బహుమతి

అంశం: బాలవాక్కు బ్రహ్మవాక్కు

బహుమతి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: శ్రీదేవి విన్నకోట

మనం ఇటువంటి వస్తువును బహుమతిగా ఇస్తే చాలా బాగుంటుంది శశి అన్నాడు అక్షయ్ గోడకున్న వాల్ క్లాక్ ని చూపిస్తూ, శశి అక్షయ్ భార్య భర్తలు, వాళ్ళ పన్నెండవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వాళ్ళ ఇంట్లో పది రోజుల్లో వివాహ వార్షికోత్సవ వేడుక జరగబోతుంది.దాని గురించే భార్యభర్తలు ఇద్దరు చాలా సేపటినుంచి మాట్లాడుకుంటున్నారు.
రిటర్న్ గిఫ్ట్ గా ఏమి ఇవ్వాలి ఫంక్షన్ కి వచ్చినవారికి అని, శశి గాజు బౌల్స్ లాంటివి కానీ లేదా ఏమైనా డెకరేటివ్ ఐటమ్స్ గాని ఇద్దాము అంటోంది, కానీ అక్షయ్ ఏదైనా ఇంట్లోకి ఉపయోగపడే వస్తువు ఇస్తే బెటర్ అంటున్నాడు,  ఏమి ఇవ్వాలో తెలియక ఇద్దరూ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు, ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే ఇవ్వాలని లేదు ఇద్దరికీ, ఒకరు చెప్పింది మరొకరికి నచ్చట్లేదు, అలా వాదించుకుంటూనే ఉన్నారు చాలా సేపు.
వీళ్ళ వాదన వింటున్న అక్షయ్ నానమ్మ భ్రమరాంబ ఇంత చిన్న విషయానికి అంత వాదన ఎందుకు మనవడా ఏదో ఒకటి ఇస్తే పోతుంది, మా కాలంలో అయితే స్టీల్ గిన్నెలు, జాకెట్ ముక్కలు, పండు తాంబూలంతో పాటు పసుపు కుంకుమ పెట్టి అపురూపంగా ఇచ్చేవాళ్ళం, ఏది ఏమైనా ఆ రోజులే భలే బాగుండేవిలే, ఎవరైనా ఇలా ఇచ్చిన వస్తువు ఎంతో గుర్తుగా భద్రంగానో  దాచుకునే వాళ్ళము, అంటూ చెప్పడం ఆపింది,
ఇప్పుడు అలా స్టీలు గిన్నెలు అవి ఇస్తే నవ్వుతారు అమ్మమ్మ అంది శశి,
ఎందుకు నవ్వుతారే అమ్మాయి ఇంట్లో ఉపయోగపడే వస్తువులే కదా అవి కూడా అని ఆశ్చర్యంగా అడిగింది బ్రమరాంబ.
కాలం మారిందిలే నానమ్మ మారుతున్న కాలంతోపాటు మనం కూడా మారాలి, ఏమైనా కొత్తగా ఆలోచించాలి అన్నాడు అక్షయ్ చిన్నగా నవ్వుతూ.
వీళ్ళ మాటలు గొడవ అన్ని గమనిస్తున్న శశి అక్షయ్ ల పదేళ్ల కూతురు పూర్ణ అయితే మమ్మీ డాడీ నాకొక ఐడియా వచ్చిందోచ్ అంటూ అరిచింది గట్టిగా.
అక్కడున్న వాళ్లు అందరూ ఏంటి చెప్పు అని అడిగారు ఉత్సాహంగా.
మరేమో కొద్ది రోజుల క్రితం మా ఫ్రెండ్ పుట్టినరోజు అయితే వాళ్ళ ఇంట్లో వాళ్లు వచ్చిన వాళ్లందరికీ పూల మొక్కలు గిఫ్ట్ గా ఇచ్చారు, మనం కూడా అలా ఇద్దాం డాడీ అని చెప్పింది ముద్దుగా.
అందరూ ఈ ఆలోచన చాలా బాగుంది, బాల వాక్కు అంటే బ్రహ్మ వాక్కు అని ఊరికే అంటారా పిల్ల చక్కని మాట చెప్పింది, అనుకున్నారు.
