(అంశం::”చిత్రం భళారే విచిత్రం”)
చిత్రమైన వాన
రచన:: అమూల్యచందు
అందరి కవితల జడివానలో
నే తడిసి మురిసినట్టు
రాత్రి వర్షానికి
స్నానం చేసిన వీధులన్నీ
ఉదయాన్నే అలాగే
మురుస్తున్నాయ్…
చెట్లన్నీ కురులు
విరబూసుకున్న కవిత్వంలా
పచ్చగా కళకళలాడుతున్నాయ్…
ఇళ్ల గోడలన్నీ సగం తడితో
ఇంకొంచెం పొడితే
కొత్త కవిత్వ
డిక్షన్ కి తెరతీసినట్టు
అదో రకం కొత్తందంతో
మెరిసిపోతున్నాయ్…
వంటగదులన్నీ
పొగలు కక్కే కాఫీలతో,
కమ్మని రుచుల టీలతో,
దోశ, ఇడ్లీ, వడై లతో
వేడివేడి కవిత్వాన్ని
కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, కారప్పొడులతో వడ్డిస్తున్నాయ్…
వాకింగ్ వీరుల
అలసిన బొజ్జల నుంచి
వినిపిస్తున్న ఇస్సు, ఉస్సుల
కవిత్వం…
వీధి టిఫిన్ బళ్ల చుట్టూ
చేరి ప్లేట్లలో
వార్తల్ని కవితాత్మకంగా
తింటూ నవ్వుకుంటున్నాయ్…
వాన ఎప్పుడూ ఓ గొప్ప
కవిత్వమే…
ఒక అందమైన చిత్రమే…
***