బ్రతకాలనే ఆశ

బ్రతకాలనే ఆశ

రచన:: అపర్ణ

ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారిపేర్లు రాజేష్, గిరి వారిద్దరూ గవర్నమెంట్ హాస్పిటల్ లో నర్స్లుగా పని చేసేవారు. అక్కడ వారికీ ఎక్కువగా మార్చురీ లో శవపరీక్ష చేసేప్పుడు సహాయంగా ఉండే పని ఉండేది . రోజూ అదే పనిగా శవాలతోసావాసం అవడం, చనిపోయినవారిని దగ్గర నుండి చూసి, చూసి వారికి జీవితం మీద విరక్తి పుట్టింది.ఒకరకమైన మానసిక అశాంతికి గురి అయ్యారు దానితో వాళ్ళకి ఎన్ని రోజులు బతికితే ఏంటి, ఏమి చేస్తే ఏంటి జీవితపు చివరి మజిలీ కాటికేగా అనే తీవ్ర ఆలోచనలు వారికి కలిగాయి.దానితో ఆత్మహత్య చేసుకుందాము అని నిశ్చయించుకున్నారు . అసలు కారణమే లేదు ఏదో జీవితం లో అన్నీ చూసేసినట్లు ఇంక ఈ జీవితం దేనికి పనికిరాదు అన్నట్లు అనిపిస్తుంది వాళ్ళకి. ఒకానొక రోజు కొండ మీద నుంచి దూకేద్దాము అని వాళ్ళ ఊరి చివర ఉన్న కొండ దగ్గరికి వెళ్తారు. కొండమీదనుంచి దూకుదాం అని అనుకుంటుండగా అప్పటికే మబ్బులుపట్టి వర్షం పడేలా ఉంది ఆకాశం. ఉన్నటుండగా పెద్ద వర్షం కురవసాగింది. అది చూసి ఈరోజు కుదరదేమో రేపు చద్దాము అని అనుకుని వెనుతిరిగారు. మరలా రెండో రోజు చావడానికి రెడీ అయ్యారు అయితే అక్కడిదాకా వెళ్లి చచ్చేదేముందిలే ఇంట్లో నే ఈ కరెంటు ప్లగ్ లో వేలు పెడితే చావమా అని అనుకున్నారు. వెంటనే గిరి ప్లగ్ లో వేలు పెట్టి నుంచున్నాడు కానీ నిన్నటి వర్షాలకి కరెంటు పోయి ఇప్పటివరకు రాలేదు ఆ విషయం అప్పుడే అర్థమైంది వాళ్ళకి. అయ్యో ఈరోజు కూడా చావు లేనట్లేనా అనుకున్నారు, కరెంటు వస్తుందేమో అనుకున్నారు కానీ అందరికీ వచ్చింది వాళ్ళింట్లో తప్ప కారణం కరెంటు బిల్లు కట్టలేదని నిన్ననే వచ్చి ఫుజ్ పీకేసారంట. సరేలే అదికాకపోతే ఇంకో దారి లేదా అనుకున్నారు. ఉరి వేసుకుందాం అనుకున్నారు కానీ ఇంట్లో చొక్కాలు పాంట్లు తప్ప ఇంకేమి లేవే దుప్పటి ఉండాలిగా అని చూసారు కానీ నిన్న ఉతికి ఆరేసిన దుప్పటి వర్షానికి ముందు వచ్చిన గాలికి కొట్టుకుపోయింది అది వాళ్ళకి అప్పుడే తెలిసింది. “దేవుడా! చద్దాము నీ దగ్గరికి వద్దాము అనుకుంటే నువ్వెంటీ అన్నీ దారులు మూసేస్తున్నావు” అని బాధపడ్డారు. ఆకలి వేసింది వాళ్ళకి ఇంట్లో అన్నం ఉంది దానిలో మొన్న ఎలుకలకి పెడదాం అని తెచ్చిన మందు ఉంది అది కలుపుకొని తిందాము అని సిద్ధం చేసుకున్నారు. ఒక ముద్ద నోట్లో పెట్టుకుందాము అని అనుకునేలోపు తలుపులు ఎవరో దబా దబా బాదుతున్నారు. అర్ధరాత్రి కావస్తోంది ఈ సమయంలో ఎవరా చూద్దాం అని తలుపు తీశారు. ఎదురుగా ఒక వ్యక్తి “ఏవండీ మా ఆవిడ పురిటి నొప్పులతో బాధపడుతుంది పక్కన వాళ్ళని అడిగితే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ లో నర్స్ గా చేస్తున్నారు అని చెప్పారు కొంచం మా ఆవిడను చూడరా అసలే