నమ్మక ద్రోహం

నమ్మక ద్రోహం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: శ్రీదేవి విన్నకోట

నాపేరు రమణి నాభర్త పేరు శేఖర్ మాది చాలా అన్యోన్యమైన దాంపత్యం ఇప్పటివరకు. కానీఒక్కటే లోటు,మా పెళ్ళయ్యి ఇప్పటికి పదిహేను సంవత్సరాలు అయింది. మాకు పిల్లలు లేరు, అయినా అది ఎప్పుడూ నాకు పెద్ద సమస్యగా అనిపించలేదు. ఎందుకంటే ఆయన నాపై చూపించే ప్రేమ అలాంటిది. నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం మనిద్దరం తోడు నీడ, అయినా ఈ రోజుల్లో పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం ఏం సుఖ పడుతున్నారు చెప్పు తల్లిదండ్రుల పై అంతగా ప్రేమ ఉన్న పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళను పెంచి చదివించడం పెళ్లి చేయడం తప్ప ప్రయోజనం ఏముంది అంటూ ఆయన నామనసుకు స్వాంతన కలిగించడానికి చెప్పే ఆ మాటలు నన్ను నవ్వించడానికి చేసే పనులు, నా కోసం ఆయన తీసుకునే జాగ్రత్త ఇవన్నీ చూసి మాకు పిల్లలు లేరు అనే బాధను మర్చిపోతూ ఉంటాను. నీకుమరీ అంతగా పిల్లలు కావాలి అనిపిస్తే ఎవరైనా అనాధను సక్రమమైన పద్ధతిలో దత్తత తీసుకుని తెచ్చుకుని పెంచుకుందాము. అని అంటూ ఉంటారు.

అలారోజులు చాలా సంతోషంగా గడుస్తున్నాయి నన్ను కన్విన్స్ చేయడానికి ఆయన చెప్పే మాటలు చేసే పనులు చూస్తుంటే నాకు నవ్వు వస్తూ ఉంటుంది అయినా ఆమాటల్లో నాపై ప్రేమ ఇష్టం కనిపిస్తుంది. అలా హాయిగా గలగల పారేగోదారిలో అందమైన పడవ ప్రయాణం సాగిపోతున్న మా ప్రేమ సంసార జీవితంలో ఓపెద్ద కుదుపు. అదికూడా నేను భరించలేనంతగా తట్టుకోలేనంతగా నాజీవితంలోకి అనుకోని ఓపాత్ర ప్రవేశించింది. అది కూడా ఓఅమ్మాయి రూపంలో.

మా వారు ఒక పేరున్న ప్రైవేట్ కంపెనీలో సూపర్ వైజర్ గా పని చేస్తారు. అందులోనే ఆ అమ్మాయి కూడా రిసెప్షనిస్ట్ గా చేరింది. తన పేరు గిరిజ  ఒళ్లంతా వయ్యారం కవ్వించెకళ్ళు చీటికి మాటికి అవసరం లేకపోయినా సరే ఎప్పుడూ పెద్దగా నవ్వుతూ ఎదుటి వాళ్ళను ఆకర్షిస్తూ రెచ్చగొడుతున్నట్టు ఉండే మొహం మగవాళ్ళని చూస్తే చాలు వగలుపోతున్నట్టు ఉండే ఆమె వళ్ళు ఇవన్నీ ఆమెకు అదనపు క్వాలిఫికేషన్స్ అసలు ఆమెను చూస్తుంటేనే పూర్తిగా వెకిలితనం ఉన్న మనిషిలా అంత మంచి మనిషి కాదు అని అనిపిస్తుంది, భర్తనువదిలేసి ఇద్దరు చిన్నపిల్లలతో కలిసివేరుగా ఉంటుంది, భర్తని వదిలేయడానికి తగిన కారణమేంటో తెలియదుకానీ, ఆమెగురించి తెలిసిన వాళ్ళు అందరూ ఆమె క్యారెక్టర్ మంచిది కాకపోవడం వల్లే భర్త ఆమెను వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు అని చెప్పుకుంటూ ఉంటారు.

