భార్య ఒక మనిషే అర్థం చేసుకోరు

భార్య ఒక మనిషే అర్థం చేసుకోరు

రచన: శ్రీదేవి విన్నకోట

ఒసేయ్ శ్వేత ఎక్కడ చచ్చేవె, నేనొచ్చి  రెండు నిమిషాలుఅయింది.ఆఫీస్ నుంచి వచ్చిన మొగుడికి కాసిన్ని మంచి నీళ్లు అయినా తగలెద్ధాం అనే ఇంగిత జ్ఞానం ఉండక్కర్లే,మీ పుట్టింటి వాళ్ళు నీకు మొగుడ్ని ఎలా గౌరవించాలి అనేది కూడా నేర్పించలేదా,

డిగ్రీలకిడిగ్రీలు చదివేము అంటూ వచ్చేస్తారు ఎవర్ని  ఉద్ధరించడానికో మరి అంటూ ఉరుము లేని పిడుగులా సాగిపోతున్న భర్త రాజారాం తిట్ల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ శ్వేత మంచినీళ్ల గ్లాస్ తో అతని ముందుకు వచ్చింది, కళ్ళలోంచి బయటికి రాబోతున్న కన్నీటిని ఆపుకుంటూ  నీళ్ల గ్లాసు అతనిచేతికిచ్చి వంటింట్లోకి వెళ్ళిపోయింది.హు అంతా నా కర్మ ఇది ఒక మూగ మొద్దు ఎలాంటి రెస్పాన్స్ ఉండదు ఎప్పుడు చూడు ఏడుపు మొహం వేసుకుని ఉంటుంది అని మనసులో అనుకుంటూ తినడానికి ఏమైనా తగలేయవే నాకు అంటూ గట్టిగా అరిచాడు.

వంటింట్లో ఉన్న శ్వేత హడలిపోతూ ఇదిగో తెస్తున్నాను అండి అంటూ  అప్పుడే వేడి వేడిగా చేసిన పకోడీలను ప్లేట్లో వేసుకునితీసుకెళ్ళి అతనీ ముందు  టీపాయ్ మీద పెట్టింది.ఇంత వేడిగా తీసుకొచ్చి నా మొఖన కొట్టకపోతే కాస్తచల్లార పెట్టి చావొచ్చుగా అంటూ మళ్లీ తిట్ల దండకం అందుకున్నాడు. శ్వేత అతని మాటలకు వణికిపోతూ వంటింట్లోనే ఉండిపోయింది నిశ్శబ్దంగా ఏడ్చుకుంటూ.

రాజారాం శ్వేతకి  పెళ్లయి ముచ్చటగా మూడేళ్లు అవుతుంది. అతనికి కోపం చాలా ఎక్కువ పెళ్లి అయిన దగ్గర నుంచి ఇదే వరస ఎప్పుడు చూడు భార్యను తిడుతూనే ఉంటాడు. భార్య అంటే అతని దృష్టిలో
ఒక బానిస అతను చెప్పిన పనల్లా చేస్తూ అతని అవసరాలన్నీ తీరుస్తూ కుక్కిన పేనులా పడి ఉండాలి.
శ్వేత అసలే చాలా నెమ్మదస్తురాలు, ఆమె మెతకదనం మంచితనం అతనికి మరింత అలుసు అయింది.

అందుకే మరింతగా రెచ్చిపోతున్నాడు. శ్వేత అతని ప్రవర్తన గురించి అటు అమ్మ నాన్నలకు అత్తమామలకు చెప్పలేక తనలో తానే సతమతమైపోతుంది. తనకు
ఈ బానిస బ్రతుకు బ్రతకడం చాలా కష్టంగా ఉన్నా  ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సర్దుకుపోవాలి అని తన చిన్నప్పట్నుంచి అమ్మానాన్న చెప్పే మాటలు గుర్తుతెచ్చుకుంటూ  అతను మారుతాడేమో అని ఓపిక పడుతూ కాలాన్ని అలా కన్నీళ్లతో నెట్టుకొచ్చేస్తోంది శ్వేత.

