అంతరంగ వీచికలు

అంతరంగ వీచికలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: మక్కువ. అరుణకుమారి

ఆశల పల్లకిలో ఊరేగుతూ
ఆనంద తీరాలు చేరాల్సిన తరుణంలో
అంతుచిక్కని నైరాశ్యంలో నను తోసివేసి నువు నిష్క్రమించిన వేళ
ఒంటరి ఊపిరినే చిరునామా గా చేసుకొని బతికేదెందుకని
నా అంతరంగం నను ప్రశ్నిస్తుంది!
ఏమని చెప్పను?
అందని సుదూర తీరాలలో ఉన్నా
నీ కన్నుల వెనుకున్న చూపుల బాణాలు
అనుక్షణము నన్నే సంధిస్తున్నాయని చెప్పనా!
నీ యదలోయల దాగున్న నిశ్శబ్ద శబ్ధాలు నిరతము
నా మనోవీణియలను రవళిస్తూ మధురరాగాలాపన చేస్తున్నాయని చెప్పనా!
ప్రతి నిత్యం నీలో నిండిన మన అందమైనజ్ఞాపకాలు
తలపు తలపున పరదాలు తొలిగించుకుంటూ
మదిని మైమరిపించే మరుమల్లెల
సౌరభాలు వెదజల్లుతూ
నిను నావైపు పంపే శుభతరుణంకై
వేచి చూస్తున్నాయని చెప్పనా!
నీ ప్రియసమాగమన మాసన్నమగు ఆ తరుణాన
నా భావామృతాన్ని వర్షించగా
ఈ కవనపుష్పాలు పూయిస్తుంది మరి!
ఈ తెలుగు వెలుగుల జాణ
నా ఆశల మొలకలు చూసి
నివ్వెరపోయిన బృందావనాలు
ఔరా అంటూ మేళమాడుతున్నాయి
వాటికేం తెలుసు కలే వరమై కళ్ళెదుట నిలుస్తుందని!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!