మానవత్వం ఇంకా బతికే ఉంది
రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
సాయంత్రం ఆరు గంటల సమయంలో హైదరాబాద్ దిల్ శుఖ్ నగర్ దరి అష్టాలక్ష్మి కోవెలలో అమ్మవారిని దర్శించుకుని కారులో మేనల్లుడు ప్రశాంత్ తో తిరిగి వస్తుండగా రైతుబజార్ రోడ్డు పై సుమారు డెబ్భై ఐదు సంవత్సరాల వృద్ధుడు స్పృహ తప్పి పడి ఉన్నాడు. బజారుకి వచ్చే వాళ్ళు, వెళ్ళే వాళ్ళు అతనిని పట్టించుకోకుండా ఎవరి మానాన వారు పట్టనట్లు వెళ్లిపోతుండడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది.
పది సంవత్సరాల తరువాత ‘అన్నయ్యా నిన్ను చూడాలని ఉంది నా ఒంట్లో బాగాలేదని’ పిన్ని కూతురు సరోజ ఫోన్ చేస్తే కెనడా నుంచి ఇండియా వచ్చాను. అమ్మ సంవత్సరికాలు అయిన తరువాత మొదటగా ఇండియా వచ్చాను. నేనొక్కడినే తల్లిదండ్రులకి పిల్లాడిని. బాల్యంలో ఉమ్మడి కుటుంబంలో పెరిగాను. నేను సరోజని స్వంత చెల్లిలా భావించాను.
వార్ధక్యపు ఛాయలు దరి చేస్తున్న వేళ చెల్లిని, పెదనాన్న మనవరాలి పెళ్ళి ఉండటంచే అయిన వాళ్ళని చూసి చిన్నప్పటి స్మృతులు నెమరు వేసుకోవచ్చునని ఇండియా వచ్చాను.
మేనల్లుడు ప్రశాంత్ మామయ్య మనింటి దగ్గర అష్టలక్ష్మి కోవెలకు తీసుకువెళతాను అంటే వచ్చాను. దారిలో ఈ సంఘటన చూసి కారు ఆపి ప్రశాంత్ వృద్ధుని దగ్గరకెళ్ళి చూసి వడదెబ్బ అయి ఉంటుందని కారులోని వాటర్ బాటిల్ తీసి అతని ముఖంపై చల్లి మామయ్య కొంచెం ఇతనిని పట్టుకుని కారు వెనక సీట్లో కూర్చో నా స్నేహితుని చైతన్య హాస్పిటల్ పక్కనే చూపిద్దాం అనగా కారులో హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు.
డాక్టర్ రఘు పరిశీలించి సమయానికి తీసుకొచ్చారు ఆలస్యం చేస్తే ప్రాణం పోయేది అని కృత్రిమ శ్వాస అందించి సెలైన్ బాటిల్ రాత్రి తెల్లవార్లు పెట్టాలి. ప్రాణభయం లేదు ఇంతకీ ఎవరీయన అంటే మనలాగే మనిషి, పడి ఉంటే తీసుకొచ్చాను రాత్రి అతని దగ్గర నేనే ఉంటాను. పక్కవీధిలో ఉన్న మా ఇంట్లో మామయ్యను దింపివస్తాను అని చెల్లి వాళ్ళింట్లో వదలి అన్నమైన తినకుండా మానవసేవే మాధవసేవ అన్న ధ్యేయంగా గబ గబ తల్లితో చెప్పి ఆసుపత్రికి వెళ్ళిపోయాడు.
ఉదయం తొమ్మిదింటికి ప్రశాంత్ వచ్చి మామయ్య ఆ వృద్ధునికి స్పృహవచ్చిన వెంటనే అడ్రస్ చెప్పగా దింపి వస్తున్నాను. ఇంతకీ ఆయన మా కెమిస్ట్రీ మేడమ్ ప్రొఫెసర్ శశికళ గారి తండ్రి. ఆమె సంతోషంగా నీ ఋణం తీర్చుకోలేను. మా నాన్నగారు చిన్నప్పుడే అమ్మ పోయాక అన్నీ తానై నేనొక్కదాన్నే సంతానము అవుటచే క్రమశిక్షణ తో పెంచారు. పెద్దవారు ఎక్కడికి వెళ్ళొద్దు అంటే తిరిగితే కాళ్ళు చేతులు సరిగా ఉంటాయి. శరీరం మనకి లొంగాలి మనం దాని ఆధీనంలో ఉండకూడదు అంటారు అని దీవించి పంపించారు.
అప్పుడు నాకు మానవత్వం ఇంకా బతికే ఉంది అని వాడిని శతమానం భవతి అంటూ ఆశీర్వదించి ఆప్యాయంగా కౌగలించుకున్నాను.