ఆమెతో పాటు పనిచేసే వారందరి చూపులు ఆమె పైనే, ఆమె చూపులగాలం వేసిందో లేదా ఏంమాయ చేసిందో తెలియదు కానీ నన్ను ఎంతో ప్రేమించే నా భర్తకూడా ఆమె మాయలో చిక్కుకున్నాడు, అసలు వాళ్ళిద్దరి స్నేహం ఎలామొదలైందో తెలీదు. నాకు ఈమధ్య నాకు చీటికి మాటికి అబద్దాలు చెప్పడం  అప్పుడప్పుడు ఇంటికి బాగాలేటుగా రావడం నన్ను అంతగా పట్టించుకోకపోవడం నేను గమనిస్తూనే ఉన్నాను కొన్నిరోజుల నుంచి.

నిజంగా భర్తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భార్యకి భర్తలో ఏ చిన్నమార్పు వచ్చినా ఇట్టేతెలిసి పోతుంది. నాకుకూడా అంతే నాభర్త లో ఏచిన్నమార్పు వచ్చినా నేను కనిపెట్టగలను. కానీ ప్రశ్నించలేదు నాభర్తను ఇంతవరకు  ఇన్నేళ్ల నావైవాహిక జీవితంలో నేను
ఏవిషయంలోనూ ప్రశ్నించే అవసరం ఇంతవరకు రాలేదు, అలాంటి అవసరం ఆయన ఎప్పుడూ తీసుకురాలేదు,ఇక నాజీవితంలో ఆయనని ఎదిరించడం అనే పరిస్థితి ఎప్పటికీరాదు అని అనుకున్నాను.

కానీ మనంతలచినట్లు దేవుడు తలవడు కదా, ఒక్కో మనిషికి ఒక్కోకష్టం, దుఃఖాన్ని మనసులో భరిస్తూ గుండెదిటవు చేసుకుని భరించడంతప్ప నేనుఇంకేం చేయగలను. అమ్మానాన్న లేరు, అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఉన్న ఏదో సందర్భం వచ్చినప్పుడు కలవడమే తప్ప మరిఅంత ప్రేమాభిమానాలు లేవు ఎవరి సంసారంవారిదే అన్నట్టుగా ఉంటాము,

రోజులు గడుస్తున్నాయి. నాభర్తకు నామీద ప్రేమ తగ్గుతూ వస్తుంది అతనిలో మార్పు నాకుచాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎంతగాఅంటే నన్నుచూస్తేనే చిరాకుపడే స్థాయికి వచ్చేశారు నాకు ఏం చేయాలో, ఆయన్ని ఎలా ప్రశ్నించాలో అసలు అర్థం కావట్లేదు మాటిమాటికీ కళ్ళుతడిసి ముద్దైపోతున్నాయి. ఆయనతోపాటు షాప్ లో పనిచేసే వాళ్ళు, తెలిసిన వాళ్ళు నావెనకాల చెవులు కొరుక్కుంటున్నారు.

మావీధిలో నాతో చనువుగా ఉంటే ఇద్దరుముగ్గురు ఆడవాళ్లు కూడా మీఆయన అక్కడ కనిపించాడు ఇక్కడ కనిపించాడు వేరేఅమ్మాయితో బండిమీద అని చెప్పసాగారు, నాపై ఆయన ప్రేమ తగ్గుతున్నట్టు నాకు ఖచ్చితంగా తెలుస్తుంది, ఇకఓపిక పట్టలేక ఒకరోజు ఆయన్ని అడిగేసాను గట్టిగా, మీరు చేసేది కరెక్ట్ కాదు అని, నేనేం చేయాలో నాకు తెలుసు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ నామీద రివర్స్ అయ్యారు, మీరు నన్ను  ఎంచేయాలనుకుంటున్నారు, 15 సంవత్సరాల మన బంధం అంత తేలికయినదా, ఒక పరాయిఆడదాని మోజులో పడి, ఆమెకోసం  నన్ను దూరంచేసుకునే అంతగా,నేను ఆయనతో  మాట్లాడలేకపోతున్నాను నాకళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆయన్ని ప్రశ్నిస్తుంటే,

