ఆత్మీయ స్పర్శ

ఆత్మీయ స్పర్శ

రచయిత ::స్వాతికృష్ణ సన్నిధి

రాత్రి ఒంటిగంట కావస్తోంది.ప్రశాంత్ కి నిద్ర పట్టక ఏదేదో ఆలోచిస్తూ బెడ్ రూమ్ కిటికీ నుండి బయటకు చూస్తున్నాడు.పల్లెటూరు కావడం వల్ల ప్రకృతి పచ్చదనంతో మెరిసిపోతున్నా అతను మునుపటిలా ఆస్వాదించలేకపోతున్నాడు..
ఆలోచనలకు స్వస్తి పలికే క్రమంలో పుస్తకం
చదువుదామని షెల్ఫ్ లో నుండి తీసిన పుస్తకాన్ని తెరవగానే కనిపించిన అక్షరాలు మనసు పొరల్లోకి చొచ్చుకునివెళ్ళి గతానికి తెరతీసాయి..
సీత ఒక సామాన్య గృహిణి. మధ్యతరగతి కుటుంబం. భర్త,పిల్లలతోనే తన ప్రపంచం.తనకున్న లోటంతా బాధ,సంతోషం పంచుకునే తోడు లేకపోవడం.భర్త ఆఫీస్ నుండి ఏ రాత్రికో వస్తారు.పిల్లలు అర్థం చేసుకునేంత పెద్దవారు కారు.
అప్పుడప్పుడు ఆమె రాసుకునే కవితలే తనకు తోడయ్యాయి. ఇలా సాగిపోతుండగా..
ఒకరోజు సీత పక్క ఊరిలో ఒకరు చెస్ నేర్పుతున్నారని తెలిసి పిల్లలకు చెస్ నేర్పించేందుకు అక్కడకు తీసుకెళ్లింది.
కోచ్ ప్రశాంత్ చాలా సౌమ్యంగా మాట్లాడారు.ఆరోజు నుండి పిల్లల్ని చెస్ క్లాసులకు తానే స్వయంగా తీసుకెళ్లేది.ఆ క్లాస్ సమయంలో ఖాళీగా కూర్చోలేక తనకు ఇష్టమైన కవితల్ని రాసుకుంటుండగా సాహిత్యం,పుస్తకాలు చదవడం,ప్రకృతిని ఆస్వాదించడం అంటే ఇష్టమున్న ప్రశాంత్ సీతకు ఏవేవో సూచనలు,సలహాలు ఇస్తూ ఉండేవాడు.ఇలా వారి పరిచయం స్నేహంగా మారింది.స్నేహం తర్వాత ప్రేమ అనుకుంటారు.కానీ అందరూ అలా వుండరు కదా.సీత మనసులో ఒక ఆలోచన.తనకంటూ సొంత అన్నయ్య ఉంటే ఇలాగే సలహాలు ఇస్తూ ప్రోత్సహిస్తూ ఉండేవాడు.లేని అన్నయ్య కోసం బాధపడే బదులు దేవుడు ఇచ్చిన అన్నయ్యతో ఉంటే …అనుకుంటూనే ప్రశాంత్ కి విషయం చెప్పింది.
తనకు కోపం ఎక్కువని,చెల్లిగా అనుకుంటే తిడతాను,నా ధాటికి తట్టుకోలేకే నాతో అతికొద్ది మంది మాత్రమే స్నేహం చేస్తారు అన్నా కూడా అదంతా తెలియదు.నువ్వే నా అన్నయ్యవు అని పట్టు పట్టిన ఆ దేవిడిచ్చిన చెల్లెల్ని మురిపెంగా చంటి పిల్లలా చూసుకుంటూ సీత కవితల్లో రాణించడానికి తనవంతు కృషి చేస్తూ ఉండేవాడు.తానే కాదు ప్రశాంత్ వాళ్ళ అమ్మ లలితమ్మ గారు కూడా సొంత కూతురిలా చూస్తూ ఆమె కూడా మంచి,చెడు చెప్తూ ఉండేది.ఇలా మరీ ఎక్కువ కాకపోయినా కాస్త పేరు తెచ్చుకుంది సీత.ఇక తనకు ఒంటరితనం లేదు అన్నయ్య తోడున్నాడు అని మురిసిపోయేది.
కానీ అన్నయ్య ఎప్పుడు ఆ అధికారంతోనే ఆలోచిస్తాడు.చెల్లిని పొగిడితే తన కెరీర్ కు బ్రేక్ ఇస్తుందేమోనని మెచ్చుకునేవాడు కాదు.ఇంకా పైకి రావాలి.మంచి పుస్తకాలు రాసి పదిమందికి ఆదర్శంగా నిలవాలి అనేవాడు.
సీత మనసులో దేవుడికి ఉన్నంత స్థానం అన్నకు ఇచ్చిందేమో అమితమైన ప్రేమ పెంచుకుంది అన్నపై…అన్నయ్యకు ఏ కష్టం వచ్చినా తన కంట్లో నీరు వస్తుంది..
