ఆరాధన

(అంశం:: “నా ప్రేమ కథ”)

ఆరాధన

రచన: లోడె రాములు

నూనూగు మీసాలతో అప్పుడప్పుడే కాలేజీ చదువు కోసం పట్నం బాట పట్టడానికి.. బలవంతంగా అమ్మానాన్నలను ఒప్పించి ఊపిరి తీసుకుంటున్న వేళ…
వేసవి కాలం పల్లెటూళ్లలో ఇంటి వాకిల్లలోనే,వీధి వీధంతా వరసగా పక్కలు పరచుకొని, వెన్నెల వెలుగుల్లో ఆట పాటలు, కథలు, కబుర్లు, తాగినోళ్ల తందనాలు, పిల్లల దోబూచులాటలు, రోజూ ఇలాగే అంతా సందడిగా ఉంది… కానీ ఈ రోజు ఏదో ప్రత్యేకంగా అనిపించింది.అంతలోనే ఆకాశంలో
ఒక మెరుపులా తెల్లని దుస్తుల్లో మెరిసే అందమైన జాబిలి మా ఇంటి ముందు మయూరంలా నడుస్తుంటే.. ఒక్కసారి మనసు దూది పింజంలా ఆమె చుట్టూ పరీక్షిస్తూ ప్రదక్షిణలు…
రాత్రంతా ఈ అమ్మాయి ఎవరై ఉంటుందని ఆలోచిస్తూనే ఉన్నాను
“ఎన్నడూ.. లేనిది ఏందిరా.. పొద్దు పొద్దున లేచి తయారై కూర్చున్నావు.ఎక్కడికన్నా పోతావా ఏందీ..?”
“ఎక్కడికి లేదమ్మా.. ఊర్లనే మా యువత కార్యక్రమాలు.. రెండ్రోజుల్లో వేసే నాటకం.. పనులు ఉన్నాయి…”..
“అదా.. సంగతి.. ఊరిని ఉద్దరించడమే, కానీ ఇంటి పనులు..పొలం పనులకు ఆసరా కావు.. ఎంతని తండ్లాడాలిరా, మీ అయ్యా.. నేనూ..”
“ఏందే.. వాడు రాత్రేగా పట్నం నుంచి వచ్చింది..అయినా వాడికేం పనులు వచ్చు.. ”
“హా.. వాడిని నువ్వు లాడ్ చేయబట్టే.. ఊరేగుతుండు.. వాడిని మందలిచ్చేటప్పుడు నడుమ రాకు అత్తమ్మా..”
“ఆ..ఆహా.. చెప్పొచ్చినవ్..”
నాన్నమ్మ కు నేనంటే ప్రాణం నా మీద ఈగ వాలనీయదు.. అమ్మ అన్నది నిజమే. నేను ఇంట్లో ఉండడం కన్నా ఊర్లో ఉండడమే చాలా ఎక్కువ..
(ఈ అలవాటు నాకు చిన్నప్పటి నుండి అలవడింది.చిన్నప్పుటి నుండి చిత్ర కళ మీద మక్కువ.. మా ఊర్లో చేయి తిరిగిన చిత్రకారుడు, కళాకారుడు, రాజకీయ చతురుడు, అందగాడు, మంచి వక్త అన్ని ఆటల్లో ఆరితేరిన వ్యక్తి బోయిని కృష్ణన్న..నా అభిరుచులు కూడా దాదాపుగా అవే కావడం వల్ల మా నాన్న తన వద్ద శిష్యరికం కుదిర్చాడు. ఆయనంత మహానుభావున్ని కాలేదు.. కానీ ఇప్పటికీ ఆయన స్ఫూర్తే నాకు మార్గదర్శకం..)
ఈ అత్తా కోడళ్ల వాదులాటలు మామూలే.. అని ఊర్లోకి బయలుదేరుతూ.. ఓరచూపులతో పరిసరాలను గమనించాను. ప్చ్..
రాత్రి కన్పించిన నెలవంక.. ఉదయం కన్పించదేమిటి..?అనుకుంటూ వెళ్ళాను..
ఊర్లో మిత్రులతో కల్సి తొలిసారిగా నా దర్శకత్వం లో ఓ నాటికను ప్రదర్శిస్తున్నాం,.దానికి సంబంధించిన పనులను చూసుకొన్నాను.. నాటికను విజయవంతం చెయ్యాలని అందరం పట్టుదల తో ఉన్నాం..
మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చే సరికి ఇంటి నిండా సందడి, మా అమ్మ, చెల్లెండ్రు, చుట్టుపక్కల పిల్లల మధ్య నెలవంక,కనులు మిరుమిట్లు కొడుతుంది.. సిగ్గుపడటం నా వంతు అయ్యింది..
“ఒరేయ్… అలా.. జారుకుంటావేందిరా.. ఈ అమ్మాయిని గుర్తుపట్టలేదా..మన ఎదురింటి అమ్మాయిరా.. చిన్నప్పుడే వాళ్లు పట్నం పోయిండ్రు.నీకు వరసకు మరదలు అయితది.. మీరిద్దరు కలసిమెలిసి ఆడుకునేటోళ్లు..”హయ్ “చెప్పి సన్నగా నవ్వాను.. ఆ చీమిడి ముక్కు.. నెలవంక గా మారిందేమిటి.. అని ఆలోచన..
సాయంత్రం మెల్లగా ఇంటి అరుగు మీద కూర్చొని మాటలు కలిపాను..
మనసు ఇంకా పసితనమే.. తల్లి చాటు బిడ్డ.. భయం భయం గా ఉంటుంది.. పొడి పొడి మాటలే మాట్లాడి మబ్బుల చాటు కెళ్లింది..
