ఏరువాకమ్మ

ఏరువాకమ్మ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన :సావిత్రి కోవూరు

పొలిమెరలో పారు ఏరువాకమ్మ,
మా ఊరికే అది కన్న తల్లమ్మ,
ఏడేడు అందరం పూజ చేసేము,
జలకళతో అది నిండుగా పారు,
మా ఊరికే అది కల్పవృక్షము,
రైతన్నలకు పెట్టు ప్రాణభిక్షమ్ము,
వరిచేను నిండుగా పండేను చూడు,
రైతన్న కళ్ళలో కాంతిపుంజాలు,
ఏరునిండా ఎగురు చేప పిల్లాలు,
వేటగాళ్ల కవి తెచ్చు కనక వర్షాలు,
ఏటి గట్టు మీద పున్నాగ చెట్టు,
పున్నాగ మాలలతో పూజ చేసేము,
కాలువ గట్టున కంది చేనుల్లు,
కంది చేలల్లోన కనకాంబరాలు,
కాలువ గట్టున బంతి తోటల్లు,
ముద్దబంతులతోను మురిసేము మేము,
పసిడి పువ్వుల తోను పరవశించేము.
కాలువ గట్టున మర్రిచెట్టుల్లు,
మర్రిచెట్ల నిండా పక్షిరాజాలు,
కువకువ శబ్దాల సరిగమలు పాడు,
ఏటి గట్టు మీద ఇసుక తిన్నెల్లు,
ఇసుక తిన్నెలపైన కొంగ పక్షులు,
దొంగ జపములు చేసి మీనాలు మింగు,
చిత్తడినేలలో బాతు పక్షులు,
వయ్యారి నడకల సయ్యాటలాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!