సరేనువ్వు ఇంతగట్టిగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్న నేను ఇకమీదట ఆఅమ్మాయితోనే ఉంటాను తనదగ్గరికే వెళ్లిపోతున్న అంటూ విసురుగా తన బట్టలు తీసుకుని నేనుచెప్పేది ఏమీ వినిపించుకోకుండానే అడ్డుపడుతున్న నన్ను పక్కకి తోసేసి వెళ్ళిపోయారు. నేనుఅలాగే ఒంటరిగా ఏడుస్తూ కుప్పకూలిపోయాను. రోజులు గడుస్తున్నాయి ఇప్పటికీ ఆయన ఇంటికి వచ్చినెల రోజులుఅయింది, నాకుతెలిసిన వాళ్ళు అంతా, మీ ఆయనమీద కేసుపెట్టు పోలీస్ లే ఇద్దర్నీ నాలుగు తన్ని నీభర్తను తీసుకువచ్చి నీకుఅప్పగిస్తారు అంటూ, భయంతోనో లేదా ఎవరోఏదో అనుకుంటారనో కాదు ప్రతి మనిషికి ఒకరి మీద ఒకరికినమ్మకం ఉండాలి, ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో కావాల్సింది నమ్మకమే ఆనమ్మకాన్ని నాభర్త పూర్తిగా కోల్పోయాడు, వాళ్ళ అక్రమసంబంధంలో ఆ అమ్మాయి తప్పు ఎంతుందో నాభర్త తప్పుకూడా అంతేఉంది, మనబంగారమే మంచిదికానప్పుడు ఎవరిని ఏమనుకుని లాభం, నన్నిలా అర్థంతరంగా వదిలేసి వెళ్లిపోయిన మనిషి ఇకనాకు  అవసరం లేదనేఅనిపిస్తుంది నామనసుకి, నేను కూడా మెల్లిగా నాఒంటరి జీవితానికి అలవాటు పడుతూ, గడవడానికి ఏదో ఒకపని చేయాలికాబట్టి నాకుబాగా వచ్చిన నచ్చిన వంటపనినీ నా ఆదాయమార్గంగా ఎంచుకున్నాను నాకు తెలిసిన కొంతమంది ఆడవారు  కేటరింగ్ సర్వీస్ చేస్తూ ఉంటారు, అందులో చేరిపని చేయసాగాను. ఈ ఒంటరి జీవితానికి ఆపనికి  పూర్తిగా అలవాటు పడిపోయాను.

ఒకరోజుఉదయాన్నే చాలావిషాదకరమైన వార్త తెలిసింది,మావారు (ప్రస్తుతానికి అలాఅనకూడదు ఏమో నేను) ఆఅమ్మాయి వెళ్తున్న బైక్ కి పెద్ద యాక్సిడెంట్ అయిందని, మావారి ఒకకాలు పూర్తిగా నుజ్జు అయిపోయిందని, ఆమెకు చిన్న చిన్న దెబ్బలు తగిలాయని, వాళ్ళిద్దరూ ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉన్నారు అని నాకుతెలిసిన చూసిన వారు చెప్పారు,
ఎంతవెళ్లి చూడకూడదు అనుకున్నా మనసు ఊరుకోలేదు, ఆగమేఘాల మీద గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి పరిగెట్టాను, హాస్పటల్లో బెడ్ మీద చాలా దయనీయమైన సృహ లేని పరిస్థితిలో ఉన్నారు,అతన్ని అలా చూసి నామనసు దుఃఖంతో చలించిపోయింది.చూసివచ్చేసాను అంతకుమించి ఇంకేం చేయగలను. బాధపడడం తప్ప,.

ఆతర్వాత మరికొన్ని రోజులకి మరోవార్త తెలిసింది. ఆ అమ్మాయి అలా మంచంమీద ఉన్న నాభర్తని తన ఇద్దరుపిల్లల్ని వదిలేసి  డబ్బున్న మరొకరితో వెళ్ళిపోయింది అని, నాకనిపించింది దేవుడు ఎవరు ఏంతప్పులు  చేస్తున్నారో అన్నిచూస్తూనే ఉంటాడు, శిక్షించడానికి కొంచెంసమయం పడుతుంది అంతే, కానీనిజంగా నేను ఇలాజరగాలని మాత్రం అస్సలు కోరుకోలేదు, ఆయననీ వెళ్లిచూడాలి అనిపించినా నేను ఎంతోప్రేమగా అపురూపంగా నమ్మకంగా చూసుకున్న భార్యాభర్తల బంధాన్ని కాదని వెళ్లిన అతనికి  నేనేంటో నాప్రేమ ఏంటో తెలిసిరావాలి అని అనిపించింది, అందుకే ఆయన్ని మళ్లీచూడ్డానికి నేనువెళ్లలేదు, నామనసు ఎంతగా అతన్ని చూడాలని కోరుకుంటున్నసరే, ఆరోజు సాయంత్రం పనిముగించుకుని వచ్చి అలా ఏదో ఆలోచిస్తూ పరాగ్గా కూర్చున్నాను. ఇంటి ముందు ఆటోవచ్చి ఆగింది, ఆటోఅతను మరొకరుకలిసి జాగ్రత్తగా నాభర్తను దింపిలోపలికి ఎత్తుకొని తీసుకొచ్చారు, నేనుఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాను.