ఒకరోజు మాటల్లో సీతను ప్రశాంత్ తిట్టాడు.కారణం కొద్ది రోజుల నుండి ఆమె ఏమి రాయడంలేదు,చదవడం లేదు. అందుకని ఏమి రాస్తున్నావు.నా మీద నీకున్న పిచ్చిని కవితల మీద మలచుకుంటే కోరుకున్న భవిష్యత్ వస్తుంది అంటూ ఏదేదో తిడుతున్నాడు. సీతకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.మెదడు మొద్దుబారినట్టు,కాళ్ళ కింద ప్రళయంలా ఏదేదో అయిపోతోంది.తన ప్రేమను పిచ్చిగా అన్నాడని మాత్రమే ఏడుస్తోంది.
అంతే ఆరోజు నుండి చిన్న విషయాన్ని కూడా ప్రశాంత్ దగ్గర దాచని సీత ఏది చెప్పడం మానుకుంది. కాలక్రమంలో రాకపోకలు,మాటలు కూడా తగ్గిపోయాయి.సీతకు గుండెలో మాత్రం ఆ బరువు అలాగే ఉండిపోయింది.అక్కడ అన్నయ్య పరిస్థితి అలాగే ఉంటుందని తెలిసినా అన్నయ్య ఫోన్ చేయచ్చు కదా అనుకుంటూ కాలం గడిపేసేది.కానీ గొడవ జరిగిన మొదట్లో ఫోన్ చేసినా సీత తియ్యలేదు అనే విషయాన్ని మర్చిపోయింది.ఏదైతేనేమి చిన్న అపార్థానికి అనుకోని అగాధం ఏర్పడింది.
సీత రాసే కవితలతో ఇంకొంచెం పేరు వస్తోంది.ఒకసారి సీత కాస్త వేరే ఊళ్ళో బ్యాంక్ పని ఉండి ఆటోలో ఎక్కింది.దారిలో ప్రశాంత్ వుండే ఊరిని చూసి కాస్త బాధ పడుతూ కొంచెం జరగండి అని పక్క పాసింజర్ మాటతో మామూలవుతుంది.ఇంతలో చేతి నుండి జారి కిందకు పడ్డ వాచ్ ని తీసుకోబోతే పక్కనే ఒక పాసింజర్ తాలూకు బ్యాగ్ కి ఆనుకుని ఉన్న ఒక డైరీని సీత గమనించి తీసి మీదా అని పక్కవారిని అడుగుతుంది.ఎవరు కాదని చెప్పడంతో తెరిచి చూస్తూ ఒక్కసారిగా నిర్ఘాంతపోతుంది.అది ప్రశాంత్ దస్తూరితో ఉన్న పుస్తకం.ప్రతీ పేజీ చదువుతుంది సీత. సీత,ప్రశాంత్ ల మధ్య జరిగిన సంభాషణలే ఆ డైరీని పరచుకున్నాయి.ఒక దగ్గర “నువ్వు అడపిల్లవి రా అందుకే నువ్వు నా మీద ప్రేమను చెప్పుకుంటావు.నేను మనసులో దాచుకుంటాను.చెప్పలేనంత మాత్రాన ప్రేమ లేనట్టు కాదు.నువ్వు నా చెల్లెలివి రా నీ కెరీర్ బావుండాలని బాధ్యతగా ఉంటాను.అందుకే ప్రశంస కంటే ఎక్కువ తిడుతూనే ఉంటాను”.అన్న మాటలు చూసి దుఃఖం పొంగుకు వచ్చింది. ఇంకోచోట నా మీద పిచ్చి కవితల మీద మరల్చు అన్నది నిన్ను బాధ పెట్టాలని కాదు.నేను నిన్ను ఉన్నతంగా తీర్చాను అనుకోవాలి కానీ ఎవరూ తప్పుగా అనుకోకూడదు.నా కోసం ఆలోచిస్తూ విపరీత ప్రేమను పెంచుకుంటే అది నేను ఆశించిన విజయం కాదు.నా బాధ్యతకు న్యాయం జరిగినట్టు కాదు.అందుకే ప్రేమను గుండెలోని దాచుకుని కటువుగా వున్నాను.నువ్వు నన్నొదిలి వెళ్లినంత మాత్రాన నేను నిన్నొదిలితే అన్నయ్యగా నేను నీ బాధ్యత తీసుకున్నట్టు ఎలా అవుతుంది. నువ్వు మాట్లాడకపోయినా నీ గురించిన విషయాలన్నీ నీ భర్త రాం ద్వారా తెలుసుకుంటూనే వున్నాను.ఎప్పటికైనా నువ్వొస్తావని తెలుసు.అందుకే నేను నిబ్బరంగా వున్నాను.చిన్నపిల్లలా చూసుకున్నప్పుడు తండ్రికి పిల్లలపై కోపం ఉంటుందా.ఇదీ అంతే” ఈ అక్షరాలు చదువుతుంది కానీ కాలువ కడుతున్నాయి నీళ్లు.
