దుమ్ము దులిపెయ్…!

దుమ్ము దులిపెయ్…!

రచయిత ::చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

chaitra sri

బూజుపట్టిన ఇల్లును దులుపుతూ కష్టపడుతున్న రజియా దగ్గరకి పొరుగింటి రమీజ వచ్చి నువ్వు దులపాల్సింది ఇంటి దుమ్ము కాదే మీ ఆయన కు పట్టిన వ్యసనాల దుమ్ముని అన్నది.”ఏంటి పిన్ని నువ్వనేది.మా ఆయనకేం బంగారం అయితే”అని రజియా మొగుడిపై నమ్మకంతో మాట్లాడింది.”అలాగే నమ్ము నీకూ నిజం తెలిసినప్పుడు అప్పుడు తట్టుకోలేవు”అంటూ లేనిపోని అనుమానాలను రేకెత్తించింది రమీజ.నేనూ ఆయన ప్రేమించి పెళ్ళిచేసుకున్నాం.నేనంటే ఆయనకి పిచ్చి ప్రేమ. నాక్కూడా ఆయనంటే పిచ్చి ప్రేమ.మా మధ్యలో లేని పోనివి చెప్పి కాపురంలో చిచ్చు పెట్టకు అంటూ రమీజ ఏం చెప్పబోతుందో కూడా వినకుండా రజియా తిట్టి పంపేసింది.రజియా భర్త సమీర్ రానే వచ్చాడు.ఏంటే డల్ గా ఉన్నావ్ అంటూ భుజాలు పట్టుకొని మెడమీద నెమ్మదిగా ముద్దు పెట్టాడు.రజియా తన్మయత్వంతో సమీర్ ను గట్టిగా హత్తుకొని ముద్దులతో ముంచెత్తింది. అలా ఇద్దరూ ఒకరినొకరు శారీరకంగా పలకరించుకుంటుండగా రమీజ వచ్చి తలుపు తట్టడంలో వాళ్ళ ఏకాంతానికి తెరపడింది.రజియా చెమటలు తుడుచుకుంటూ తలుపు తీసింది.రమీజ ఎవరో కాదు సమీర్ కి దూరపు చుట్టం వరుసకి అక్క. రమీజ నేరుగా సమీర్ దగ్గరకి వచ్చి “ఏరా సమీర్ నిన్న ఎవర్రా నీ బండిపై ఎక్కించుకొని వెళ్తూ ఉన్నావ్.నిన్నెవరూ అడగరనా.రజియా అమాయకపు పిల్ల” అంటూ అడగడంతో సమీర్ కి విపరీతమైన కోపం వచ్చింది.అక్కా నీ ఇంట్లో గంపడు బురద పెట్టుకొని మా మీద ఎందుకు పడతావ్.నీ పని నువ్వు చూసుకో అంటూ అసలు విషయాన్ని తోసిపుచ్చాడు.

రజియా ఆలోచనలో పడింది.సమీర్ పనికెళ్ళాడు.రోజంతా అదే ఆలోచిస్తూ అన్నం సరిగా తినక కళ్ళు తిరిగి పడిపోయింది.సమీర్ రావద్దన్నప్పటి నుంచి రమీజ వాళ్ళింటికి రావట్లేదు.రజియా ఒంటరిగా ఇంట్లో అచేతనంగా పడి ఉంది.

