చిత్రాలేల శివయ్య..

రచన – తపస్వి

చివరి మజిలీతో నిన్ను చేరిన జనుల పాపాలతో మైల పడతావనా

గంగమ్మను నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నావు…

నిన్ను చూసి మా గంగమ్మలు మమల్ని అడిగితే మేమెక్కడ మోయగలం?

ఆది,అంతం నువ్వే అని చెప్పేందుకు సతిని సగం చేసుకుని మురిసిపోతున్నావా…

మా సతులు మేమెక్కడ నీలో అంటూ నసిగితే మా గతేం కాను?

బొచ్చె పట్టుకుని బిచ్చం ఎత్తి ఏం చెప్పాలి అనుకుంటున్నావు సామి…

నీ అంతటి వాడే సతి ముందు మోకరిల్లి దేహి అంటుంటే

మా సతుల ముందు మేమెంత అని చెప్పాలనా?

అష్ట ఐశ్వర్యాలు ప్రేమతో నీ భార్యామణికి ఇచ్చి , ఆ గోచి ఏంటి మహాదేవ…

మా జీవితాలు పెట్టిన మా భార్యామణుల మనసుని తృప్తి పరచగలమా?

గతి లేనట్టు ఆ చితాభస్మాన్ని పూసుకు తిరుగుతావు ఏమయ్యా…

చింత లేని బ్రతుకు అంటూ మాకెందుకు సోకులు అని

మమల్ని కూడా నీలా ఉండమంటే మా గతేం కాను?

భోళా శంకరుడు అని పిలిపించుకునే నీకు ఆ పొగరు ఎందుకయ్యా…

నీలా నేను ఉంటే ఆ కాటి కాపరి కూడా కాస్త చోటు ఇవ్వడు …..

చితి మంటల్లో చలి కాగుతూ ఆ చిరునవ్వు ఏలనయ్య…

చివరి క్షణం వరకు చిల్లర బ్రతుకులతో చిల్లు పడిన

మానవత్వంతో బ్రతకటం ఎంత కష్టమో నీకేం తెలుసు…..

మట్టి కొట్టుకుపోయిన కురులున్న నీకు జఠాధరుడు అన్న పేరు ఎందుకయ్యా…

కామ క్రోధ మద వాంఛలతో కుళ్లిపోయిన మా బ్రతుకులను గేలి చేయటానికా…

కాటిలో కులాసాగా ఉండే నిను కొలిచే జాతర ఎందుకయ్యా…

ఆశలేని బ్రతుకులో నిరాశ కాక బ్రతుకుటే మనశ్శాంతి అని చెప్పేందుకేనా…

You May Also Like

One thought on “చిత్రాలేల శివయ్య..

Leave a Reply to హసీనాఇల్లూరి Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!