ప్రేమలేఖ (భర్తకి కాదు అత్తకి)

ప్రేమలేఖ (భర్తకి కాదు అత్తకి)

రచయిత ::నాగ మయూరి

రమణమ్మ మనసు మంచిదే అయినా మాట మాత్రం కటువు. ప్రతీ చిన్న విషయంలోను తనమాటే నెగ్గాలి అనే మొండి ఘటం. ఆ మొండి తనంతో రమణమ్మని అందరూ గయ్యాళిగా ముద్ర వేశారు.

ఆమె భర్త రామం ఎంతో సౌమ్యుడు. భార్య నోటికి దడిచి ఏనాడు ఎదురు మాట్లాడేవాడు కాదు.

వారి ఒక్కగానొక్క కొడుకు బాలు. తండ్రి లాగానే అత్యంత సౌమ్యుడు. బాలుకి పెళ్ళి కుదరగానే ఊళ్ళో జనాలంతా గుసగుసలు మొదలు పెట్టారు. “పాపం వచ్చే పిల్లని రమణమ్మ ఎన్ని బాధలు పెడుతుందో” అంటూ…

తీరా ఆవివాహ తంతు ముగిసి , కొత్త కోడలు వసుధ ఆ ఇంటికి రానే వచ్చింది. కానీ రమణమ్మ అందరూ ఊహించినట్లు కోడలిని ఇబ్బంది పెట్టట్లేదు సరికదా ఆమెని ఎంతో ప్రేమగా చూసుకుంటోంది.
ఇదివరకటి లాగా భర్తని కూడా అన్నింటికీ సాధించడం మానేసి ఎంతో గౌరవంగా చూస్తోంది. చుట్టు ప్రక్కల వారితో కూడా చాలా మర్యాదగా మాట్లాడుతోంది.

ఇదంతా చూసి రామం, బాలులు చాలా ఆశ్చర్యపోయారు. ఈ మార్పుకి కారణం వసుధే అయ్యుండచ్చు అని గ్రహించారు.
ఇంక ఉండబట్టలేక రామం ఒకరోజు భార్య లేని సమయం చూసి, కోడలు వసుధతో “అమ్మా మీ అత్తగారిలో ఇంత మార్పు ఎలా సాధ్యం?..ఏమి చేశావు? అంటూ ప్రశ్నించాడు”.

దానికి వసుధ నవ్వుతూ ఇలా సమాధానం చెప్పింది.ఏమి లేదు మామయ్య గారు మా పెళ్ళికి ముందు తెలిసిన వాళ్ళు అందరూ అత్తయ్యగారి గురించి చాలా చెప్పారు. అలాంటి గయ్యాళికి కోడలిగా పంపితే మీపిల్ల సుఖపడదు అంటూ అమ్మకి ఉచిత సలహలిచ్చారు.
అదంతా విన్న మానాన్న గారు చిన్ననాటి స్నేహితుడికి ఇచ్చిన మాట కాదనలేక, నాభవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న భయంతో….పెళ్ళి చేయాలా,వద్దా అని సతమతమవుతున్నారు.
సరిగ్గా అదే సమయానికి మీరు మా ఇంటికి వచ్చి, అత్తయ్య గుణగణాల గురించి వివరంగా మానాన్న గారితో మీరు మాట్లాడిన విషయాలు అన్నీ నాన్న నాతో చెప్పి. ఒక్క రమణమ్మ గయ్యాళి తనం గురించి తప్ప,వేరే ఏ వంక పెట్టడానికి లేని మంచి సంబంధం.అయినా “నువ్వు ఆ ఇంటి కోడలిగా వెళితే మీ అత్తయ్యని మార్చి నా స్నేహితుడు సంతోషంగా ఉండేలా చెయ్యగలవన్న నమ్మకం నాకుంది” అని చెప్పారు.

అప్పుడే అత్తయ్య మనస్తత్వం ఏమిటి అనే అంచనాకి వచ్చాను.ఆమెను ప్రేమతో మాత్రమే గెలవగలం అని నాకు అనిపించింది. వెంటనే అత్తయ్య గారికి కాబోయే కోడలిగా ఆవిడ లోని మంచిని పొగుడుతూ,చెడుని సున్నితంగా ఎత్తిచూపుతూ… వివాహనంతరం నేను మీ అడుగుజాడలలోనే(మంచి-చెడు రెండిటిలో) నడుస్తూ,మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మంచి భార్యగా,మంచి తల్లిగా, పరిపూర్ణ మహిళగా ఉండాలను కుంటున్నాను.కాబట్టి నాకు మీరే గురువు అంటూ అత్తయ్య కి ఒక లేఖ రాసాను అంతే మామయ్యగారు.బహుశా ఆ లేఖలోని ఆంతర్యం అత్తయ్యకి అర్థమయ్యి వుండచ్చు అంది వసుధ.

పెళ్ళికి ముందు ఎవరైనా కాబోయే వాడికి ప్రేమలేఖ రాస్తారు కానీ నువ్వు ఏంటే మా అమ్మకి రాసి బుట్టలో వేసుకున్నావు అంటూ బాలు…
మొత్తానికి ఆ గడసరి అత్త తిక్క కుదిర్చే సొగసరి కోడలే వచ్చింది మా ఇంటికి అంటూ రామం ఆనందించారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!