వర్షం పడి రోడ్ బాగోలేదు అంబులెన్సుకు ఫొన్ చేస్తే టైమ్ పట్టుద్ది అని చెప్పారు ఈలోపు డెలివరీ అయ్యేలా ఉంది కొంచెం తొందరగా రండి” అంటూ హడావిడి చేసాడు. నిమిషం ఆలోచించకుండా ఇద్దరూ అతని వెనుక పరిగెత్తివెళ్ళారు. అక్కడ నొప్పులతో అల్లాడిపోతుంది అతని భార్య కొంచెం ఓర్చుకోండి అంటూ ఆమెని సముదాయిస్తూ వేడినీళ్లు కొన్ని దుప్పట్లు తీసుకురండి అని చెప్పి వాళ్ళు ఆమె అటువైపు ఇటువైపు చేరి ఆమెని నీకేమి భయము లేదు మేము ఉన్నాముగా అంటూ ఆమెకి భరోసా ఇచ్చారు. నావల్ల కావట్లేదు అండీ చనిపోతానేమో అనిపిస్తుంది అంటూ వాళ్ళ చేతులు గట్టిగా నొక్కింది నొప్పిని తట్టుకోలేక, ఈ నొప్పి తాత్కాలికం తల్లీ ఇంకొంచెం సేపట్లో నీ బిడ్డ ఈ భూమి మీదకి వస్తది ఆ బిడ్డని చూస్తే నువ్వు ఈ నొప్పిని మొత్తం మర్చిపోతావు అంటూ ఆమెని సముదాయించారు. వాళ్ళ ఆయన వచ్చాడు, కొంచెంసేపట్లో దిక్కులు అదిరేలా ఏడుస్తూ నిండు చందమామ లాంటి ఓ అందమైన ఆడపిల్ల ని కనింది అతని భార్య.ఆ బిడ్డని చూసి అప్పుడుదాకా పడిన కష్టం, బాధ అంతా మరచిపోయింది ఆ తల్లి, ఆనందాబాష్పలతో ఆ బిడ్డ ను చేతిలో తీసుకుంది. ఆ బిడ్డని చూసి గిరి, రాజేష్ లో ఏదో తెలియని ఆనందం వచ్చింది. ఇద్దరూ ఇంటికి తిరిగివెళ్లారు.తీరా చూస్తే తాము కలిపిన అన్నాన్ని ఆ ఇంట్లో వాళ్ళని ఎప్పటినుంచో బాధపెడ్తున్న రెండు ఎలుకలు తిని వాటి ప్రాణాలు విడిచాయి. అది చూసి వాళ్ళకి అర్థమైంది మనం చావాలనుకుంటే చావు మన దరికి చేరలేదు, కానీ వేటికి రాసిపెట్టి ఉందో అవి మాత్రం చచ్చాయి. ఇప్పుడే పుట్టిన పసిబిడ్డ తను బతకాలి అని తన తల్లీ గర్భం నుంచి బయటకు రావడానికి విశ్వప్రయత్నం చేసి తాను అనుకున్నది సాదించానని బయటికి రాగానే దిక్కులు అదిరేలా ఏడ్చింది. అక్కడ ఒక ప్రాణం బతకాలి ఎలాగైనా ఈ లోకాన్ని చూడాలి అని తన శక్తికి మించి పోరాడి గెలిచింది. కానీ మనమిక్కడ చావడానికి శతవిధాలా ప్రయత్నించి ఓడిపోయాము. ఇప్పుడు అర్థం అవుతుంది ఈ జీవితానికి బ్రతకడానికి కావలసినది ఏంటో అదే బ్రతకాలని ఆశ. అది ఇప్పుడే పుట్టింది మళ్ళీ ఆ బిడ్డతో పాటు, పునర్జన్మ పొందిన ఆ తల్లి తో పాటు. ఇన్ని చావులు చూసాము కానీ ఒక పసిబిడ్డ మళ్ళీ జీవించాలనే ఆశకు ప్రాణం పోసింది.
చావు, పుట్టుక అనేవి రెండు విభిన్నమైన లోకాలు. ఈ సృష్టిలో జరిగే ప్రతి కార్యానికి ఒక కారణం అనేది ఉంటుంది. మన పుట్టుక ఒక కారణమే, అలాగే చావుకుడా. ఈ రెండిటి మధ్య బ్రతుకు అనేది ఏదయితే ఉందో దానికి కూడా ఒక ఉద్దేశ్యం ఉంది. అందుకేగా మన పురాణాల్లో శ్రీకృష్ణుడిని కంసుని సంహారించుటకు కారణ జన్ముడై పుట్టాడని కొనియాడాము దేవునిగా పూజిస్తున్నాము. బ్రతకడానికి ఒక చిన్ని కారణం చాలు ఒక్కసారి ఆలోచిస్తే దొరుకుతుంది.

**శుభం **

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!