ఎదురీత

(అంశం:: “సాధించిన విజయం”)

ఎదురీత 

రచన :: సావిత్రి కోవూరు

“అమ్మమ్మా నీవు ఎంత వరకు చదువుకున్నావ్?” అన్నది ఒక రోజు సాయంత్రం మా మనవరాలు శ్రీయ.

“నేను ఎమ్.ఏ చేశాను తల్లీ” అన్నాను.

“అమ్మమ్మా ఆ కాలంలో కూడా పి.జి. లు చేసేవారా ఆడవాళ్ళు”

“ఆ చేసే వాళ్లు.కాని చాలా తక్కువ మంది” అన్నాను.

” పెళ్ళి వరకే చదువుకున్నావా అమ్మమ్మా” అన్నది.

“లేదు పెళ్ళి వరకు ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ కాలేదు నాది.” అన్నాను.

“మరి తాతయ్య చదివించారా” అన్నది

“అదో పెద్ద కథ లేవే” అన్నాను

“చెప్పు నాకు నీ కథ వినడం చాలా ఇష్టం.”

“నీకు ఓపిక ఉంటే అలాగే చెప్తాను విను. నాకు  ఇంటర్ కంప్లీట్ కాకముందే పెళ్లయింది. పెళ్లి అయినాక ఇంటర్ పరీక్షలు రాసి పాసైనాను. ఆ తర్వాత ఒక పాప. పాప పనులు, ఇంటి పనులతో సంసారంలో మునిగి తేలుతూ చదువు పక్కన పెట్టాను. మా వారు అంటే మీ తాతయ్య పబ్లిక్ సెక్టర్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. ఉదయం ఏడు గంటలకు ఇంటి నుండి బయలుదేరితే డ్యూటీ అయిన తర్వాత, అక్కడి నుండే ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లి నైట్ కాలేజీలో బి.ఇ. చేసేవారు. ఆయన వచ్చేసరికి రాత్రి పన్నెండు అయ్యేది. పాప పనులు, ఇంటి పనులు, అయిన తర్వాత మ్యాగజైన్స్ చదువుతూ  కాలక్షేపం చేసేదాన్ని.

ఒకరోజు డిగ్రీ చదివే మా చెల్లెళ్ళు ఇద్దరు కాలేజీ నుండి  నా దగ్గరకు వచ్చారు. వాళ్ళ పుస్తకాలు తిరగేస్తూ, “నాకంటే చిన్నవాళ్ళు మీరు మంచిగా డిగ్రీ చదువుతున్నారు. నాకేమో బాగా చదువుకొని ఉద్యోగం చేయాలని చిన్నప్పటినుండి ఉండేది.కానీ ఇంటర్ తోనే ముగిసిపోయింది” అన్నాను.

అప్పుడు మా చిన్న చెల్లెలు లక్ష్మి “అక్క అలా ఎందుకు బాధపడతావ్. నీకు చదవాలని ఉంటే ఇప్పటికైనా చదువుకోవచ్చు ప్రైవేటుగా” అన్నది.

మా పెద్ద చెల్లెలు సుధా కూడ  “అవును అక్క నీకు చదువుకోవాలని ఉంటే మా నోట్స్, బుక్స్ ఇస్తాం. ఇంట్లో నుండి చదువుకొని ఎక్స్టర్నల్ పరీక్షలు రాసుకోవచ్చు.” అన్నది.

“ఇంట్లో కూర్చుని చదవడం నా వల్ల అవుతుందా” అన్నాను.

“బావగారు ఎలాగు రాత్రి పన్నెండు వరకు రారు కదా! పాప పనులన్నీ, నీ పనులన్నీ అయిపోయిన తర్వాత, పాప పడుకున్నప్పుడు చదువుకో. ఏవైనా అర్థం కాకపోతే మేము చెప్తాము.”  అన్నారు.

ఆ రోజు వాళ్ళ ఫస్టియర్ పరీక్షలు అయిపోయిన పుస్తకాలన్నీ నాకు ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు.  వాళ్ళు వెళ్ళిన తర్వాత పాప పడుకున్నాక  ఆ పుస్తకాలు తిరగేస్తూ కూర్చున్నాను.

