అంతా శుభమే

(అంశం:”అపశకునం”) 

అంతా శుభమే

రచన ::లోడె రాములు

“సార్.. శివ్వన్నగూడెం బస్సు పోయిందా..ఎప్పుడొస్తదో ..?”
“అట్ల కూర్చో అమ్మ.. గంటసేపట్ల వస్తది.,నేను కూడా ఆ బస్సు కోసమే చూస్తున్న..”
“జర చెప్పు సార్.. నాకు సదువు రాదు..”
“అట్లనే చెప్తా..నిమ్మలంగా కుసో.. అమ్మ..ఏ ఊరమ్మా శివన్నగూడెం దగ్గర..?
ఖాళీగా కూర్చున్న కదా.. మాటల్లో పడ్డాం..
తన పేరు లక్ష్మమ్మ అని..తన భర్త తాటి చెట్టుపై నుండి ప్రమాద వేశాత్తు పడి మరణించడాని, తన అత్తా మామలకు ఒక్కడే కొడుకని,
కనీసం మా కొడుక్కన్నా సంతానం ఎక్కువ కలగాలని కొడుకుల కోసం
మేము కంటూ పోయాం..అని క్లుప్తంగా చెప్పింది..
“ఏడ్డిగా ఐదుగురు బిడ్డల్నే ఇచ్చాడు దేవుడు… మా చిన్నది మూడేళ్లు ఉండగా తాడు జారిపడి ..చనిపోయిండు..”
వాళ్ళాయన గుర్తుకొచ్చి కన్నీళ్ల పర్యంతం అయ్యింది..
“అయ్యో… ఊర్కో అమ్మా.. కొన్ని మంచి నీళ్లు తాగు “..
“కన్న కష్టం పడ్డ.. అయ్యా..
నా ఐదుగురు ఆడపిల్లల్ని వేసుకొని..”
“ఊళ్ల ఏమైనా భూమి ఉందా…?”
“ఒక్క ఎకరం ఉందిసార్. అది పాలోళ్ల పంచాయతి తెగనిస్త లేరు,
పొందనిస్త లేరు..”
“పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఏమైనా…!”
“అందరి పెళ్లిళ్లు చేసిన సారూ.. దేవుని దయవల్ల.. నా పిల్లలూ, నేనూ రెక్కలు ముక్కలు చేసుకొన్నం”
“ఐదుగురి పెళ్లిళ్లు చేశావా…??”
“నా మొగుడు పోయినంక ఊర్ల, అయినమ్మా , కానమ్మా..ఎప్పుడు ఎట్లా..బతుకుతావో, పిల్లల్ని ఎట్లా సాదుకుంటావో !!.. అని బాధపడేటోళ్ళు కొందరైతే..పొద్దున్నే నా మొఖం మీదే.. ముండమోసింది, అపశకునంలా..అడ్డొచ్చిందని తిట్టే వాళ్లు కొందరు,. మొన్నటి దాకా కడుపునిండా కనుక్కున్నావు నిండు ముత్తయిదువవు లచ్చుమమ్మా , అని ఏ శుభ కార్యానికైనా బొట్టుపెట్టి బతిమిలాడినోళ్లే.. ఇలా..అంటుంటే అది నా తప్పా.. అని ఏడ్చేదాన్ని…”
“లోకం తీరే అంత.. అమ్మా..! ఉన్నప్పుడు ఒకతీరు.. లేకుంటే ఒకతీరు.. నరం లేని నాలుక..ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు.. వాళ్లు ఆర్చేవాళ్లు కాదు.. తీర్చే వాళ్లు కాదు.. వాళ్లు మారరు.. వదిలెయ్యాలే.. వెనకా ముందు ఎవ్వరమైనా.. పోయేవాళ్ళమే కదా…””
