నమ్మకం

(అంశం:”అపశకునం”) 

నమ్మకం

రచన :: సావిత్రి కోవూరు 

“అమ్మ ఎగ్జామ్ కి టైం అయింది నేను వెళుతున్నాను  డోర్ వేసుకో” అన్నాడు పృథ్వీ.

“అరేయ్, ఆగరా నేను వస్తున్నాను” అన్నది స్వర్ణ.

“అమ్మ నాకు టైం అయిపోతుంది. ఈ కాలంలో కూడా ఏంటి మమ్మీ ఈ మూడ నమ్మకాలు. నేను ఎనిమిదింటి లోపు అక్కడ ఉండాలి. లేకపోతే గేటు మూసేస్తారు. ఎంట్రెన్స్  రాయనివ్వరమ్మా.”

“ఆగు ఆగు ఒక్క నిమిషం వచ్చేస్తున్న”అన్నది స్వర్ణ.

“అబ్బా  లేటయింది తొందరగా రామ్మా” అని గబగబ వెళ్ళి క్యాబ్ ఎక్కాడు పృధ్వీ బిట్స్ ఎంట్రన్స్ రాయడానికి.

వాళ్ళు ఉండేదేమో హైటెక్ సిటీ లో, సెంటర్ ఏమో నాచారం నోమ ఫంక్షన్ హాల్ లో. అంతదూరం వెళ్లాలంటే, పాపం రెండు గంటల ముందు బయలుదేరి,  ఆ ట్రాఫిక్ ను దాటుకుని హాల్ కి వెళ్ళేసరికి పూర్తిగా మానసికంగా అలసి పోయాడు పృధ్వీ. అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళి పిల్లలు పరీక్షలు రాయాలంటే ఎంత కష్టమో ఆ భగవంతుడికే తెలుసు. ఎలాగో హాల్ కు చేరుకుని పరీక్ష రాయడానికి సిద్ధమయ్యాడు. ప్రశ్నలన్నీ చదివినవే కానీ, టైం సరిపోక అంత బాగా  రాయలేకపోయాడు.

వికలమైన మనస్సుతో ఇంటికొచ్చేసాడు. రాగానే తల్లి “ఏరా ఎలా రాశావు” అని అడిగింది.

” అంత బాగా రాయలేదమ్మా. నాకు హోప్ లేదు” అన్నాడు డల్ గా పృధ్వీ.

“పోనీలేరా ఇంకోటి సాట్ ఉంది కదా. దానికి బాగా చదువు నాలుగు రోజులుందిగా” అన్నది స్వర్ణ.

“చదువుతానులే అనుకుంటూ రూం లోకి వెళ్ళిపోయాడు.”

సంవత్సరం నుండి, చదివే ఒక యజ్ఞంలా చదువుతున్నాడు. వాడు పుట్టక ముందు రామకృష్ణ పదేళ్ళు అమెరికాలో ఉద్యోగం చేశాడు. పృధ్వీ అక్కడే పుట్టాడు. సాట్ ఎన్నారై కోటాలో  ఫీజ్ రెండింతలు ఉంటది. బిట్స్ స్కోరు మంచిగా వస్తే ఫీజు తక్కువగా ఉంటుంది. లేకపోతే రెండింతల ఫీజు కట్టాల్సిందే. అంత డబ్బు కట్టాలంటే ఎవరికైన కష్టమే. అందుకని చాలా కష్టపడుతూనే ఉన్నాడు. అసలు తన రూమ్ లో నుంచి బయటికి రావట్లేదు. వాడిని చూస్తే చాలా జాలి అనిపిస్తోంది.

మళ్లీ నాలుగు రోజులకు రాయాల్సిన పరీక్షకు బాగా చదివాడు. స్వర్ణ హడావుడి అంతా ఇంతా కాదు. గుళ్ళకు తిరగడం, పూజలు, నోములు చేయడం ఎన్నో చేస్తుంది. కొడుకుకి మంచి స్కోర్ రావాలని. చివరకు పరీక్ష రోజు రానే వచ్చింది.

ఇప్పుడు పిల్లల పై కక్ష తీర్చుకుంటున్నట్టు సిటీ అంత దాటి, చిలుకూరు దాటి మొయినాబాద్ లో వున్న కాలేజి ‘సెంటర్’ వేశారు. ఎగ్జామ్ మూడు గంటల నుండి ఆరు గంటల వరకు. ఇంటి నుంచి మూడు గంటలు ముందు బయలుదేరాల్సి ఉంటుంది. కాబట్టి  కొడుకును తీసుకు పోవడానికి రామకృష్ణ లీవ్ పెట్టాడు. మూడింటికి పరీక్ష అయితే పన్నెండింటికి బయలుదేరారు.

