భువనవిజయం

భువనవిజయం

రచన: అపర్ణ

“అమ్మా, అమ్మ! చాక్లెట్ కొనిపియ్యవా” అంటూ చీర కొంగు పట్టుకుని లాగుతూ షాప్ వైపు చూపించింది ఇదేళ్ల శ్రేయ. పర్సు ఓపెన్ చేసి చూస్తే ఇరవై రూపాయల నోటు తప్ప ఇంకేమి లేదు. ఎదురుగా షేర్ ఆటో, పిల్లకి నాకు కలిపి ఇరవై రూపాయలు తీసుకుంటాడు నేను వెళ్లే క్లయింట్ ఇంటికి ఆ డబ్బు సరిపోతుంది, పిల్ల కోరిక తీర్చలేని తన అసమర్ధతకు తన ఈ స్థితి కి దుఃఖం పొంగుకొస్తున్నా తనని తాను సముదాయించుకుని “ కాసేపు ఆగమ్మా ఇప్పుడు మనం ఒక అంటీ ఇంటికి వెళ్తున్నాం ఆ అంటీ డబ్బు ఇస్తుంది అప్పుడు నీకు బోల్డన్ని చాక్లెట్స్ కొనిపిస్తాగా” అంటూ తల నిమురుతూ చెప్తుంటే సరే అమ్మ అంటూ తన ఆశ ని చంపుకుటూ అమ్మతో కలిసి ఆటో ఎక్కింది శ్రేయ. పిల్లకి చాక్లెట్ కూడా కొనిపియ్యలేని తన పరిస్థితి దానికి కారణమైన సంఘటనలు గుర్తు తెచ్చుకుంటూ ఆటోలో అంతే దిగాలుగా కూర్చుంది భువన..
“చెప్తే వినరేంటండీ ఈ మందు వల్ల ఎంతమంది జీవితాలు, ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యాయో మీకు తెలీదా ఆ బార్ లో పని మానేయండి ప్లీజ్ అంటూ వేడుకుంటున్నట్లు అడుగుతున్న భువన వైపు కోపంగా చూస్తూ “మాకు తెలుసు ఏమీ చేయాలో, చేయకూడదో నువ్వు నాకు ఏం చెప్పక్కర్లేదు అయినా ఇప్పుడు నేను అక్కడ ఉద్యోగం మానేస్తే ఏమి తింటాం చెప్పు ఇల్లిళ్లు తిరిగి అడుక్కోవాలి, అనవసరంగా పెద్దల్ని ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు ఈ శిక్ష నేను అనుభవించాల్సిందే, నీతో ఈ మాటలు పడాలిసిందే అంటూ వడి వడిగా అడుగులు వేసుకుంటూ బయటికి వెళ్ళబోతుంటే అతనికి అడ్డుగా వచ్చి “ఏమి అంటున్నావు శివ నన్ను చేసుకున్నందుకు మన పరిస్థితి ఇలా అయ్యిందా, మీ అమ్మానాన్న నన్ను ఒప్పుకోలేదని మా ఇంటికి వెళదాం అంటే, ఉన్నఒక్క మీ అమ్మ దగ్గర నేను ఉండలేను అంత చేతగాని వాడిని కాదు అని నన్ను బయటికి తీసుకొచ్చావ్. డిగ్రీ మధ్యలో ఆపేసి బార్ లో పని చేస్తూ తాగుడుకి బానిస అయ్యింది నువ్వు, అప్పటి వరకు బాగానే ఉన్న మనం ఇప్పుడు ఇలాంటి దుస్థితి కి రావడానికి కారణం నువ్వు, ఇప్పటికీ నన్నే తప్పు పడుతున్నావు” అని ఇంకా ఏదో అనబోతున్న భువన చెంప చెళ్ళు మనింది. చెయ్యి బుగ్గ మీద పెట్టుకుని అంతే కూలబడిన తనని చూస్తూ టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ ని అంతే దూరంగా విసిరేసాడు అది వెళ్లి సోఫా లో నిద్రపోతున్న కూతురి ముందు ముక్కలుగా పగిలి పడిపోయింది. చెయ్యి గోడ మీద గుద్ది అంతే బయటికి వెళ్ళిపోయాడు శివ. ఒక్క క్షణం ఏమి జరిగిందో అర్థం చేసుకుని ఈ లోకంలోకి వచ్చేసరికి శ్రేయ ఏడుస్తూ అమ్మ వళ్ళో వచ్చి కూర్చుని వెక్కిళ్లు పెడుతుంటే తనని అంతే ఎత్తుకుని ఇంట్లోనుంచి బయటికి వచ్చేసింది భువన. ఆ రావడమే ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని స్థితి, సిగ్గు చంపుకుని అమ్మ ఇంటికి వెళ్లి తలుపు తట్టింది. తల్లి ఏమి మాట్లాడకుండా లోపలికి దారి చూపించింది. లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్న భువన కి అన్నము పళ్లెం తీసుకువచ్చి పిల్లకి పెట్టమని తాను లోపలికి వెళ్ళిపోయింది. శ్రేయ కి అన్నం పెట్టి, పడుకోబెట్టి తను అమ్మ దగ్గరికి వెళ్లి ఆమె ముందు కూర్చుంది. భువన ని చూస్తూ “నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నా దగ్గరికి వచ్చావో నాకు తెలుసు, ఏమి జరిగింది అని నిన్ను అడగను, ఇకముందు నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో అది చెప్పు, ఏమి చేయాలో పాలుపోనట్లు అంతే నేలని