అక్షయ్ చెల్లెలు మహేశ్వరి మాట్లాడుతూ మనం వచ్చిన వారందరికీ చక్కగా ఒక చిన్న పూల మొక్కను  అందమైన కుండీ తో సహా బహుమతిగా ఇస్తే చాలా బాగుంటుంది, ఏం మొక్క ఇవ్వాలి అనేది మీ ఇష్టం, తులసి మొక్క అయినా పూజ చేసుకోవడానికి ఔషధపరంగా చాలా బాగుంటుంది అందరికీ ఉపయోగ పడుతుంది. తులసి మొక్క మీదుగా  వచ్చే గాలి ఎన్నో రోగాలను నయం చేస్తుంది, మన చిట్టి తల్లి పూర్ణ చెప్పినట్టుగా రిటర్న్ గిఫ్ట్ మొక్క అయితే మంచిది అని నా ఉద్దేశం, ఇలా రిటర్న్ గిఫ్ట్ గా పూల మొక్కలు కూడా బానే ఉంటాయి, నేను చెప్పడం వరకే, ఆపై మీ ఇష్టం ఏమొక్క ఇవ్వాలి అనేది మీరే ఆలోచించుకోనీ, మంచి నిర్ణయం తీసుకోండి అన్నయ్య వదిన అంది మహేశ్వరి.
ఇంట్లో ఉన్న అందరూ ఈ ఆలోచనకు ఓటేశారు పెద్ద వాళ్ళతో సహా అందరూ చిన్నారి పూర్ణ ను బాగా మెచ్చుకున్నారు, చాలా మంచి మాట చెప్పావు అని, అక్షయ్, శశికి కూడా ఈ ఆలోచన చాలా బాగా నచ్చింది, నిజంగా ఇది చాలా మంచి ఆలోచన మొక్కలు అంటే ఇష్టం లేని వారికి కూడా మనం ఇలా ఒక మొక్కను బహుమతిగా ఇస్తే ఖచ్చితంగా ఆ మొక్కను జాగ్రత్తగా పెంచాలి అనిపిస్తుంది, ఒకటి పెంచితే దానికి తోడు మరొకటి పెంచాలనే ఆలోచన కలుగుతుంది అలా మరొకటి మరొకటి అంటూ మనం పెంచే మొక్కలు సంఖ్య అలా పెరుగుతుంది, ఈ రోజుల్లో మనకి మంచి ఆక్సిజన్ ఎంత అవసరమో అందరికీ తెలిసిందే కదా. ఈ కరోనా కాలంలో ఆక్సిజన్ దొరకక ఎంత మంది ప్రాణాలు పోయేయో మనం చూస్తూ, వింటూ ఎంతో బాధకి గురవుతూనే ఉన్నాము, మనం తప్పకుండా ఇలానే చేద్దాము నిజంగా మన పూర్ణ చాలా తెలివైనది మంచి ఐడియా ఇచ్చింది అన్నాడు సంతోషంగా అక్షయ్ నవ్వుతూ.
ఇంతలో భ్రమరాంబ అందుకుని అలాగే చేయండిరా, మనవడా,ఆ పచ్చని మొక్కలాగా మీ సంసారం కూడా ఎంతో పచ్చగా దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది,
ఆ మొక్కను చూసినప్పుడల్లా తీసుకున్న వాళ్ళకి మీ ఇద్దరు దంపతులు గుర్తుకొస్తారు, అలా వాళ్ల ఆశీర్వాదాలు మీకు మరింతగా లభిస్తాయి, అనడంతో అందరూ సంతోషంగా నవ్వేశారు,
ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏం మొక్కలు ఇవ్వాలి పూల మొక్కలా లేక ఇంకేమైనా ఔషధ మొక్కలు ఇవ్వాలా, ఒక్కో ఐటమ్ ఎంత రేటు పడుతుంది, మొక్క తో పాటు ఎలాంటి అందమైన కుండీలు కొంటె బాగుంటుంది,అనే దశలో సాగుతుంది,
ఏదైతేనేం పాప వల్ల చాలా మంచి ఆలోచన వచ్చింది ఈ విషయంలో ఇక వాళ్ళు వాళ్ళు ఏం తేల్చుకుంటారో వాళ్ళ ఇష్టం, మనం వాళ్ళని ఇక వదిలేద్దాం, మొక్క ఏదైనా పచ్చదనాన్ని ఇచ్చేదే కాబట్టి, మొక్క ఏదైనా మంచిదే, తీసుకున్న వాళ్లు కూడా ఈ బహుమతి భలే ఉందే అని ఇచ్చిన వారిని ఖచ్చితంగా తలచుకొని మెచ్చుకునీ సంతోష పడేలా ఉంటుంది, కాదని అనగలరా ఎవరైనా, నిజంగా ఎవరు అలా అనరుగా.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!