మరోజన్మకు ఆహ్వానం

మరోజన్మకు ఆహ్వానం

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: శ్రీ(ను)లత(హృదయస్పందన)

ప్రియమైన నీకు
ఏంటి నేస్తం.. ఈ రోజు నా కలం ముందుకు సాగనని  మారం చేస్తుంది. నీకేమైనా తెలుసా!
నిన్నటి వరకు నేను నీ కవితలకు అభిమానిని. నీకు కలం నేస్తాన్ని, మరి ఈ రోజు ఏంటి నాకు నేనే కొత్తగా వింతగా కనిపిస్తున్నాను. అలా ఆనందంగా సాగిపోతున్న మన స్నేహంలో ఇదేంటి కొత్త ఆలోచన మాటలే రాని నేను పాటనయ్యాను. పరవశిస్తున్నాను. మరో ప్రపంచంలో విహరిస్తున్నాను. దీనికి కారణం తెలుసుకుందామని ఒకసారి నా అంతరంగంలోకి వెళ్లి నన్ను నేను నిశితంగా పరీశీలించాను. అక్కడ ఎన్నో ఆలోచనలు, ఎన్నో అనుభూతులు. ఏంటి వింత!!  నాకు తెలియకుండానే నా అంతరంగంలోకి నీ ఆలోచనలు ఎలా వచ్చాయి? అంతా మాయగా ఉంది. అందుకే నా అంతరంగాన్ని ప్రశ్నించాను. ఏంటి ఈ వింత అని?..
ఆ క్షణం నా కంటి నుండి ఒక కన్నీటి చుక్క జారి నా అరచేతిని ముద్దాడింది. ఆ కన్నీటి బిందువును తిరిగి ప్రశ్నించాను. ఏంటి ఇలా వచ్చావ్? ఎన్ని సంవత్సరాలు అయిందో నిన్ను చూసి అని. దానికి బదులు ఎం ఇచ్చిందో తెలుసా నేస్తం, ఇన్ని రోజులు నువ్వు ఎదురు చూస్తున్న స్వప్నం నీ కళ్ళ ముందే ఉన్న గుర్తించకుండా నీ మనసును బంధీని చేశావ్ అని.. అందుకే నేను రాక తప్పలేదు అంది. ఎంత అందమైన భావం నా కన్నీళ్లు నాకు చెప్పే వరకు తెలియదు నేస్తం.. నేను నిన్ను అభిమానించటం లేదు… ఇంకేదో ఉందని..మరి నాలో ఈ మార్పుకు కారణం తెలుసా నేస్తం… నువ్వే…అవును నువ్వే..
ఒక్కసారిగా నా గుండె వేగం పెరిగింది.. మునుపటి ఆలోచనలు మెల్లిమెల్లిగా నాలో…
నువ్వు మాట్లేడే ప్రతి  మాట నా హృదయాన్ని  తాకుతుంది. ఆ మాటలు నాకు తేనెలోని మాధుర్యాన్ని  రుచి చూపిస్తున్నాయి. వాటిని నా అంతరంగంలో పదిలంగా భద్రపరుచుకున్నాని నాకు ఇప్పుడు అర్ధం అవుతుంది.
ఒంటరిగా కూర్చొని నిన్ను తలుచుకున్నపుడు నీ ఆలోచనలు మండు వేసవిలో పిల్ల తెమ్మెరలా నా మనసును తాకుతున్నపుడు ఎంత ఆహ్లాదాన్ని అనుభవిస్తానో తెలుసా నేస్తాం.
ఇపుడు నేను ఎం చేయను నేస్తం…
నాకు నేను కొత్తగా … నా హృదయం భారంగా అనిపిస్తుంది. నాలోని మార్పు నాకు ఒక పరీక్షగా ఉంది. ఏదో అలజడి ఇంకేదో భయం. భయం ఎందుకంటావా.! నేను నాకు తెలియకుండా ప్రేమిస్తున్నానెమో అని.. మనం ఎప్పుడు ఒకరి కళ్ళలోకి ఇంకొకరం చూసి మాట్లాడుకోలేదు.. ఒకరి చేయి ఇంకొకరం పట్టుకొని వాగ్దానాలు చెలుకోలేదు..
ముందు మన కలాల నుండి జాలువారిన మన కవితా భావాలు మాట్లాడుకున్నాయి.. తర్వాత మన మనసులు మాట్లాడుకున్నాయి.. మనసు భాష మనసుకు తెలుసు….. కాని, మనిషికి స్వార్థం ఉంటుంది కదా నేస్తం. ఇప్పుడు నాలోని ఈ ప్రేమ పెరిగి స్వార్థంగా మారితే, నీ మనసుని, ప్రేమను మాత్రమే కోరుకునే నేను నిన్ను కోరుకుంటే, ఆలోచించటానికి అందని భయం. నన్ను వెంటాడుతుంది. అందుకే ప్రేమకు – స్వార్దానికి తేడా తెలుసుకొని దానిని అంగీకరించిన రోజున నా ప్రేమను తెలుపుతాను. నేను నీ మనసును, ప్రేమను మాత్రమే కోరుకున్న రోజు ఆ ప్రేమ నీలోనే ఉందని గుర్తించిన రోజు తప్పకుండ నా హృదయాన్ని నీ ముందు ఆవిష్కరిస్తాను. అప్పుడు ప్రపంచంలో ఎక్కడ దొరకని స్వేచ్ఛ, సంతృప్తి నాలో ఉంటుంది.
ఆ రోజు నేను నీకు ఒకే మాట చెప్తాను నేస్తం..
నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని… జీవితం చివరి మజిలీ వరకు ప్రేమిస్తూనే ఉంటానని..
నా జీవితపు చివరి క్షణం నీ ఎదపై తల వాల్చి నీ ఎద సవ్వడి వింటూ… నీ హృదయంలో నా రూపాన్ని చూసుకొని…నీ ఒడిలో శాశ్వతంగా నా చివరి శ్వాస వదలాలని… మళ్ళీ నీతో జత కట్టటానికి. మరో జన్మకు ఆహ్వానం పలకాలని…. నా చివరి కోరిక…

ఇట్లు,

నీలోని నన్ను అన్వేషించే నేను..

శ్రీ(ను)లత

You May Also Like

One thought on “మరోజన్మకు ఆహ్వానం

  1. బాగుందండి మీ ప్రేమ భావం పదిలంగా మరో జన్మ వరకూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!