మా వారు వచ్చి “ఏం చదువుతున్నావు” అన్నారు.

“ఈరోజు సుధా, లక్ష్మి వచ్చి వెళ్లారు. వాళ్ళ పుస్తకాలు నాకు ఇచ్చి ప్రైవేట్ గా బి.ఎ. కట్టమన్నారు అవే తిరిగేస్తున్నాను.”  అన్నాను.

“పెద్ద చదువావులే బి.ఎ. లు ఎమ్.ఎ.లు” అన్నారు.” మా వారు హాస్యంతో కూడిన  ఎగతాళిగ.

నా మనసు చివుక్కుమంది. అసలు మా వారికి ఆడవాళ్లు అంటే చాలా గౌరవం. ఆడవాళ్లు కూడా బాగా చదువుకోవాలి. కాని అవసరం ఉంటేనే ఉద్యోగం చేయాలి అని చెప్పేవారు. మరి ఆ రోజు మాత్రం అలా అనేసరికి నాకు చాలా అవమానంగా అనిపించింది. అప్పుడు మౌనంగా ఉన్నాను. కానీ ఎలా అయినా పట్టుదలగా చదివి చూపించాలని అనుకుని, ఆ రోజు నుండి శ్రద్ధగా చదవటం మొదలు పెట్టాను. మధ్య మధ్య మా చిన్న చెల్లి వచ్చి, నాకు అర్థం కానివన్ని చెప్పేది. నేను పాప పనులు, ఇంటి పనులు చేసుకుంటూ అటూఇటూ తిరుగుతుంటే, నా వెనక వెనక వస్తూ “అక్క నీ పనులు నువ్వు చేసుకో. కానీ చెవులు మాత్రం నా మాటలపై పెట్టు అని పూసగుచ్చినట్టు, కథలు చెప్పినట్టు, నా చెవిలో కి దూరే లాగా, అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు బోధించేది. నేను బుక్స్ మొత్తం చదవకపోయినా మా చెల్లి చెప్పిన వాక్యాలు గుర్తుపెట్టుకుని వెళ్లి పరీక్షలు బాగా రాసి పాసయ్యాను.

మా చెల్లి చెప్పే విధానం చూసి, మా మామగారు “లక్ష్మీ నీవు లెక్చరర్ అయితే బాగ షైన్ అవుతావు. విద్యార్థులు అదృష్టవంతులు అవుతారు” అన్నారు.

ఆ విధంగా మా చెల్లి పుణ్యమా అని నేను బి.ఎ. ఈజీగా ప్యాసయ్యాను.

తరవాత మా కజిన్ కొడుకు ఎక్సటర్నల్ గా ఎం.ఎ.రాయడానికి  ఫీజు కట్టడానికి హైదరాబాద్ వచ్చి మా  ఇంటికి వచ్చాడు. అతనిని అడిగి నోట్స్ తీసుకుని రాసుకున్నాను. లిస్టు తీసుకొని పుస్తకాలు కొనుక్కుని, నేను కూడా అతనితో పాటు  ఎం. ఏ. ఫీజు కట్టి చదివి పరీక్షలు రాశాను. ఫస్ట్ ఇయర్ అయిపోయింది.

ఒక రోజు మా చెల్లి ఒక న్యూస్ పేపర్ తెచ్చి “అక్కా పండిట్ ట్రైనింగ్ కి అడ్మిషన్స్ అవుతున్నాయి. నాకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ లో తెలుగు లేదు. కనుక అవకాశం లేదు. నీకు అవకాశముంది. ఈ రోజు లాస్ట్ డే. నీకిష్టమైతే సర్టిఫికెట్స్ అన్ని తీసుకుని మాసబ్ ట్యాంక్ ట్రైనింగ్ కాలేజీ కి ఈ రోజే వెళ్ళు”అని చెప్పింది.