ఆ రోజు ఆదివారం తీరిగ్గా పదింటికి లేచి కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నాడు రాజారాం మధ్య మధ్యలో శ్వేత మీద తిట్ల వాన కూడా కురిపిస్తునే ఉన్నాడు అలవాటుగా, ఇంతలో బయట ఆటో సౌండ్ వినిపించి బయటికి వచ్చాడు రాజారాం చెల్లెలు  జానకి ఆటో దిగి ఆటోలో ఉన్న పెద్ద సూట్ కేసు ని దింపి  ఆటో అతనికి డబ్బులు ఇచ్చి పంపించేసింది.

రాజారాం తన చెల్లెలకి ఎదురు వెళ్లి సూట్కేసు అందుకున్నాడు. ఇదేంటి ఇంత బరువు ఉంది అంటూ లోపలి తీసుకొచ్చి పెట్టాడు. బావగారు రాలేదా జాను అంటూ అడిగాడు. జానకి అన్న వంక ఒకసారి నిరసనగా చూసి హు అంటూ లోపలికి వెళ్ళిపోయింది.

ఇంతలో శ్వేత వచ్చి బాగున్నావా జానకి
అంటూ అడిగింది ఆ ఏదో బ్రతికే ఉన్నాలే అంది
పుల్లవిరుపుగా అన్నయ్య ఎలా ఉన్నారు అని అడిగింది శ్వేత మీ అన్నయ్యకి ఏం మాయ రోగం రాయిలా బాగానే ఉన్నాడు నన్ను ఏడిపించకునీ తింటూ  అంది కొట్టినట్టుగా.

రాజారాం ఆ మాటలన్నీ వింటూనే ఉన్నాడు. చెల్లెలి దగ్గరకు వచ్చి ఏమైంది జాను బావగారితో ఏమైనా గొడవ పడ్డావా అంటూ అడిగాడు. అసలు నేను గొడవపడడానికి ఎక్కడ ఉంటుంది. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి నిద్ర పోయేవరకు ఒక్క ఆఫీస్కి వెళ్ళే టైం తప్ప మిగిలిన అంతసేపు నన్ను ఏదో ఒక వంకతో తిడుతూనే ఉంటాడు ఈ విషయం ఇంతవరకూ అమ్మా నాన్నకు చాలా సార్లు చెప్పాను.

సర్దుకుపో సర్దుకుపో అని చెప్తున్నారు కానీ ఇలా ఎన్నాళ్ళు సర్దుకు పోను, ఎన్ని రోజుల బానిస బ్రతుకు బ్రతకమంటావు, నేను కాస్తో కూస్తో చదువుకున్నాను ఏదో ఒక ఉద్యోగం చేసి నాబ్రతుకు నేను బ్రతకగలను,
నన్ను ఆయన దగ్గరికి వెళ్ళమని మాత్రం చెప్పద్దు అన్నయ్య ఒకవేళ నువ్వు అలా చెప్తే నేను వెళ్లి ఏదో ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో ఉంటాను అంటూ రాజారామ్ కి మరీ మాట్లాడే అవకాశం లేకుండా కరాఖండిగా చెప్పేసింది జానకి,

రాజారాం కి ఏం చేయాలో అర్థం కాలేదు. బావ గారికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది,మళ్లీ మర్నాడు జానకితో బావగారి ప్రస్తావన తీసుకు వచ్చాడు,పోన్లే జాను ఈ ఒక్కసారికి చూడు నేను తీసుకెళ్ళతాను నిన్ను మీ ఇంటికి బావగారికి గట్టిగా వార్నింగ్ ఇస్తాను మళ్లీ మళ్లీ అలా ప్రవర్తించకుండా నిన్ను చులకనగా చూడకుండా అంటూ నచ్చచెప్పబోయాడు చాల్లే ఊరుకో అన్నయ్యా నీ ప్రవర్తన ఏమైనా సరిగా ఉందా ఏంటి వదినతో నువ్వు అంతేగా వదిన్ని పురుగు కంటే హీనంగా చూస్తావు నువ్వు బావగారికి ఏమని చెప్తావు,

ముందు నువ్వు నీ ప్రవర్తన మార్చుకుని నీ భార్యని బాగా చూసుకో తర్వాత నా మొగుడికి బుద్ధి చెబ్దువుగాని అయినా మీ మగాళ్ళకి పెళ్ళాల్లంటే బాగా లోకువ, అందుకే భార్యను హింసిస్తూ వారిపట్ల శాడిజం చూపిస్తూ ఉంటారు అంటూ నోటికొచ్చిన తిట్లు అన్ని తిట్టేసింది.తన అన్నయ్యని,

