బాలవాక్కు

బాలవాక్కు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: వడలి లక్ష్మీనాథ్

“బాబాయ్ ఆడు కొందాము” చిట్టి చిట్టి అడుగులతో గదిలోకి వచ్చింది బుజ్జి.

“రా! రా! నా బుజ్జి బంగారం” అంటూ ఎత్తుకొని ముద్దాడ సాగాడు కామేశ్వరరావు.

“రావే తల్లి! వచ్చావా? ఒక్క నిమిషం నన్ను, నా భర్తతో ఉండనీయవు” లోపల్లోపల గొణుక్కుంటుంది కోమలి.

ఒక్క నిమిషం మొగుడు పెళ్ళాంని కూర్చొనివ్వదు. సందు దొరికితే చాలు లోపలికి దూసుకుని వచ్చేస్తుంది. వాళ్ళమ్మ కన్నా బుద్ధుందా? పిల్లల్ని వదిలేస్తుంది లోపల్లోపల తిట్టుకోసాగింది కోమలి.

“ఉండరా తల్లి ఒక్క నిమిషము ఫోన్ వస్తోంది. ఐదు నిమిషాల్లో నేను వస్తాను” అనుకుంటూ బయటికి వెళ్లాడు కామేశ్వరరావు.

చాలా చికాకుగా ఉంది కోమలికి, బుజ్జి వాళ్ళ బాబాయిని అసలు వదిలిపెట్టదని.

“పిన్ని దా! మనిద్దరం ఆడుకుందాం” అంటూ వెళ్లి కోమలి పక్కన కూర్చుంది బుజ్జి. ముందే చికాగ్గా ఉంటే, బుజ్జి దగ్గరకు వచ్చేసరికి మరింత చికాకు పెరిగింది కోమలికి.

“ఏదో ఆ బ్యాంకు టెస్ట్ పాసై, ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవచ్చనుకుంటే, అది కూడా రిజల్ట్ రావట్లేదు. ఇక్కడి నుంచి ఎప్పుడు బయటికి వెళ్లి పోతామో, అర్థం కావట్లేదు” మనసులోనే తిట్టుకుంటోంది

“రా పిన్ని ఇద్దరం ఆడుకుందాం”అని ఒకటే గోల గోల చేస్తోంది బుజ్జి. కోమలికి చెప్పరాని కోపం వచ్చింది. చాలా రోజుల నుంచి తనకు నచ్చనప్పుడు చేస్తున్న పని, అది ఎవరికీ కనిపించకుండా గట్టిగా తొడపాసం పెట్టేస్తుంది. దాంతో బుజ్జి ఏడుస్తుంది “అక్కయ్య బుజ్జి ఎందుకు ఏడుస్తోంది,చూడు” అంటూ ఇచ్చేస్తుంది.
క్షణం ఆలోచించకుండా కామేశ్వరరావు వచ్చే లోపల ఆ పిల్లని బయటికి వెళ్ళగొట్టాలి అనుకుని గట్టిగా ఎవరికీ కనపడకుండా నవ్వుతూ తొడపాసం పెట్టింది. ఆ బాధ భరించలేక బుజ్జి ఏడ్చుకుంటూ వెళ్ళింది వాళ్ళ అమ్మ దగ్గరికి. “అక్కయ్య! బుజ్జి ఎందుకో ఏడుస్తుంది చూడవా! అంటూ కేకలు వేయడంతో.

“ఆ!చిన్న పిల్లలు అంతేలే ఎందుకు ఏడుస్తారో తెలియదు. నేను చూస్తాను లే!” అనుకుంటూ బుజ్జిని తీసుకుని వెళ్లిపోయింది వాళ్ళమ్మ.
ఒక గంట తరువాత కామేశ్వరరావు ముఖం వేలాడేసుకొని వచ్చాడు.
” ఏమైంది అలా ఉన్నారు?” అడిగింది కోమలి.
“ఏమీ లేదు. ఎంతో కష్టపడి చదివాను. ఈ సారి ప్రమోషన్ వస్తుంది అనుకున్నాను. కానీ, నా పేరు లిస్ట్ లో లేదని స్నేహితుడు ఫోన్ చేసి చెప్పాడు” బాధగా అన్నాడు. ఈ లోపల బుజ్జి పరిగెత్తుకుంటూ వచ్చింది లోపలికి. “బాబయ్యా!” అంటూ.

కోమలికి పిచ్చి కోపం వచ్చింది “ఇప్పుడు కాదు వెళ్ళు. బాబయ్యకి కావాల్సిన పని అవ్వలేదు. ఆరోగ్యము బాగాలేదు. నువ్వు వెళ్ళి ఆడుకో” అంది.

బుజ్జి బాబాయ్ మొహం చూసి “బాబయ్యా! నీకు జ్వరము వచ్చిందా? ఏమీ కాదులే. నేను జేజికి
చెప్తాను. నీకు కావాల్సిన పని అవ్వాలని. అమ్మ చెప్పింది నేను జేజికి చెప్తే, అలా అయిపోతాయని. జేజి మా బాబాయ్ కి కావాల్సింది ఇవ్వు” అనుకుంటూ వెళ్ళిపోయింది.

లోపలనుంచి బుజ్జి దేవుడికి దండం పెట్టడం వినిపిస్తోంది కోమలికి.” జేజి! మా బాబాయ్ కి ఏం కావాలో అది ఇవ్వు” అని. కోమలికి పిచ్చి కోపంగా ఉంది. అసలే మనసు బాలేదు అనుకుంటే , ఈ బుజ్జి ఒకటి విసుక్కుంది.

చికాకుగా పడుకున్న కామేశ్వరరావు లేచి చొక్కా వేసుకుని బయటికి వెళ్ళాడు. ఒక గంటలో తిరిగి వచ్చాడు, చాలా చాక్లెట్లు బిస్కెట్లు పట్టుకుని.

“బుజ్జి ప్రార్ధించింది. అది నిజమే అయ్యింది.” అని ఎత్తుకొని ముద్దాడ సాగాడు.
అప్పుడు కోమలి వచ్చి “ఏమయింది “అని అడిగింది. “ఏమీ లేదు పొద్దున్న చెప్పిన స్నేహితుడు పొరపాటున తప్పు లిస్టు చూశాడుట. ఇప్పుడు సరైన లిస్టు చూసి ఫోన్ చేసాడు. అందులో నా పేరు ఉంది, నాకు ప్రమోషన్ వచ్చింది” చెప్పాడు కామేశ్వరరావు.

కోమలికి నోట మాట రాలేదు “బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. ఇంత చక్కటి బుజ్జి తల్లిని ఎప్పుడూ విసుక్కుంటూ సరిగా చూసుకోకుండా ఏడిపించి పంపించాను. చాలా తప్పు పని చేశాను” అనుకుని బుజ్జిని తీసుకుని ముద్దాడసాగింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!