“గట్లనే అనుకున్న సారూ.. ఇక ఈ ఊళ్లే ఉంటే, పూలమ్మిన దగ్గర కట్టెలు అమ్మలేను.. అని ఐదుగురు పిల్లల్ని తీసుకొని గీ పట్నం వచ్చిన.. నా పరిస్థితి చూసినోళ్లు, ఓ గుడిసె లో ఉండమని, పిల్లల్ని సర్కార్ బళ్ళకు పంపుకుంటూ, నేను చుట్టుపక్కల ఇండ్లల్ల నమ్మకంగా పనిజేసుకుంటుంటే.. మెల్ల మెల్లగా ధైర్యం వచ్చింది.. నా బాధ చూడలేక పెద్దబిడ్డ ఏడు దాక సదివి ఆపేసి, నాకు తోడుగా పనిలోకి వస్తుంటే, కొద్ది రోజులకు, నీలాంటి సారూ.. వాళ్ల ఆఫీస్ ల పని ఇచ్చిండు.. గట్లనే అందరు పిల్లలు
ఏడు, ఎనిమిది దాకనే చదివిండ్రు, నాకు చేదోడువాదోడుగా,కంపిన్లల్లా, ఇండ్లల్లా, షాప్ లల్లా, దినమంతా కస్టపడి బతికాం..కానీ చిన్నదాన్ని పదిదాకా సదివించిన..”
తన బాధను కథగా చెబుతుంటే ఆశ్చర్యం వేస్తుంది.. తల్లికి తగ్గ పిల్లలు. తల్లి వారిని ఎంత పద్దతిగా పెంచింది.. ఆమె చెబుతుంటే శ్రద్దగా వింటున్నా.. ఆమెకు కూడా తన బరువును దించుకుంటున్నంత తేలిక పడుతుందేమో మనసు..
“ఇక పిల్లల పెళ్లిళ్లు ఎలా చేశావమ్మా..”
“అయ్యా.. పిల్లలు ఒకరెంక ఒకరు ఎదుగుతుంటే, నా మనసున భయం జొర్రబడ్డది, అంతా ఆ శివయ్య మీదే భారం వేసిన, ఎట్లనన్నా నా పిల్లల పెండ్లిళ్లు చెయ్యాలె.. నా కష్టం.. పిల్లల కష్టం పోగేస్తే ఖర్చుల వరకు ఎల్లదీస్తా, ఈ కట్నాలు, కానుకలు ఎట్లా,అనే మనసున రంది ఉండే..”
“ఈ రోజుల్ల ఏసోంటోడి కైనా కట్నాలే కావాల్నాయే..”
“అవును..గానీ సారూ.. నా పిల్లల అదృష్టమో ఏమో, ఆ కష్టం రాలే..”
నాకు ఇంకా ఇంట్రెస్ట్ గా
అనిపించింది..
“అదేట్లా…”
“ముందుగాల ఓ సంబంధం మా పెద్ద బిడ్డను సూస్తానికి వచ్చిండ్రు..
మొదటే..చెప్పిన నా పిల్లలు,నా పరిస్థితి,మీకు నచ్చితేనే రాండ్రి అని
పెద్దదాన్ని చూసిండ్రు.. ఏం
చెప్పకుండా పోతుంటే..గిదేందీ అయ్యా మా ఇజ్జత్ తీయొద్దు..
ఎదున్నా ఇక్కడే జెప్పుండ్రి.. అని గట్టిగా అడిగిన..మెల్లగా మా ఇయ్యపురాలు నా చెవిలా “‘పెద్దమ్మాయి కన్నా..మీ రెండో బిడ్డ మావాడికి నచ్చిందట.. ఈ మాట నీ కెలా చెప్పాలా అని మాలో మేమే తర్జనభర్జన పడుతున్నం..”‘అని చెవిల ఊదింది..”
“అరే…!!”
