రంగుల లోకం

రంగుల లోకం

రచయిత్రి: పరిమళ కళ్యాణ్

ఆకాశం చూడు రిషి ఎంత నీలంగా నిర్మలంగా ప్రశాంతంగా ఉందో అచ్చం నీ మనసులాగనే..

ఆ సముద్రం చూడు అలలతో ఎలా 

ఎగసెగసి పడుతుందో నాలాగే..

 

చుట్టూ ఆ పచ్చని చెట్లు చూడు 

వింజామరలు వీస్తున్నట్టు ఉన్నాయి కదా!

 

అదుగో పైన ఎగురుతూ పక్షులు చేసే 

కిలకిలా రావాలు చూడు 

ఎంత వినసొంపుగా ఉన్నాయో!

 

ఆ కొండల నడుమ గలగల పారుతున్న 

సెలయేరు చేసే సవ్వడి చూడు, 

ఎంత మనోహరంగా ఉందో!

 

అప్పుడే అస్తమిస్తున్న ఆ సూర్యుడు చూడు, 

ఆకాశానికి ఎర్రని బొట్టు దిద్దినట్టు ఉన్నాడు!

అదుగో ఇంకోపక్క రేరాజు నా డ్యూటీ టైం అయ్యిందన్నట్టు ఎలా వస్తున్నాడో!” అంటూ చెప్పుకుంటూ పోతోంది నేత్ర.

“నేత్రా! ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉంది కదూ?!” అన్నాడు రిషి.

“అవును రిషీ, నేను ఇప్పుడు కొత్తగా చూస్తున్నాను. కానీ ప్రకృతి ఇంత అందంగా ఉంటుందని నేనెప్పుడూ అనుకోలేదు. కళ్ళు లేకుండా పుట్టానని నన్ను కన్నవాళ్లే వదిలేశారు. అనాధలా పెరిగాను, తల్లి తండ్రి ఎవరో తెలియకుండా. నన్ను ఆదరించిన ఆ ఆశ్రమమే నాకు అన్నీ. కళ్ళు లేవని నేను బాధపడకుండా నేత్రా అనే పేరు పెట్టింది ఆ ఆశ్రమంలో వాళ్ళే. 

        అక్కడే కదా నువ్వు కలిసావు. మొదటి సారి నీతో మాట్లాడినప్పుడే ఎవరో ఆత్మీయుడితో మాట్లాడిన అనుభూతి కలిగింది. నీతో గడిపిన కొద్ది రోజుల్లోనే తెలిసింది నీ గురించీ. అయినా నా ప్రేమని నీకు ఎలా చెప్పాలి? నాలాంటి కళ్లులేని అమ్మాయిని ఎవరు ప్రేమించడానికి, పెళ్ళి చేసుకోవటానికి ముందుకి రారు. నువ్వు మాత్రం ఎలా ఒప్పుకుంటావు? అని ఆలోచించేదాన్ని. కానీ నువ్వు నా కోసం ఇంత చేస్తావని ఎప్పుడూ అనుకోలేదు. నన్ను చెకప్ కోసం డాక్టర్ దగ్గరకి తీసుకు వెళ్లావు, ఎన్నో వైద్య పరీక్షలు చేయించావు. ఇంక లాభం లేదు, నాకిక ఈ జన్మలో చూసే భాగ్యం లేదు అనుకున్న సమయంలో నా చూపు కోసం, నా కోసం నువ్వు ఇంత త్యాగం చేసావు.

       రిషీ! లోకం ఎంత అందంగా ఉందో, నా కళ్ళతో చూడు,  కాదు కాదు ఇవి నీ కళ్ళే కదా, నా బాధ చూడలేక చిన్నతనం నుంచీ నేను చూడని, చూడాలనుకున్న ప్రపంచాన్ని నాకు చూపించాలని నీ కళ్ళను నువ్వు నాకు ఇచ్చావు. నీ ఋణం ఎలా తీర్చుకోగలను రిషీ? నీకు జీవితాంతం ఋణపడి ఉంటాను.” అంది కన్నీటి పర్యంతమై.

      “ఏడుస్తున్నావా నేత్రా! నువ్వలా బాధ పడకూడదు కన్నీరు కార్చకూడదు అనే కదా నీకు కళ్ళు ఇచ్చింది. ఇంకెప్పుడూ నాకు నీ వల్ల చూపు పోయిందని బాధపడకు. మొదటిసారి నిన్ను చూసినప్పుడే నీ మీద మనసు పడ్డాను. నీతో మాట్లాడిన తర్వాత పెళ్లంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. అమ్మా నాన్నా పోయిన తర్వాత అనాధగా మిగిలిన నాకు, అనాధల మీద ప్రేమ కలిగింది. అప్పుడే మీ ఆశ్రమానికి వచ్చాను. అక్కడ నిన్ను చూశాక నాక్కూడా ఎవరూ లేని లోటు తీరిపోయింది. అప్పటినుంచీ నువ్వే నా ప్రపంచం అయ్యావు తెలుసా.

      చూడు! రాత్రయితే ఈ లోకం అంతా చీకటే. అలాగే నువ్వు లేని నా జీవితం కూడా చీకటే. చీకట్లో ఉన్న నాకు వెలుగులా నువ్వు జీవితాంతం తోడుంటావు కదూ. ఆ మాట ఇవ్వు, అది చాలు” అన్నాడు రిషి.

       “తప్పకుండా రిషి, ఇకనుంచి మన ఇద్దరి చూపు ఒక్కటే. ఇద్దరి లోకం ఒకటే. ఈ రంగుల లోకంలో నీకు నేను, నాకు నువ్వు. ఈ కళ్ళే కాదు నా తనువు మనసు, నా జీవితం అన్నీ నీవే. జీవితాంతం పట్టుకున్న నీ చెయ్యి విడవను!” అంటూ ప్రమాణం చేసింది నేత్ర.

                                                                                                                                                                                  

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!