రాత్రి షరా మామూలే వీధి అంతా హడావిడి. ఎవరి గోల వారికానందం. నెలవంక తో మా చెల్లెండ్రు బాగా కలసిపోయారు.. వారికి తానో అద్భుతం..ఓ సితార ను చూస్తున్నంత సంతోషం..
తెల్లారితే నాటిక సన్నాహాలు.. ఊరంతా బాగా ప్రచారం జరిగింది.. అప్పట్లో ఇంకా టీవీ ప్రభంజనం రాలేదు.. ప్రజలకు వినోదం ఎక్కువగా యక్షగానాలు,
బాగవతాలు, బుర్రకథలు, సందర్భానుసారంగా ప్రదర్శనలు ఇచ్చేవారు.. నాటికలు ఎక్కువగా ఎప్పుడో వచ్చే సంచార జాతుల వారు ప్రదర్శనలు ఇచ్చేవారు.. అప్పుడు మేము వేసిన నాటిక పేరు ధరిత్రి.. యండమూరి గారి కథ కు నేను సంభాషణలను,సన్నివేశాలను వ్రాసుకొని.. నాతోపాటు ఉండే యువత కు శిక్షణ ఇచ్చి, తెర లేపడం నుండి దర్శకత్వం వరకు, మిత్రుల సాయంతో భాద్యతలు.. అందులో హీరో పాత్ర పోషణ నాదే.
ఆ రోజు రంగస్థలం పూర్తిగా కిక్కిరిసి పోయింది.. నాటకం రసవత్తరంగా సాగుతుంది.. గ్రామీణ నేపథ్యంలో ఊరి భూస్వామి,సర్పంచ్ గ్రామంలోఆయన చేసే అరాచకాలను.. అన్యాయలను ఎదురించే వారిని ఎక్కడికక్కడ అణచి వేస్తూ.. ప్రజలను చదువు లేని దద్దమ్మలను చేసి తన అధికారాన్ని చేలాయించు కొంటున్న సమయానికి హీరో ప్రవేశం.. ప్రజలను చైతన్య పరచడం.. స్కూల్ తెరిపించడం.. అడుగడుగున సర్పంచ్ ను అడ్డుకోవడం..చిరంజీవి లెవల్లో హీరో పాత్రలో జీవించాను.. నాటిక నా నెలవంక కూడా చూస్తుంది కదా అన్న ఉత్సాహం.చివరికి సర్పంచ్ హీరోను ఓ హత్యా కేసులో ఇరికించడం.. హీరోకు ఉరిశిక్ష పడటం.. ఆ తర్వాత ఊరి జనమంతా సర్పంచ్ ను తుదముట్టించడం..నాటిక క్లుప్తంగా ఇది.. ప్రజలు లీనమైనారు..
అందరూ.. అప్పట్లో ఊరి ఊరికి ఇలాంటి భూస్వాములే ఉండేవారు.
నాటిక అయిపోగానే జనం మొహాల్లో ఒక బాధ.. దిగులుతో వెళ్లారు… ఎందుకో అప్పుడు అర్ధం కాలేదు…
ఉదయం.. నెలవంక మా ఇంట్లో కి పరుగు పరుగున వచ్చి నా చేతిలో ఓ కాగితం పెట్టి అంతే స్పీడ్ తో వెళ్ళింది.. “రాత్రి మీ నాటిక చాలా బాగుంది.. ఓ సినిమా చూసిన అనుభవం.. కానీ చివరికి మీకు ఉరిశిక్ష పడటం.. అస్సలు బాగలేదు.. చాలా బాధ అనిపించింది. మీరంటే నాకు చాలా ఇష్టం.. మళ్లీ ఇంకెప్పుడూ ఇలా సుఖాంతం అయ్యే పాత్రలు వెయ్యకండి.. రెండ్రోజుల్లో పట్నం వెళ్లిపోతున్నాం.. చాలా ఏండ్ల తర్వాత మిమ్మల్ని చూశాను. మనసు ఆనందంగా ఉంది.. సెలవులోచ్చినప్పుడల్లా, ఊరోస్తాను మీ కోసం..పట్నం లో కలవడం కుదరదు. ఇంటి గడప దాటనివ్వరు అమ్మ నాన్న..”.. సంతకం లేని లేఖ
మనసు ఒక్కసారి నెలవంక పై విహరించిన ఆనందం.. విశ్వ విజేత కూడా ఇంత సంతోషించి ఉండడు.
ఆ రెండ్రోజులు ఇల్లు కదిలింది లేదు. తాను వెళ్లే వరకు కంటికి రెప్పలా తనను గమనిస్తూ… అనుసరిస్తూ.. కళ్లతో మాటాడుకుంటూ..
వీలుదొరికినప్పుడల్లా ప్రేమ లేఖలు రాసుకుంటూ..ఒక జన్మకు కావాల్సినంత జ్ఞాపకాలను జమ చేసుకొని, బాధతప్త హృదయం తో వీడ్కోలు పలికాను..
ఆనాటి తొలిప్రేమ ఇప్పటికీ మా ఇరువురికి అదే ఆరాధనగా మిగిలింది.ప్రేమ పెళ్లిగా మారాలంటే సవాలక్ష కారణాలు..ప్రేమించడం చాలా తేలిక..ప్రేమను గెలిపించు కోవడమే,..కత్తి మీది సాము…

*****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!