మా వారికి చెప్పడానికి అప్పుడు ఫోన్ లేదు. ఈ అవకాశం మళ్లీ రాదని, మా వారిని ఎలాగైన ఒప్పించ వచ్చులే, అనుకుని బయల్దేరాను. అప్పటికే నాకు ఇద్దరు పిల్లలు. మా అన్నయ్య వాళ్ళ ఇల్లు మాకు చాలా దగ్గరగా ఉండేది. పిల్లలిద్దర్నీ మా వదిన దగ్గర వదలి పెట్టేసి కాలేజీ కి వెళ్లాను. అక్కడ నా ఫ్రెండ్స్ ముగ్గురు కలిశారు.వాళ్ళను చూసిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది. అక్కడ నేను ఆలోచించుకోడానికి కూడా టైం లేకుండా నా సర్టిఫికెట్స్ చెక్ చేసి ఫీజు కట్టించుకుని అడ్మిషన్ ఇచ్చేశారు. మూడు రోజుల తర్వాత క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అని చెప్పారు.

ఇక ఇంటికి వచ్చినాక పేద్ద రామాయణమే జరిగింది మా వారితో. “నేను ఉదయం వెళితే రాత్రికి గాని రాను. పెద్ద పాపని స్కూల్ కి పంపించాలి. నీకు ఉదయం పది గంటలనుండి సాయంత్రం నాలుగు గంటల వరకు క్లాసెస్ అంటున్నావు. ఎలా చేస్తావ్ ట్రైనింగ్, పిల్లలు ఏమవుతారు” అని కోప్పడ్డారు.

“పెద్ద పాపని పొద్దున్నే స్కూల్ కి పంపిస్తాను. అది స్కూల్ నుండి వచ్చే సరికి ఎలాగైనా నాలుగున్నర అవుతుంది. చిన్న పాపని వదిన చూసుకుంటానన్నది. మీ ముగ్గురిలో ఎవరికి ఇబ్బందయిన వెంటనే మానేస్తాను.” అన్నాను.

అయినా మా వారు నన్ను మా అన్నయ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మా అన్నయ్యకు అంతా చెప్పారు. “చూడండి బావ, తను చదువు కుంటానంటే నాకు సంతోషమే. కాని పిల్లలు చిన్నవాళ్ళు కదా.వాళ్ళకి చేసి, లోపలంత కిక్కిరిసిన జనాలు, డోర్ దగ్గర కూడ జనాలు వేళ్ళాడుతుంటారు బస్సుల్లో  ఎలా వెళుతుంది. ఆ బస్సులో పడి అంత దూరం ప్రయాణం చేస్తే ఎంత అలసటౌతుంది. మళ్ళీ ఇంటికొచ్చి పనిచేసుకోవాలి. తను ట్రైనింగ్ చేయడం ఇప్పుడు అవసరమా?  ఇద్దరు పిల్లల్ని వదిలిపెట్టి” అన్నారు.

మా అన్నయ్య “అతనికి ఇష్టం లేకపోతే ఎందుకమ్మా ట్రైనింగ్” అన్నారు.

“అది కాదు అన్నయ్య వాళ్ళు నా ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకుని జాయిన్ చేసుకున్నారు.ఇపుడు ఇవ్వమంటే ఇవ్వరు. నాకు ఎప్పుడూ ఇబ్బంది అనిపిస్తే, అప్పుడు మానేస్తాను. వదిన చిన్న పాపని చూసుకుంటానన్నది. పెద్దది ఎలాగూ స్కూల్ కి వెళుతుంది” అన్నాను.

మా అన్నయ్యకు నేనంటే చాలా ప్రేమ ఆయన దగ్గర ఉండే నేను చదువుకున్నాను. మా అన్నయ్య మావారితో “పోనీలెండి అది మీకు కానీ, పిల్లలకి గాని ఇబ్బంది అయితే మానేస్తానని అంటున్నది కదా!” అన్నారు.

“నాకు తను ఉద్యోగం చేయడం ఇష్టం లేదు బావగారు. పిల్లలను సరిగ్గా పెంచితే చాలు. నేను చక్కగా పోషించగలను” అన్నారు.