కరెక్ట్ గా బయల్దేరేముందు ఎక్కడ నుంచి వచ్చిందో ఒక నల్ల పిల్లి ఎదురొచ్చింది.  అంతేకాకుండా కాలు బయటపెట్టే టైం కి ‘హాచ్’ అని తుమ్మాడు పృథ్వి. అదంతా చూస్తున్నా స్వర్ణ అరేయ్ చూస్తూ చూస్తూ పిల్లి ఎదురైతే ఎలా వెళ్తావ్ రా. అది కాకుండా వెళ్లే ముందు తుమ్మితివి. ప్లీజ్ రా లోపలికి వచ్చి కాసేపు కూర్చుని, మంచి నీళ్ళు తాగి వెళ్ళురా” అన్నది.

“పోమ్మా మొన్న కూడా అలాగే చేశావు. టెన్షన్ తో స్పీడ్ గ రాయలేక పోయాను. టైం సరిపోక పరీక్ష బాగా రాయలేదు. ఈరోజు జలుబుతో తుమ్మితే కూడ అపశకునం అంటావు. నీవు ఇంకేమి చెప్పకు. మేము వెళ్లి పోతున్నాం” అని తండ్రీ కొడుకులిద్దరూ కారెక్కి వెళ్లిపోయారు.

స్వర్ణకు వాళ్ళు వెళ్ళినప్పటి నుండి మనసంతా  కలతతో  ఎప్పుడు ఏ వార్త వింటానా అని భయపడుతూనే ఉంది. అందరి దేవుళ్ళకి మొక్కుతూ కూర్చుంది. ఇక ఏడుపొక్కటే తక్కువ.

ఏం చేయాలో తోచక తల్లికి ఫోన్ చేసి “అమ్మా చూడమ్మా నీ మనవడు అల్లుడు ఎంత చెబుతున్నా వినకుండా, పిల్లి అడ్డం వచ్చినా నామాట వినకుండ అలాగే వెళ్ళిపోయారు. పైగా పూర్తిగ వెళ్ళే ముందు వాడు తుమ్మినా, కాసేపు కూర్చుని వెళ్ళమంటే వినకుండా వెళ్లిపోయారు. నాకు చాలా భయంగా ఉంది” అని చెప్పింది.

తల్లి అంజనమ్మ “వీళ్ళు రోజురోజుకు పెద్దల మాటలకు విలువ ఇవ్వడం మానేశారు. పరీక్షలది ఏముంది ఇప్పుడు కాకపోతే మళ్ళీ రాసుకోవచ్చు. కానీ ఏమైనా ప్రమాదం జరిగితే ఎంత కష్టం” అన్నది.

“అదేనమ్మా నాకు కాళ్ళూ చేతులు ఆడటం లేదు. మామూలుగా అయితే ఈపాటికి రావాలి. ఇంకా రాలేదు. నేనేం చేయాలమ్మా” అని ఏడవటం మొదలు పెట్టింది స్వర్ణ.

“నీవు ఏడవకే ఏమి అవ్వదు. అంతా భగవంతుడే చూసుకుంటాడు. నీవు ధైర్యంగా ఉండు.పోని నన్ను రమ్మంటావా? ఒంటరిగా వుంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి.” అన్నది అంజనమ్మ.

“అమ్మ వీళ్లు వచ్చినట్టున్నారు. నేను తర్వాత ఫోన్ చేస్తాను” అని ఫోన్ పెట్టేసి, ఇంటి ముందుకు పరిగెత్తుకొచ్చేసరికి తండ్రి కొడుకులు ఇద్దరు నవ్వుకుంటూ లోపలికి వస్తున్నారు. వాళ్ళను అలా చూసే సరికి ప్రాణం కుదుటపడింది స్వర్ణకి.

“వచ్చారా అబ్బా ఎంత భయపడుతున్నాను మీరు వెళ్ళినప్పటి నుండి, మీరు క్షేమంగా వచ్చారు అంతే చాలు” అన్నది తేలికైన మనసుతో.

అయినా “మీరేంటి ఆరింటికి పరీక్ష అయిపోతే ఇంత లేటుగా వచ్చారు” అన్నది.

“పక్కనే చిలుకూరు కదా, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వచ్చాము. లేకపోతే ఇంటికి వచ్చినాక మళ్లీ, అంత దూరం వెళ్ళి, స్వామిని దర్శించుకుని రాలేదు. ఏమి జరుగుతుందో ఏమో అని నువ్వు భయపడతావు”  అన్నాడు రామకృష్ణ నవ్వుతూ.