ఇంటికి వచ్చి రాం ని అడిగేసరికి తనలాంటి మంచివాడు ఉండడని,అన్నయ్యా అని పిలిచినా ఏదో ఒక సందర్భంలో అడ్వాంటేజ్ తీసుకునే రోజుల్లో తనలాంటి మనిషి నీకు అన్నగా లభించడం నీ అదృష్టం అని, చెప్పేసరికి చేసిన తప్పును తెలుసుకుని సిగ్గుతో కుమిలిపోతుంది.అన్నయ్య ఎలాగైతే నా గురించి తెలుసుకుంటూ చెప్పద్దని మాట తీసుకున్నాడో అలాగే నేను అర్థం చేసుకున్నట్టు కూడా చెప్పద్దు.ఇప్పుడు అన్నయ్యను కలిసేకంటే తనకు నచ్చిన తను మెచ్చే చెల్లిలా వెళ్తాను అని రాం ని ప్రాధేయపడుతుంది.ప్రశాంత్ చేజార్చుకున్న డైరీని తలచుకుని బాధ పడినా రాం మాత్రం భార్యకు ఇచ్చిన మాట కోసం డైరీ పోలేదు,మంచే చేసిందన్న విషయాన్ని చెప్పడు..
రెండు సంవత్సరాలు గడుస్తాయి.సీత కొత్త తేజస్సుతో వెలుగుతూ అన్నయ్య నేర్పిన అక్షరాలు పేరిట మంచి పుస్తకాన్ని రాస్తుంది.అది మంచి ప్రాచుర్యం పొంది గొప్ప పేరు వస్తుంది.ఇంకో పక్క ప్రభుత్వ ఉద్యోగినిగా అవ్వాలని పట్టుదలగా చదివి ఉద్యోగం సాధిస్తుంది.ఉద్యోగ బాధ్యతలు ఒకవైపు,పుస్తకాలు రాయడం మరోవైపు, ఇంటి బాధ్యతలు ఇంకోవైపు ..ఇలా బిజీ జీవితాన్ని కదా అన్నయ్య కోరుకున్నది .సవ్యసాచిలా నేను మారాలని,అందరికి ఆదర్శంగా ఉండాలని,కదా.ఇప్పుడు అన్నయ్య గర్వపడే రోజు వచ్చింది,ఉద్యోగపు ఆర్డర్,పేరొందిన పుస్తకం అన్నయ్యకు కానుకిచ్చే రోజు వచ్చింది అనుకుంటూ ఎప్పుడెప్పుడు అన్నయ్య కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి అని ఆలోచనల్లో తేలుతుండగా గోడకు వేలాడుతున్న గడియారపు శబ్దం తన ఆలోచనల్ని భగ్నం చేసి ఒంటిగంట అయ్యిందని చెపుతుంది. మనసు నిలవని సీత ,రాంని లేపి అన్నయ్య దగ్గరకు తీసుకు వెళ్ళండి అనగానే ఉదయం వెళదాం అని చెప్పబోయి తన ఆరాటాన్ని అర్థం చేసుకుని ప్రశాంత్ ఇంటికి తీసుకువెళ్తాడు.
కాలింగ్ బెల్ శబ్దానికి గతపు ఆలోచనల నుండి బయటకు వచ్చి ఈ రాత్రి ఎవరా అనుకుంటూ తలుపు తీసేసరికి రాం కనబడతాడు.ఒక్కసారిగా ఏం జరిగింది.సీత ఓకేనా అంటూ కంగారుగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ప్రశాంత్ ని చిరునవ్వుతో చూస్తున్న రాం వెనుక నుండి వస్తున్న సీతను చూసి ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలితాన్ని చూసి ఆనంద భాష్ఫాలు రాలుస్తూ ఏరా తల్లి అంటున్న ప్రశాంత్ ని అన్నయ్యా అంటూ చుట్టేసింది సీత. క్షమించమని ఏడుస్తూ తన ఉద్యోగ ఆర్డర్ ను,పుస్తకాన్ని అందిస్తుంది..
కొన్ని బంధాలు అంతే వద్దనుకున్నా పోలేవు.స్వార్ధం లేనిది ఏ ప్రేమైనా ఎప్పుడు మనతోటే ఉంటుంది .అంటూ లోపలి గది నుండి వస్తూ అంటున్న ప్రశాంత్ అమ్మని కూడా అమ్మ అంటూ అల్లుకుపోయింది.ఇక ఏ శక్తి ఈ అన్నా చెల్లెళ్ళ పవిత్ర బంధాన్ని విడదీయలేవు అంటూ లలితమ్మ గారు ఆశీర్వదిస్తుంటే సీత అన్న గుండెపై ఒదిగి ఇన్నాళ్ల వేదనకు సాంత్వన పొందుతోంది.ఆత్మీయ స్పర్శతో..!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!