“నోరెళ్ల పెట్టిన..అంతలోనే మనసును సమ్లాయించుకున్న.. వాళ్ళను జరసేపు కూసోండ్రి, అని జెప్పి ఇంట్లకు నా పెద్ద బిడ్డను, రెండో బిడ్డను పిల్సుకొని, ఎట్ల జేద్దాం బిడ్డా.. ఆల్లు గట్లంటుండ్రు అని జెప్పిన..’ నీ ఇష్టం అమ్మా.. నువ్వెట్ల జెప్తే అట్లా..’ అన్నరు.. నాకు ఏటూ దోయక, ఇంటి పక్కనున్న నీలాంటి పెద్దమనిషిని అడిగిన .. ఆ పెద్దాయన ఒప్పేసుకో లచ్చుమమ్మ.. వాళ్ల అదృష్టం ఎట్లుంటే అట్లయితది.. అని ధైర్యం ఇచ్చిండు.. సరే అని ఆ సంబంధం ఖాయం చేసి పెళ్లిజేసిన”
కొద్ది సేపు ఊపిరి తీసుకుంది..
నేనూ ఓ నిట్టూర్పు వదిలాను..మళ్లీ అందుకుంది..
“మా అల్లుడూ, వాళ్ల కుటుంబం సల్లగుండా, ఆస్తులు పాస్తులు పెద్దగా లేవు గానీ బంగారం లాంటి మనుషులు, ఇంటిల్లాదులు కష్ట పడి బతుకుతున్నారు.. నా బిడ్డను ప్రేమగా చూసుకుంటున్నారు.. మళ్లా ఏడాదికి పెద్ద బిడ్డ పెళ్లి గూడా చేసిన, అట్లనే అందరి పెళ్లిళ్లు అయినయి.. ఇప్పుడు నాకు ఐదుగురు మనవళ్లు, ముగ్గురు మనవరాండ్లు…”అని సంతోషంగా తన ఆస్తులు వాళ్లే అన్నట్లుగా ధీమాగా అంది.. ఆమె కళ్లల్లో అనిర్వచనీయమైన ఆనందం..
నాకూ సంతోషమనిపించింది..
“నీవు గెలిచావమ్మా..మా లాంటోళ్లకు చెంప పెట్టమ్మా..”
“నేనూ నా పిల్లలు శానా కష్టపడ్డం సార్… మా కష్టానికి తగ్గట్టుగా మా అల్లుళ్లు మంచోళ్లు.. వాళ్లు అల్లుళ్లు కాదు నా కొడుకుల కన్నా, ఎక్కువ
ఇప్పుడే లోటు లేదు
సార్..ఇంటికాడ ఉన్నప్పుడు ఏదో పనికి పోత..ఈ మనవలు, మనవరాండ్ల తోనే కాలం గడుస్తుంది.. వాళ్లకన్నా నాకేం కావాలి..”
“నిన్ను అపశకునం.. అన్నోళ్లంతా”
“అవును..సారూ.. ఇప్పుడు నన్ను చూసి కుళ్లుకునే వాళ్లున్నారు.. మెచ్చుకునేలా వాళ్లున్నారు.. నేనేం పట్టించుకోను సార్.. నా నిజాయితీ నావెంటే.. నా అదృష్టాన్ని ఎవ్వరూ గుంజుకోలేరు.. ఇంతే అనుకుంట సార్..””
అంతలోనే బస్సు వచ్చింది..
నాకు ఇప్పుడు ఆమె మీద గౌరవం పెరిగింది.. ప్రయాణికులు రద్దీగా ఉన్నారు. సీట్లు దొరకడం కష్టం నేను ముందు ముందు వెళ్లి ఒక సీటు సంపాదించ గలిగాను. బస్సంతా ఫుల్ అయ్యింది.. లక్ష్మమ్మ కు సీటు దొరకలేదు.. తనని పిలిచి నా సీటు ఇచ్చాను.
ఆమె నా దృష్టిలో ఒక కీర్తి శిఖరం..
ఆమె ఒక పూర్ణకుంభం.. తాను ఎదురోస్తే అంతా శుభమే…
చేతులెత్తి నమస్కరించు కొన్నాను
మనస్సులో..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!