ఆయన తనని మీఅడ్రస్ చెప్పి  ఇక్కడికి తీసుకు వచ్చి దింపమని మమ్మల్ని అడిగారు సిస్టర్ అందుకే ఇక్కడికి తీసుకు వచ్చాము అని చెప్పారు వాళ్ళు, నేనేం మాట్లాడకపోవటంతో వాళ్ళువెళ్ళిపోయారు.

మావారి వంక చూశాను ఆయనకళ్ళల్లో కన్నీళ్లు మనిషికి పశ్చాత్తాపానికి మించిన శిక్ష మరింకేం ఉంటుంది, నన్నుక్షమించు రమ నీకుచాలా అన్యాయం చేశాను, అందుకు తగినశిక్ష  ఇప్పుడు అనుభవిస్తున్నాను, నీకుచేసిన అన్యాయానికి నాకీ శాస్తి జరగాల్సిందే అంటూ బోరున చిన్నపిల్లాడిలా ఏడ్చారు, దేవుడు ఆడవాళ్ళకి ఊరికే కరిగిపోయే మనసు ఎందుకు ఇచ్చాడో అర్థంకాదు, నాపరిస్థితి అదే, అప్పుడు వరకు దూరమైన అపూర్వమైనదేదో నన్ను చేరుకున్నట్టు అనిపించింది, ఆయన్ని పట్టుకుని అన్నిరోజుల బాధ పోయేలా వెక్కివెక్కి ఏడ్చాను.
మరోసారి ఎప్పుడు ప్రాణం పోయినా ఇలాంటి నమ్మకద్రోహం నీకు చేయను అంటూ పదేపదే క్షమాపణలు చెబుతూనే ఉన్నారు, నేనేఆయన్ని
ఓదార్చాను, జరిగిందేదో జరిగిపోయింది జరిగిందంతా గుర్తుపెట్టుకోవాల్సిన అంత గొప్పవిషయం కూడా కాదు చెడునీ మనంమరిచి పోదాం, ఇకనుంచి ఎలాంటి అరమరికలు లేకుండా మంచిగా ఉందాం.
మీరు జరిగిపోయిన విషయం గురించి ఆలోచించి మరింత మనసునీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి.. అంటూ నచ్చచెప్పాను,మంచిగా ఉండి చెడ గా మారిన భర్త జరగాల్సిన అనర్థం అంతా జరిగిన తర్వాత, తన తప్పు తెలుసుకుని అనారోగ్యంతో నాచెంతకు వస్తే కాదనెంత కఠినమైన మనసుకూడా నాకులేదు, ఎంతైనామాది భార్యభర్తల బంధం అంత తొందరగా విడిపోలేము, మనసులో కోపం ఉన్నా అది తీర్చుకునే సందర్భం ఇదికాదు అందుకే ఆయనకి మరో అవకాశం ఇస్తూ నెమ్మదిగా ఉండిపోయాను అచ్చంసగటు భార్యలాగే, ఆఖరిగా మీఅందరికీ మరోవిషయం చెప్పడం మర్చిపోయాను, ఆరాక్షసి వదిలివెళ్లిన పిల్లలను నేనే తీసుకువచ్చి పెంచుతున్నాను,నాకోపం ఆమెమీదే కానీ, ఆపసిపిల్లల మీద ఎంతమాత్రం కాదు, అందుకే మళ్లీ నాభర్తతో పాటు ఆచిన్నారులకు కూడా నా మనసులో చోటిచ్చాను. అందుకే మా ఆడవాళ్లను ఆ భూమాతతో పోలుస్తారు క్షమయా ధరిత్రి అంటూ నిజమే కదా మరీ.

శుభం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!