మన కుసంస్కారాలు

మన కుసంస్కారాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కొల్లూరు వెంకటరమణమూర్తి

శుభ్రంచేసేస్తాం పరిసరాల్ని
శుభ్రంచేసుకుంటాం ఇంటిని
శుభ్రంచేసుకుంటాం బట్టల్ని
శుభ్రంచేసుకుంటాం శరీరాన్ని
శుభ్రంచేసుకుంటాం కడుపుని
కానీ, శుభ్రంచేసుకోదలచుకోం
మనసుని, మన ఆలోచనలనీ!
ఉన్నతస్థాయికి ప్రయత్నిస్తాం
సంపాదనలోనూ, ఖర్చులోనూ
అధికారాలలోనూ, హోదాలోనూ
ఇంటిలోనూ,ఇంటిసామాన్లలోనూ
అలంకరణల్లోనూ, ఆర్భాటల్లోనూ
కానీ, ఉన్నతస్థాయి మాటే యెత్తం
హృదయాన సద్భావాల గురించి!
పెంచేసుకుంటాం ఆస్తిపాస్తుల్ని
పెంచేసుకుంటాం భోగభాగ్యాల్ని
పెంచేసుకుంటాం అందచందాల్ని
పెంచేసుకుంటాం సకలసౌఖ్యాల్ని
కానీ, ఎప్పటికీ పెంచుకోదలచుకోం
మానవత్వాన్నీ,సజ్జనసాంగత్యాల్నీ,
దైవత్వాన్నీ,సద్బుద్ధినీ,సదాచారాల్నీ!
నమ్మేస్తుంటాం లేనిపోని పుకార్లని
ఆశించేస్తాం అప్పనంగా వచ్చేవాటికి
అబద్దాలాడతాం అడ్డదారిసంపాదనకి
మొగ్గుచూపుతుంటాం మోసగించడానికి
తలపెడతాం తోటివారిని తొక్కేయడానికి
కానీ, అనుకోం మన కష్టార్జితం చాలునని
ఉన్నదానితోనే సంతృప్తి చెందవచ్చునని!
శ్రద్ధవహిస్తాం పరులసొత్తు దోచుకోవడంలో
శ్రద్ధవహిస్తాం అక్కర్లేనివి ఆనందించడంలో
శ్రద్ధవహిస్తాం అలజడులు సృష్టించడంలో
శ్రద్ధవహిస్తాం ఇతరుల తప్పులెంచడంలో
శ్రద్ధవహిస్తాం విద్వేషాలు రెచ్చగొట్టడంలో
కానీ, శ్రద్ధచూపించం ఆత్మ విమర్శనంలో
స్వయాన్ని సరిగ్గా సంస్కరించుకోవడంలో!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!