మహర్షి.

“మహర్షీ ఇక మీదట మా సంస్థ నిర్వహించే ప్రదర్శనలకు జోకర్ వి నువ్వే నయ్యా. లోకల్ గా ఉండే నీలాంటి మాణిక్యాలను విడిచిపెట్టి ఇన్నాళ్ళు వేరే రాష్ట్రం వ్యక్తిని పోషించాం. మంచి టాలెంట్ ఉందయ్యా నీలో. గొప్పోడివి అవుతావు.” అన్నారు రఘురాం గారు.

“ధన్యవాదాలు సర్. మీకెలా కృతజ్ఞతలు తెలియజేయాలో తెలియడం లేదు.” అన్నాడు మహర్షి.

“ఇలా” అంటూ అతన్ని గుండెలకు అదుముకున్నారు రఘురాం గారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!