ఆరోగ్యం

ఆరోగ్యం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)  

రచన: సావిత్రి కోవూరు 

        “లాస్య ఐదవుతుంది. లేచి చదువుకో” అన్నది రవళి. “అమ్మా ఇంకా కాసేపు పడుకుంటానమ్మా నాకు చాలా డల్ గా ఉంది” అన్నది పదోతరగతి చదువుతున్న లాస్య.”నీకు చదువుకోమంటే ఎప్పుడు డల్ గానే ఉంటది. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. కొంచెం కూడా తెలివి లేదు. ఈమధ్య స్కూల్ కు కూడా తరచుగా మానేస్తున్నావు. ఇట్లా అయితే మంచి మార్కులు ఎలా వస్తాయి. టెన్త్ లో మంచి మార్కులు రాకపోతే ఇంటర్ కు మంచి కాలేజీలో సీటు దొరకదు. అయినా నైన్త్ క్లాస్ వరకు బాగానే చదువుకున్నావు కదా.  మరి టెన్త్ క్లాస్ కి వచ్చాక ఎందుకు ఇలా చేస్తున్నావ్. ఎప్పుడు చూసినా డల్గా పడుకుంటావు. చదువు పూర్తిగా మానేశావ్” అన్నది రవళి.”ఏమైంది ఉదయమే దాన్ని కోప్పడుతున్నావు. కాసేపు పడుకోని డల్ గా ఉంది అంటుంది కద” అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చినా శ్రీధర్. “అవునండి నేను కోప్పడుతున్నదే కనబడుతుంది మీకు. అదేం చేస్తుందో మీకేం కనిపించట్లేదు. నేనేమాట  చెప్పినా వినటం లేదు. తిండి పూర్తిగా మానేసింది. ఎలా పెట్టిన బాక్స్ అలాగే తీసుకొచ్చేస్తుంది. చదువు అసలు చదవట్లేదు టెంత్ క్లాసు లో ఇలాగైతే ఎలాగండి. ఎప్పుడు చూసినా పడుకొని ఉంటుంది. మధ్య మధ్యలో స్కూల్ కూడ మానేస్తుంది. చాలా తక్కువ మార్కులొస్తున్నాయి. మొన్న వాళ్ళ టీచర్ కనబడి దీనికి చదువుపై పూర్తిగా శ్రద్ధ తగ్గిపోయిందన్నది.
మీరేమో అసలు పట్టించుకోవట్లేదు. నేను ఎంత చెప్పినా దాని చెవికెక్కట్లేదు. నన్ను ఏం చేయమంటారు” అన్నది రవళి బాధగా.
ఈ లోపల లాస్య లేచి లోపలికెళ్ళి రెడీ అయ్యి వచ్చి బ్యాగ్ తీసుకుని “అమ్మా నేను స్కూల్ కి వెళ్తున్నాను” అన్నది. అది కాదమ్మా ఇలా రా. ఏమైంది నీకు ఎందుకు అలా ఉంటున్నవు. ఒంట్లో బాగలేదా. జ్వరంగా ఉందా” అని శ్రీధర్ కూతురి నుదుటిపై చేయి పెట్టి చూస్తుండగానే లాస్య నేలపై పడిపోయింది. ఇద్దరు గట్టిగా పిలుస్తూ లేవదీసి వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఎంతో సేపు లాస్య లేదు. ఉలుకు పలుకు లేదు. “దాని పరిస్థితి ఏమిటో తెలియకుండా చదువు తప్పించుకోవడానికే అలా చేస్తుందని ఈ మధ్యన రోజు కోప్పడుతున్నానండి. నాకేం తెలుసు అది నిజంగానే ఇబ్బంది పడుతుందని. అసలు ఏమైందండి  నా తల్లికి. అది చదవక పోయినా పర్వాలేదు. క్షేమంగా ఉంటే చాలు దేవుడా. ఇప్పుడు నేనేం చేయను” అని గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది రవళి.
“చూడు రవళి నీవు మొదట ఏడుపు మానెయి. మొన్నటి వరకు మంచిగా చదువుకున్న పిల్ల ఈ మధ్యన చదవట్లేదు అంటే శారీరకంగానో మానసికంగానో ఏదో ఇబ్బంది పడుతుందనే కదా అర్థం. తల్లివి నీవే అర్థం చేసుకోకపోతే కోప్పడితే ఇంకెవరికి చెప్పుకుంటుంది. నీవు కోప్పడుతున్నావని ఒంట్లో బాగా లేకపోయినా స్కూల్ కి వెళుతుంది అది. అసలు దాని ప్రాబ్లం ఏంటని దగ్గర కూర్చోబెట్టుకొని వివరంగా అడగాలి కదా” అన్నాడు శ్రీధర్. “అవునండి ఎంతసేపు అందరి పిల్లలు బాగా చదువుకుంటున్నారు. మనమ్మాయే చదవటం లేదని బాధపడి దాని పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా రాక్షసిలా ప్రవర్తించాను. చాల తప్పుగ ప్రవర్తించాను. అసలు దానికి ఏమైందో ఏమో అని మళ్ళీ ఏడవడం మొదలు పెట్టింది రవళి. హాస్పిటల్ లో లాస్యని లోపలికి తీసుకెళ్లి అన్ని టెస్ట్ చేసిన డాక్టర్ “ఈ పిల్ల అసలు తిండి తింటుందా. ఇంత బలహీనంగా ఉంది. రక్తం పరీక్షకు పంపిచాంము. రిపోర్ట్ వస్తేగాని ఏ విషయం తెలియదు” అన్నాడు. టెస్ట్ రిపోర్ట్ చూసిన డాక్టర్ “రక్తంలో హిమోగ్లోబిన్ పూర్తిగా తగ్గిపోయింది. అందువల్లనే ఈ అమ్మాయి చాలా బలహీనంగా ఉన్నది. అందుకే అలిసిపోయి  డల్ గా ఉంటుంది. ఇంకా కొన్ని రోజులు అలాగే నిర్లక్ష్యం చేస్తే చాలా కష్టం అయ్యేది. పిల్లల విషయంలో చదువు ఒక్కటే ముఖ్యము కాదండి. ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కాలంలో తల్లిదండ్రులందరూ పిల్లలు ఏం తింటున్నారు, సరిగ్గా ఆహారం తీసుకుంటున్నారా లేద చూసుకోవట్లేదు. ఎదిగే పిల్లలకు కావలసిన పౌష్టికాహారం విషయంలో శ్రద్ధ చూపటం లేదు. మేము సమయానికి బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్ ఇస్తున్నాం కదా మా బాధ్యత తీరిపోయింది అనుకుంటారు. అలా కాకుండా మీరు ఇచ్చే ఆహారంలో వారికి కావలసిన పోషకాలు ఉన్నాయా చూసుకోవాలి. లేకపోతే ఇలాగే పిల్లలు పూర్తిగా అనారోగ్యం పాలవుతారు. ఇప్పుడైన ఆ అమ్మాయికి బీట్ రూట్రసము, దానిమ్మ పండ్ల రసము, పాలకూర, తేనె, పాలు పండ్లు రెగ్యులర్గా ఇవ్వండి హిమోగ్లోబిన్ స్థాయి పెరిగి ఆరోగ్యంగా ఉంటది” అన్నాడు.”ఇప్పటినుంచి మీరు చెప్పినట్టే చేస్తాము డాక్టర్. ఎలాంటి పొరపాటు జరగకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటాము  మా అమ్మాయిని” అని ఇంటి ముఖం పట్టారు రవళి దంపతులు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!