(అంశం::”చిత్రం భళారే విచిత్రం”)
ఏటో సిత్తరం
రచన:: మంగు కృష్ణకుమారి
ఇంట అత్తనీ మావనీ ఓ మూలగదిలో పడేసి ఇంత ముద్ద మాత్రమే పడేసిన
కోడలు తన చిన్నారి కొడుకును గుండెల మీదేసుకొని “నా బాబే నా
రేపటి వెలుగే” అంటది…
సిత్తరం కాదూ, దానికీ దానిలాటి కోడలొస్తదన్న బయమే లేదదేం
ఇడ్డురమో..
కట్టుకున్న ఆలిని సానా మాటాలంటూ కమ్మగా వడ్డిస్తే కంచం ఇసిరికొట్టి
‘మద్దెమద్దె’ లో సేయెత్తి బెదిరిస్తూ, మాపటికి మల్లె పూలెట్టుకొని తెల్లకోక కట్డి పక్కన సేరితేనే ‘పెళ్ళాం’ పెళ్ళామనుకునే మగడు
ముద్దుల కూతురొచ్చి
‘అయ్యా, నీ అల్లుడు తాగుబోతు సచ్చినాడు
‘తాగితాగి’ నన్ను కొడతాడు, కాపురం నావల్లకాదు’ అని ఏడిస్తే,
“పెళ్ళాన్ని కొట్టేటోడూ… మొగుడే, ఆయ్…ఏదీ నాకర్ర ఆడి బొమికలిరగ్గొట్టేత్తా” అంటాడే…
ఓలమ్మో ఆడికి తనగుణం
తలపుకే రాలేదే? ఏటీ సిత్తరం?
అయిదేళ్ళు సొమ్ములు మింగేసి, మొగవే సూపనోళ్ళు ఎన్నికల
ముందు దండం ఎట్టి “మీ పేదోల్ల కోసమే మా రాజ్జెం మాఁవూ ఉన్నాం
తమ్ముడూ, నీ ఓటు మాకే” అంటే అన్నీ మరిసిపోయి ఆడికే ఓటు
గుద్దేస్తారు జనాలు… ఏటమ్మా.. ఇంత సిత్తరమోలమ్మా……
ఇంకెన్ని సిత్తరాలయన్నయో బూమ్మీద?
***