చూస్తూ కూర్చుంది భువన. “చూడు నీ బిడ్డకి ఈరోజు అన్నం పెట్టగలిగాను ఇంకొన్ని రోజులు పెట్టగలను కానీ ఎల్లకాలం నేనే పెట్టలేను నీ సంపాదన నీకు ఉంటే నీకు, నీ బిడ్డ భవిష్యత్ కి చాలా మంచిది ఆలోచించుకో ఏమి చేయాలనుకుంటున్నావో” అని అక్కడినుండి వెళ్ళిపోయింది. భువన ఆలోచనలో పడింది. తన వస్తువులు ఉన్న గదిలోకి వెళ్ళింది. శివని పెళ్లి చేసుకునేప్పుడు తను బి ఏ లీటరేచర్  రెండో సంవత్సరం చదువుతోంది. ఆ వయసులో చదువు విలువ తెలియక, ప్రేమ మైకం లో పడి చదువుని మధ్యలో మానేసి శివతో వచ్చేసింది తను. తను చదువుకునే రోజుల్లో ఎన్నో కవితలు, కథలు రాసేది ఆ పుస్తకాలు అవి చూసి అప్పట్లో చదువు విలువ తెలియదు, తెలిసేసరికి జీవితం ఏటో వెళ్ళిపోయింది. ఇప్పుడు చదువు మొదలుపెట్టాలన్నా అంత స్థోమత లేదు ఏమి చేయాలి నా బిడ్డని ఎలా సంరక్షించుకోవాలి అని మదనపడుతూ అంతే కూర్చుండిపోయుంది తన పుస్తకాలు ముందు వేసుకుని. అప్పుడే ఒక చిన్ని పిచుక వచ్చి తన గది కిటికీ వద్ద నుంచుని అరుస్తూ ఉంది. దాని అరుపులు విని అటువైపు చూసిన భువనకి పక్కనే ఉన్న అద్దం ఉన్న అల్మరా కనిపించింది.దాని ముందుకి వెళ్లి నుంచుంది. అది తీసి చూస్తే తను అప్పట్లో కాలేజీ వెళ్లొచ్చి ఒక బ్యూటీ పార్లర్ లో పని చేసేది దానికి సంబంధించిన మేకప్ వస్తువులు కనిపించాయి. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్లు నాకు నా గతాన్ని గుర్తు చేయటానికి ఆ దేవుడే ఈ పిచ్చుక రూపంలో వచ్చాడా అనిపించింది తనకి. ఆ మరుసటి రోజు పిల్లని తన వెంటే తీసుకుని తను ఇంతకుముందు పని చేసిన పార్లర్ కి వెళ్ళింది. ఆ పార్లర్ ఆవిడ భువన ని చూడగానే గుర్తుపట్టి తన పని తనం తెలిసినదే అవటంతో తనని మళ్ళీ చేరమని చెప్పి, కాకపోతే క్లయింట్స్ ఇంటికి వెళ్లి చేయాలని హోమ్ సర్వీస్  డిపార్ట్మెంట్ లో మాత్రమే కాలీ ఉందని చెప్పటంతో, తను ముందు సంకోచించినా, తనకి పని అవసరం ఉండటంతో తను వెంటనే ఒప్పుకుంది. అలా ఇప్పుడు ఓ క్లయింట్ ఇంటికి వెళ్తుంది తను.ఇలా ఆలోచిస్తుండగానే క్లయింట్ ఇంటికి ముందు వచ్చి ఆగింది ఆటో. అదో విశాలమైన బంగ్లా దాని ముందు నుంచుని అంతే చూస్తూ ఉంది భువన, తన బిడ్డ చేయిని అంతే గట్టిగా పట్టుకుని తనకు చెప్పింది “ఒకరోజు మనం ఇలాంటి ఇంట్లో ఉంటాము నన్ను నమ్ము” అని తనని తీసుకుని లోపలికి వెళ్ళింది. తన క్లయింట్ కి కావలిసిన సర్వీస్ అంతా బాగా ఉండటంతో ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువే ఇచ్చింది ఆమె. సంతోషంగా ఆ డబ్బు తీసుకుని బయటికి వచ్చింది భువన. అంతే వెనుతిరిగి చూసుకోలేదు తను. క్లయింట్స్ పెరగడంతో పాటు, తన సంపాదన పెరిగింది తను అక్కడే ఉంటూ ఇంకా బ్యూటీ కోర్సెస్ చేసి ఇంకా తన పని తీరుని మెరుగు పరుచుకోడంతో సినిమాల్లో మేకప్ ఆర్టిస్ట్ గా పని చేసే అవకాశం దక్కింది తనకి. ఇలా అంచలంచెలుగా ఎదుగుతూ సొంతంగా బ్యూటీ పార్లర్ పెట్టుకుని తనకు తను ఒక సామ్రాజ్యన్ని సృష్టించుకుంది. తన కూతురికి ప్రామిస్ చేసినట్లుగా తన ఆశల సౌధాన్ని నిర్మించుకుని ఆ బంగ్లాకి గృహప్రవేశం చేస్తూ బిజీగా ఉన్న భువన వద్దకి వచ్చిన పదేళ్ల శ్రేయ అమ్మ చెవిలో ఇలా అంది “అమ్మా నీ ప్రామిస్ నువ్వు నిలబెట్టుకున్నావు కదా” అంటూ తన చేతిని గట్టిగా అదిమింది.  తన కూతురిని చూసి నవ్వుతూ “ఈ ఐదు సంవత్సరాల్లో ఇదంతా సాధించాను ఇది నీవు నామీద పెట్టుకున్న నమ్మకం, ఇది నీ, నా విజయం. అంటూ తన ఇంటికి పెట్టుకున్న పేరు ను తడుముకుంది ప్రేమతో ‘భువనవిజయమని’.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!