కన్న కలలు

కన్న కలలు

రచన: ఉమామహేశ్వరి యాళ్ళ

సుప్రభాత రాగాలాపనతో తులసి కోట శుద్ధి చేస్తోంది కామేశ్వరమ్మ. పేపర్ చదువుతూ లోకాన్ని పరికిస్తున్నాడు భర్త దేవ్. ఇచ్చిన హోం వర్కులతో కూర్చున్నారు పిల్లలు పవిత్ర, ఠాగూర్.
అంతలో కమ్మని కాఫీతో దేవ్ ముందు ప్రత్యక్షమయింది భార్య జయ. పిల్లలకి పాలు కలిపిచ్చింది. అలా ఆ ఉదయమే కాదు నిత్యం జరిగే కృత్యమిదే. చక్కని చిక్కని మంచి కాఫీ లాంటి కుటుంబమది.

అనుబంధాలూ, ఆప్యాయతలూఅంగరంగవైభవంగా పెనవేసుకున్నకుటుంబమిది. వీరికి పెట్టడమే తెలుసు తప్ప తీసుకోవడం తెలీదు అన్నంతగా విలువలనే ఊపిరిగా నేర్పిందా తల్లి. దేవ్ కూడా అలానే నేర్పాడు తన పిల్లలకి. ఇక ఆ అత్తాకోడళ్ళు తల్లీ బిడ్డల్లా కలసిపోయారు.
పండుగలా కళకళలాడే ఆ ఇంట్లో నిత్యం ఏదోక సందడే. పిల్లలూ, దేవ్ టిఫిన్లు కానిచ్చి బడికి వెళ్ళాక, అత్తాకోడళ్ళు కూడా టిఫిన్ తిని, వంటలకి ఉపక్రమించారు.

వంటలయ్యాక తీరికగా కూర్చుని దూది ఒత్తులు చేస్తున్న కామేశ్వరమ్మ ఊహలు అలా అలా గతంలోకి వెళ్ళాయి.చాలా పెద్ద కుటుంబం, తాను నమ్ముకున్న సిద్ధాంతాలకోసమనీ, మంచి తప్ప చెడు తెలియని తన భర్త ఇంటికి పెద్దై చెల్లెళ్ళు,తమ్ముళ్ళ వివాహాలు,పురుళ్ళూ, పుణ్యాలు,వాళ్ళ పిల్లల ఆలనాపాలనా.ఇంటికి పెద్ధై అన్నింటికీ సర్ధుకుపోతూ అందరికి నచ్చ చెబుతూ ఓపిగ్గా వ్యవహరించే తన భర్తంటే ఎంతో ప్రేమ కామేశ్వరమ్మగారికి. అస్తమానం గొడవలు పడుతూ ఏదోక చిన్న చిన్న కారణాలకే అలకలు చూపే చెల్లెలి భర్త, భర్త వైఖరికి‌ విసిగిపోతూ అన్నా నీవే దిక్కన్నట్లుండే చెల్లెలు. వాళ్ళ పిల్లల ఆలనాపాలనా, భార్యాభర్తలకి సర్ధిచెప్పడం చూసి చూసి విసిగిపోయిన కామేశ్వరమ్మగారు తనకి చక్కగా ఒద్దికగా ఉండే కోడలు రావాలనీ, తమతో అన్యోన్యంగా కలిసిపోవాలని, అపుడైనా తన భర్తా,తనూ కాస్త ఊరట చెందుతారని అనుకుంది.

దేవ్ చక్కగా చదువుకుని. మంచి ఉపాధ్యాయ వృత్తిలో నిలిచాడు.అన్ని మంచి చెడ్డలూ తెలుసుకునీ, అన్నీ కుదిరాకా అందం అణకువా గల జయతో దేవ్ వివాహం జరిపించారు. అంతా చాలా సంతోషంగా గడచిపోయింది. అంతలో తండ్రి ఆరోగ్యం దెబ్బతినడం, అనుకోకుండా అతడిని కోల్పోవడం. అన్నీ ఒక్కసారిగా జరిగిపోయాయి.

పిల్లాడిని ఎన్నో విలువలతో, ఆత్మీయానుబంధాలను తెలుపుతూ,అందరి బాగోగులు చూసేలా భర్తకి ప్రతిరూపంలా ఇంటినీ, ఆత్మీయులనూ చాలా శ్రద్ధగా చూసుకునేలా పెంచారు. అవే విలువలతో పాటు దేవ్ లో ఉన్న మంచి మనసు, సౌశీల్యం అందరనూ ఇట్టే ఆకర్షిస్తాయి. అందరి వాడిలా మార్చేస్తాయి. ఆయన ఆశయాలను నెరవేర్చాననే అనాలి. నా కలల ఆసరాగా అన్యోన్యమైన దాంపత్యం గడుపుతున్న నా కొడుకూ కోడల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది.నా ఆశయాలకి అనుగుణమైన ఆశల
సౌధాన్ని నిర్మించాననే అనాలి అనుకుంటూ ఆలోచనలలో విహరిస్తున్న కామేశ్వరమ్మ ఒక్కసారిగా
అత్తయ్యా! భోజనం చేద్దురు రండి అనే కోడలు జయ పిలుపుతో,గతం నుండి వర్తమానంలోకి‌ వచ్చింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!