మరువకూడని బంధం

మరువకూడని బంధం

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: రాయల అనీల

ప్రియమైన అమ్మకు,

అమ్మ….
నేను ఎవరో నీకు తెలియదు అమ్మ
నాకు నువ్వు ఎలా ఉంటావో కూడా తెలియదు
కానీ నీ గురించి చాలా సార్లు విన్నాను మా అమ్మ మాటల్లో, తన కళ్ళల్లో నీ గురించి చెబుతున్నప్పుడు వచ్చే మెరుపు, ఆనందం ఇప్పటికీ, ఎప్పటికీ అలానే ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా, మా అమ్మ మాటల్లోనే చూశాను నిన్ను, నీ గొప్ప మనసుని ఇచ్చే చేతికి తెలియదు తీసుకునే వారికే తెలుస్తుంది దాని విలువ అంటారు. అది సత్యం అమ్మా, నీ విలువ మాకు మాత్రమే తెలుసేమో నీకు నేను ఈ జన్మంతా కృతజ్ఞురాలినే అమ్మ.
మా అమ్మ నన్ను నవమాసాలు మోసి నాకు ప్రాణాన్ని ఇస్తే నువ్వేగా ఆ ప్రాణాన్నినిలబెట్టింది. నీవే నన్ను మొదటి గా చూసింది, నన్ను పట్టుకుంది, మా అమ్మ ని జాగ్రత్తగా చూసుకుంది. అటువంటి నువ్వు కూడా నాకు అమ్మవేగా. అమ్మా! మీకు గుర్తుందా మీరు ఒకసారి డ్యూటీ ముగించుకుని ఇంటికి బయలుదేరుతున్న సమయంలో పురిటి నోఫ్పులతో బాధపడుతున్న ఒక స్త్రీ ని తీసుకుని తన తల్లి తండ్రులు, భర్త మీ హాస్పిటల్ కి రాగా నీవు అప్పటికే అలసిపోయి ఇంటికి వెళ్లేదాని వల్లా ఆగి ఆ తల్లి బాధను అర్థం చేసుకొని, పెద్ద డాక్టర్ గారు రావడానికి సమయం పడుతుందని, ఇంకా ఆలస్యం చేస్తే తల్లి బిడ్డ ఇద్దరు చనిపోతారని, నాకెందుకు ఇంత రిస్క్ అని మీరు ఆనాడు అనుకోకుండా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వచ్చి, మీరేగా అందరికీ ధైర్యం చెప్పి వారిని కాపాడారు గుర్తుందా అమ్మా. ఆ సమయంలో మీరు కాపాడింది మా అమ్మ ని ,ఇంకా నన్నే అమ్మ, ఈనాడు నేను అనుభవిస్తున్న ఈ ఆనందం, అమ్మ నాన్న అందరి ప్రేమ నాకు దొరికాయంటే దానికి కారణం నువ్వే కదమ్మ.!
అది నీ డ్యూటీ అంటారు కొందరు, సాయం అంటారు కొందరు, కానీ ఆ సమయంలో రెండు రెండు ప్రాణాలు కాపాడిన దేవతవు నువ్వు. ఇది నీకు కొత్తేమీ కాదు, నువ్వు రోజు ఇలాంటివి ఎన్నో నీ చేతులతో చేస్తూనే ఉంటావ్ ఎన్నో ప్రాణాలను కాపాడి ఉంటావు అందరూ నీకు గుర్తుండకపోవచ్చు, కానీ మాకు గుర్తుండాలి అమ్మ మేము నిన్ను మరువము. మరువకూడదు నీది మరువకూడని బంధం. అమ్మా! ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలియదు, నీ గురించి కనుక్కున్నాను నువ్వు హెడ్ నర్స్ గా రిటైర్ అయ్యావని ఆ తర్వాత ఎక్కడున్నారో తెలియదు అని చెప్పారు. బాధనిపించింది. నీ గురించి తెలుసుకోలేక పోతున్నానని, కానీ ఎక్కడున్నా నువ్వు సంతోషంగా ఉండాలి, ఉంటావు అని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
ఈ లేఖ నీకు చేరకపోవచ్చు కానీ ఇది నా దగ్గరే భద్రంగా ఉంటుందమ్మా ఒక జ్ఞాపకంలా

ఇట్లు
నిన్ను చేరలేని ఓ జ్ఞాపకం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!