“ట్రైనింగ్ అవ్వగానే ఉద్యోగం పిలిచి ఇస్తారా ఏదో సరదాగా చేస్తున్నాను. పది పదిహేనేళ్ళ క్రితం ట్రైనింగ్ అయిన వాళ్లు కూడా ఖాళీగా ఉంటున్నారు అన్నయ్య” అన్నాను.

చివరికి అయిష్టంగానే ఒప్పుకున్నారు. మావారు ఇంట్లో ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే మానేసే శరతుతో.

ట్రైనింగ్ కి వెళ్ళడం మొదలు పెట్టాను. జాయిన్ అయినా కొన్ని నెలలకు శంకర్ మఠ్ దగ్గర బస్సు దిగి ఇంటికి వస్తుంటే, వెనక నుండి పరిగెత్తుకొచ్చిన ఆవు తోసేసుకుంటూ వెళ్ళిపోయింది. రోడ్డుపై పడిపోయాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే “బెడ్ రెస్ట్ తీసుకోవాలి,లేకపోతే బేబీ దక్కదు” అన్నారు.

ఒకవైపు బేబీ దక్కదు అన్న బాధ, ఇంకొకవైపు ఎంతో కష్టపడి జాయిన్ అయిన ట్రైనింగ్ మధ్యలోనే ఆగిపోతుందన్న బాధ. ఏడుస్తూ కూర్చున్నాను. మా వారే లీవ్ లెటర్ రాసి కాలేజీకి వెళ్లి ‘పురుషోత్తం గారు’ అనే సర్ కి ఇచ్చారట. ఆయన ఎంత స్ట్రిక్ట్ అంటే, ఒక్క నిమిషం కూడా అటు ఇటు  కాకుండ, ప్రతి క్లాస్ తీసుకునేవారు. హోం వర్క్ చేయకపోతే చెడామడా తిట్టేసే వారు. అలాంటి సర్ మావారు లీవ్ లెటర్ ఇవ్వగానే “ఆమెను ఏమి బాధ పడొద్దు అని చెప్పండి. మిగతా సర్స్ కి నేను చెప్పి, అటెండెన్స్ అడ్జస్ట్ చేయిస్తాను. కానీ బాగా చదువుకుని పరీక్షలు రాయమని చెప్పండి.” అన్నారట. ఆ విధంగా ట్రైనింగ్ పూర్తి చేశాను. బాగ చదువుకుని పరీక్షలు రాసాను. పాస్ అయ్యాను. తర్వాత ఆరోగ్యకరమైన బేబి పుట్టాడు. నా సంతోషానికి అంతేలేదు.

కొన్ని రోజులకు ఇంటి దగ్గరున్న ప్రైవేట్ స్కూల్లో ఒక టీచర్ లీవ్ లో వెడుతూ ఒక నెలరోజులు నన్ను చేయమని రిక్వెస్ట్ చేసారు మా వారి ముందరే. మా వారు  “ఆ ఒక్క నెల రోజులు మాత్రమే చెయ్యి. ఆమె అంత రిక్వెస్ట్ చేస్తున్నారు కదా!” అన్నారు. తర్వాత కూడ చేస్తానని అనొద్దని మాట తీసుకున్నారు.

నన్ను చూసి మా పెద్ద చెల్లి కూడా నెక్స్ట్ బ్యాచ్ లో ట్రైనింగ్ చేసింది. వాళ్ళాయన ఇంట్రస్ట్ తో. ఒక రోజు మా మరిది వచ్చి, టీచర్ వేకెన్సీలు అనౌన్స్ చేసారట వదినా. అప్లై చేయడానికి మీ చెల్లిని తీసుకెళ్ళుతున్నా. మీరు కూడ వస్తారా డి ఇ.వో. ఆఫీస్ కి అన్నారు. అప్పుడు మావారికి చెబుదామంటే మా ఇంట్లో ఫోన్ లేదు. తర్వాత ఎలాగైన ఒప్పిచ వచ్చులే అన్న ధీమాతో సరేనన్నాను. నేను, మా చెల్లి, మా మరిది కలిసి డి.ఇ.వో. ఆఫీస్ కి వెళ్ళాం. పొద్దుటి నుండి సాయంత్రం వరకు కొండవీటి చాంతాడంత క్యూలో నిలబడి వెయిట్ చేసి, వెయిట్ చేసి మొత్తానికి అప్లికేషన్ ఇచ్చేసి వచ్చాము. వచ్చిన తర్వాత ఆ సంగతే మర్చిపోయాను.

