కొత్త రంగులు

కొత్త రంగులు

రచయిత:మౌనవీణ

“పండగ పూట ఇంకా ఎంతసేపు అమ్ములు.. త్వరగా లేమ్మా..” ప్రేమగా నన్ను తట్టి నిద్ర లేపింది అమ్మ.

“పండగా..!” ఆశ్చర్యంగా అడుగుతూ లేచి కూర్చున్నాను.

“ఇవాళ హోలీ కదా బంగారం. మనం కలిసి చేయాల్సిన అల్లరి చాలా ఉంది.. త్వరగా రెడీ అయ్యి రా రా..” నేను అడిగిన ప్రశ్నకు నాన్న పిలుపే సమాధానంగా వచ్చింది.

      ‘హోలీ.. హ్మూ.. చీకటైపోయిన జీవితానికి రంగుల పండుగ అవసరమా.?’ మనసులోనే నిట్టూర్చాను.

      నా మనసును కూడా చదివేసే అమ్మ నా పక్కనే ఉందని మరిచాను. నా తల మీద ప్రేమగా చెయ్యి వేసి నిమిరి “మా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు ఇంకెప్పుడు అలా అనుకోకు” అంటున్న అమ్మ మాట వినగానే నాకు అర్థమైంది నా మనసులోని బాధ తనకు చేరిందని.

      కిందటి సంవత్సరం ఇదే హోలీ నాడు నేను నాన్నతో కలిసి చేసిన అల్లరి గుర్తొచ్చింది. ప్రతియేటా అమ్మతో కలిసి ఇంట్లోనే సొంతంగా రంగులు తయారు చేసుకునే వాళ్ళం. మా ఊళ్ళో ఈ పండుగకు అంత ప్రాముఖ్యత లేకపోయినా కేవలం నా వల్లే మా చుట్టుపక్కల ఇళ్ళ వాళ్లు కూడా రంగుల్లో మునిగి తేలే వాళ్ళు.

     అవును నాకు రంగులు అంటే ఇష్టం. ఇంద్రధనస్సులోని రంగులు ఒకదానితో ఒకటి కలిపి ఇంకా అద్భుతమైన ఎన్నో వింతైన రంగులను సృష్టించడం ఇంకా ఇష్టం. 

     రంగు రంగుల గులాబీలు అంటే ఇంకా ఇష్టం. అందుకే మా పెరడు నా స్వహస్తాలతో నాటిన రంగురంగుల పూల మొక్కల తో నిండిపోయింది.

    రంగులను చూడడమే కాదు, వాటిని వేయడం నాకు ఇష్టమే. ఆ ఇష్టమే నన్ను చిత్రకళ వైపు మొగ్గు చూపేలా చేసింది. రోజంతా వందల్లో ఉన్న రంగుల మధ్య కాలం గడపడమే నా దినచర్య. ఎవరైనా ఏమైనా అడిగినా రంగులతోనే సమాధానం చెప్పేదాన్ని.

రంగులంటేనే ఆనందం..

రంగులంటేనే ప్రేమ..

ప్రకృతి మొత్తం రంగులమయం..

జీవితం ఆ ప్రకృతిలో కమనీయం..

     ఇదే నెల క్రితం వరకు నేను నమ్మిన సిద్ధాంతం. కానీ ఆ యాక్సిడెంట్ నా కలల్ని చీకటిమయం చేసింది. నాలోని చిలిపితనాన్ని అగాధంలోకి నెట్టేసింది. నా పెదవుల మీద చిరునవ్వును మాయం చేసేసింది. ఇప్పుడు నాకు కనిపిస్తున్న రంగు ఒక్కటే.. “నలుపు..”. అవును.. నిజమే..‌ ఇప్పుడు నేను ఏమీ చూడలేను కదా మరి. 

     నాకు ఇంట్లో నుండి బయటకు వెళ్లాలని లేదు. ఎదుటి వాళ్లు చూపించే సానుభూతిని తట్టుకునే శక్తి లేదు. కేవలం అమ్మనాన్నల కోసమే బలవంతంగా లేని సంతోషాన్ని నటించాలని ప్రయత్నించాను.

    అమ్మ సాయంతో రెడీ అయ్యి గదిలో నుండి బయటకు వచ్చాను. అమ్మ చేసిన కమ్మని పాయసం, నాన్న తినిపిస్తుంటే వాళ్ల ప్రేమకు పొంగిపోతూ కడుపునిండా తిన్నాను.

     పెరట్లో వేప చెట్టు కింద కూర్చుని నాన్న చెబుతున్న కబుర్లు ఆసక్తిగా వింటున్నాను. ఒక్కసారిగా నాన్న మాట్లాడడం ఆపేశారు. ఎందుకో నాకు అర్థం కాలేదు.

     ఇంతలో రెండు చేతులు వెనుక నుండి ఏ నా కనులు మూసాయి. ఆ స్పర్శ నాకు తెలుసు. నా ప్రియనేస్తం.. నా ఇష్టమైన సఖుడు.. ‘ఆ స్పర్శకు తెలియదా నా కన్నులు ప్రత్యేకంగా మూయాల్సిన అవసరం లేదని..!? తెలుసు కదా.. మరి ఎందుకిలా చేసాడు.?’ అని ప్రశ్నించాలి అనిపించలేదు.

      ఎప్పటిలాగే తనలో ఏ మార్పూ లేదు. ఆ స్పర్శ నాకు నచ్చింది. నేను తనను గుర్తుపట్టాను అని తనకు అర్ధం అవ్వగానే ఆ రెండు చేతులు నన్ను పైకి ఎత్తుకున్నాయి. ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. ‘ఎక్కడికి..!’ అడగాలనే ఆలోచనే రాలేదు. అమ్మ నాన్నల ముసిముసినవ్వులు నా మనసు తెలుస్తున్నాయి. అరగంటలో బీచ్లో ఉన్నాను నా మనోహరునితో. 

     ఈ నెల రోజుల్లో కొన్ని వేల సార్లైనా నాకు ఫోన్ చేసుంటాడు. మరి తను వెంటనే నేరుగా రాలేనంత దూర దేశంలో ఉన్నాడు. నా జీవితంలో నిండిపోయిన చీకటితో తన జీవితాన్ని కూడా చీకటి చేయాలి అనిపించలేదు నాకు. అందుకే అవాయిడ్ చేశాను. కానీ తనలో ఏ మార్పూ లేదు. నా సమస్య తనకు అసలు సమస్యే కాదు. ఇసుక తిన్నెల మీద నా చెయ్యి పట్టుకుని నడుస్తూ మాట్లాడుతూనే ఉన్నాడు. తన మాటల్లో జాలి లేదు ప్రేమ తప్ప. మళ్ళీ నాకు ప్రపంచం అందంగా అనిపించసాగింది. కాకుంటే ఈ సారి నా కళ్ళకు కాదు.. నా మనసుకు.

      మనసంతా అందమైన రంగులతో నిండిపోగానే హోలీ మునుపెన్నడూ ఎరుగని రంగులతో, కొత్త వెలుగులతో వచ్చినట్లుంది నా జీవితానికి.

 

You May Also Like

2 thoughts on “కొత్త రంగులు

  1. 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👏
    అగాధం లో ఉన్నాం అనుక్కునావారికి ఒక చేయూత నేస్తం…
    ఆ నేస్తం ప్రేమగా పక్కనే ఉంటే చాలు ఏమి లేకపోయినా అన్ని ఉన్నటే సంతోషం మనతోనే ఉంటుంది…
    బాగుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!