మధ్యాహ్నమయింది.పక్కనే ఉన్న క్రికెట్ గ్రౌండు నుంచి వికెట్లకు గిరాటెయ్యాల్సిన బాల్ నేరుగా సమీర్ వాళ్ళ కిటికీ అద్దాన్ని గిరాటేసింది.ఆ శబ్ధానికి పక్కింటి ఫాతిమా వచ్చి చూసి ఇంట్లో ఎవరూ లేరనుకొని బయట బాతాకానీకి వెళ్ళిపోయింది.బాల్ కోసం వచ్చిన బుడ్డోడొకడు రజియా పక్కనే ఉన్న బాల్ తీసుకొని వెళ్ళిపోయాడు.సాయంత్రం అయిపోయింది.
మాటామాటల్లో రమీజాతో ఫాతిమా మీ వదిన మరదలు ఇంట్లో లేదా అంది.ఉందే ఎక్కడికీ వెళ్ళదు అని రమీజా అనడంతో ఫాతిమాకి అనుమానం వచ్చి ఇందాక బాల్ తగిలి అద్దం పగిలితే కనీసం తలుపు దగ్గరికి కూడా రాలేదు అని మాట్లాడుకుంటుండగా బాల్ తెచ్చుకున్న బుడ్డోడు ఆంటీ పైనున్న రజియా ఆంటీ కింద పడిపోయి ఉండింది అని చెప్పడంతో రమీజ ఫాతిమా పరుగు పరుగున వెళ్ళారు.రజియాని చూసి రమీజా కళ్ళు చెమర్చాయి.వెంటనే హాస్పిటల్లో చేర్చి సమీర్ కి ఫోన్ చేసింది.రజియా గర్భంతో ఉందనీ,ఏదో లోతుగా ఆలోచిస్తూ అన్నం సరిగా తినలేదనీ అందుకే నీరసంతో అలా పడిపోయిందని డాక్టర్ చెప్పడంతో సమీర్ అలా ఏమీ ఆలోచించదు డాక్టర్ అంటూ వాపోయాడు.కానీ రమీజ నీ గురించే ఆలోచించి అలా పడిపోయుంటుందిరా అంటూ దెప్పిపొడవడంతో సమీర్ నువ్వు దానికి లేనిపోనివి చెప్పి చెడగొట్టావా నువ్వనుకున్నట్లు ఆ అమ్మాయికి నాకూ ఎటువంటి సంబంధం లేదే అక్క.సరే ఇంటికి పదండి ఇద్దరికీ అసలు విషయం చెప్తా అంటూ ఇంటికి వెళ్ళారు.
రెండు రోజులు గడిచినా రజియా ఏదో డల్ గానే ఉన్నట్లనిపించింది సమీర్ కి.వెంటనే రజియా రమీజాని తీసుకురాపో మాట్లాడాలి అని పంపాడు.ఈలోపు సమీర్ బైక్ పై ఎక్కించుకున్న అమ్మాయి అలీషాకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి ఇంటికి రమ్మని చెప్పాడు.ఇంతలో రజియా రమీజ ఇద్దరూ వచ్చారు.సమీర్ రజియా ని కుర్చీలో కూర్చోబెట్టి “ఏమే..నా మీద ఏదైనా అనుమానం ఉంటే చెప్పు.నువ్వు లోపలే ఆలోచించి ఇబ్బంది పడకు.నువ్వు వట్టి మనిషివి కూడా కాదు” అన్నాడు.
రజియా”నాకే అనుమానం లేదండి.మీమీద చాలా నమ్మకం.కానీ మిమ్మల్ని రమీజ పిన్ని అడిగినప్పుడు మీరు కోపంగా తిట్టి పంపేయడంతో ఆ అమ్మాయెవరోనని ఆలోచనలో పడ్డాను అంతే” అంది.రమీజ “ఒరేయ్ నేను చూసి అడిగాను తప్ప మీ మధ్యలో గొడవలు పట్టాలని కాదు అంటూ తప్పు చేశానన్నట్లు మాట్లాడడంతో సరే అక్క నేను చెప్పేది విను ఆ అమ్మాయి ఎవరో కాదు మా ఓనర్ కూతురు అలీషా.నన్ను అన్నా అని పిలిచే చెల్లెలు.అంతే కాని మీరనుకొన్నట్లు కాదు అంటూ నిజం నిగ్గు తేల్చాడు.ఇంతలో అలీషా వచ్చి ఏం భయ్యా రమ్మన్నావ్ అంటూ మాట్లాడింది.సమీర్ ఏం లేదు అలీషా రజియాకి మూడోనెల నువ్వు డాక్టర్ చదువుతున్నావ్ కదా సలహాలు ఇస్తావని అంటూ సర్దేశాడు.భర్తని అనుమానించి తప్పు చేశానని దులపాల్సింది నా భర్త దుమ్ము కాదు నా మెదడులో పేరుకున్న అనవసరపు ఆలోచనల దుమ్ముని అనుకుంటూ చెప్పుడు మాటలు వినకూడదని నిశ్చయించుకొని పొట్టపై చేతిని పెట్టుకొని బిడ్డ రూపాన్ని ఊహించుకుంటూ అలీషా చెప్పిన సలహాలను విని కృతజ్ఞతలు తెలిపింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!