టిక్ టాక్

టిక్ టాక్

రచన: సావిత్రి తోట “జాహ్నవి”

ఏంటో!?…  ఈ మధ్య అందరూ టిక్ టాక్ మీద పడ్డారు. మెున్న మా బంధువుల అమ్మాయి సంవత్సరమున్నర చిన్నది ఒళ్లు ఊపుతూ టిక్ టాక్ చేస్తూంటే నాకు ఏమన్నాలో తెలియలేదు.
ఆ ఒళ్లు ఊపడం, ఆ కళ్లు తిప్పడం, మర్చిపోయానండోయ్!… కళ్లద్దాలు ఎలా తిప్పింది అనుకునేరు… అచ్చు సినిమా హీరోలానే అంటే మీరు నమ్మరు.
ఆ వయసులో మాకు అసలు నడకయైనా వచ్చిందో లేదో… మా అమ్మాయిలకు పోటో తీద్దామంటే ఇపుడే పోటో తీస్తే మాటలు రావని… పిల్లలకి దిష్టి తగులుతుందని…  అసలు పోటోయే తీయనిచ్చేవారు కాదు, మా పెద్దలు.
ఇంకా రెండేళ్లు అయిన నిండని అమ్మాయిలతో లిటిల్ చాంపియన్స్, బోల్ బేబి బోల్, డాన్స్ బేబి డాన్స్ ఎన్ని ప్రోగ్రామ్ లు చేయిస్తున్నారో!!… నాకైతే చాలా ఆశ్చర్యం వేస్తుంది.
అసలు అదంతా వాళ్ల టాలెంటే అంటారా!?… లేక ఆ తల్లిదండ్రులు పిల్లల చేత బలవంతంగా చేయిస్తున్నారా!?… బలవంతంగా చేయిస్తుంటే, ఎన్ని హింసలు పెడుతున్నారో కదా. వాళ్ల గొప్ప చూపించుకోవడానికి.

పాపం చిన్న చిన్న పిల్లలు.  తమ టాలెంట్ నిరూపించుకోవడానికి ఎన్ని తిప్పలు పడుతున్నారో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారో కదా అండి.

ఇక అమ్మాయిల విషయానికి వస్తే ఏది ఆ ఒద్దిక, గట్టిగా మాట్లాడితే ఎవరూ ఏమంటారోననే భయం, నలుగురిలో నవ్వుల పాలు అవుతావేమో అనే ఆలోచన కూడా లేకుండా పోయింది ఈ కాలం యువతకి.

ఒంటరిగా గదిలో వేసుకోవడానికి కూడా భయపడే స్టేజ్ నుంచి అసభ్యమైన డాన్స్ లు వీడియోలు తీసి వాళ్లే పోస్టులు పెడుతుంటే ఇక ఎవరిని అని ఏం లాభం.

నాకు తెలిసిన ఒకరూ వాళ్ల అమ్మాయి అసభ్యంగా ఒళ్లు తిప్పుతూ డాన్స్ చేస్తుంటే తప్పని మందలించడం పోయి, ఆ తల్లే విడియో తీసిందంటే ఎంత దిగజారి పోయారు ఈ కాలం తల్లులు. అలాంటి తల్లులు ఉన్నపుడు పిల్లలు అలా ఉండకుండా ఇంకేలా ఉంటారు మీరైనా చెప్పండి.

నేను చూసిన ఇంకో సంఘటన ఒక 2,3 సంవత్సరముల పాపని ఆ పాప తండ్రి ఎక్కడేక్కడికో తీసుకుని వెళ్లి పాటలు పాడించి , డాన్స్ చేయిస్తూ, తాను కూడా డాన్స్ చేసాడు. ఎలాంటి డాన్స్ అనుకునేరు ఆ అమ్మాయి ఆ తండ్రిని సాధిస్తూన్నట్లు చేతులు తిప్పుతూ డాన్స్ చేస్తుంటే ఆ వీడియో చూసిన వారంతా షేర్ చేస్తున్నారు.
అంటే రేపటి తరం ఎలా ఉండబోతుందో దీనిబట్టి తెలియడం లేదా. తండ్రికి భయపడే రోజులు పోయి, ఆ తండ్రే కోరి తిట్టించుకుంటే రేపటి రోజున ఆ అమ్మాయి తండ్రిని బయటకి తోసేస్తే అది ఎవరి తప్పు. ఆ పిల్లదా?అలా పెంచిన తండ్రిదా? లేక అలాంటి విడియోలను ప్రోత్సహించిన వెర్రి జనాలదా?

ఇంకా కొన్ని విడియోలు చూస్తుంటే భార్యభర్తలు నాలుగు గోడల మధ్య గుట్టుగా చేసుకోవలసిన కాపురం, సరసాలు కూడా విడియోకి ఎక్కిస్తున్న ప్రబుద్ధులు ఉన్నారు ఈ కాలంలో.

ఏ భార్య భర్తలైన  సరదాగా సరసాలు ఆడుకున్న సమయంలో ఎవరైన పొరబాటున వస్తే సిగ్గుపడి లోపలికి వెళ్లిపోయే పరిస్థితి నుండి. అక్కటా!! ఎంత కష్టం ఇది! ఇలాంటి వీడియోలు చేసే కాలం వచ్చింది. అవి చూస్తూ వయసులో ఉన్న పిల్లలకు చదువులని, భాధ్యతలని, జాతకాలని  ఇలాంటి ఏదో కారణం చేత వయసు ముదురే వరకు పెళ్లి చేయకపోతే ఆ పిల్లలు హద్దులు దాటితే అది ఎవరి తప్పు. ఏమనగలం ఆ పిల్లలని. అలాంటి వీడియోలు తీసి, చూసి, షేర్ చేస్తున్న మనకు వాళ్లని దండించే  అర్హత ఉందా అసలు.

ఈ టిక్ టాక్ వెర్రి ఎంతలా ముదిరి పోయింది అంటే 70,80 ఏళ్ల ముసలివాడు తన భార్యతో సరసాలు ఆడుతూ వీడియోలు తీయించుకుని, షేర్ చేయించినంత. మరి ఇప్పటి యువతకి మంచి చెడ్డ చెప్పేది ఎవరూ  తాతలు, బామ్మలే ఇలా ఉంటే.
అస్సలు ఇప్పటి యువత పెద్దవారికి ఆదర్శ మా, లేక పెద్దవారు ఇప్పటి యువతను ఆదర్శంగా తీసుకుంటున్నారో  నాకైతే అర్దం కావడం లేదు.

నేర్చుకోవడానికి వయసు తేడా లేదు అనుకుంటున్న… కాని అది ఎలాంటి విషయంలో అన్నది కూడా కొంచెం ఆలోచించాలి కదా పెద్దవారు.

ఇలా చెప్పుకుంటూ పోతే నేటి యువత చెడి పోవడానికి ఒక రకంగా మనమే కారణం ఏమో అనిపిస్తుంది. తప్పు చేస్తే సరిదిద్దవలసిన వారే తప్పులు చేస్తూంటే, మరి ఎటు పోతుంది నా దేశం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!