“మీకన్నీ వేళాకోళంగానే ఉంటాయి. ఇంతకీ వాడు ఎంట్రెన్స్ ఎలా వ్రాశాడు” అన్నది స్వర్ణ.

“బ్రహ్మాండంగా వ్రాశానమ్మా. ఎందుకంటే పిల్లి ఎదురు వచ్చింది కదా. నాకు అదే మంచి శకునం అయ్యింది. తప్పకుండా సీట్ వస్తుంది” అన్నాడు తల్లిని ఉడికిస్తూ.

సరే గానీ పరీక్షలు అయిపోయినవి కదా. ఇక రేపు గుడికి వెళ్ళి, అక్కడి నుండి సినిమాకి వెళ్ళి, డిన్నర్ బయటనే చేసుకుని వద్దాం. అబ్బా నాకే పరీక్షలన్నంత టెన్షన్ ఫీల్ అయ్యాను రా. ఇప్పుడు హాయిగా ఉంది. ఇంకా ఏమీ మాట్లాడకుండా రేపంతా నేను చెప్పినట్టు వినండి ఇద్దరు”  అన్నది.

‘సరేలే ఇంక వాడిని వదిలేయ్. టీవీలో క్రికెట్ మ్యాచ్ చూసుకుంటాడు. పాపం సంవత్సరం నుండి వాడి సరదాలన్ని చంపుకున్నాడు”అన్నాడు రామకృష్ణ.

రెండో రోజు ముగ్గురు సినిమాకు వెళ్లడానికి సిద్ధమై బయటకు వచ్చే ముందర రెండు సార్లు చెక్ చేసుకుని వచ్చింది స్వర్ణ. మళ్లీ పిల్లి ఏదైనా ఎదురు వస్తుందేమోనని, రాహుకాలం లేకుండా చూసుకుని మంచి ముహూర్తం లోనే బయలుదేరారు. సినిమా చూసి, రెస్టారెంట్ కి వెళ్ళి డిన్నర్ చేసుకుని ఇంటికి బయలు దేరారు. కొంతదూరం వెళ్ళగానే  కారుకు అడ్డంగా ఒక కుక్క వచ్చింది. రామకృష్ణ కారును సడన్ గా పక్కకు తిప్పాడు. అక్కడ డివైడర్ కు కారు గుద్దుకొని ముందర బెల్ట్ పెట్టుకోకుండా కూర్చున్నా పృధ్వీ మోకాళ్ళు గుద్దుకొన్నాయి. స్వర్ణ తలకు కొంచెం దెబ్బలు తగిలాయి. రామకృష్ణ కారుని చాల నెమ్మదిగా నడుపుతున్నాడు కనుక ఎక్కువ దెబ్బలు తగల్లేదు. ఇద్దరినీ హాస్పటల్లో ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని ఇంటికి వచ్చారు. మూడు నెలలకి నొప్పంతా తగ్గి మామూలు మనుషులు అయ్యారు.

“అమ్మా అపశకునాలు అని మనసంత పాడు చేసుకోకు. నేను పరీక్షకు వెళ్ళేటపుడు పిల్లి అడ్డం వచ్చినా ఆ రోజు ఏమి జరగకుండా క్షేమంగా ఇంటికి వచ్చాము. అన్నీ శకునాలు చూసుకుని సినిమాకు బయలుదేరితే అనుకోకుండా ఆక్సిడెంట్ అయింది. కనుక ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలని నమ్మడం ఆపేసేయ్” అన్నాడు పృధ్వీ.

“అవునురా ఇప్పటి నుండి ఇలాంటి నమ్మకాలను  తుడిచేస్తాను. మన జాగ్రత్తలో మనం ఉండాలి కానీ మూఢ నమ్మకాలతో మనశ్శాంతిని పోగొట్టుకోకూడదు అని తెలుసుకున్నాను.అయినా అన్ని మంచి శకునాలు చూసుకుని వెళ్ళినందుకే కొంచెం దెబ్బలతో పోయిందేమొ” అన్నది స్వర్ణ.

“అరే పృధ్వీ మీ అమ్మను మార్చడం ఆమెను పుట్టించిన ఆ బ్రహ్మ తరం కూడ కాదు.మనమెంత చెప్పు” అని రామకృష్ణ అనగానే తల్లీ కొడుకులు నవ్వడం మొదలు పెట్టారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!