శ్వేత ప్రేక్షక పాత్ర వహించడం తప్ప మరేమీ మాట్లాడలేదు. రాజారామ్ కి శ్వేత తో తన ప్రవర్తన గుర్తొచ్చింది. తాను ఆమె పట్ల ఎంత హీనంగా ప్రవర్తించాడో  ఆమె ఎంత బాధను తనలో దాచుకుని
కుమిలిపోతుందొ అతనికి అర్థమైంది, తను ఎన్ని తిట్టినా ఎదురు సమాధానం చెప్పనీ భార్య మంచితనం  తాను చేసిన తప్పు అతనికి తెలిసొచ్చింది, చొప్పున శ్వేత దగ్గరికి వెళ్లి ఆమె రెండు చేతులు పట్టుకుని ఇన్నాళ్లు నేనుఎంతో తప్పుగా ప్రవర్తించాను నన్ను క్షమిస్తావా శ్వేత
అంటూ కన్నీళ్లతో ఎంతో ప్రేమగా అడిగాడు.

శ్వేత వెంటనే మీ నుంచి నాకు కావాల్సింది ప్రేమ అనురాగం మాత్రమే క్షమాపణలు కాదండి  నేను మీలో ఇలాంటి  మార్పే రావాలని కోరుకొన్నాను. నాకు ఇంతకు మించి మరేమీ ఏమీ అక్కర్లేదు అండి అంది ఆనందంగా కన్నీళ్లతో శ్వేత.

ఇంతలో జానకి హమ్మయ్య మాఅన్నయ్య లో మార్పు వచ్చింది, ఇక నా నటన ఆపేయవచ్చు అంటూ హాయిగా నవ్వింది. నటన ఏంటి అంటూ ఆశ్చర్యపోయాడు రాజారాం అయ్యో అన్నయ్య
మీ బావగారు దేవుడు నన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు. వదిన్ని నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, తాను ఎప్పుడూ బాధపడుతూ డల్ గా ఉండడానికి కారణం నీ ప్రవర్తనే అని నాకు ఎప్పుడో తెలుసు.

అందుకే నీకు బుద్ధి రావాలని చిన్న అబద్దం ఆడాను. భార్య అంటే  బానిస కాదు అన్నయ్య
నీ బ్రతుకు పండించి నీ వంశాన్ని వృద్ధి చేసి జీవితాంతం నీకు తోడుగా ఉండడానికి వచ్చిన మనిషి రూపంలో ఉన్న దేవతే అన్నయ్య భార్య అంటే ఉంటూ ఒక్క క్షణం ఊపిరి పీల్చుకోవడానికి ఆపింది జానకి. ఇంతలో
రాజారామ్ అమ్మ తల్లి చెల్లి నాకు బుద్ధొచ్చింది.

ఇక మీదట మీవదిన్ని పువ్వుల్లో పెట్టుకొని అంటూ
కాదు కాదు నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను సరేనా అన్నాడు శ్వేత వంక చిలిపిగా చూసి నవ్వుతూ శ్వేత భర్త మాటలకు చాలా అందంగా సిగ్గు పడింది. అది చూసి జానకి నవ్వుతూ ఈప్పుడు మీ ఇద్దరి మధ్య నేను ఎందుకు పానకంలో పుడకలా నన్ను బస్సు ఎక్కించెయ్ అన్నయ్య పాపం మీ బావగారు నేను లేక భోజనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు,

ఆయనకు ఏమీ చెప్పకుండా మాఅన్నయ్య ను చూడాలని ఉంది అని వచ్చేసాను అంటూ రాజారాం ను బస్టాండ్ కి బయల్దేరతీసింది జానకి.  ఇప్పుడే మా చెల్లిని బస్సు ఎక్కించి వస్తా బంగారం అంటూ తనకు టాటా చెప్తున్న భర్తను ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తూ రాబోయే మధురమైన కాలాన్ని నిజం కాబోతున్న తన కలల్ని  ఆశలను తిరబోయో కోరికలను తలుచుకుంటూ  సంతోషంగా ఇంట్లోకి నడిచింది శ్వేత. మనకి ఇక ఇక్కడ ఏం పని మనం కూడా వెళ్లి పోదాం పదండి మరి.😊🙏🏼

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!