తర్వాత కొన్ని రోజులకు  మెథడిస్ట్ స్కూల్లో రాత పరీక్షకు హాల్టికెట్ వచ్చింది. అది నేను మా చెల్లి ఇద్దరం వెళ్లి బాగానే రాశాము. ఈ లోపల ఎమ్.ఎ. సెకండ్ ఇయర్ పరీక్షలు కూడా రాసేసాను. రిటన్ టెస్ట్ అయినాక ఒక ఏడాదికి పర్సనల్ ఇంటర్వ్యూలకు  పిలిచారు. ఇంటర్వ్యూ కూడా బాగానే చేశాము.

ఒక రోజు మా మరిది  ఇంటికి వచ్చి, “డి.ఇ.ఓ. ఆఫీస్ నుంచి మీకేమన్నా ఆర్డర్ వచ్చిందా?” అని అడిగారు. నాకేమి రాలేదని చెప్పాను. మా చెల్లికి జాబ్ ఆర్డర్ వచ్చిందని, వారం లోపల జాయిన్ అవ్వమన్నారని చెప్పారు.

నేను పర్సనల్ ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేదేమో అనుకున్నాను. ఇక నేను ఎలాగైనా ఉద్యోగం చేస్తానని మా వారిని బ్రతిమిలాడాను. టీచర్ ఉద్యోగం కాబట్టి, పిల్లలకు ఎప్పుడు సెలవులు ఉంటే, నాకు కూడా సెలవులు  ఉంటాయి. కనుక పిల్లలకి ఏ ఇబ్బంది ఉండదని మా వారితో అన్నాను. ఎలాగో ఒప్పుకున్నారు.

ఒకరోజు  ఖైరతాబాదు లో ఒక ప్రైవేటు స్కూల్ లో ఇంటర్వ్యూ ఉంటే మా వారిని తీసుకుని వెళ్లాను. ఇంటర్వు  అయిన తర్వాత వచ్చేటప్పుడు బస్ స్టాప్ లో నిలుచున్నాము. బస్టాప్  డి.ఇ. వో. ఆఫీస్ కి నాలుగడుగుల దూరం లోనే ఉంది. మా వారితో “డి.ఇ.వో ఆఫీస్ ఇక్కడే ఉంది. ఒక్కసారి వెళ్లి నోటీసు బోర్డు పైన నా పేరుందేమో చూసొద్దామండి” అన్నాను.

“మీ చెల్లికి పోస్ట్ లో వచ్చింది కదా! ఆర్డరు. నీకు జాబ్ వస్తే ఆర్డర్ ఇంటికి పోస్ట్ లో వచ్చేది కదా. నీకు జాబ్ రాలేదేమో.అక్కడి కెళ్ళి ఏం చూస్తాం” అన్నారు.

అదే మాట ఇంటికొచ్చి మా అన్నయ్య కూతురు మంజు తో చెప్పాను. “పోనీలే అత్త. రేపు శనివారం కదా. నీకు  స్కూల్ హాఫ్ డే నే   కదా!  మనిద్దరం  వెళ్లి చూసి వద్దాం” అన్నది సరే లే అనుకున్నాను.

శనివారం మధ్యాహ్నం మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అన్నయ్య కూతురు మంజు రెడీ అయి కూర్చుంది. “ఎక్కడికెళ్తున్నావే  రెడీ అయి కూర్చున్నావు.” అన్నాను దానితో.

“అదేంటి అత్తా నీవే కదా డి.ఇ.ఓ. ఆఫీస్ కు వెళదామని నిన్న చెప్పావు.” అన్నది.

ఆ సంగతే మర్చిపోయాను. అప్పుడు దానితో కలిసి డి.ఇ.ఓ. ఆఫీస్ కి వెళ్ళాను. వెళ్లి అక్కడ కనుక్కుంటే అక్కడ వాళ్ళు “ఇంపార్టెంట్ విషయాలకి కూడా మీరు అడ్రస్ తప్పిస్తే ఎలాగమ్మా. మీ ఆర్డర్ వారం రోజుల నుండి తిరిగి తిరిగి టేబుల్ పైన పడి ఉన్నది. ఈరోజు లాస్ట్ డే. రేపు చెత్తబుట్టలో వేద్దాం అనుకుంటున్నాం. ఇప్పటికైనా కరెక్ట్ అడ్రస్ రాసి ఇచ్చి వెళ్లండి” అన్నాడు.

“నేను వచ్చాను కదా సార్. నాకు ఇచ్చేయండి.” అన్నాను. మళ్లీ పోస్ట్ లో సరిగ్గా వస్తుందో రాదో అన్న అనుమానంతో.

“అలా ఇవ్వకూడదు. మీకు పోస్ట్ లోనే పంపిస్తాం. సోమవారం వస్తుంది. మీరు వెళ్ళండి.” అని చెప్పారు.

ఇంటికొచ్చాక ఎవరికీ చెప్పలేదు.ఎందుకంటే నాకే నమ్మకం కుదరటం లేదు.అందరికి చెప్పుకున్నాక ఆర్డర్ రాకపోతే. అందుకే ఆర్డర్ చేతిలోకి వచ్చాకే చెప్పాలనుకున్నాను. సోమవారం రోజు స్కూల్ కెళ్ళి, మధ్యాహ్నం ఇంటికి వచ్చి మా వదినని ఏమన్న పోస్ట్ వచ్చిందా అని అడిగాను. నాకెందుకో నా అదృష్టం పైన నాకే నమ్మకం లేదు.

కానీ మా వదిన  “ఏదో కవర్ వచ్చింది అక్కడ పెట్టాను చూడు” అన్నది. వెంటనే చూస్తే లోపల నా జాబ్ ఆర్డర్ నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను.

ఈ విషయము సాయంత్రం మా వారికి చెప్పి, ఆర్డర్ చూపించి,” మీరు ఒకప్పుడు పేద్ద చదివావులే. బి. ఏ. లు ఎమ్. ఎ.లు అన్నారు కదా! చూడండి ఇప్పుడు నేను బి.ఎ. చదివాను ఎం. ఏ. కూడ చదివాను టీచర్ ట్రైనింగ్ చేశాను. టీచర్ జాబ్ సంపాదించుకున్నాను. మీరు ఆరోజు నన్ను ఎగతాళిగా అనక పోయి ఉంటే ఇంత పట్టుదలగా చదివేదాన్ని కాదు” అన్నాను.

“ఇదమ్మా నా చదువుల ప్రస్థానం. నేను సాధించిన విజయం కథ. అలా ఉద్యోగం సంపాదించుకుని ఇరవై ఏడు ఏళ్ళు సజావుగా ఉద్యోగం చేశాను.” అన్నాను మా మనవరాలు శ్రీయ తో.

“చాలా బాగుంది అమ్మమ్మా నీ పట్టుదల. అంతే కాకుండా నీవు మన ఫ్యామిలీ లో కెనెటిక్ హోండా పై ఉద్యోగానికి వెళ్ళిన  మొట్ట మొదటి లేడీ అట కదా! నాన్న  ‘మా అత్తగారు  మోడర్న్ అత్తగారు’అని అందరితో అంటుంటారు. అమ్మమ్మా.” అన్నది నా మనవరాలు శ్రీయ.

(ఇది నా జీవిత యదార్థ కథ అని తెలియ చేస్తున్నాను.)

You May Also Like

One thought on “ఎదురీత

  1. స్ఫూర్తిదాయక జీవిత కథ👌👌👌👌👌
    అబినందనలు సావిత్రి గారూ
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!